నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి 

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి

      తెలుగు సాహిత్యంలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా పరుగునపడిపోయిన కవులెందరో వున్నారు. వారిలో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఒకరు. వీరికి తెలుగు సాహిత్య క్షేత్రంలో రావలసినంత పేరు ప్రతిష్టలు రాలేదు సరికదా చరిత్రకారులు ఆయనను పూర్తిగా విస్మరించడం గమనార్హం.
ఆధునిక యుగాంధ్ర సారస్వత స్రష్టలలో, ద్రష్టలలో బహుముఖ ప్రజ్ఞాదురంధరులలో ఈయన విద్వత్క విరత్నము. రసజ్ఞ విమర్శక తర్నము. నిరంతర సాహితీ తపస్వి. బహుభాషా కోవిదులు.
ఆంధ్రలో పుట్టి తెలంగాణలో స్థిరపడి ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలుగు జాతికి వెలుగు బాటగా ‘సాహితీ మేఖల’ అను సాహిత్య సంస్థను నల్లగొండ జిల్లా చండూరులో స్థాపించి తమ జీవితకాలమంతా ఈ సంస్థకే అంకితం చేసి తెలంగాణలో ఎందరో కవుల రచనలను సాహితీ ప్రియులకు అందించిన సహృదయ సాహితీమూర్తి.
అంబటిపూడి సాహిత్యం గద్య పద్యాత్మకమై హృద్యంగా వుంటుంది. భాషాదృష్టితో పరిశీలిస్తే ఆంధ్రరచనలు, సంస్కృత రచనలు, ఆంగ్ల రచనలు, అనువాద రచనలుగా వర్గీకరించవచ్చు.
1857లో నానాసాహెబ్‌ కూతురైన మైనాను ఆంగ్ల ప్రభుత్వం సజీవంగా కాల్చిన గాథను ఇతివృత్తంగా ‘మైనాదేవి’ అనే చక్కని పద్య కావ్యాన్ని సృష్టించారు. ఈ కావ్యం చాలామందిలో దేశభక్తిని ప్రబోధించింది. ‘సంధ్యా విద్య వీరి హిందూత్వాభిమానానికి గొప్ప ప్రతీక. విదేశీయ గాధలను కూడా రాయడం ఈ కవి సమదృష్టిని సూచిస్తుంది. ఇలాగే వీరు తమ రచనా వ్యవసాయంలో ఎన్నో ప్రయోగాల ప్రక్రియలు చేశారు. ముఖ్యంగా వందలాది వ్యాసాలు, ఉపన్యాసాలు, కావ్యాలు, నాటకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శాస్త్రీయ గ్రంథాలు, ఆంగ్ల – సంస్కృత గ్రంథాలు, లఘుగ్రంథాలు, అనువాద కావ్యాలు, శతకానువాదాలు మొదలైన రచనలు చేసినప్పటికీ చరిత్రకారులు ఆయనను విస్మరించడం గమనార్హం. వీరు ఆనాడు పేరు ప్రతిష్టల కోసమూ, సంపద కోసమూ, అవార్డుల కోసమూ ఎప్పుడూ పాకులాడలేదు. కొందరికి అవి అయాచితంగా వస్తాయి. మరికొందరికి ప్రయత్నించినా రావు. ముఖ్యంగా ఆనాడు అంబటిపూడికి దక్కాల్సిన జ్ఞానపీఠం మరొకరి వశమైంది.
అంబటిపూడి ప్రౌఢకవి. వీరి కవిత్వాన్ని రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా మొదలైన వారు ప్రశంసించి చక్కని పీఠికలు రాశారు. అయినప్పటికినీ వీరు అజ్ఞాతంగానే ఉండిపోయారు.
జీవితానికి ఒక లక్ష్యం వుంటుందని, ఆ లక్ష్య సాధన కోసం సాహిత్యం ఒక చక్కని ఉపకరణమని విశ్వసించి చిత్తశుద్ధితో చివరిక్షణం వరకూ నిలిచిన ఆదర్శమూర్తి అంబటిపూడి.
‘ఈ తెలుగు నాలుకనిచ్చిన మీ రుణమ్ము ధాత్రి సకలమిచ్చినప్పటికీ తీరదు’ అని తమ గురుభక్తిని వేలూరి శివరామశాస్త్రికి చాటిన విద్వత్కవి అంబటిపూడి. తెలుగు సాహిత్యంలో ఆయన ఒక మరుగున పడిన మాణిక్యం. సుమారు 60కి పైగా రచనలు (సాహిత్య గ్రంథాలు) రచించిన అంబటిపూడిని నేడు తెలంగాణ సాహిత్యకారులు ప్రస్తావించక పోవడం ఎంతో విచారకరం.
సాహిత్య సేవ కోసం ఆయన మనసు తపన పడింది. సాహిత్యసేవతో పాటు సమాజ సేవ కూడా చేయాలని ఆయన హృదయం ఆరాటపడింది. పల్నాడంతా కాలి నడనక తిరుగుతూ తెలంగాణ ప్రాంతమైన నల్లగొండ జిల్లాలోని చండూరు గ్రామం చేరి అక్కడ దరిద్రనారాయణ సేవా సమితి పేరుతో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. సాహిత్య సేవతో పాటు కృష్ణభక్తి ప్రబోధం, హరిజనులకు విద్యాదానం, పేదలకు వస్త్రదానం, అన్నదానం ఆయన ఆశ్రమంలో సాగి ప్రాచీన గురుకులంగా ప్రసిద్ధి చెందింది. కులమతాలకు అతీతంగా ధనిక, పేద తారతమ్యం లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం, రావి నారాయణరెడ్డి సహకారంతో హరిజన పాఠశాలను స్థాపించడం లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ”కల్లొద్దురా బాబు కల్లొద్దురా” వంటి గీతాలు పాడి మధ్యపానం నుండి ఎంతో మంది అమాయకులను విముక్తుల్ని చేశారు.
చండూరులో ఆయన నాటిన మొక్కే ‘సాహితీ మేఖల’. నేడది శాఖోపశాఖలుగా విస్తరించి శతాధిక గ్రంథాలను ప్రచురించి గొప్ప సాహితీ క్షేత్రంగా విరాజిల్లుతుంది.
అంబటిపూడి రచనలు :
ప్రణయవాహిని (1936), మైనాదేవి (1941), మొరాన్‌కన్య (1941), వత్సలుడు (1941), వనవాటి (1941), చంద్రశాల (తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు 1951), ఇంద్ర ధనువు (1951), దక్షిణ (నాటకం 1943), ఏకాంకికలు (1950), సంధ్యావిద్య (1955), కృష్ణకథ (1958), వివేక శిఖరాలు, తర్కభాష, కథావళి, తాత్విక తరంగాలు, ఇందిరా విజయమ్‌ (తెలుగు, సంస్కృతం 1972), ఓటర్ల కొకమాట, మధుర యాత్ర, గోపీకావ్యం (1984), శాంతి తీరాలకు, ప్రభుసప్తతి, భారతీయ సంస్కృతి (1973), గుంటూరు కాలేజి శతావధానం, బ్రహ్మ సూత్రములు, షడ్దర్శనములు, క్యావ మణిహారం, రత్నకవి అనువాదలహరి, సంధ్యావందనము, వ్యాస తరంగాలు మొదలగునవి.
ధర్మజనిర్వేదంలాంటి ఖండకావ్యాలు కవికి ఇతిహాస, వాఙ్మయంపైగల అధికారానికి గీటురాళ్ళు. బెర్నార్డ్‌షా, కీట్సు, షెల్లీ వంటి ఆంగ్ల కవుల రచనలు తెలుగువారికి పరిచయం చేశారు.
అంబటిపూడి తన 63వ ఏట నల్లగొండలోని గీతా విజ్ఞాన ఓరియంటల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ఎందరో విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వివేకానందుడు పేర్కొన్నట్లు “Have an eastern heart and western mindµ” అనే భావానికి అంబటిపూడి ప్రతీకగా నిలుస్తారు. అంబటిపూడి భారతీయ సంస్కృతిని పాఠకలోకానికి అందించడానికి ‘తాత్విక తరంగాలు’ అన్వేషించి, వివేక శిఖరాలు అధిరోహించి 75 సంవత్సరాల కాలంతో పాటు ప్రయాణించి శాంతి తీరాలకు చేరారు.
– పున్న అంజయ్య, 9396610639

నిరంతర సాహితీ సేవలో కవి'రత్నం'

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.