గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4 341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి  నీలకంఠ శాస్త్రి (1910-1984)

 గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-4

341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి  నీలకంఠ శాస్త్రి (1910-1984)

9-7-1910న శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు  ఓరుగంటి నరసింహ మహోదయ ,అప్పలనరసమ్మ దంపతులకు విజయనగరం లో జన్మించారు .విజయనగర సంస్కృత కళాశాల లో విద్యఅభ్యసించారు  .వీరి వ్యాకరణ గురుదేవులు –మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి,మహామహోపాధ్యాయ శ్రీ నౌడూరి వేంకట శాస్త్రి ,వ్యాకరణ శిరోమణి శ్రీ అప్పల జోగన్న శాస్త్రి గార్లు .ఓరుగంటి వారు న్యాయ ,మీమాంసా శాస్త్రాలను శ్రీ గంటి  సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .

  గుంటూరు హిందూకళాశాల పాఠశాలలో 1936నుండి తొమ్మిదేళ్ళు 1947వరకు పని చేశారు .గుంటూరు హిందూ కళాశాలలో పండితోపన్యాసకులుగా 1947నుండి 24ఏళ్ళు 1971వరకు ఉన్నారు .1972లో గుంటూరు కె.కె.సంస్కృత కళాశాల పండితులుగా ,ఆంద్ర విశ్వ విద్యాలయం పిజి సెంటర్ –గుంటూర్ యుజిసి గౌరవాచార్య పదివిలో సేవలందించారు .

  శాస్త్రిగారు సంస్కృతం లో –శ్రీ కళ్యాణానంద స్వామి వారి ‘’అక్షర దర్శనం ‘’అనే సంస్కృత సూత్ర గ్రంథానికి సంస్కృతం లో ‘’లోచన ‘’వ్యాఖ్యానం రచించారు .తెలుగులో బాలవ్యాకరణం ,కళ్యాణ లీల –అక్షర సమామ్నాయము ,లోచానవ్యాఖ్య ,శ్రీ విద్యారణ్యుల ‘’సూత సంహిత ‘’కు తెలుగు వ్యాఖ్యానం ,తిక్కయజ్వ హరిహరనాథ తత్త్వం రాశారు .వీరి రచనలు భారతి వంటి ప్రముఖ సాహిత్యపత్రికలలో ప్రచురితాలు .ఇవికాక శాస్త్రి గారి అముద్రిత గ్రంథాలు 60కి పైనే ఉన్నాయి .

     నీలకంఠ శాస్త్రిగారు శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠాధిపతి శ్రీశ్రీ కళ్యాణానంద భారతీ స్వాములవారి వద్ద మంత్రదీక్ష తీసుకొని ప్రస్థానత్రయం లో సాధన చేశారు  ..వీరికి వ్యాకరణ విద్యాప్రవీణ ,,ఉభయ భాషా  ప్రవీణ ,వేదాంత పారీణ సార్ధక బిరుదులున్నాయి .శ్రీ విరూపాక్ష మఠానికి,శ్రీ  కళ్యాణాన౦దస్వామివారికి ఆంతరంగిక కార్య దర్శిగా మహోన్నత సేవలందించారు .శాస్త్రి గారు 74 వ ఏట 1984 ఫిబ్రవరి 14న పరమపదించి నీలకంఠ సన్నిధానం చేరుకొన్నారు.

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-18-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.