భారతీయ సంస్కృతికి ,సాహిత్యానికి నిలువెత్తు దర్పణం, నడిచే విజ్ఞాన సర్వస్వం డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు
1946లో జన్మించి ,73 ఏళ్ళకే 19-8-19 సోమవారం నాడు శివైక్యం చెందిన డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు విజ్ఞానఖని ,నడిచే విజ్ఞాన సర్వస్వం ,మూర్తీభవించి భారతీయ సంస్కృతీ, సాహిత్యం .మహావక్త .గొప్ప కథానికా రచయిత.’’పంచ్ ఆబ్ ‘లాగా, పేటికా౦తర్గత మాణిక్యాలలాగా
అయిదు నవలల గుచ్చం ‘’మంజూష ‘’ను వెలయించి న సవ్యసాచి .ఏ విషయం పైనైనా సాధికారికంగా సంభాషించే సునిశిత మేధ ఆయనది .ఆంధ్రాంగ్ల సంస్కృత హిందీ సాహిత్యాలను ఆమూలాగ్రం చదివి అవపోసన పట్టిన సామర్ధ్యంవారిది . .ఆయనతో మాట్లాడటం ఒకవిద్యా వ్యాసంగమే .సమాన దృష్టి వారి ప్రత్యేకత .
మచిలీ బందరుతో ఆయన అనుబంధం సుమారు అర్ధ శతాబ్ది కాలం .అక్కడి రచయితలూ కవులు కళాకారులు ,సాహిత్య సంస్థలు అందరూ ఆయనను సమాదరంగా గౌరవంగా భావిస్తారు .ఏ ఒక్కరిపైనా అయిష్టత లేనివారు .అందుకే అక్కడి అన్ని సాహిత్య సంస్థలు ఆయనను తమవాడిగానే భావిస్తాయి .ఆయననే ముఖ్యఅతిధిగా ఆహ్వానించి సభలకు విలువ పెంచుకొంటాయి .అందరిపై సహజ వాత్సల్యం అభిమానం ప్రేమ ఆదరణ ఉన్న మహా మనీషి మాదిరాజు వారు .వారి నడక ,నడత ,మాట తీరులో ఆ రాజత్వం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది .ఆయన లేని సభ బందరులో జరగలేదు అంటే ఆశ్చర్యం లేదు .అన్నిటికీ హాజరవటం ,నిష్పక్షపాతంగా వ్యవహరించటం ఆయన స్వభావం .వ్యక్తుల వెనక ఉన్న తత్వాన్ని అర్ధం చేసుకొనే మనస్తత్వం ఆయనది .
మచిలీ పట్నం మరో ముట్నూరి మాదిరాజు
కృష్ణాపత్రిక సంపాదకులు ,బహుభాషావేత్త ,తాత్విక సంపన్నులు,ప్రముఖ దేశభక్తులు ,అందరికి ‘’లోవెలుగులు ‘’పంచిన మార్గదర్శి శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు .అలాగే వారే మళ్ళీ దిగి వచ్చి మచిలీ బందరును సాహిత్య, సంస్కృతులతో పునీతం చేశారా అనిపిస్తుంది శ్రీ మాదిరాజు రామలింగేశ్వరరావు మాస్టారిని చూస్తే.ఇద్దరు సార్ధక జీవులే .
స్వర్గీయ రాళ్ళబండి కవితాప్రసాద్ గారి అవధానాలు ,ప్రసంగాలు ,సాహితీ చర్చలు ,సన్మానాలు ,సాహితీ మిత్రుల సభల లో ప్రసంగాలు ,అనేక పుస్తకావిష్కరణలు ,ఎన్నిటికో రాసిన ముందుమాటలు అన్నీ ఆయన వైదుష్యానికి అద్దాలే.రేడియోలో హిందీ ప్రసంగాలు ,ఆలోచనాలోచనం సూక్తి ముక్తావళి సాహితీ ప్రసంగాలు రవీంద్రుని గీతా౦జలిపై ఉపన్యాసాలు ,మహాత్మునిపై సాధికార విశ్లేషణలు ,ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం దాకా చుళికీకరించినవారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం బందరు బెజవాడ లలో జరిపే అన్ని సాహిత్యకార్యక్రమాలకు ,ప్రపంచ తెలుగు రచయితల సభలకు తప్పక హాజరౌతూ వాటికి విశిష్టతను సంతరించిన సాహితీ మూర్తి .వారు ప్రచురించిన విలువైన రిసెర్చ్ గ్రంథాలలోమాదిరాజువారి అమూల్య వ్యాసాలూ చోటు చేసుకొని విలువ పెంచాయి .అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి వారిని చూడటం ‘’నిత్య గురు దర్శనం ‘’గా ఉండేవి .వారి వాక్కు శిరోధార్యమే .వారి సలహా అమూల్యమే ,తప్పక అనుసరి౦పదగినదే .బందరులో వారి వలన ప్రేరణ ,స్పూర్తి పొందని సాహితీ ,సంగీత ,సాంస్కృతిక కారులు లేరు .అంతటి ప్రభావ శీలి మాస్టారు గారు .అందుకే మరో ముట్నూరి అన్నాను .
సరసభారతి తో అనుబంధం
సరసభారతి స్థాపించటానికి చాలా ఏళ్ళ క్రితమే మా కుటుంబ మిత్రులు నాకు అత్యంత ఆప్తులు ,రచయిత, మహా కధకులు విశ్లేషకులు ,కాలమిస్ట్ శ్రీ రాజనాల శివరామకృష్ణ మూర్తి అంటే ఆర్ ఎస్ కే మూర్తి గారి షష్టిపూర్తి మహోత్సవానికి వారి ఆహ్వానం పై బందరు వెళ్ళాము నేనూ మా శ్రీమతి .అప్పుడు వారు నన్ను శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారు ఆ సాయంత్రం నిర్వహించే అష్టావధానం లో గణితం లో పృచ్చకునిగా ముందే కోరి ఉండటం చేత ,మాదిరాజువారింట్లో కవితా ప్రసాద్ గారి ఆధ్వర్యం లో ఇస్టాగోష్టి జరుగుతుందని నన్ను అక్కడికి కారులో పంపారు .ఇల్లంతా కవి జనం తో కిటకిటలాడింది .అప్పుడే రామ లింగేశ్వరరావు గారిని,కవితాప్రసాద్ గారినీ మొదటి సారి చూశాను . రాళ్ళబండివారు అమ్మవారిపై తానురాసిన అద్భుత పద్యకావ్యం ‘’కాదంబిని ‘’అందరికి అందజేశారు .అందులోని పద్యాలు భక్తికి ,ఆరాధనకు నిలువెత్తు అద్దాలు .ఇక్కడ ఒక గంట కాలక్షేపం జరిపి అందరం మూర్తి గారింటికి వెళ్లి విందు భోజనం చేసి ,సాయంత్రం టౌన్ హాల్ లో మాదిరాజువారి ఆధ్వర్యం లో జరిగిన అవధాన కార్యక్రమ౦లో ,మూర్తిగారి సన్మాన సభలో పాల్గొన్నాం .ఈ తొలి చూపు తోనే వారు నామనసులో పదిలంగా కొలువై ఉన్నారు .ఆతర్వాత కృష్ణాజిల్లా రచయితల సభలలో చాలాసార్లు కలుసుకొన్నాం .ఎంతో ఆప్యాయంగా ఆదరంగా పలకరించి మాట్లాడేవారు .వారి సాహితీ మూర్తిమత్వానికి ఆరాధకుడనయ్యాను .పెద్దగా పరిచయమూ పెంచుకోలేదు .
శ్రీ విహారి గారి పద చిత్ర రామాయణ ‘’సుందరకాండ ‘’ఆవిష్కరణ సభ ఉయ్యూరులో నేను కన్వీనర్ గా ఉన్న సాహితీ మండలి ఆధ్వర్యం లో జరపాలని స్పాన్సర్ గా ఉన్న శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు కోరినపుడు అలాగే నిర్వహించి ,మాస్టారుగారితో ,డా గుమ్మా సాంబశివరావు గారితో విహారిగారు ,పూర్ణచంద్ గారు మొదలైన ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించాం .సరస భారతి ఏర్పడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ,’’గురజాడ –టాగూర్ ‘’ల 150 వ జయంతిని స్థానిక కాలేజీలో ఉదయం నుంచి సాయంకాలందాకా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ముఖ్యఅతిధిగా జరిపినపుడు రామలింగేశ్వరరావు గారు చిరస్మరణీయమైన ప్రసంగం చేశారు .ఆసభలో శ్రీ ద్వా .నా .శాస్త్రి ,శ్రీ సవరం వెంకటేశ్వరరావుగార్లు కూడా విలువైన ప్రసంగాలు చేశారు .వారు అతిధిగా లేకపోయినా సుబ్బారావుగారితోపాటు వచ్చి సభలలో పాల్గొని మాకు ఆనందాన్ని చేకూర్చేవారు .వారు సభలో ఉంటె వందమంది మహా రచయితలు సభలో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు .
సరసభారతి ప్రచురించిన పుస్తకాలు వారికి పంపుతూ ఉండేవాడిని. వారు రాసిన ‘’మంజూష ‘’నాకు పంపారు .నన్ను బాగా ప్రోత్సహించేవారు .సరసభారతి బ్లాగు చదువుతూ ,మంచి కామెంట్స్ రాసేవారు .నాపుట్టిన రోజుకు ,మా మారేజీ డే కు తప్పని సరిగా గ్రీటింగ్స్ మెయిల్ చేసేవారు .మేము అమెరికాలో ఉన్నా,వారి స్పందన తప్పక తెలియ జేసే సౌజన్యం మాస్టారు గారిది .సాహితీ లోకం లో పెద్దరికం అంటే ఏమిటో వారిని చూసి తెలుసుకోవాలి .2017లో మేము అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఆగస్ట్ లో అనుకొంటా ఒక మెయిల్ రాస్తూ తమ బంధువు షిర్డీ సాయి భక్తులని ,ఆయన ‘’గురు సాయి స్థాన్ ‘’ అనే మాసపత్రిక ప్రారంభిస్తున్నారని ,తానూ దాని సంపాదకత్వ బాధ్యతలో ఉన్నానని ,నేను రాసిన ‘’సిద్ధయోగి పుంగవులు ‘’పుస్తకం లోని వ్యాసాలను అందులో నెలకుఒకటి గా ముద్రించాలని అనుకొంటున్నానని ,అనుమతినివ్వమని కోరారు .’’దీనికి అనుమతి ఎందుకు మాస్టారూ .మంచి పని నలుగురికితెలియ జేయాలని రాసినవే అవి .తప్పక ప్రచురించండి .మహదానందం నాకు ‘’అని వెంటనే జవాబు రాశాను .బహుశా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఆ వ్యాసాలు ప్రతినెలా దారావాహికగా వస్తూ నన్ను ధన్యుడిని చేస్తున్నాయి .
మాదిరాజు వారి రచనా ప్రస్థానం
1-బొమ్మ బొరుసు 2-వైకుంఠ పాళి 3-అనుభవాలకు ఆవలి ఒడ్డున 4-శ్రుతి చేసిన తీగలు 5-రుణాను బంధ రూపేణా అనే మాదిరాజువారి అయిదు నవలలను కలిపి ‘’మంజూష ‘’పేరుతో నవలా సమాహారం గా బందరు స్పందన సాహితీ సమాఖ్య శ్రీ గుత్తికొండ సుబ్బారాగారి ఆధ్వర్యం లో 2013లో ప్రచురించింది .ఈ మంజూష ను తమ ప్రియతమ అర్ధాంగి ,విదుషీమణి శ్రీమతి పర్వత వర్ధనిగారికి అంకితమిచ్చి తన ప్రేమను చాటుకొన్నారు .మొదటి నాలుగు నవలలు స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలలు గా వెలువడ్డాయి . చివరిది సన్ ఫ్లవర్ సచిత్ర వారపత్రికలో ధారావాహికగా వచ్చిందని ,..మంజూష తన ఊహలకు అక్షర రూపమని ,బొమ్మ –బొరుసు నవల స్వాతి నవలలపోటీలో ప్రధమబహుమతిగా 25 వేల రూపాయలు అందుకొని అందరిమన్ననలు పొందిందని ,శరత్ నవలలు తనపై గొప్ప ప్రభావం చూపాయని ,శ్రీపాద ,భరద్వాజ నవలలు తనను ఆకర్షించి నవలా రచనకు ప్రోత్సహించాయని ,గుంటూరు శేషేంద్ర శర్మ ,బుచ్చిబాబు ,అద్దేపల్లి ,టి.ఎల్ .కాంతారావు ,విహారి ,శాలివాహన ,పన్నాలభట్టు ,గుత్తికొండ మొదలైనవారు తనను విశేషంగా ప్రభావితం చేశారని ,దూర దర్శన్ కు పరిచయం చేసి సాహితీ ప్రసంగాలు చేయించిన శ్రీ వోలేటి పార్వతీశం మంచి ఆప్తడని, రేడియో స్టేషన్ డైరెక్టర్లు శ్రీమతి ప్రయాగ వేదవతి, శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ ,శ్రీమతి కృష్ణకుమారి శ్రీ సుమన్ ,శ్రీమతి సరోజానిర్మల, శ్రీ నాగసూరి వేణుగోపాల్ ,శ్రీ ఆర్ .అనంత పద్మనాభరావు గార్ల ప్రోత్సాహంతో నాటికలు ,పాఠాలు,ప్రసంగాలు చేశానని ,తమ సాహితీ వ్యాసంగానికి తండ్రి శ్రీ వెంకటప్పయ్యగారి పరోక్ష ప్రోత్సాహం ఉందని మంజూషలో ముందు మాటలుగా చెప్పారు మాస్టారు .
మాదిరాజువారు కొన్ని కథలు కూడా రాశారు .శృతి చేసిన తీగలు ,వైకుంఠపాళి,అరే ఏమైంది ,ఔనా అంతేనా ,కాకిపురణం ,మనసుగతి ఇంతే అందులోకొన్ని. ఇవి స్వాతి, కధాకేళి ,తెలుగు విద్యార్ధి ,రచన మాసపత్రికలలో ప్రచురితాలు .అమెరికాలోని సిలికానాంధ్రవారి సుజన రంజని మాసపత్రికలో ‘’మనసున్న మనిషికీ ‘’కథ ప్రచురింపబడింది .ఇందులో తరతరాల అంతరాలవలన వ్యక్తుల్లో కలిగే మానసిక సంఘర్షణ అవగతమవుతుందని ,ఈ తరంవారికి ముందుతరం వారివి, వారికి వీరివి మనస్తత్వాలు అర్ధంకావని ,ఛట్రం లో బిగుసుకుపోయిన పెద్దలకు మనశ్శాంతి కరువైపోతోందని ,వారిమనసులను బాధపెట్ట రాదన్న ఇంగితం పిన్నలలో కలగటం లేదని ,కొన్ని విషయాలలో పిన్నలతో పెద్దలు ఏకీభవించాలని ,రాజీ పడటం ఒక శిక్షగా భావి౦చినపుడే మనశ్శాంతి దొరుకుతుందని ఈ కథను విశ్లేషించిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి తమిరిశ జానకి అన్నారు .
మాదిరాజు వారు రవీంద్రుని గీతాంజలి పై అధారిటి ఉన్నవారు .రవీంద్రుడు ఒకసారి బిడ్డగా ,మరొకసారి ప్రియురాలిగా ,వేరొకసారి భక్తునిగా పరమాత్మకు అంజలి ఘటించాడని ,మానవుడు మాయలోపడి ఆత్మకు ,పరమాత్మకు ఉన్న సంబంధాన్ని గుర్తించలేక దూరమౌతున్నాడని బాధపడ్డాడని ,మృత్యువును విముక్తి ద్వారంగా ,మృత్యు దేవతను భగవంతుని దూతగా రవీంద్రుడు అభి వర్ణించాడని ,ప్రతిగీతం హృదయపు లోతులలోకి చొచ్చుకుపోయి ,పరమ ప్రశాంతత కలిగిస్తుందని ,కొన్ని గీతాలు సంగీతమయంగా ఉండి,గీతాంజలి కావ్యత్వాన్ని పొందిందని రవీంద్ర హృదయాన్ని మాదిరాజు మాస్టారు మహా గొప్పగా ఆవిష్కరించారు .
బహుముఖీన పాండిత్యం తో లెక్చరర్ గా రాణించి విద్యార్ధుల హృదయాలలోనూ ,సాహితీ సంస్థలతోనూ ,సాహిత్య కారులతోనూ చక్కని అనుబంధం ,పెద్దరికం సాగించిన డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారి మృతి సాహిత్య ఆధ్యాత్మిక సంగీత కారులకు తీరనిలోటు .
వారి మరణవార్తను మూడు రోజులైనా పత్రికలు ప్రచురించకపోవటం ఆశ్చర్యంగా నే ఉంది .వారిపై ఎవరూ ఒక చిన్నవ్యాస మైనా రాయకపోవటమూ నన్ను బాధించింది. మాదిరాజువారి ప్రసంగాలన్నీ ప్రచురించి ఈ తరం వారికి అందుబాటులోకి తీసుకురావటమే వారికి ఘననివాళి అవుతుంది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-19-ఉయ్యూరు
—