మహా భక్త శిఖామణులు
8-మౌనీ బాబా
బెంగాల్ నదియా జిల్లా అజుదియా గ్రామంలో 1856లో శివనాథ ఘోష్ కు మౌనీ బాబా జన్మించాడు .తండ్రి హరి భక్తుడే కాని పోలంపుట్రా నగలు నట్రా లేని బీదసంసారి .కుటుంబ పోషణకోసం సాబ్నా పట్టణం చేరి కొంతదబ్బు సంపాదించాడు .పెద్దకొడుకు ప్యారేలాల్,చిన్నవాడు కున్జులాల్ ప్రభుత్వబడిలో చదివారు .అందులో ఒక బ్రహ్మసమాజీయ ఉపాధ్యాయుడు ప్యారేలాల్ తెలివి తేటలు గుర్తించి’’కోపం పనికి రాదనీ సత్వగుణం మంచిదని పరస్త్రీని తల్లిలాగా చూడాలనీ .ధర్మం మాత్రమె చనిపోయాక వెంటవస్తుందని .ధర్మమే అన్నిటినీ కాపాడుతుంది ‘’‘’అనీ తత్వ బోధ చేసేవాడు .ఇలా జ్ఞానామృతం పొందిన ప్యారేలాల్ ,తమ్ముడితోకలిసి మనో వికాసం పొందాడు .బ్రహ్మసమాజ ప్రార్ధనలలో పాల్గొని జ్ఞాన విజ్ఞానాలు పెంచుకొన్నారు .ఈ సోదరులను హిందూ మతం వెలి వేసింది .
తమ్ముడిని చదివించాలని అన్న ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు .జల్పాయి గురి లో కొంతకాలం పని చేసి ,తర్వాత రంగాపురం లో ఇంగ్లీష్ పాఠ శాల హెడ్ మాస్టర్ అయి చాలాకాలం పని చేశాడు .పెళ్లి చేసుకొని కాపురం రంగాపురం లో పెట్టాడు .సోదరికూడా వీరితో ఉండేది .సంసారం చేస్తున్నా , జ్ఞాన వికాసం కోసం అర్ధరాత్రి లేచి ధ్యాన సమాధి లోకి వెళ్ళిపోయేవాడు .రోజుకు మూడు నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోయేవాడు కాదు .సామాన్య ఆహారమే తినేవాడు .ఉపవాసాలెక్కువగా ఉంటూ ,తర్వాత జీవితంపై చింతనతో గడిపేవాడు .12ఏళ్ళతర్వాత భార్య చనిపోయింది .వైరాగ్యభావం ప్రవేశించింది .మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేస్తే ,తనను మళ్ళీ సంసారకూపం లోకి లాగవద్దని చెప్పేవాడు .తమ్ముడు ప్రయోజకుడై ధనం తగినంత సంపాదించాడు .ఇంటిబాధ్యత అతనికి అప్పగించి యోగ సాధనకోసం ప్యారేలాల్ చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు .
మూడేళ్ళు చిత్రకూట్ లో గడిపి తర్వాత రమ్యమైన ప్రకృతికి ఆలవాలమైన ఓంకార్ నాథ్ పర్వతం చేరి ,అనువైన ప్రదేశం లో తపస్సు ప్రారంభించి ఎండ వానల్లో నిద్ర ఉండీ లేక ,తినీ తినక తీవ్ర తపస్సు చేశాడు .యోగాసనం నుంచి అతడు లేవటం ఎవరూ చూడలేదు .ఇతని కఠోర సాధన, తపస్సు గమనించి లక్ష్మీ నారాయణ్ అనే మార్వాడీ ,ఆపర్వత౦ పైనే ఒక గుహను వసతులతో ఏర్పాటు చేసి అందులో ఉంచాడు .తపస్సు కు ఎట్టి ఆటంకమూ లేకపోవటంతో ,మరింతఘోర తపస్సు చేయగలిగాడు .ఎవ్వరితోనూ మాట్లాడకుండా నిరంతరం మౌనంగానే గడిపాడు .ప్రజలలోకి వెడితే భంగం కలిగిస్తారని గుహ వదిలి వెళ్ళేవాడుకాదు.ఆరునెలలు గడిచాక అతని గొప్పతనం గుర్తించి అందరూ ‘’మౌనీ బాబా ‘’ అని పిలవటం మొదలు పెట్టారు .అతని ఆస్తి మూడు ఇత్తడి చెంబులు,ఒక చర్మపు ముక్క ,ఒక రాతిపలక .తోలుముక్కపై పడుకొని రాతిముక్కను దిండుగా వాడుకొనేవాడు .
అతన్ని చూడాలని జన ప్రవాహం వచ్చి గుహ ద్వారం వద్ద నిలబడేవారు .రోగవిముక్తికి తత్వజ్ఞానానికి ,సిద్ధికి,జ్ఞానోపదేశానికి జనం వచ్చేవారు .ఆ మార్వాడీ ‘’నేను నిరుపేదను బాబా కృప వలన మహా ధనవంతుడనయ్యాను .నా ఐశ్వర్యం అంతా నౌనీ బాబా యే’’అనేవాడు .ఓంకారనాథ దేవాలయ అర్చకుడు మౌనీబాబా వంటి తపస్సంపన్నుడిని తాను అంతవరకూ చూడలేదని చెప్పేవాడు .కొద్దిగాపాలు కొంచెం, మారేడు ఆకులపసరే ఆయన ఆహారం .ఇలా చాలాకాలం గడిచాక శరీరం శుష్కించి ఎముకల పోగుగా మారాడు .1896లో 40 ఏళ్ళ చిన్నవయసులోనే సిద్ధిపొందాడుమౌనీబాబా ‘.
ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
శ్రీ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-19-ఉయ్యూరు