ప్రపంచ దేశాల సారస్వత౦
14-పారశీక సాహిత్యం
భాష –క్రీ.పూ 6వ శతాబ్ది నుంచి పారశీక భాష ఉన్నట్లు తెలుస్తోంది .ఇప్పుడు ఇరాను దేశం లో వాడుక భాష ,శాసనసభ విశ్వవిద్యాలయ బోధనకు,అధికార ప్రకటనలకు ,పత్రికలకు సామాన్య సాహిత్యానికీ అదే భాష .అభయ మెనిడ్ రాజులచేత వాళ్ళ స్మారక చిహ్నాలలో రాయబడిన పాత పారశీకమే ఇది .బెహిస్తూన్ పర్వతం పై ఎత్తుగా ఉంచబడిన డేరియస్ ప్రకటన చాలా ప్రసిద్ధమైంది ,ఇక్కడి శాసన వ్యాకరణ భాషకు అవెస్తా సంస్కృతలో ఉన్న భాషకు సన్నిహిత సంబంధం ఉన్నది .
మధ్య పారశీ లేక పహ్లవి –అలక్జాండర్ సామ్రాజ్య పతనం తర్వాత పర్షియాను పార్దియన్లు పాలించారు .వీరిని బట్టే పహ్లవి అనే మాండలీకానికి ఆ పేరు వచ్చింది .కొన్ని శాసనాల్లో ,మత గ్రంథాలలో,నాణాలపైనా కనబడే భాష అదే అంటారు .ఫార్సు రాష్ట్రం లో ఏర్పడిన పాత పారసీ పరిణామ దశలో ఇది ఒకటి .
ఇస్లామిక్ పారసీ -7వ శతాబ్దిలో ఇస్లాం మతం అవలంబించటం పర్షియా దేశం కాలి ఫేట్ కు వశమవటం జరిగాక ,అరబ్బీ భాష తప్పని సరి అయింది .పారసీ రచయితలూ అరబ్బీ నుండి విరివిగాపదాలు వాడే అవకాశం కలిగింది .నిత్యవ్యవహారాలు పార్సీలోనే జరిగేవి .ఇప్పుడు సామాన్యజనం పాడుకొనే పాటలుకూడా ఆభాషలో రాసినవే .పద్యం లో అరబ్బీ పదాలు తక్కువే .గద్యంలో విపరీతం .పరదేశీయులు పాలించినా పార్సీ వారి భాషలలో లీనంకాకపోవటం ప్రత్యేకత .అరబ్బీ పదాలను అరువు తెచ్చుకొన్నా వ్యాకరణమర్యాద నిలుపుకున్నది .వాక్యంలో పదాలన్నీ అరబ్బీ అయినా ,క్రియలు ,పదాలక్రమం మాత్రం పారసీ లక్షణాలతో ఉంటుంది .
వర్తమానకాలం లో పత్రికలలో ,ఉత్తరప్రత్యుత్తరాలలో ,నవలలో వాడే భాష ప్రాచీన పార్సీ ,వ్యావహారిక భాష ,ఫ్రెంచ్ జర్మన్ ,ఇంగ్లిష్ మొదలైన పాశ్చాత్యపదాల కలగా పులగం .దీనికీ ,11 వ శతాబ్ది భాషకు పెద్దగ తేడా లేదు .కొత్తపదాలు చాలా చేరాయి .పదాలా అర్ధాలు కూడా మారాయి .
ఆసియాలో పారసీ –మహమ్మద్ గజని సామ్రాజ్యం లో బుఖారా ,సమర్ఖండ్అనే పెద్ద పట్టణాలున్నాయి .ఇక్కడి నుంచే ఇస్లాం లోని పారశీక సంస్కృతి ఇండియాకు ,టర్కీకి వ్యాపించింది .క్రీశ 1000లో టర్కోమాన్ ప్రాంతాలన్నీ ముస్లిం ప్రభావం లో ఉన్నాయి .స్థానిక భాషలలో చేరిన అపరిచిత పదాల అర్ధాలు పారశీ ద్వారా వివరించాల్సి వచ్చేది .మతపరివర్తన ప్రయోజకులు పారశీనే వాడేవారు .ఆసియా మైనర్ లోని ‘’ఆటోమన్’’నాయకులు ఉత్తరప్రత్యుత్తరాలకు పారశీ నే వాడేవారు .టర్కీలో వచ్చిన మొదటి సాహిత్యం పారశీలోనే వచ్చింది .టర్కీకవులు పార్శీ మూలం లోని ప్రసిద్ధ ఛందస్సులు ,ప్రక్రియలనుమాత్రమేకాక ,విశేష పద సంపదకూడా తీసుకొన్నారు .ఇప్పటికీ గ్రాంధిక టర్కీలో పారశీ ఎక్కువే .
పారశీ సాహిత్యం – డేరియస్ తోనే పారశీ సాహిత్యం మొదలైంది .అతడు బెహేస్తూన్ కొండలమీదా ,నాణాలమీదా,కిర్మాన్ షామతగ్రంధం లో తన ఆజ్ఞలనుపారషీ భాషలో చెక్కించాడు .జోరాస్టర్ మత గ్రంథం కూడా ఈ భాష లోనే ఉంది .అవెస్తా అనేది గ్రంథంమాత్రమేకాదు ,మా౦డలికంకూడా .దీనికీ, సంస్కృతానికి సంబంధం ఉన్నది .ఇప్పుడు లభించింది 21గ్రంథాలతో కూడిన మూలగ్రంథం ఒక భాగం మాత్రమె .ఇంకో భాగం ఉన్నది .అవెస్తా మూలం ,అవేస్తాఖర్డు అనే ప్రార్ధనలు .పహ్లవి వాజ్మయం లో మూలం మాత్రమె నిల్చి ఉంది .దీనిలో దీన్ కార్డ్ ,మైన్యో ఐ ఖిరాద్ అనేవి ప్రసిద్ధాలు .వీటి ప్రాముఖ్యం తర్వాత రచనల పరిణామం గురించి చదివేటప్పుడు తెలుస్తుంది .యత్కాలే జరిరాన్ ,ఇందార్స్ ఏ –ఖుస్రని ,గవటాన్,కార్నమక్ఎ-అర్దీ షెర్ అనేవికూడా ముఖ్యమైనవే. ఫిరదౌసి కవి రాసిన ఇతిహాసానికి మూలమైనవి సెసెనియన్ కవిత్వం లో ఏమీ మిగలలేదు .
సశేషం
రేపు- రథ సప్తమి శుబాకా౦క్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-20-ఉయ్యూరు