సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-42
తనబలపరాక్రమాలు చూపి చైత్య ప్రాసాదాన్ని నేలమట్టం చేసి తనవానర సేనా బల వివరాలు తెలియజేస్తూ ,అసలు కపి సైన్యం ఎంతుందో ఖచ్చితంగా రావణుడికి తెలియజేశాడు .అందులో కొందరు ఓఘం సంఖ్యకల ఏనుగుల బలం ఉన్నవారు అన్నాడు .ఓఘం అంటే సముద్రం అనే అర్ధం కూడా ఉంది .సముద్రం లోతు అంతుపట్టదు .అదేకాక ఓఘం అంటే 1057 .అంటే 10తర్వాత 57సున్నాలు పెడితే యెంత పెద్ద సంఖ్య వస్తుందో అంతసంఖ్యున్న ఏనుగులు యెంత బల౦ కలిగి ఉంటాయో అంతటి బలమున్నవారు అని అర్ధం .ఈ సంఖ్యకంటే పెద్దది మహా ఓఘ0 అంటే 1062. ..
కనుక ఆషామాషీ వ్యవహారం కాదు .అనంత బలసంపన్నమైన వానర సైన్యం అనంతంగా కడలి వస్తుందని హెచ్చరించాడు హనుమ .
రావణుడి ఆజ్ఞతో ప్రహస్తునికొడుకు జంబుమాలి యెర్ర మాలలు వస్త్రాలు సకల ఆభరణాలతో పెద్దకోరలతో బయల్దేరి వచ్చి అల్లెత్రాటిని లాగి పిడుగులాంటి భీకర శబ్దాన్ని చేయగా ఆ ధ్వనిఅన్ని దిక్కులూ భూ నభోన్తరాలకు ప్రాకింది .రాగానే మహాకపి పై వాడి బాణాలు వేశాడు .అసలే ఎర్రనిముఖం ఆ బాణ ఘాతాలతో మరింత ఎర్రబడి శరత్కాల తామర పువ్వులా ప్రకాశించాడు –
తస్య తచ్ఛుశుభే తామ్రంశరేణాభి హతం ముఖం –శరదీవామ్బుజం ఫుల్లం విద్ధంభాస్కర రశ్మినా’’
అసలే ఎర్రనిముఖం బాణపు దెబ్బలతో మరింత ఎర్రగామారి ఆకాశం లో రక్త చందన బిందువులతో తడుపబడిన పెద్ద తామర పువ్వూ లాగా శోభిల్లింది –
‘’యధాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభిః –చుకోప బాణాభి హతోరాక్షసస్య మహా కపిః’’
ఈదెబ్బలతో రెచ్చిపోయిన హనుమ అక్కడే కనిపించిన పెద్ద బండరాయి పీకి జ౦బు మాలిపై విసిరేస్తే వాడు 10బాణాలతో ముక్కలు చేశాడు .కోపం మరీపెరిగి విశాల సాలవృక్షం పెరికి గిరగిరా తిప్పి వాడిపై విసరగా వాడు ఐదు బాణాలతో దాన్ని ,ఒకబాణ౦ తో హనుమ భుజాన్నీ ,ఒకబాణ౦తో వక్షస్థలాన్నీ పదిన్టితో స్తనప్రదేశాన్ని కొట్టాడు .ఒళ్ళంతా బాణమయమైకోపోధృతి తో ఇనప గుదియ(పరిఘ ) వేగంగా తిప్పి వాడి రొమ్ముపై కొట్టాడు .ఆ దెబ్బతో వాడి తల ,చేతులు ,మోకాళ్ళు విల్లు ,గాడిదలు ,గుర్రాలు చిరునామా లేకుండాపోయి ,వాడి అవయవాలు,ఆభరణాలు పొడిపొడిఅయి జంబుమాలి నేలపైబడి ,జముని దగ్గరకు చేరాడు.
‘’న ధను రణ రథోనాశ్వాస్తత్రా దృశ్యంత నేషవః –స హత స్సహసౌ తేన జమ్బుమాలీ మహాబలః ‘’
‘’పపాత నిహతో భూమౌ చూర్ణి తాంగ విభూషణః’’
కింకరులు,మహాబలశాలి జంబుమాలి హనుమ చేతిలో చచ్చారన్న వార్తవిని రాక్షసరాజు సహించలేక మంత్రిపుత్రులను హనుమపైకి యుద్ధానికి పొమ్మని ఆనతిచ్చాడు .
ఇది 20శ్లోకాల 44 వ సర్గ .
ఇదే మొదటిసారి హనుమకు ఒక మహా బలవంతుడితో లంకలో పోరాడటం .ఇందులోనూ విజయం సాధించాడు వాయుపుత్రహనుమ.
ఇంతటి భీకర యుద్ధం లోనూ మహర్షి మనకు కాస్త వినోదం కోసం హనుమ ముఖం అసలే ఎర్రగా ఉన్నది వాడి బాణాల దెబ్బలతో మరింత ఎర్రబడటాన్నిచక్కని ఉపమానాలతో వర్ణించి కాస్త నవ్వుకూడా తెప్పించాడు .బండరాయి, సాల వృక్షం కూడా జంబుమాలిని ఏమీ చేయలేకపోయాయి . చివరిగా తన ఆయుధం పరిఘ మాత్రమె వాడి ప్రాణాలు తీయగలిగింది .అదీ వాడి అవయవాల,ఆభరణాల రథాలగుర్రాల గాడిదల అడ్రస్ లేకుండా చేసి వాడిని భూశయం ముందే చేయించింది .అదీ హనుమ వీర విక్రమ పరాక్రమ ప్రతాపం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-20-ఉయ్యూరు

