సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-43
రావణ ఆజ్ఞతో అగ్ని తేజులైన ఏడుగురు మంత్రి పుత్రులు హనుమపైకి వచ్చారు .రంగులతోరణాలు అనేక విధాలైన రథాలు తమతమ అసాధారణ చిహ్నాలతో ఉన్న పతాకాలు తో మేఘధ్వనికలిగిస్తూ వచ్చారు .మేలిమి బంగారు విల్లులతో టంకార ధ్వని చేస్తూ ,మెరుపులతో కూడిన మేఘాల్లా దూసుకొచ్చారు .వారి తల్లులకు కి౦కరులు హనుమ చేతిలో చచ్చారన్న వార్త ము౦దేవిని బంధు మిత్రాదులతో దిగాలుగా,దిగులుగా ఉన్నారు –
‘’జనన్యస్తు తత స్తేషాం విదిత్వా కిమ్కరాన్ హతాన్ –బభూవు శ్శోకసంబ్రాంతా స్సబాంధ వ సుహ్రు జ్జనా’’
మంత్రిపుత్రులు తమలో తాము హనుమను చంపుతామని పోటీ పడుతూ ద్వారప్రదేశం దగ్గరున్న హనుమపైకి దూకారు .మేఘాలు,రథ గర్జితం అనే మేఘ గర్జన ధ్వని తో వర్షించే మేఘాలలాగా బాణ వర్షం కురిపిస్తూ ,అంతటా తిరుగుతూ హల్ చల్ చేశారు .హనుమ వెంటనే వ్యూహం మార్చి శరీరం పెంచి ,వర్షంచేత కప్పబడిన పర్వతాకారశరీరుడై కనిపించాడు .ఆబాణాలమధ్య వేగంగా కదులుతూ ,వాటిని నిష్ప్రయోజనం చేశాడు .ఆకాశంలోకి యెగిరి వాళ్ళ రథాల వేగాన్ని కూడా ప్రయోజనం లేకుండా చేశాడు .అంతరిక్షం దాకా దూసుకువెళ్ళి అరివీర భయంకర హనుమ ,ఇంద్ర ధనుసుతో ఉన్న మేఘాలున్న ఆకాశం లో తిరుగుతూ వాయుదేవుడిలాగా ఉన్నాడు .అక్కడి నుంచే భయంకరంగా గర్జించి ఆ సేనను మరింత భయపెట్టాడు .
వీళ్ళ మీద ఆయుధాలు ఎందుకనుకొని ,వారిలో కొందర్ని చేతులతో ,కొందరిని పాదాలతో ,,కొందర్నిగోళ్ళ’’తో మరికొందరిని ఎదురు రొమ్ము తో ,కొందరిని తొడలతో చీల్చిపారేశాడు.మరికొందరు హనుమ అరుపుకే ప్రాణాలు కోల్పోయి నేలమీద పడి చచ్చారు-
‘’తలే నాభ్యహన త్కాంచి త్పాదైః కాంశ్చిత్పరంతపః-ముస్టినాభ్యహన త్కాంశ్చి న్నఖైః కా౦శ్చిద్వ్యదారయత్
‘’ప్రమమా థోరసా కాంశ్చిదూరుభ్యామపరాన్ కపిః-కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితాభువిః’’
మంత్రికోడుకులు చనిపోగానే సైన్యమంతా భయపడి చెల్లా చెదరై పారిపోయింది .ఏనుగులు పెద్దగా ఘీ౦కరించాయి గుర్రాలు నేలకూలాయి .యుద్ధభూమి అంతా విరిగిన రధాల టెక్కాలు గొడుగులు వాటిముక్కలతో భీభత్సంగా కనిపించింది .సైన్య ,జంతు రక్తాలతో దారులన్నీ తడిసి బురదగామారాయి .లంకలో వికృత శబ్దాలు వినిపించాయి .మంత్రికొడుకులతో యుద్ధం అయ్యగారికి మజాగా లేదు .చప్పగా అనిపించింది .మరికొందరితో యద్ధం చేయాలన్న కండూతి పెరిగి ద్వార తోరణం ఆశ్రయించాడు మంత్రికుమారహత హనుమ.
‘’స తాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ –మహాబల శ్చండ పరాక్రమః కపిః-యుయుత్సు రన్యైః పునరేవ రాక్షసై-స్తమేవవీరోభిజగామ తోరణం ‘’
ఇది17శ్లోకాల 45వ సర్గ
ఇందులో తమాషా ఏమిటంటే రావణ మంత్రుల కొడుకుల పేర్లు వాల్మీకి మహర్షి చెప్పలేదు .వాళ్ళను అగస్త్య భ్రాతలుగా నే ఉ౦చేశాడు .వాళ్ళు ‘’పొడిచేదీమీ’’ లేదనే అభిప్రాయమా ?మరోతమాషా వీళ్ళతో యుద్ధం ఆకాశం లో చేయటం .ఇంకో తమాషా వాళ్ళను వాళ్ళ సైన్యాన్నీ చేతులతో,కాళ్ళతో,రొమ్ము,తొడలు , గోళ్ళు తో నుజ్జు నుజ్జు చేశాడుహనుమ .అంటే కోన్కిస్కా గాళ్ళు వీళ్ళపై ఆయుధాలు ఎందుకు దండగ అనుకొని ఉంటాడు హనుమ గురుడు .అరిస్తే కరుస్తా, కరుస్తేఅరుస్తా అన్నట్లు గట్టిగా అరచి హార్ట్ ఎటాక్ తెప్పించి తనతో పనిలేకుండా హరీ అనిపిచాడు హరిసత్తముడు .మేఘం చేసే ఒకరకమైన ధ్వనికి ‘’రథ గర్జితం’’అనే పేరు ఉన్నదని వాల్మీకి మనకు తెలియజేశాడు . కి౦కరులు,ద్వారపాలకులు ,జంబుమాలి ఇప్పుడు మంత్రికొడుకులు హనుమ చేతిలో హతమయ్యారు .పాపం వీళ్ళ తల్లులు బంధువులువీళ్ళు బయల్దేరే ముందే కింకరులు హతమయ్యారన్నవార్తతెలిసి తెల్లమొహాలేశారు .అంటే వీళ్ళూ బతికి బట్టకట్టే వారు కాదు అనే నిర్ణయానికి వచ్చారన్నమాట .అనుకొన్నట్లే జరిగి వారికి పుత్ర శోకం తప్పలేదు . నెత్తురు రుచి మరిగిన సింహం కాని పులికాని మరో వేట జంతువు కోసం ఎదురు చూడటం వాటి సహజలక్షణం .హనుమకూడా అలాంటి వాడే కనుక ఈయన ‘’భుజాల దుల’’ అంటే ముద్దుగా ‘’కండూతి ‘’తీరలేదు .అతడి దృష్టిలో ఇది ఏకపక్ష యుద్ధమైంది .కనుక నే మరికొందరు రాక్షసులతో యుద్ధం చేసి తనకండూతి తీర్చుకోవాలనుకొన్నాడు .దానికి ‘’వెయిట్ అండ్ సీ’’ గా మళ్ళీ ద్వారం ఎక్కికూర్చున్నాడు రాక్షస మిడతలదండుకోసం అగ్ని హోత్ర హనుమ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-20-ఉయ్యూరు

