సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-48
గోరోచనవర్ణ నేత్రాలు ,మహాతేజస్వి ,వానర శ్రేష్టుడు అయిన హనుమను రావణుడు చూసి సందేహం కలిగి మనసులో ‘’ఇతడు సాక్షాత్తు నందీశ్వరుడు ‘’లాగా ఉన్నాడేమిటి ?’’అనుకొన్నాడు –
‘’’’శంకాహృతాత్మా దధ్యౌ స కపీన్ద్ర౦ తేజసావృతం –కిమేశ భాగావాన్న౦దీ భవే సాక్షా దిహాగతః’’
పూర్వం నేను కైలాసాన్ని పెకలిచినపుడు నాకు శాపమిచ్చిన నందీశ్వరుడు కాని బలికొడుకు బాణ రాక్షసుడు కానీ కోతిరూపంలో వచ్చాడా ?’-
‘’యేన శప్తోస్మి కైలాసే –మయా సంచాలితే పురా –సోయం వానర మూర్తిఃస్యాత్ –కిం స్విత్ బాణోపి వా సురః’’
’అనుకుని కోపంతో కన్నులు ఎర్రబడి మంత్రి ప్రహస్తునితో ఇలాన్నాడు ‘’ఇతడు ఏ దేశం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో నా వనం పాడు చేయట౦ లో ప్రయోజనమేమిటో ,రాక్షస స్త్రీలను భయపెట్ట టానికి కారణమేమిటో ఎదిరించటానికి సాధ్యం కాని లంకానగారానికి రావటానికి కారణమేమిటో ఆ దురాత్ముని అడుగు ‘’అన్నాడు .
వెంటనే ప్రహస్తుడు ‘’వానరా !ఊరడిల్లు.నీకు శుభం కలుగుగాక ,భయపడకు .ఇంద్రుడు పంపగా వచ్చావా ,కుబేర ,యమ, వరుణ చారుడుగా వచ్చావో భయం లేకుండా చెప్పు వదిలేస్తాం .లేక విజయం కోరే విష్ణువు చే పంపబడిన దూతవా ?వానరుడవైనా నీ తేజస్సు అమోఘం .నిజం చెప్పు .అబద్ధం చెబితే నువ్వు బతకటం దుర్లభం .అసలు ఏ ఉద్దేశ్య౦ తో లంకు వచ్చావో చెప్పు .’’అని అన్నాడు
‘’యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్యచ –చార రూపమిదం కృత్వా ప్రవిస్టో నః పురీ మిమాం ‘’
‘’విష్ణునా ప్రేషితో వా దూతో విజయ కామక్షి ణః
‘’నహి తో వానరం తేజో రూప మాత్రం తు వానరం ‘’
‘’అనృతం వదశ్చాపిదుర్లభం తవ జీవితం
అథవాయన్నిమిత్తం తే ప్రవేశో రావణాలయే’’
అప్పుడు వానర శ్రేష్ట హనుమాన్ సూటిగా రావణుడి తోనే ‘’నేను దేవేంద్ర ,యమ ,వరుణులు పంపిన దూతను కాను .కుబేరునితో నాకు స్నేహం లేదు .విష్ణువు నన్ను పంపలేదు .జాతిగా వానరుడినే కాని వానర రూపం పొందిన వేరొకడిని కానే కాను . రాక్షస రాజు రావణుడిని చూడటం దుర్లభం కనుక ఆయన్ను చూడటానికే వనం ధ్వంసం చేశాను –‘’అన్నాడు
‘’అబ్రవీ న్నాస్మి శక్రస్య యమస్య ,వరుణస్య వా –ధనదేన న మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః
‘’జాతి రేవ మమత్వేషావానరో హ మిహాగతః
‘’దర్శనే రాక్ష సేన్ద్రస్య దుర్లభే తదిదంమయా –వనం రాక్షస రాజస్య దర్శనార్ధే వినాశితం’’
‘’అప్పుడు బలవంతులైన ,యుద్ధం కోరే రాక్షసులు నాపై కి వచ్చారు. ఆత్మ రక్షణ కోసంనేను వాళ్ళతో పోట్లాడాను .నన్ను ఏ శస్త్రాస్త్రాలు బంధించలేవని బ్రహ్మ దేవుడు నాకు వరమిచ్చాడు .రావణుడిని చూడటానికే నేను బ్రహ్మాస్త్ర బంధనం అలాగే ఉంచుకున్నాను .మీవాళ్ళు త్రాళ్ళతో కట్టటం తో బ్రహ్మాస్త్ర బంధనం తొలగి పోయింది .నేనొక రాజ కార్యం కోసం ఇక్కడికి వచ్చాను .నేను అమిత పరాక్రమ శాలి రాముని దూతను .నీ మంచికోసం నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను ‘’అన్నాడు హెచ్చరికగా హనుమ .
‘’తతస్తే రాక్షసాఃప్రాప్తా బలినో యుద్ధ కా౦క్షిణః-రక్షణార్ధంతు దేహస్య ప్రతి యుద్ధా మయారణే’’’’
‘’అస్త్ర పాశైర్న శక్యోహం బద్ధుం దేవాసురైరపి-పితామహా దేష వరో మమాప్యేషోభ్యుపాగతః ‘’
‘’కేనపి రాజ కార్యేణసంప్రాప్తోస్మి తవాన్తికం –దూతోహ మితి విజ్ఞేయో రాఘవస్యామి తౌజసః
శ్రూయతాం చాపి వచనం మమ పథ్య మిదం ప్రభో ‘’
ఇది 18శ్లోకాల 50వ సర్గ .
కిందటి సర్గలో హనుమ రావణ వైభవానికి ఆశ్చర్యపోతే ,ఈ సర్గలో రావణుడికి గతంలో జరిగిన విషయాలు,అనుభవాలు హనుమను చూడగా స్పురణకు వచ్చాయి .హనుమలో భగవంతుడైన నందీశ్వరుడు కనపడ్డాడు .ఆయన పెట్టిన శాపం గుర్తుకు వచ్చింది .లేకపోతె కోతికి అంతటి తేజస్సేమిటి విడ్డూరం కాకపొతే ?ప్రహస్తుడు కూడా మంచి ప్రశ్నలే సంధించాడు .నిజం చెబితే వదిలేస్తామని ,అబద్దమాడితే చావు తప్పదని హెచ్చరించాడు .అన్ని ప్రశ్నలకు యుక్తియుక్తమైన సమాధానాలే చెప్పాడు దీమాన్ హనుమాన్ .ఏ దేవుడూ దేవతా పంపిన దూతను కాను అని నిష్కర్షగా చెప్పాడు .అశోక వనం భగ్నం చేయటానికి కారణం రావణుడిని చూడాలన్న ‘’చపలత్వమే’’ అన్నాడు .అమిత పరాక్రములైన రావణ రాక్షసులు అనవసరంగా తనపైకి కాలుదువ్వి వచ్చారని ఆత్మ రక్షణకోసం వారితో పోరాడవలసి వచ్చిందని యుక్తియుక్తంగా చెప్పటం హనుమ ధీనిధి అని తెలియ జేస్తుంది ‘’ఆత్మ రక్షణ కోసం –రక్షణార్ధం తు దేహస్య ‘’ ‘’అన్నమాట సుప్రీం కోర్టులో కూడా తిరుగులేని మాట .అప్పీలు లేని మాటకూడా .ఇక్కడే పురాణప్రవచ ప్రవీణ బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారుచాలా తమాషాగా చెబుతారు ‘’రాజా !నేను మీ వాళ్ళ మీదకు వెళ్ళానా ?లేక వాళ్ళే నా మీదకొచ్చారా ?తెలుసుకో .ఏదో ప్రాణ రక్షణార్ధం వాళ్ళను అలా ఇలా వాయించా .ఆయువు మూడిచచ్చారు.ఇందులో నా తప్పేమీ లేదు మహారాజా !’’అని సరదాగా చెబుతారు
తనకు బ్రహ్మ ఇచ్చిన వరం వలన ఏ అస్త్రాలు తనను బంది౦లేవని బ్రహ్మాస్త్రానికి ఆయనమాటమీదే బద్ధుడనై ఉండిపోయాను అనీ,మీ అబ్బాయి పౌరుష పరాక్రమాలకు నేను లొంగిరాలేదు అవి నన్నేమీ చేయలేవు అని అన్యాపదేశంగా చెప్పాడు ..మహాత్ముడైనశ్రీరాముని దూతను అని విస్పష్టంగా చెప్పాడు .రావణ హితం కోసం తాను చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించమని హెచ్చరికా చేశాడు హనుమ .ఇక్కడే మహర్షి మంచి సస్పెన్స్ సృష్టించి తరువాత ఏమి జరుగుతుందో అనేఉత్సుకత కలిగించాడు .అది తెలుసుకోవటానికి రేపటి దాకా ఆగాలిగా మరి ?అంతేగా మరి ?
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-20-ఉయ్యూరు
—

