ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5

ప్రపంచ దేశాల సారస్వతం

108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5

అపార పాండిత్య ,వ్యక్తిత్వ ప్రతిభతో విద్వజ్జన వందితుడైన వాగను శాసన(డిక్టేటర్ ఆఫ్ ఇంగ్లిష్ లిటరేచర్ ) బిరుదాంకితుడు ‘’డాక్టర్ శామ్యూల్ జాన్సన్ తొలి ప్రామాణిక ఇంగ్లిష్ డిక్షనరీ కూర్చాడు .’’ది రా౦బ్లర్ ,’’ది ఐడ్లర్ ,అనే ధార్మిక వ్యాస సంపుటులు ,’’దివానిటి ఆఫ్ ది హ్యూమన్ విషెస్ ‘’పద్యకావ్యం ‘’ఐరీన్ ‘’నాటకం ,’’రసెలాస్ ‘’వచన కథ కూడా రాశాడు షేక్స్పియర్ నాటకాలకు విశేషమైన పీఠికలు,ఆంగ్లకవుల చరిత్ర గా ‘’లైవ్స్ ఆఫ్ దిపోయెట్స్’’అనే బృహద్గ్రంథం ఆయన సాహితీ విమర్శకు నిలువెత్తు నిదర్శనం .సాహితీ సదస్సును నిర్వహిస్తూ సమకాలీన రచయితలను ప్రోత్సహించేవాడు .ఆయన చెప్పినప్రతి మాట సాహిత్యమే, ఆయన కున్న ప్రతి అభిప్రాయం పరమ ప్రామాణికమే .జాన్సన్ మిత్రుడు శిష్యుడు జేమ్స్ బాస్వె ల్ ‘’లైఫ్ ఆఫ్ సామ్యుల్ జాన్సన్ ‘’జీవిత చరిత్ర రాసి’’ లైఫ్ హిస్టరీ’’లలో తలమానికంగా నిలిపాడు  .దీనికి సాటి వచ్చేది మరొకటి లేదని అందరి విశ్వాసం .జాన్సన్ భావాలకు ,ఆయన హృదయాన్ని ఆవిష్కరించే చక్కని భాష్యం చెప్పాడు .కనుక ఎవరైనా గొప్పశిష్యుడు ఉంటె అతడిని ‘’జాన్సన్స్ బాస్వెల్ ‘’అంటారు .మన తెలుగులో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం కవితా హృదయం గొప్ప గా ఆవిష్కరించినవారు ఆయన శిష్యులైన బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్య గారు .అందుకే ఆయన్ను ‘’విశ్వనాథజాన్సన్ కు శరభయ్య బాస్వెల్’’అన్నాను నేను ఏదో వ్యాసంలో .

   18వ శతాబ్దిలో నవల అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రక్రియ .నవలా రచనకు ఆద్యుడైన రిచర్డ్ సన్-‘’పామెలా ‘’,క్లారిస్సా ‘’నవలలు రాసి ,హృదయ నైర్మల్యాన్నిగొప్పగా చిత్రించాడు .ఫీల్డింగ్ నిత్యజీవిత విషయాలను ‘’జోసెఫ్  ,టాం జోన్స్’’నవలలుగా రాశాడు .వాస్తవికతకు అద్దం పడుతూ స్మాలెట్-‘’రరొడరిక్ రాండం ‘’మొదలైన నవలలు రాశాడు .నవలా రచయితగా విశేష ఆదరాన్ని లారెన్స్ స్టెర్న్ తన  నవలలు ‘’డిస్ట్రం షాండీ  ‘’,ఎ సెంటిమెంటల్ జర్నీ ‘’తో సాధించాడు. ఆనాటి వారిలో సర్వతోముఖ ప్రతిభ చూపినవాడు ఆలివర్ గోల్డ్ స్మిత్ .తనకావ్యాలతో శామ్యూల్ జాన్సన్ ను కూడా మెప్పించాడు .అతడి దిట్రావెలర్ ,ది దడిజర్టెడ్ విలేజ్ ‘’గొప్ప పద్యకావ్యాలు ‘’షి స్టూప్స్ టు  కాంకర్ ‘’ హాస్యనాటకం రాశాడు .గోల్డ్ స్మిత్ అంటే ముందు అందరికీ గుర్తుకొచ్చేది ఆయన అత్యుత్తమ శ్రేణి అద్భుతనవల ‘’వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’’.సరస హాస్యం తో ‘’ది సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ ‘’పేరుతో రాసిన వ్యాసమాల సమాజం మేలు,కీడు లను పరామర్శించి౦ది .

  ఎడ్మండ్ బర్క్ ఉపన్యాసాలంటే ఆనాడు విపరీతమైన క్రేజు .గంభీరంగా సాహిత్య గుణాలతో అవి విశేషంగా ఆకర్షించి సాహిత్య గౌరవం పొందాయి .ఎడ్వర్డ్ గిబ్బన్ ‘’ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ ‘’అనే చారిత్రిక గ్రంథం రాసి సాహిత్య ప్రతిష్ట పొందాడు .అదే కాలం లో లేఖా సాహిత్యానికీ గిరాకీ బాగానే ఉండేది .హోరేస్ వాల్పోల్ ,లార్డ్ చెస్టర్ ఫీల్డ్ రాసిన లెటర్స్ అన్నీ గ్రంథ రూపం పొంది సాహిత్యంలో సముచిత స్థానం సాధించాయి .జాన్సన్ వాడి బాణాలవంటి మాటలతో పనికిమాలిన చెస్టర్ ఫీల్డ్ స్నేహ సహకారాలను నిరాకరిస్తూ రాసిన ఉత్తరం లేఖా సాహిత్య ప్రక్రియలో మణి పూస..చతురోక్తులతో ,శ్రుతిమించిన హాస్యంతో షెరిడన్ రాసిన  ‘’దిరైవల్స్ ,’’ది స్కూల్ ఫర్ స్కాండల్ ‘’నాటకాలు బాగా పేలాయి .లేని పాండిత్యాని ప్రదర్శించాలనే చాపల్యం తో అర్ధం పర్ధం సమయం సందర్భం లేకుండా మాట్లాడుతూ ఒక పుస్తకం లో ఉన్నపాత్రను వేరోకదానిలో ఉన్నట్లు ,ఒక గ్రంధం లోని పాత్ర మాటలు వేరోకదానిలో కోట్ చేసి  నలుగురిలో నవ్వులపాలయ్యే వారిని  ఆతడు ‘’మిసెస్ మేలప్రాప్’’అనే స్త్రీ పాత్రద్వారా గేలి చేశాడు .ఆపాత్ర ఒక కాయినేజ్ మాట అయింది.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-20-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.