సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-51
విభీషణుడి మాటలకు తలపంకించి రావణుడు ‘’బాగా చెప్పావు .దూతను వధించటం ని౦ద్యమే .కనుక వేరే దండన విధించాలి .కోతులకు తోక మహా ముచ్చటైన అలంకారం దాన్ని కాల్చండి.ఆకాలిన తోకతో అతడు ఇక్కడినుంచి వెళ్ళాలి .దీనుడై అంగవైకల్యం తో కృశించిన ఉన్న ఇతడిని ,సోదర బందుమిత్రాదులుచూడాలి ‘’అని చెప్పి .సేవకులతో ‘’నాలుగు వీధుల్లో వీడిని తోక కాలుతుండగా ,అందరూ చూసేట్లు త్రిప్పండి ‘’అని ఆనతిచ్చాడు –‘’’’సంయగుక్తం హి భవతా దూత వధ్యా విగర్హితా –అవశ్యం తు వధాధన్యః క్రియతామస్య నిగ్రహః ‘’
‘’కపీనాం లాంగూల మిష్టం భవతి భూషణం –తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్దేన గచ్ఛతు’’
‘’తతః పశ్యం త్విమం దీన మంగ వైరూప్య కర్శితం –సమిత్ర జ్ఞాతయ స్సర్వే బాంధవా స సుహృజ్జనాః’’
ఆజ్ఞాపయరాక్ష సేంద్రఃపురం సర్వం సచత్వరం – ‘’లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరి ణీయతాం-‘’
ఇంకేముంది కోతితో ఆడుకోవాలని ముచ్చటపడ్డ రాక్షసులు చినిగిన గుడ్డ పేలికలు తోక కు పూర్తిగా చుడుతుంటే ,కొంటె హనుమ ఇదే సమయమని తన శరీరాన్ని పెంచేశాడు .ఆయన పెంచుతూనే ఉన్నాడు వీళ్ళు చుట్టుతూనే ఉన్నారు .ద్రౌపదీ వస్త్రాపరణంలో చీర ఊడుతుంటే మరో చీర దాని స్థానం లో ‘’కన్నయ్యన్నయ్య’’ కనికట్టుతో చుట్టుకొన్నట్లుంది దృశ్యం . గుడ్డముక్కలను నూనె తో తడిపి నిప్పు అంటించారు వినోదం చూడటానికి .అవతలి ఇల్లు కాలుతుంటే మనకు వినోదం చూడటానికి తర్వాత కాలేది మన కొంపే కదా అనే ఇంగితం ఉండదు .ఆనిప్పు వాళ్ళ కొ౦పకే అన్న సంగతి తెలీదు పాపం వారికి .ఊరుకుంటాడా ‘’కోతిమారాజు’’ ? మండే తోకతో వాళ్ళను ఎడా పెడావాయించి బాదేశాడు.ఇది ‘’శాంపిల్ దెబ్బలే’’ ,తర్వాత చావు దెబ్బలు తప్పవు .ఇళ్ళల్లోని ఆబాల వృద్ధ రాక్షసులంతా వీధుల్లోకి ఆనందం తో వచ్చి చోద్యం చూశారు .మళ్ళీ రాక్షసులు తనను బంధించగా హనుమ ‘’నేను బంధింపబడి ఉన్నా వీళ్ళు నన్ను వదలరు కనుక బంధనాలు చేదించుకొని ,పైకెగసి వీళ్ళను చంపుతా .నేను నా యజమాని మేలు కోరి ,ఇక్కడ తిరుగుతుంటే ,దుర్మార్గులు వీళ్ళు నన్ను బంధించారు .దానికి ప్రతీకారం చేయలేదు .వీళ్ళందర్నీ చంప టానికి నేను ఒక్కడినే చాలు .రాముడు ప్రతిజ్ఞ చేశాడుకనుక అయన ప్రీతికోసం నన్ను నాల్గు వైపులా త్రిప్పుతారు వీళ్ళు . శ్రమ లేకుండా లంక అంతా చూసే అవకాశం కలుగుతోంది కనుక వాళ్ళ ఆగడాన్ని సహిస్తాను .నేను రాత్రిపూట లంకలో తిరిగాను కనుక నగర రక్షణ దుర్గాలు ,ఇతర విషయాలు తెలుసుకోవటం కుదరలేదు . ప్రాతః కాలం లో లంక అంతా పరిశీలించి చూస్తాను .నన్ను బాధించినా ,పీడించినా సహిస్తాను ‘’అనుకొన్నాడు యుక్తియుక్తమైన ఆలోచన .వచ్చిన పని ఏవిధంగా నెరవేరుతుంది ఇదంతా చూడకుండా ?కిష్కింధకు వెడితే ఇక్కడి విషయాలు అడిగితె ఏం చెబుతాడు ?షేక్స్పియర్ మొహం వేయాల్సి వస్తుంది .తన ఆకారం కప్పి పుచ్చుకొనగా హర్షాతి రేకంతో అతడిని పట్టి తీసుకు వెడుతూ శంఖాలు ఊదుతూ భేరీలు మోగిస్తూ రచ్చరచ్చగా వీధులన్నీ త్రిప్పారు .తిరుగుతూ బాధ భరిస్తూ లంకను కూలంకషంగా పరికించి పరిశీలించి,పరిశోధించి చూశాడు.మహా వీధులు ,క్రాస్ రోడ్లు ,సందులు గొందులు చిన్నా ,పెద్దా ఇళ్ళూ, భవనాలు అంతర్ద్వార, బహిర్ద్వారాలు ,లోగిళ్ళు ,ముంగిళ్ళు పరీక్షించి చూసి అవగతం చేసుకొన్నాడు .’’వీడు దొంగ దొంగ ‘’అని పరిచయం చేస్తూ ,అరుస్తూ త్రిప్పారు .పాపం ఎంతటి కాక తగులుతూ ,బాధ భరిస్తూ ,రామకార్య నిర్వహణకోసం,అవమానమూ ఓర్చుకున్నాడో రామభక్త హనుమ .కార్య దీక్ష అంటే అదీ .
‘’చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైవచ –ఘోషయంతికపిం సర్వే’’చారీక ‘’ఇతి రాక్షసాః’’
ఈ వార్త సీతకు రాక్షస స్త్రీలు –‘’సీతా !నీతో మాట్లాడిన ఆ ఎర్రమూతికోతి తోకకు నిప్పెట్టి రాక్షసులు లంకానగరం అంతా తిప్పుతున్నారు’’అని చెప్పారు
‘’యస్త్వయా కృత సంవాద స్సీతే తామ్రముఖః కపిః-లాంగూలేన ప్రదీప్తేన సఏష పరిణీయతే’’
ఆమాటలకు సీత తన ప్రాణాలనే అపహరించినట్లు దుఖపడి అగ్నిని ధ్యాని౦చిఉపాశించింది –‘’అగ్ని దేవా !నేను పతి సేవ ,తపస్సు చేసి ఉంటె ,పతివ్రతనైతే నువ్వు హనుమంతుని శరీరం కాలకుండా చల్లగా ఉండేట్లు చేయి .దీమంతుడైన నాపతి పై కొంచెమైనా దయ ఉంటె ,హనుమ శరీరాన్ని కాల్చక చల్లగాఉండు.నేను పాతివ్రత్యంతోఉన్నట్లు రామ సమాగమనం కోసం ప్రతీక్షిస్తున్నట్లు ,ధర్మాత్ముడైన రాముడికి తెలిసిఉంటే ,హనుమ అనుకొంటే హనుమపట్ల చల్లగా ఉండు .సత్యప్రతిజ్ఞ కల పూజ్య సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసాగరం నుంచి తరి౦ప జేసెనేని ,నువ్వు హనుమంతుని బాధించక చల్లగా ఉండు ‘’ అని పరిశుద్ధ మనసుతో నాలుగు శ్లోకాలతో ప్రార్ధించింది –
‘’మంగళాభి ముఖీ తస్య సా తదాసీ న్మహాకపేః-ఉపతస్థే విశాలాక్షీ ప్రయాతా హవ్యవాహన౦ ‘’
‘’యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః –యది చాస్త్వేక పత్నీత్వం’’శీతో భవ హనూమతః’’ ‘’
‘’యది కించి దనుక్రోష స్తస్య మయ్యస్తి ధీమతః –యది వా భాగ్య శేషో మే ‘’శీతో భవ హనూమతః ‘’
‘’యది మాం వృత్త సంపన్నానాం ,తత్సమాగమలాలసాం –స విజానీతి ధర్మాత్మా ‘’శీతో భవ హనూమతహః ‘’
‘’’యది మాం తారయేదార్య ’స్సుగ్రీవ స్సత్య సంగరః –అస్మాద్దుఖా౦బుసంరో’’ధాచ్ఛీతో భవ హనూమతః ‘’
‘ఆమె ప్రార్ధనలు విని వేడి తోక లోని అగ్ని శాంతించి ,సీతాదేవితో’’ హనుమ కు శుభమే’’ అని తెలియ జేస్తున్నట్లుగా ప్రదక్షిణ జ్వాలతో మండాడు .అ అనలమే చల్లబడితే తండ్రి అనిలుడు ఊరు కుంటాడా ?తనవంతు కర్తవ్యాన్నీ తీరుస్తూ మంచులాగా చల్లగా వీస్తూ సీతకు ,హనుమకు సుఖం కలిగేట్లు వీచాడు .’’అగ్నికి వాయువు తోడైనట్లు’’అనే సామెత ఉంది .అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గాలిబాగా వీస్తే ఉపయోగించే సామెత .ఇక్కడ రివర్స్ లో అగ్ని చల్లదనానికి వాయువుకూడా మరింత చల్లగా వీచి తామిద్దరం భాయీ భాయీ,జిగినీ దోస్తులం అని నిరూపించుకొన్నారు .ఇలా అగ్నికి చల్లదనం లో వాయువు తోడుపడటం అరుదైన సంఘటన, దృశ్యమూను.
ఈ ‘’బిహైండ్ ది కర్టెన్ ‘’విషయం పాపం హనుమకేం తెలుసు ?మనసులో ‘’అగ్ని నన్ను ఎందుకు దహించటం లేదు .పెద్దపెద్ద జ్వాలలేఉన్నా , నాకేమాత్రం బాధ కనిపించటం లేదు చందనం, వట్టి వేళ్ళ గంధం పూసినట్లు నా తోక చివర చల్లగా ఉందేమిటి ?ఇదంతా రామ ప్రభావమే .ఆయన ప్రభావంతోనే సముద్రమధ్యలో మైనాకుడు పైకి వచ్చాడు కదా .అతనికే రామకార్యం మీద ఆసక్తి ఉంటె ,అగ్ని ఎందుకు సహకరించడు?సీత సౌమ్యత రాముని తేజస్సు ,వాయు దేవుని స్నేహం వలనా దహించే స్వభావం కల అగ్ని నన్ను కాల్చటం లేదు ‘’అనుకొన్నాడు .
‘’దాహ్యమానేచ లాంగూలేచిన్తయామాస వానరః – ‘ప్రదీప్తోగ్ని రయంకస్మాన్న మాం దహతి సర్వతః –
‘’దృశ్యతే చ మహా జ్వాలః కరోతి న చ మేరుజం –శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్టి తః’’
‘’రామ ప్రభావా దాశ్చర్యం పర్వత స్సరితాం వతౌ-యది తావత్సముద్రస్య మైనాకస్య ధీమతః –రామార్ధం సంభ్రమ స్తాదృక్ మగ్నిర్నకరిష్యతి ?
‘’సీతాయాశ్చానృశం స్యేనతేజసా రాఘవస్యచ –పితుశ్చ మామ సఖ్యేన న మాం దహతి పావకః ‘’
వెంటనే సింహ నాదం చేస్తూ పైకి యెగిరి ,రాక్షస సంచారం లేని పురద్వారం దగ్గరకు వెళ్లి ,మళ్ళీ పొట్టి రూపం పొందగా బంధనాలన్నీ విడిపోయాయి –
‘’స భూత్వా శైల సంకాశః క్షణేనపునరాత్మవాన్ –హ్రస్వతాంపరమాం ప్రాప్తో బంధనా న్యావశాతయత్ ‘’
.బంధన విముక్తుడైన వెంటనే మళ్ళీ పర్వతాకారం దాల్చి అక్కడున్న ఇనుప గుదియ చూసి,దానితో కావలి రాక్షసులను వాయి౦ చేసి చంపి లంకను చూస్తూ తోకనుండి వచ్చే అగ్ని జ్వాలలు మాలగా ఉన్నవాడుగా ,కిరణ సమూహంతో ఉన్న సూర్యుడులా భాసి౦ చాడు హనుమ –
స తా న్నిహత్వా రణ చండ విక్రమః –స్సమీక్ష మాణః‘’పునరేవ లంకాం-ప్రదీప్త లాంగూలాకృతార్చిమాలీ –ప్రకాశాతదిత్య ఇవార్చి మాలీ ‘’
ఇది 45 శ్లోకాల 53వసర్గ
వనం విరగ్గొట్టి ,పంపిన కింకర ద్వారపాలక మంత్రికుమార సేనాపతులనే ససైన్యంగా చంపిన హనుమ దీమత్వాన్ని అంచనా వేయలేక పోయాడు రావణుడు .లేకపోతె తోకను కాల్చమని చెప్పటం ఏమిటి ?అసలు రాక్షసులు కవ్వి౦చక ముందే అశోక వననాశనం చేశాడు .తోకకాలిస్తే ఇంకేం ప్రమాదం తెస్తాడో అనే బేసిక్ ఆలోచన మంత్రాంగం తెలిసిన అతడికి రాకపోవటం విడ్డూరంగా ఉంది. కొలువులో అందరు మేదావులున్నా ఎవరికీ ఈ ఆలోచన తట్టలేదు .విభీషణుడికి తట్టే ఉండచ్చు .కానీ చెబితేఈ ‘’మొండి ము౦డావాడి ‘’వల్ల ఏ ప్రమాదమో ఏదో చంపకుండా వదిలి రాజనీతిని కాపాడుకోనేట్లు అన్నతో చేయి౦చాను కదా అని తృప్తి పడి మిన్నకుండి పోయాడని పిస్తుంది .హనుమ ‘’మామూలోడు ‘’కాదు .తోకకు గుడ్డలు చుట్టేప్పుడు ,నగర వీధుల్లో త్రిప్పినప్పుడు పర్వత సన్నిభ ఆకారం లో ఉన్నాడు .అలాగే పైకీ ఎగిరాడు .ద్వారం దగ్గరకొచ్చాక ,బుద్ధి పాదరసంలా పనిచేసి వామనత్వం పొంది తనబంధనాలు ఆటోమేటిక్ గా ఊడి పోయేట్లు చేసుకొన్నాడు .ఇదే సమయానికితగినట్లు ప్రవర్తించటం ఆలోచించటం ఆచరించటం అంటే .అది హనుమ లో పుష్కలంగా ఉన్నది .
హనుమ తోకకు నిప్పెట్టారని రాక్షస వనితలు సీతకు చెబితే ఆమె తల్లడిల్లి పోయింది .తనకోసం ఇంతదూరం వచ్చిన రామదూయ అయిన వాడికి ఏ అపాయం జరుగరాదు అని భావించి అగ్నిని ప్రార్ధించి తనవ్యక్తిత్వాన్ని రామ ప్రభావాన్నీ ,సుగ్రీవ సంకల్పాన్నీ ప్రవర లాగా చెప్పుకొని ‘’శీతో భవ హనూమతః ‘’అని మనస్పూర్తిగా నాలుగు సార్లు ప్రార్ధించింది .పతివ్రత ఐన ఆమె ప్రార్ధన మన్ని౦చక పోతే అగ్నికి పుట్టగతులుండవు.అందుకే హనుమ తోకకు చందనం , వట్టివేళ్ళగంధం వెన్నపూస పట్టించినంత గా వెంటనే చల్లబడ్డాడు .తనధర్మం తానూ చేశాడు రామకార్యం కోసం .డూడూ బసవన్నలా వాయుదేవుడు కూడా సహకరించి మలయ మారుతంలా వీచి చల్లబరచాడు.
తోక మంటలను అంతకు ముందు భరిస్తూ నగరమంతా తిరిగాడు .ఊరికే తిరగటమా అది కానే కాదు .ప్రతిఅంగుళం లోనూ ఏముందో బైనాక్యులర్ కళ్ళతోనూ, ఎక్స్ రే నేత్రాలతోనూ చూసిమెదడు మనస్సులో గ్రాఫిక్ చిత్రాలు గీసుకొన్నాడు రామ సుగ్రీవులకు నివేదించటానికి .లంకవాసులకు హనుమ లాంగూల దహనమే చివరి వినోదం అయింది .ఐతే బాగా ఎంజాయ్ చేశారు బాజా భజంత్రీల డప్పుల మోతలమధ్య .హనుమనూ చాలాదగ్గరగా చూడగలిగారు .ఆతర్వాత ఇళ్ళూ,ఒళ్ళూకాలి లబో దిబోలేగా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-20-ఉయ్యూరు
‘’
‘
‘’
—

