సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54

 

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-54

  చేయాల్సిన లంకా దహనం కూడా సంతృప్తిగా చేసి హనుమ శింశుపా వృక్షం క్రింద ఉన్న సీతాదేవిని దర్శించి నమస్కరిచి ‘’నా భాగ్యవశం వలన అమ్మా నిన్ను ఏ ఆపదారాని దానిగా చూస్తున్నాను ‘’అన్నాడు .సీతకూడాతిరుగు ప్రయాణానికి సిద్ధ పడిన హనుమను ఆత్మీయంగా పలకరించి ‘’హనుమా !శత్రు సంహారకా !నువ్వొక్కడివే సర్వ రాక్షస సంహారం చేసి, నన్ను నా రామునికి సమర్పి౦చ గలసమర్దుడవు .దీనివల్ల నీకీర్తి పెరుగుతు౦ దనే కాని రాముని కీర్తి పెరగదు .ఆయనే వచ్చి శత్రు రాక్షసులను చంపటమే శ్రేయస్కరం శోభకరం .నువ్వు వెళ్లి ఆయనకు అన్ని విషయాలు చెప్పి ,ఇక్కడికి రావటానికి తగిన ప్రయత్నాలకు అనుగుణ౦గా నువ్వు ఆయనకు చెప్పు .

  హనుమ సీతకు ప్రత్యుత్తరంగా ‘’అమ్మా !రాముడు అన్నిరకాల సైన్యంతో త్వరలోనే ఇక్కడికివచ్చి రాక్షుల౦దర్నీ చంపి, నీ శోకం తీరుస్తాడు ‘’అని ఓదార్పుగా చెప్పి తిరుగు ప్రయాణం చేయబోతూ ,సీతకు వీడ్కోలు చెప్పి అత్యంత త్వరగా రామ దర్శనం చేయాలన్న హడావిడిలో’’ అరిష్టం ‘’అనే పర్వత శ్రేస్టాన్ని ఎక్కి అనేక జలపాతాలతో అనేక వృక్ష ఫల పుష్పజాతులతో పక్షులు జంతువుల సమూహాలతో ఉన్న ,గాలికికదలే కీచకాలు  వెదురు పొదల ధ్వనితో  బుసలు కొట్టే సర్ప సమూహాలతో .తపస్సుకు ఉపయోగపడే ప్రశాంత గుహలతో  మేఘాలను అందుకొనే శిఖర సమూహాలతో ,దాతు స్రావంతో ఉన్నఅరిస్ట పర్వత శిఖరం ఎక్కి ,ఒక్కతొక్కు తొక్కగా కొన్ని కొండ చరియలు విరిగిపడగా హనుమ దక్షిణ తీరం నుంచి ఉత్తర తీరానికి ప్రయాణి౦చాలని బయల్దేరాడు  .ఆ పర్వతం పై ఉన్న సకల పుష్ప జాలం హనుమకు వీడ్కోలు చెబుతున్నట్లు పూల వాన కురిపించాయి .పెద్ద చెట్లు విరిగి నేల వ్రాలాయి .

  గుహా౦తర్భాగం లో ఉన్న సింహాలు హనుమ పాద ఘట్టనం తో పీడింపబడి  భయంతో భీకరంగా అరవగా ఆ ధ్వని  ఆకాశాన్ని చీల్చుకొని అంతటా వినబడింది –

‘’ఆరురోహ గిరి శ్రేష్ట మరిస్ట మరిమర్దనః-తుంగ పద్మకజుస్టాభి ర్నీలాభి ర్వనరాజిభిః’’

‘’కందరాన్తరస్థానాంపీడితానాం మహౌజసాం-సిమ్హానాం –నినదో భీమో నభో భిన్దన్ స శుశ్రువే ‘’

  ఈ భయంకర ధ్వనులకు విద్యాధర స్త్రీలు భయంతో వస్త్రాలు జారి, చిందరవందరై ,ఆభరణాలు స్థానాలు తప్పి ,పర్వతం ఉంచి ఆకాశానికి ఎగిరాయి –

‘’స స్రస్తవ్యా విద్ధవసనా  వ్యాకులీకృత భూషణాః-విద్యాధర్యస్సముపాతాళానికి పేతుః  సహసా ధరణీధరాత్ ‘’

పెద్ద పెద్ద పాములు యెర్రని నాలుకలతో ,విషసర్పాలతలలు పర్వతం నుంచి పైకి ఎగిరిపోయాయి .కిన్నర విద్యాధర గందర్వ,యక్షులు తమ స్థానాలు కోల్పోయి గత్యంతరం లేక వాళ్ళూ ఆకాశం లో చేరారు .హనుమ త్రొక్కిడికి అరిష్టపర్వతం పాతాళానికి కుంగిపోయింది .-

స చ భూమిధరః శ్రీమాన్ బలినా తేన పీడితః – ‘’సవృక్ష శిఖరోదగ్రః ప్రవి వేశ రసాతలం ‘’

పదియోజనాల వెడల్పు ,ముప్ఫై యోజనాల ఎత్తు ఉన్న అరిష్ట పర్వతం అణగారి భూమితో సమానమైనది .

‘’దశయోజన విస్తార స్త్రి౦శద్యోజన ముచ్చ్రితః –ధరణ్యాం సమతాం యాతః స బభూవ ధరాధరః ‘’  తీవ్ర తరంగాలతో కొట్టబడిన తీర ప్రదేశం కల భయంకర సముద్రాన్ని అవలీలగా దాటటానికి బలవాన్ వీర్యవాన్ దీమాన్ హనుమాన్ ఒక్క సారిగా ఆకాశంలోకి ఎగిరాడు –

‘’స లిలంఘ యిషుర్భీమం సలిలం లవణార్ణవం-కల్లోలా స్ఫాల వేలాంత ముత్పపాత నభో హరిః’’

 ఇది 34శ్లోకాల 56 వ సర్గ

 ఇందులో హనుమ మళ్ళీ చివరిసారిగా సీతాదేవిని చూసి ,ఆమె దుఖాన్ని పోగొట్టే మాటలు చెప్పి ,రాముడు  ససైన్యంగా త్వరలో వస్తాడనే భరోసా ఇచ్చి ,సెలవు తీసుకొని తిరుగు ప్రయాణానికి బయల్దేరాడు .ఇప్పుడు అరిష్ట పర్వతం ఎక్కాడు ఆకాశం లోకి ఎగరటానికి .ఆయన  త్రోక్కుడికి’’ అరిస్టం’’ పాతాళానికి దిగిపోయింది .ఇక్కడ నాకు ఏమి అనిపించిందంటే అన్ని రూపాలలో ఉన్న అరిష్టం తొలగిపోయి, రాముడు రావటానికి’’ లైన్ క్లియర్ ‘’అయింది అని .సీత హనుమ పరాక్రమం ను మెచ్చి ,ఐతే సీత దుఖం రాముడు వచ్చి తీర్చాల్సిందే కాని, ,హనుమ చేయాల్సినపని కాదని స్పష్టం చేసింది .ఆయన త్వరగా వచ్చేట్లు నచ్చ చెప్పమని నొక్కి మరొక్కసారి చెప్పింది .కనుక ఆశావహంగా ఈ సర్గ ముగిసింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-6-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.