ప్రపంచ దేశాల సారస్వతం
108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -9
విక్టోరియాయుగ రచయితలు సాహిత్యం వినోదం కోసమేకాక సంఘ సంస్కరణకూ తోడ్పడాలని భావించి ప్రయోజనాత్మక రచనలే చేశారు .19వ శతాబ్దం చివర దీనికి విరుద్ధంగా ‘’కళకళ కోసమే ‘’అనే సౌందర్య ప్రదానవాదం (ఈస్తటిక్ మువ్ మెంట్ )వచ్చింది .సాహిత్యనికేకాక కళలన్నిటికీ శిల్ప సౌందర్యమే పరమావధి అనీ ,ధర్మప్రబోధంతో దానికి సంబంధం లేదనీ భావించారు .వాల్టర్ పేటర్’’ది రినైజాన్స్ ‘’అనే వ్యాసం లో ఈసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు .అతడి వచన శైలి రమ్యం .ఈయన్ను సమర్ధించాడు ఆస్కార్ వైల్డ్ .వైల్డ్ వ్యాసాలూ ,’’ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’’నవల ,’’ది ఇంపార్టన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ ‘’’’లేడీ విండర్ మియర్స్ ఫాన్’’హాస్యనాటకాలు చాలా ప్రసిద్ధమైనాయి .మెరుపు తీగలవంటి చతురోక్తులకు వైల్డ్ పెట్టిందిపేరు .
చిన్న కథ 19వ శతాబ్దం లోనే రూపు దాల్చింది .డికెన్స్ స్టీవెన్సన్ ,ఆస్కార్వైల్డ్ లు నవలలతో పాటు గొప్ప కథలూ రాశారు. అసామాన్య నైపుణ్యంతో కథానికా రచనకు కొత్త రూపు ,ఊపు తెచ్చినవాడు రుడ్యార్డ్ కిప్లింగ్ .ఇండియాలో కొంతకాలం పత్రికా రచయితగా ఉండి,అక్కడి ప్రజాజీవితాన్ని వాటిలో పొందుపరచాడు .అతడి నవల ‘’కిం ‘’ప్రసిద్ధమైంది .19శతాబ్ది చివరలో ఫ్రాన్సిస్ టాంసన్’’దిహౌన్డ్ ఆఫ్ హెవెన్ ‘’భక్తిరస ప్రథానకావ్యం రాశాడు .మనిషి మర్చిపోయినా అతడిని వెంబడించేదేవుని కరుణా తత్పరత ఇందులో ఉంటుంది.జేరార్డ్ మాన్లి హాప్కిన్స్ ఆధ్యాత్మిక భావ బంధుర కావ్యాలు గొప్ప శిల్ప చమత్కృతి తో రాశాడు .అందులో ‘’ది టెస్టమెంట్ ఆఫ్ బ్యూటీ ‘’అద్భుతః .
శామ్యూల్ బట్లర్ విక్టోరియా యుగ విశ్వాసాలపై తిరగబడి ‘’ఎరివాన్ ‘’,ది వే ఆఫ్ అల్ ఫ్లెష్ ‘’నవలలతో 20వ శతాబ్ది రచయితలకు మార్గ దర్శి అయ్యాడు .థామస్ హార్డీ’’ది రిటర్న్ ఆఫ్ది నేటివ్ ‘’,ది మేయరాఫ్ కాస్టర్ బ్రిడ్జ్ ‘’,టెస్ ఆఫ్ది డాబర్ విల్స్ ,జూడ్ దిఅబ్ స్క్యూర్’’నవలలలో ప్రతికూలశక్తులమధ్య ,కస్టాలకెరటాలు ఎదుర్కుంటూ బతుకు బండీ మోసే సామాన్యుల విషాద దయనీయ స్థితిని వర్ణించాడు .అతనిలోని తాత్విక దృష్టి’’ది డైనాస్ట్స్’’వంటి నాటకాలలో ,గీతాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది .
20వ శతాబ్దం లో మళ్ళీ సంప్రదాయం పై వైముఖ్యం ఏర్పడి రాజకీయ మార్పులు వైజ్ఞానిక రంగ పురోగతి మొదలైన వాటిపై రచయితలకు మోజు పెరిగి వాస్తవిక వాదం వచ్చింది .సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ అంటే మనో విశ్లేషణ శాస్త్ర సిద్దా౦త౦ ,’’ఫేబియన్ ‘’సామ్యవాదం ,నీషే, బెర్గ్ సన్ ,జీన్ పాల్ సాత్రే తత్వవేత్తల రచనలు సాహిత్యం లో కొత్తపోకడలను తెచ్చాయి .ఏ. యి. హౌస్మన్ కవి ‘’ఏ ష్రాప్ సైడ్ లాడ్’’,లాస్ట్ పోయెమ్స్ కవితా సంపుటులు ,మంచి గీతాలు రాశాడు .నిరాశామయ జీవితం లో అవి మనో ధైర్యానిస్తాయి .డబ్ల్యు బి యేట్స్ ,వాల్టర్ డీలామేర్ కవులు కాల్పనిక సాహిత్యం లోని కమనీయ ఘట్టాలను కొత్త కోణం లో వర్ణించారు .జాన్ మేస్ ఫీల్డ్ ‘’దివిడో ఆఫ్ ది బై స్ట్రీట్ ‘’ది ఎవర లాస్తింగ్ మెర్సి’’కావ్యాలలో మంచీ చెడూ ,పాపపుణ్యాలు ,దైవకరుణల మధ్య ఏర్పడే సంఘర్షణ ను మహోన్నతంగా చిత్రించాడు .మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యువత లో కలిగిన మానసిక సంక్షోభాన్ని రూపర్ట్ బ్రూక్ ,సీగ్ ఫ్రీడ్ సెసూన్ ,విల్ఫ్రెడ్ ఓవెన్ ,రాబర్ట్ గ్రేవ్స్ కృతులలో హృదయవిదారకంగా వర్ణించారు.
కాల్పనికోద్యమంలో వచ్చిన మధుర కోమల పదావళి నిర్జీవమై పోయి ,వర్తమాన జీవిత మానసిక స్థితి వర్ణించటానికి అనుకూలంగా లేదని తిరస్కరించి ,నిత్యజీవిత వ్యవహారం లో ఉన్న పదాలతో కొత్త భావాలు తెలియ జేయవచ్చు అని శబ్ద చిత్రాల సృష్టి అనే పేరుతో సంకేత ప్రథానవాదం –ఇమేజిస్ట్ మువ్ మెంట్ 1912నుంచి వచ్చింది .వర్ణనా శిల్పంతో నవ్యత తెచ్చారుకవులు .ఈకవులలో ఇలియట్ ,అగ్ర గణ్యుడు.అమెరికాలో పుట్టి ఇంగ్లాండ్లో స్థిరపడ్డాడు .ఇలియట్ రాసిన ‘’వేస్ట్ లాండ్ ‘’కావ్యం నవ్యకవిత్వావతరణకు నాందీ గీతం అయింది ఒకరకంగా నవ్యకవిత్వానికి ‘’బైబిల్ ‘’అయింది . ‘’మర్డర్ ఆన్ ది కేతెడ్రిల్,దిఫామిలి రీ యూనియన్ ,నాటకాలు ,ది సేక్రేడ్ వుడ్ ‘’అనే సాహిత్య విమర్శ అతని మేధో వికాసానికి గొప్ప ఉదాహరణలు .మొ.ప్ర.యు .తర్వాత మానవాళిలో ఏర్పడిన నైరాశ్యం ను తన రచనల్లో అద్భుతంగా తీర్చి దిద్దినమేదావి .సిసిల్ డేలూయీస్ ,డబ్ల్యు హెచ్ ఔడెన్,లూయీ మేక్లీస్ ,స్టీఫెన్ స్పెండర్ కవులకు వాళ్ళ కృతులకు మంచి గౌరవమే ఉన్నది ‘
సశేషం
సూర్యగ్రహణ కానుక
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-21

