‘’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -60
‘’మనసులో మరో సారి నిశ్చయానికి వచ్చి సీతాదేవి నాతో ‘’నా వృత్తాంతం అంతాచెప్పి విన్నంతనే రామలక్ష్మణ సుగ్రీవులు కలిసి ఇక్కడికి వెంటనే వచ్చేట్లు చెయ్యి .రెండు నెలలుదాటితే, నేను బ్రతకను ఆతర్వాత ఆయన వచ్చినా వ్యర్ధమే –
‘’యద్యన్యథాదేత ద్ద్వౌమాసౌ జీవితం మమ-న మాం ద్రక్ష్యతి కాకుస్థో మ్రియేసాహ మనాథవత్’’
‘’సీతాదేవి దీనాలాపాలతో నాకు రాక్షసరాజు పై విపరీతమైన కోపం వచ్చి మిగిలిన పని పూర్తి చేయాలనుకొన్నాను .నా శరీరాన్ని పర్వతంలాగా పెంచి యుద్ధం చేయాలనుకొని అశోకవన ధ్వంసం చేశాను .రాక్షస స్త్రీలు మేల్కొని అక్కడి మృగ పక్షులు పారి పోవటం చూసి ,అక్కడ నన్ను చూసి వెంటనే రావణుడి దగ్గరకు వెళ్లి ‘’రాజా !ఇతరులు ప్రవేశించజాలని నీవనాన్ని ,నీ బలపరాక్రమాలు తెలీక ఒక దుర్మార్గ వానరుడు పాడు చేశాడు .వాడి దుర్భిద్ధికి తగినట్లుగా వెంటనే మరణ శిక్ష విధించు ‘’అన్నారు.’’ఏ శిక్ష వెయ్యాలో వాళ్ళే రాజుకు సూచించారు .42వ సర్గలో మాత్రం తీవ్ర శిక్ష వెయ్యమని చెప్పబడింది .హనుమ కొంత మార్చి చెప్పాడు .-
‘’వధ మాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్ ‘’
‘’అప్పుడు తనమాట వినే జయి౦పనలవికాని కింకరులను నాపైకి రాజు ఆజ్ఞాపించి పంపాడు .నాపై పడిన 80వేలమంది కింకరులను అక్కడే పరిఘ తో చంపిపారేశాను .చావగా మిగిలి తప్పించుకొన్నవారు రాజుకు వెళ్లి చెప్పగా నేను చైత్యప్రాసాదం ఎక్కి, దాని రక్షకులను చంపాను ‘.అప్పుడు చాలామంది రాక్షసులతో ప్రహస్తుని కొడుకు జంబుమాలిని నాపైకి పంపాడు. వాళ్ళందర్నీ పరిఘతోనే మట్టుపెట్టాను .మంత్రికుమారుల్ని పంపాడు రాజు. వాళ్ళనీ పరిఘతోనే యమపురికి పంపాను .తర్వాత అయిదుగురు సేనానాయకులను పంపగా అందర్నీ ససైన్యంగా చంపేశాను .మండోదరి కొడుకు అక్షకుమారుని గొప్ప సైన్యం తో పంపగా వాడితో ఆకాశాయుద్ధం చేసి రెండు పాదాలు గట్టిగా పట్టుకొని వందసార్లు ఆకాశం లో త్రిప్పి
నేలపై పడగొట్టి చంపాను .పంపినవారందర్నీ చంపేస్తున్న నాపై కోపం విపరీతమై తనకొడుకు ఇంద్రజిత్ ను పంపగా వాడి సైన్యాన్ని గుక్క తిప్పుకోకు౦డాకూల్చగా,వాడికీ మండి, బ్రహ్మాస్త్రం ప్రయోగింఛి నన్ను బంధించగా వాడిభటులు నన్ను త్రాళ్ళతో కట్టి రావణదర్బారుకు తీసుకు వెళ్ళారు .
‘’నన్ను లంకకు ఎందుకు ఏపనిమీద వచ్చానో ,సీతను ఎందుకు చూశానో చెప్పమని ప్రశ్నించారు .నేను ‘’సీతాదేవిని చూడటానికే వచ్చాను వాయుకుమారుడైన హనుమను రామదూతగా వచ్చాను సుగ్రీవుని మంత్రిగా వచ్చాను సుగ్రీవుడు నిన్ను క్షేమం అడిగాడు నీకు ఇహపర సాధకమైన హితోపదేశం నాతో పంపాడు .’’ఋష్యమూక పర్వతం పై రాముడు నాకు మిత్రుడయ్యాడు .నాభార్యను రావణుడు ఎత్తుకుపోయాడని కనుక ఆమెను వెతకటానికి సాయం చేయి అని కోరగా ,నేను మా అన్నవాలి నాకు అపకారం చేశాడు , వాడిని వధించి నాకు న్యాయం చేయి ‘’అనికోరాడు అని సుగ్రీవ వాక్యంగా చెప్పాడు హనుమ .రాజా !వారిద్దరూ అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు .రాముడు ఒకేబాణ౦ తో వాలిని చంపి వానర రాజ్యం కిష్కింధకు సుగ్రీవుని రాజును చేశాడు .కనుకమేము రామునికి అన్నివిధాలా సాయం చేయాలి .అందుకే ధర్మసంమిటంగా నన్ను నీదగ్గరకు దూతగా పంపాడు .వానరసైన్యం నీ రాక్షససైన్యాన్ని చంపకముందే నువ్వు సీతను రాముడికి సమర్పించు .దేవతలే వానరుల సహాయం కోరితే వెళ్లి విజయం చేకూర్చిన వానరుల ప్రభావం అందరికీతెలుసు ‘’అని హితవు చెప్పాను ‘’ ఈమాటలు 51వ సర్గలో లేవు .అక్కడ వేలాది వానర వీరులు సర్వదిశలో వాయువేగంతో సంచరించే బలపరాక్రమవంతులైన వారున్నారు అనిమాత్రమే చెప్పాడు .ఇక్కడ కొంచెం పెంచి చెప్పాడు .
‘’వానరాణా౦ ప్రభావోహి న కేన విదితః పురా –దేవతానాం సకాశం చ యేగచ్ఛ౦ తి నిమంత్రితాః’’
‘’నా ప్రభావం తెలీక నన్ను చంపని రావణుడు ఆజ్ఞాపిస్తే ,బుద్ధిశాలి సోదరుడు విభీషణుడు దూతవధ రాజశాస్త్రానికి విరుద్ధమని ,దూత స్వామిహితం కోసమే నిజం చెబుతాడు కనుక చంపటం ధర్మకాదని ,ఆకపి అపకారమే చేసిఉంటే అంగవైకల్యం కలిగించవచ్చు అని చెప్పగా ,నా తోక కాల్చమని ఆజ్ఞాపించాడు రాజు .వెంటనే సేవకులు జనపనార గుడ్డపీలికలతో నా తొకకుచుట్టి నన్ను కొడుతూ తోక కాల్చారు .నాలుగు వీధులూ తిప్పుతూ ‘’ఈకోతి చేసిన అపరాధానికి శిక్షగా బంధనం ,పుచ్చదహనం చేయబడుతో౦ దహో ‘’అని బిగ్గరగా అరుస్తూ త్రిప్పారు .ఈవిషయం 53వ సర్గలో లేదు .అక్కడ ‘’వీడుదొంగ వీడుదొంగ ‘’అని అరుస్తూ తిప్పారని ఉన్నది –
తతస్తే రాక్షసాస్సూరా బద్ధం మా మగని సంవృతం -‘అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగాతా’’
‘’నేను తెలివిగా నారూపం తగ్గించుకోగానే కట్లు తెగిపోగా,మళ్ళీ శరీరం పెంచి ఇనుప గుదియ తో ఆ రాక్షసులని చంపి ,నగరద్వారంపైకి యెగిరి నాతోక కున్న అగ్నితో లంకాదహనం చేశాను .సీత సంగతి మర్చిపోయాను .సిగ్గుపడి పశ్చాత్తాపం చెందగా చారణులు సీత క్షేమంగా ఉన్నది అని చెప్పిన శుభవార్త విని సంతోషించాను .తోకకాలుతున్నా అగ్ని నన్ను దహించలేదు .మనసు ప్రశా౦త౦గా ఉంది వాయువు చల్లగా వీచింది ,సీతాదేవిని మళ్ళీ దర్శించి స్వయంగా ఆమె కుశలం అర్ధం చేసుకొని ,తిరుగుప్రయాణానికి ఆకాశంలోకి ఒక్కసారి ఎగిరి ,సముద్రం దాటి మళ్ళీ మీదగ్గరకు వచ్చి మిమ్మల్ని చూడగలిగాను .శ్రీరామచంద్రుని ప్రభావం ,మీ తేజస్సు ,కారణంగా మన రాజు సుగ్రీవుని కార్యాన్ని చక్కగా నిర్వహించగలిగాను .నేను ఇక్కడి నుంచి బయల్దేరిన దగ్గర్నుంచి తిరిగి వచ్చేదాకా చేసిన పనులన్నీ సవివరంగా మీకు తెలియ జేశాను .ఇక ఇప్పుడు నేను ఏమి వదిలి వేశానో అది అంతా చెయ్యాలి ‘’అని హనుమ గుక్క తిప్పుకోకుండా చెప్పి కూర్చున్నాడు .
‘’రాఘవస్య ప్రభావేన భవతాంచైవ తేజసా –సుగ్రీవస్య చ కార్యార్ధం మయాసర్వ మనుస్టితం’’
‘’ఏతత్సర్వం మయాతత్ర యథావ దుపపాదిత౦ – అత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి’’
ఇది 165శ్లోకాల 58 వసర్గ .
విషయం అంతా తెలిసి౦దేకనుక పెద్దగా వివరణ అవసరం లేదు .తేడాలున్న చోటమాత్రమే మీ దృష్టికి తెచ్చాను .ఇందులో హనుమ వ్యక్తిత్వం ఎక్కడుంది ?అంటే తన దూతకార్యం అంతా తనగొప్ప కాదు .అది రాముని ప్రభావం, వానర ఋక్ష సేన తేజస్సు మాత్రమే అని అత్యంత వినయంగా చెప్పటం లో ఉన్నది. కాదా మరి? అవును మరి .అంతేగా మరి ?వారి ఆశీర్వాద ప్రోత్సాహ బలం తో అంతటిఘనకార్య నిర్వహణ చేయగలిగాను అని వినమ్రంగా విన్న వించిన హనుమ ఎంతో ఎత్తుకు ఎదిగి’’ఎంత ఎదిగి పోయావయ్యా ‘’అని మనతో అనిపించుకొన్నాడు మనకు గొప్ప ఆదర్శ ప్రాయుడౌతున్నాడు .చెప్పాల్సింది పూస గ్రుచ్చినట్లుగా చెప్పానని ఏదీ దాయలేదనీ అన్నట్లు తెలియజేశాడు .ఇకతాను మిగిలినపని ఎలా చేయాలో సలహా ఇవ్వమని కోరి తన విజ్ఞత చాటుకున్నాడు హరి ప్రవీణ హనుమ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-20-ఉయ్యూరు

