–ఆనంత కళా క్షీర సాగర మధనం చేసి రెండు అనర్ఘ రత్నాలు వెలువరించి కలళాతృష్ణ తీర్చుకొన్న అరవై నాలుగు కళల కళాసాగర్
కళలు భౌతిక ఆధ్యాత్మిక తత్వాల సమ్మేళనం .రక్తీ ముక్తీ ఇచ్చేవి .సౌందర్య జ్యోతకాలు .మానవ జీవితాలను సుసంపన్నం చేసి ,ఆనందమయం చేసేవి .అందుకే కళాకారులు అజరామరులు . కళ భాష విశ్వ భాష .దానికి సరిహద్దులు లేవు .భారతీయ సంస్కృతిలో సంగీత సాహిత్యాలస్థానం నిరుపమానం .సంగీతానికి సాహిత్యం రససిద్ధి కలిగిస్తే ,సాహిత్యానికి సంగీతం పరిమళం అద్దుతుంది..ప్రకృతికి శోభనిస్తాయి .కళల పరమావధి ప్రపంచ శాంతి వర్దిల్లజేయటం అన్నారు కంచి పరమాచార్య’’ మైత్రీ వర్ధతాం ‘’అని చాటారు ..జీవితమే కళ కళయే జీవితంగా భావించిన కళాకారుల జీవితాలు ధన్యం వారిజీవితాలు delightful and useful ‘’జాతిని జాగృతం చేస్తాయి .వాళ్ళు సృష్టించిన వాటిపై వారికి పూర్తి సాధికారత ఉంటుంది .ఈలోకం చిదానంద స్వరూపం .మంచిమనిషి తెలివైన మనిషి ‘’అన్నాడు షేక్స్పియర్ మహాకవి .మహాకళాకారులు ‘విమతులకు పులి గా ,విశ్వాస భాజనులకు చెలి’’గా కన్పిస్తారు .వారుకోరేది డబ్బు కాదు శాశ్వత కీర్తి .సూర్య చంద్రులు మేఘం నదులు గోవులు సత్పురుషులు పరోపకారం కోసమే సృష్టింప బడ్డారు.ఒక్కో కళాకారునికి ఒక్కో శైలి ఉంటుంది .ఇదంతా కళాసాగరం .దీనికి అంతూ దరీ లేదు.అలాంటి అనంత కళా క్షీర సాగర మధనం చేశాడు మిత్రుడు కళాసాగర్ .అతడు సహజం గా ‘’64 కళల రేరాజు ‘.ఇటీవలే రెండు పుస్తకాలు వెలువరించి కళా లోకోపకారం చేశాడు .1-కళ’’నాడు –నేడు 2-64కళల ‘’స్పటిక జయంతి’’’సంచిక .స్పటిక జయంతి పేరుతొ ఇంతకూ ముందు ఎవ్వరూ సంచిక తెచ్చినట్లు నాకు తెలీదు .అభినందనీయం .
1-కళ’’నాడు –నేడు
చక్కని ముఖ చిత్రాలు ,మంచికూర్పు పుస్తకం కళను జేగీయమానం చేసింది .కళ అంటే ఏమిటో చెప్పి,పరిణామక్రమం వివరించి ,లలితకళలను వివరంగా విశ్లేషించి ,నాగరకతకు కళలు ఎలా దోహదంచేశాయో తెలిపి, ’’ఆగాధమీలు ‘’అని పిలువబడే కేంద్ర రాష్ట్ర అకాడేమీల సంక్షిప్త పరిచయంచేసి నిర్వాహకుల సేవలు వివరించి ,శిల్పగురు వంటి పురస్కారాలను వెలుగులోకి తెచ్చి అందుకున్న మహానుభావుల జాబితా అందించి ‘’సామాన్యుఅలకు తెలియని ‘’,క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ‘’ అనేబ్రహ్మపదార్ధ విచారణ చేసి ,కళాకారుడి ప్రత్యేకతలు పేర్కొని అవార్డులు కళాకారునికి గుర్తింపు ,దేశంలో నిర్వహించే వివిధకళాజాతరలు చెప్పి ,కృత్రిమ మేధ కళారంగం పై ప్రభావంకూడా వివరించి ,కళ సహజత్వం కోల్పోవడం పై బాధపడి ,కళాకోర్సులను వివరించి ,కళావికాసానికి సాంస్కృతిక సంస్థల బాధ్యతను గుర్తు చేసి ,ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలు వివరణతో పుస్తకం పూర్తి చేశారు కళాసాగర్ .నిజంగా కళాసాగర మాధనమే చేశాడు .ఒక రకం గా ఈ పుస్తకం ‘’అరచేతిలో ఉన్న మినీ కళాసర్వస్వం ‘’.హాట్స్ ఆఫ్ కళాసాగర్ .
2-64కళల సంచిక జన్మించి 14 దాటి 15 వ ఏడాదిలో ప్రవేశించిన శుభ సందర్భంగా వెలువరించిన స్పటిక జయంతి సంచిక.ఇందులో లబ్ధ ప్రతిష్టులైన కొందరు చిత్ర కళా కారుల సంక్షిప్త పరిచయాలు ఫోటోలతో సహా ఉన్నాయి వర్ధమాన కళాకారుల గురించి పరిచయమూ బాగుంది .ఆస్ట్రేలియాలో సమకాలీన శిల్పుల వివరాలున్నాయి .ఈ పద్నాలుగు ఏళ్లలో పత్రిక సాధించిన ఘనవిజయాలకు ఈ సంచిక స్ఫటికం లోనుంచి వెలువడిన తెల్లనికాంతి సప్తవర్ణ ఇంద్రధనుస్సు రూపం సంతరించుకొని రంగులకలగా కళగా భాసించింది .అన్నట్లు చెప్పటం మరిచాను .మిత్రుడు రమ్యభారతి సంపాదకుడు శ్రీ చలపాక ప్రకాష్ మాకు పరిచయం చేసిన ఈ యల్లపు కళాసాగర్ మా సరసభారతి ప్రచురించినపుస్తకాలన్నిటికీ ముఖ చిత్ర రూప శిల్పి .ఎల్లలు లేని స్నేహశీలి .మరింతగా కళాకాశం లో వెలుగులు చిమ్మాలని ఆశిస్తున్నాను .5పేజీ శీర్షికలో ‘శతాబ్ధాలు’’అనే మాట ఒక్కటే పంటికింద రాయి లా బాధించింది .చంద్రుని కళలో మచ్చకూడా అందమేగా .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ –10-9-26-ఉయ్యూరు .
