నా దారి తీరు -62
నగర సంకీర్తన
మా ఉయ్యూరులో ధనుర్మాసం కార్యక్రమాలు అంటే హరికధలే .రోజు రాత్రి వేళ హరికధాలను చెప్పించటమే ఉండేది .తెల్ల వారు జామున విష్ణ్వాలయం లో పూజ చేసేవారు సాధారణం గా దడద్దోజనమే నైవేద్యం మా అమ్మ లేచి వెళ్ళేది ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చేది మేము హిందూపురం లో ఉండగా మా ఇంటికి దగ్గరలో శివాలయం లో ధనుర్మాస కార్య క్రమాలకు వెళ్ళే వాళ్ళం ఆ ప్రసాదాలు తినటం ఇప్పటికి గుర్తే .మా మామ్మ కూడా మాతో వచ్చేది .కాని ఉయ్యూరులో నేనెప్పుడు ఉదయం పూట ధనుర్మాస పూజకు వెళ్ళిన జ్ఞాపకం లేదు .కాని 1970లో ఊళ్ళోని ఆడవారూ మగ వారూ అందరుకలిసి మొదటి సారిగా తెల్ల వారుజామున నగర సంకీర్తన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం దీనికి ప్రోద్బలం విష్ణ్వాలయ అర్చకులు స్వర్గీయ వేదాంతం రామా చార్యులు గారు ఆయన తమ్ముడు వాసుదేవాచార్యులు గారే .స్టేట్ బాంక్ లో ఆపని చేసిన ఒక కుర్రాయన దీనికి నాయకత్వం తీసుకొన్నాడు .మేమందరం అనుసరించాం .ఆయన బాగా పాడేవాడు కీర్తనలు శ్రావ్యం గా గానం చేసేవాడు తాళం లయ జ్ఞానం ఉన్న వాడు కొంతకాలానికి పెనమ కూరు ట్రాన్స్ ఫర్ మీద వెళ్లి పోయాడు
ఆ బృందం లో మంత్రాల రాదా కృష్ణ మూర్తి ,మండా వీర భద్ర రావు నేను ,మంత్రాల మంగమ్మ ,వారణాసి దుర్గ ఆమె భర్త ,మొదలైన వారందరం ఉండేవాళ్ళం సుమారు పది మంది ఆడ వారు ,పది మంది మొగ వారు కలిసి విష్ణ్వాలయం నుంచి తెల్ల వారు జామున నాలుగున్నరకే బయల్దేరే వాళ్ళం .దుర్గ గారు బాగా భక్తీ గీతాలు పాడేవారు భజనా బాగా చేసే వారు .మిగతా వాళ్ళం వీరితో గొంతులు కలిపే వాళ్ళం .తాళాలు వేసే వారు కొందరున్దేవారు .ముఖ్యం గా కే సి పి లో వర్కర్ గా పని చేసే ఆయన ఒకాయన మంచి భక్తీ పరుడున్నాడు నల్లగా ఉండేవాడు చక్కగా పంచ కట్టే వాడు ఆయన అందరి కంటే ముందు వచ్చేవాడు .ఇప్పుడాయన చని పోయాడు .వాళ్ళ అబ్బాయి కూడా జత కలిసే వాడు .అలానే అమర నాద చెల్లెళ్ళు ముగ్గురూ పెళ్ళిళ్ళు అయ్యే దాకా నగర సంకీర్తన లో పాల్గొనే వారు .విష్ణు భొట్ల సోమయాజులు భార్య ఆవిడ తోడికోడలు వాళ్ళ అమ్మాయి, ,కోమట్ల బజారు రాజా భార్య ,గెల్లి మల్లికార్జున రావు భార్య ,వీరభద్ర రావు ఇందాక చెప్పిన స్టేట్ బాంక్ ఆయనా పాల్గొనే వాళ్ళం. అందరు వీలైనంత వరకు శృతి కలిపి పాడుకుంటూ విష్ణ్వాలయం దగ్గర బయల్దేరి నుండి సూరి వారి బజారు అక్కడినుండి మా ఆంజనేయ స్వామి గుడి మీదుగా ,వెనక ఉన్న కోట వారి బజారు అక్కడి నుండి కొబ్బరి తోట మీదుగా పుల్లెరుదాకా అక్కడి నుండి మా బజారు ,సూరి పార్ధి వాకిలి దాటి శివాలయం మీదుగా సెంటర్ చేరి అక్కడి మసీదు మీదుగా విశ్వ బ్రాహ్మణ బజారు నుండి రావి చెట్టు బజారు వెళ్లి ,కోమట్ల బజారు చూసి మళ్ళీ విష్ణ్వాలయం చేరే వాళ్ళం దాదాపు రెండు గంటలు పట్టేది . జోలె సంచులు బుజానికి తగిలించుకొని వెళ్ళే వాళ్ళం చిడతలు తాళాలు మోగిస్తూ వెడుతుంటే భలే గా ఉండేది మధ్యలో ఎక్కడైనా చలి మంటవేసుకొనే వాళ్ళం .స్వెట్టరు శాలువా మగాళ్ళు వేసుకొంటే ఆడ వారు సాధారణ వస్త్రాలతో వచ్చే వారు నాలుగింటికే లేచి స్నానాలు చేసి దీపారాధన చేసుకొని స్త్రీలు శుచిగా వచ్చే వారు .మేము దంత ధావనం మాత్రం చేసి వెళ్ళే వాళ్ళం ఇంటికొచ్చి స్నానం సోమయాజులు భార్య సావిత్రమ్మ గారు భక్తీ భావం కురిసేట్లు ఆర్తిగా మంచి గీతాలు పాడేవారు .మధ్య మధ్య లో’’ శ్రీ మద్రమారమణ గోవిందా ‘’అని అందరం అంటూ హుషారుగా తిరిగే వారం .చలి పులి మమ్మల్నేమీ చేసేది కాదు .
విష్ణ్వాలయంలయం చేరి పూజారిగారికి భక్తులు వేసిన బియ్యం కాయ గూరలు డబ్బు అప్పగించి ఒక పుస్తకం లో లెక్క రాయించే వాళ్ళం ..క్రమం గా నేను తగ్గించుకోన్నాను .బూరగడ్డ బసవయ్య మనవడు కృష్ణ మోహన్ ఈ సంకీర్తన సంఘానికి నాయకత్వం తీసుకొన్నాడు .అతని భార్య కూడా సంకీర్తనలో ఉండేది .తర్వాత ఎండూరి సుబ్బారావు నాయకుడైనాడు .వచ్చిన ద్రవ్యాన్ని ఏ రోజు కారోజు మైకు లో చెప్పటం రాయించటం జరిగుతుంది .ధనుర్మాసం పూర్తీ అవ్వగానే వచ్చే మొదటి ఆదివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం .ఆ ద్రవ్యాన్ని ఇలా సద్విని యోగ పరచే వాళ్ళం .ఇప్పటి వాళ్ళు కూడా అంత జాగ్రత్తా తీసుకొంటున్నారు ఇక్కడ పెత్తనం అని కాక నిబద్ధత సేవ కే ప్రాధాన్యం .అన్న సమారాధన రోజున మొదట్లో ఆడ వాళ్ళందరూ కూరగాయలు తరగటం పదార్ధాలు వండటం ,చేస్తే మగ వారు వడ్డించటం మొదలైన వి చేసే వారు ఇక్కడ కులాల పట్టింపు ఉండేది కాదు .ఇప్పటికీ లేదు .మొదట్లో మేమూ వెళ్లి భోజనం చేసే వాళ్ళం క్రమంగా మానేశాము .
ఈ మధ్య పదేళ్లుగా సంకీర్తన బాచ్ పలచ బడి కొంచెం నిరుత్సాహం గా ఉంటె పువ్వాడ వెంకటేశ్వర రావు ను నెలకు ఏదో కొంత డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసి పాల్గోనేట్లు చేస్తున్నారు అతను గుడ్డి వాడు కాని అద్భుతమైన భజన చేస్తాడు అతన్ని చాలా చోట్లకు ఆహ్వానించి భజనలు ఏర్పాటు చేసుకొంటారు గిరాకీ ఎక్కువే అతను భార్య మిగిలిన వాళ్ళో కలుస్తున్నారు .కూనప రెడ్డి వెంకటేశ్వర రావు మంచి భజన పరుడు బాగా తాళం డప్పు వాయించగలడు అతనికీ గిరాకీ బాగా ఉంది అతనికి ప్రత్యేకం గా ఒక బాచ్ ఉంది శ్రీ హనుమజ్జయంటికి మా గుడిలో అతని తో భజన చేయిస్తాము ణా శిష్యుడు కూడా . .తూర్పు కాపుల ఆడ వారు మగ వారు కూడా ఇప్పుడు చాలా భక్తిగా సంకీర్తన చెస్తు సంప్రదాయాన్ని నిల బెట్టు కోస్తున్నారు .ఆ నాడు మేము నాటిన ఈ సంకీర్తన బీజం అభి వృద్ధి చెందుతూనే ఉంది ద్రవ్యమూ ఇబ్బడి ముబ్బడిగా .వస్తోంది నెల చివరికి దాదాపు మూడు బస్తాల బియ్యం అయిదారు వేల రూపాయల డబ్బు వస్తోంది కూరగాయలను పూజారి గారి కుటుంబానికి ఏ రోజుకారోజు ఇచ్చేస్తున్నారు ఒక సేరు బియ్యం కూడా రోజూ ఇస్తారని అన్తుకొంటున్నాను .పూజారి కర్తవ్యమ్ మరీ కష్టమైంది .
ఇప్పుడు వంట వాళ్ళను మాట్లాడి మైకులో అనౌన్స్ చేస్తూ అన్న సమారాధన భారీగా చేస్తున్నారు .నగర సంకీర్తన లో వచ్చినదే కాక దాతలు తమకు తోచినది ధన ,ధనేతరం గా ఇచ్చి సంతర్పణ సంతృప్తి గా జరిగేట్లు తోడ్పడుతున్నారు .ఈ ధనుర్మాసం నెల రోజులు సంకీర్తన బృందం నగర సంకీర్తన పూర్తీ చేసి విష్ణ్వాలయం చేరుకొన్న తర్వాతనే మంత్రం పుష్పం తీర్ధ ప్రసాద విని యోగం జరుగుతుంది నగర సంకీర్తన కు బయాల్దేర గానే పూజారి పూజ ప్రారంభించిస్తాడు .వాళ్ళు వచ్చేసరికి పూజ పూర్తీ చేసి ,నైవేద్యం కూడా పెట్టి సిద్ధం గా ఉంటాడు .తెల్లవారు జామున నాలుగింటికే మైకు ఆన్ చేసి భక్తీ గీతాలు పెడతారు .అందరు అది విని నిద్ర లేచి ఆలయానికి ఇప్పుడు పావు తక్కువ అయిదింటికి చేరి భజన చేస్తూ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి అప్పుడు ఆదిరాజు వారింటి మీదుగాఇదివరకు చెప్పిన విధం గా రావి చెట్టు బజారు దక్షిణం వైపు వెళ్లి సూరి వారి బజారుకు వెళ్ళటం సాంప్రదాయం గా పాటిస్తున్నారు .అప్పటికే గృహిణులు ఇళ్ళ ముందు కల్లాపి జల్లి ముగ్గులేసి గొబ్బెమ్మలను పెట్టి అలంకరించి సిద్ధం గా ఉంటారు కానుకలు సమర్పించటానికి ముందుకు వస్తారు బృందం అలా కీర్తనలు పాడుకొంటూ వెడుతుంటే దగ్గరకు వచ్చి భక్తీ తో కానుకలు సమర్పిస్తారు .
హరి కధలు –
మొదట్లో విశ్వాలయం లో ధనుర్మాసం లో హరికధా కాలక్షేపం ఉండేది .రాత్రి ఏడింటికి మొదలై తొమ్మిదికి పూర్తీ అయ్యేవి .ముదునూరు శంకర రావు గారు అనే ఆయన చాలా సార్లు ఇక్కడ కద చెప్పారు నెల రోజులు రామాయణం చెప్పేవారు .కల్యాణం కూడా చేసే వారు .ఆ తర్వాత కాపుల రామాలయం దగ్గర అందరూ కలిసి పందిళ్ళు వేసి నెల రోజులు హరికధలు చెప్పించేవారు .రాత్రి తొమ్మిదింటికి ప్రారంభమై పన్నెండు దాకా జరిగేవి ఆంద్ర దేశం లో ప్రసిద్ధ హరికధకు లందరూ వచ్చే వారు దీన్ని. సుబ్బారావు గారు అనే ఆయన నాయకత్వం లో నిర్వహించేవారు. ఆయనే మా ఆంజ నేయ స్వామి ఆలయాన్ని మాతో దగ్గరుండి కట్టించిన మహాను భావుడు .పట్నాల మల్లేశ్వర రావు ,పొడుగు పాండు రంగ దాసు ,చైనా రాకెట్ ప్రభ ప్రసిద్ధులైన మహిళా కధకులు మోపర్రు దాసు అందరూ ఇక్కడ కదా గానం చేసిన వారే మేము. భోజనం ,ట్యూషన్ అన్నీ అయిన తర్వాత తీరికగా వెళ్లి ఒక గంట చూసి వచ్చే వాడిని .ఇది ఇలా దేదీప్యమానం గా సాగుతుండగా శివాలయం లో గోవిందరాజుల సత్యం కోల చల చలపతి, బొల్లి పోత రాజు మొదలైన వాళ్ళు పోటీ గా హరి కధలను నిర్వహించారు . మర్రివాదకు చెందిన జగన్నాధ దాసు కడలి వీరయ్య భాగవతార్ ,తెనాలికి చెందిన కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ ల తో పోటా పోటీగా కధలు చెప్పించేవారు .భలే సరదాగా ఉండేది .రెండు చోట్లకూ వెళ్లి అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు చూసి వచ్చేవాళ్ళం .పొడుగు వారి కధలు రస వత్తరం గా ఉండేవి ‘’ఓం హరా శంకరా ‘’అని పాడుతుంటే జనం ఊగి పోయే వారు కైలాసం దిగి వచ్చిందా అని పించేది ..మోపర్రు దాసు చెబుతూ ఎన్నో దేశ భక్తీ గీతాలు పాడేవాడు .నే లకు వంగి అరచేత్తో నేల మీద చరుస్తూ పాడుతుంటే థ్రిల్లింగ్ గా ఉండేది .ఆ రోజులే వేరు ఆ భావనలే వేరు .మా ఉయ్యూరు దాసు చేవూరి కనకరత్నం గారు ఇక్కడ జీరో మిగతా దేశమంతా గొప్ప హీరో .ఆదిభట్ల నారాయణ దాసు గారు ,పేరు చెబితే ఒళ్ళు పులకరించేది .ఆ కదా ,గమనం మరువరానివి .ఆయన శిష్యులూ అంతటి ఘనులే .పెద్దింటి సూర్య నారాయణ దీక్షితులు గారు ,ములుకుట్ల సదా శివ శాస్త్రిగారు పిల్లల మర్రి రామ దాసు లబ్ధ ప్రతిస్తులైన కధకులు రామ దాసు ,గారి హరికధాలను ణా చిన్నప్పుడు హిందూ పూర్ లో విన్నాను ఆయన అంటే నాకు విపరీత మైన క్రేజ్ .
గత పది హేనేల్లుగా ఈ హరికదల సందడే లేదు. రేడియో లో దూర దర్శన్ లో తప్ప ఎక్కడా కనీ పించటం లేదు ,విని పించటం లేదు .చెప్పినా వచ్చి వినే వారే లేరు అయ్యో అని పిస్తుంది ఈ ప్రజలే ఆ నాడు వారికి నీరాజనాలుపట్టారు పట్టు పీతాంబరాలు కప్పారు సువర్ణ కంకణాలు తొడిగారు ఘనమైన బిరుడులిచ్చి సత్కరించారు వారు కద చెబితే చాలు యెంత దబ్బుఇవ్వటానికైనా సిద్ధ పడే వారు .అదంతా పోయింది .ఉల్టా పల్టా అయింది.పరిస్తితి. కాల ప్రభావం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-13-ఉయ్యూరు
I don’t have Telugu font,hence writing in English!I enjoyed reading your account of various activities in your town during “Dhaurmasam”and Haraikafhas in particular.Moparrudasu acted in the film “Sahukaru”asHaridasu and gave a memorable performance.Thanks again for posting your experiences.sincerely,Vedula Narasimhamurti