ఆంధ్రత్వం –ఆంద్ర తేజం

ఆంధ్రత్వం –ఆంద్ర తేజం

కీ.శే.శ్రీ దిగవల్లి వెంకట శివ రావు బెజవాడలో గొప్ప న్యాయ వాది.అరండల్ పేట రామ మందిరం వీధిలో ఉండేవారు .వారింటికి ఎదురుగా నేను మా బుల్లిమామ్మ గారింట్లో ఉండి1956-58లో  ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో ఇంటర్  చదివాను .అప్పుడు రోజూ శివరావు గారిని చూస్తూన్దేవాడిని .అప్పటికే ఆయన ప్రతిభగురించి కూడా తెలిసింది.వారి అబ్బాయిలు ఇద్దరూ మాతో పాటే అదే కాలేజీ లో చదివే వారు పెద్దతను డిగ్రీ ఫైనల్ .రెండో అతను వెంకట రత్నం బికాం .ఇతన్నే వెంకట్ అని పిలిచే వాళ్ళం .మా కజిన్ సూరి రాదా కృష్ణ మూర్తికి మంచి దోస్తులు ఈ సోదరులు .కాలేజి అవగానే అందరం హోటల్ కు వెళ్లి టిఫిన్లు చేసి కాఫీ లు తాగే వాళ్ళం .ఖర్చు దిగవల్లి సోదరులదే.ఇద్దరు మంచి ‘’ష్రూడ్ ‘’గా ఉండేవారు .ఈ పరిచయం తో వారింటికి తరచూ వెళ్ళే వాడిని .శివరావు గారిని పలకరించే వాడిని .ఆయనా బానే మాట్లాడే వారు .అంతకు మించి మాట్లాడే సాహసం చేయలేదు .శివరావు గారు గొప్ప రచయితలూ .మంచి పరిశోధకులు అంతకు మించి చారిత్రిక పరిశోధకులు. వారి రచనలన్నీ ఆ నాటి పత్రికలలో చదివే వాడిని .శ్రీ శివ రావు గారు ఆంద్ర దేశం భాషా సంస్కృతుల పై ‘’ఆంధ్రత్వం ‘’పేరుతొ రాసిన పుస్తకాన్ని 1962లో ఆదర్శ గ్రంధ మండలి –విజయ వాడ ప్రచురించింది .ఆపెద్ద వ్యాసం మార్చి నెల ‘’సుపద ‘’లో పునర్ముద్రించారు .అందరూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో అందులో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన వాటిని క్రోడీకరించి ‘’ఆంధ్రత్వం –ఆంద్ర తేజం ‘’పేరిట మీకు అందిస్తున్నాను .

‘’digavalli sivarao 001 ఆంద్ర దేశం దండకారణ్య భాగం లో ఉంది .మహానదికి ఉపనది అయిన ‘’తెలివాహ నది ‘’కి దక్షిణం లో ఆంద్ర భూమి ఉందని బౌద్ధ గ్రంధం ’’సుత్తి నిపాతం ‘’లో ఉంది .కృష్ణా గోదావరీ గర్భ సీమల్లో ఆంద్ర రాజ్యం ఉండేది .క్రీ పూ.300కిందట గ్రీకు  రాయబారి మెగస్తనీస్ ఆంధ్రుల రాజ్య వైభవాన్ని వర్ణిస్తూ ముప్ఫై దుర్గాలు ,లక్ష కాల్బలం ,రెండు వేల మంది ఆశ్వికులు ,వెయ్యి ఏనుగులు ఉన్నట్లు రాశాడు .ఆంధ్రుల జాత కర్మ నుండి మరణ కర్మ వరకు ఆచారాలన్నీ వైదిక బౌద్ధ జైన ద్రావిడ సంప్రదాయాలున్నాయి నాగార్జునుని ‘’సుహృల్లేఖ ‘’,ద్వారా ఆంద్ర సంస్కృతీ తెలుస్తోంది .శాతవాహనులతో బాటు తర్వాతి రాజులు పన్నెండు వందల ఏళ్ళు మహారాష్ట్ర ,కన్నడ ఆంద్ర ప్రాంతాలను కలిపే పాలించారు .అందువల్ల సంప్రదాయాల కలయిక ఏర్పడింది .విక్రమాదిత్యుని ప్రధాన మంత్రి విజ్ఞానేశ్వరుడు రాసిన ‘’మితాక్షరం ‘’అనే గ్రంధం మహారాష్ట్ర కర్నాటక ఆంధ్రులకు ధర్మ శాస్త్రం అయింది .యాదవ రాజ  మంత్రి  ‘’హేమాద్రి’’ రాసిన ‘’చతుర్వర్గ చింతామణి ‘’దాన ఖండం వ్రత ఖండాలను  పై మూడు భాషల వారు మతాచారలలో పాటించారు .వేంగిని ఏలిన తూర్పు పశ్చిమ చాలక్యుల  వంశం వారే . .వేంగికి వచ్చిన కవి గాయక పండితులు ఇతర వృత్తుల వారి వల్ల  ఆంద్ర నాగరకత వృద్ధి చెందింది .రాజేంద్ర చోళుని అల్లుడు ,ఆయన కొడుకు రాజేంద్ర చోళుడు మాతామహుని రాజ్యానికి వారసుడై ఆంద్ర ద్రావిడ దేశాలను ఏకం చేసి పాలించాడు. ఆయన వంశం వాళ్ళు తర్వాత వందేళ్ళు పాలించటం తో తమిళులకు ఆంధ్రులకు సన్నిహిత సంబంధలేర్పడ్డాయి .కాకతీయులు ఉత్తరాన బస్తర్ ,దక్షిణాన కంచి వరకు పాలించారు .విజయ నగర రాజులు కృష్ణా నది నుండి కన్యాకుమారి వరకు దక్షిణ దేశాన్ని అంతటిని ఏలారు ..గోల్కొండ రాజులు  మొత్తం ఆంధ్రా ను పాలించారు .

పూర్వం తెలుగు దేశం లో సంపన్నులు ఎర్రంచు జరీ కమ్ములున్న సన్నని నేత పంచలని కట్టేవారు .నూలు పంచలు ,ఉప్పాడ నేత పంచలు ఉత్తరీయాలు నాజూకు గా ఉండేవి .మగవారి కమీజులు ముంజేతులు ఛాతీల వద్ద మందం గా ఉండేవి .బంగారు గుండీలు పెట్టేవారు .మగవారు చెవులకు రవ్వల తమ్మంట్లు ధరించేవారు .వేళ్ళకు ఉంగరాలు, చేతికి మురుగులు, మురిడీ గో లుసులు మేడలో ముత్యాల హారాలు ఉండేవి .మహమ్మదీయుల కాలం లో పాగాలు ,అన్గారకాలు ధరించేవారు .ఎబదేళ్ళా కిందటి వరకుస్త్రీలు చీరలు రవికలు ధరించేవారు .అడ్డబాస, నత్తు, పాపిడి బింద్రీలు ,జూకాలు పెట్టుకొనే వారు .

పూర్వపు స్త్రీలు బందరు గవ్వకన్ను అద్దకం చీరలు ,పట్టు చెంగావి చీరలు ,పట్టు చీరలు కట్టుకొనే వారు .అద్దాల రవికలు ఫాషన్ .బొమ్మంచు చీరలు చంద్ర గిరి చీరలు నాజూకు గా భావించే వారు .సన్నగా ఉలిపిరి గా తెల్లగా ఉన్న చీరలను  మర్యాద  భంగం అను కొనే వారు. కొప్పు ,కచ్చా పోసి చీర కట్ట్టటం మర్యాద .వీటికి విరుద్ధం గా ఉంటె యెగతాళి చేసే వారు .చిన్నపిల్లలు పరికిణీ ,ఓణీలు రవికలు వేసేవారు .శాతవాహన కాలం లో స్త్రీ ,పురుషులు తలపైనా, మెడలో , మొలకు నగలు హారాలు ఆభరణాలు ధరించేవారు .చాలా చిత్రాలలో స్త్రీలకూ పైట లేదు. కనుక పైట వేసుకొనే వారు కాదని అని పిస్తుంది .మధ్య పాపిడి తీసి వెంట్రుకల్ని వెనక్కి దువ్వి ముడి వేసుకొనే వారు .ఆ ముడికి మెలి పెట్టిన బట్టను జడ కుచ్చు లాగా కట్టినట్లు తోస్తోంది .శిరోజాలపై ఫాలం పై ముత్యాల సరాలు ధరించేవారు .చెవులకు  బంగారు  పోగులు, చేతులకు మురుగులు ,మురిడీ గొలుసులు ధరించేవారు .ముక్కుకు ఆభరణాలు లేవు .కాళ్ళకు అందెలు కడియాలున్దేవి .పురుషులకు  ధోవతి ,ఉత్తరీయాలు శిరో వేస్టనాలు ఉండేవి .’’

ఇదంతా శ్రీ దిగవల్లి వెంకట శివ రావు గారు ఏంతో పరిశోధించి రాసిన విషయాలు .మిగిలిన విషయాలు మళ్ళీ తరువాతి సుపద సంచిక చదివితే రాస్తాను .

శ్రీ శంకర జయంతి శుభా కాంక్షలతో –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.