పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్ జేమ్స్ వన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4

దన్బార్ ,హేన్రిసన్  జేమ్స్ వన్

చాసర్ లాగే దన్బార్ కూడా సివిల్ ఉద్యోగి .రాజుగారి ప్రతినిధి గా పని చేసి పెన్షన్ పొందాడు .క్లాసికల్ విషయాలను సామాన్య భాషలో రాసిన అసామాన్యుడు .అతని రచనలలో రెండు విరుద్ధ భావాలు కన్పిస్తాయి .’’దిగోల్దిన్ టార్జ్’’లో ఒక మోడల్ గార్డెన్ ను వర్ణించాడు .ఇది రోమాన్స్ ఆఫ్ ది రోజ లాగానే ఉంటుంది .’’ది త్రిస్సిల్ అండ్ రాయిస్ ‘’లో ‘’ఎలిగరి ‘’.ఉంటుంది .సహజత్వాన్ని దాటి వెళ్ళాలనే ప్రయత్నం అతనిలో కని  పిస్తుంది .దన్బార్ ను ‘’hard and bitter ‘’అన్నాడు చాసర్ .’’మెడిటేషన్ ఇన్ వింటర్ ‘’అతని స్వీయ ఇతి వృత్తమే .సహజత్వం ఆకట్టుకొంటుంది .మిల్టన్ రాసిన ‘’హైమ్స్’’ను మరిపిస్తాడు .’’లా మెంట్స్  ఫర్ మకరిస్ (పోయేట్స్)’’గొప్ప భావాలతో ‘’స్టాన్జాలు ’’  రాశాడు . లాటిన్ వాక్యాలతో స్టాంజా లను పూర్తీ చేసి నూతనత్వాన్ని ఆవిష్కరించాడు .1460-1520 కాలం వాడు .

 

 

 

 

 

అర్ధం కాని వింత భాషా ,క్లిష్టమైన శైలి వలన అందరికి దూరమైన కవి 1430-1506కు చెందిన రాబర్ట్ హేన్రిసన్ .బెనేడిక్తియన్ గ్రామర్ స్కూల్ లో బోధన చేశాడు .చాసర్ భావాలనే అనుసరించాడు .మూడు దీర్ఘ కవితల్ని పదమూడు చిన్న కవితలని రాశాడు .’’ఫేబుల్స్ ‘కవిత ద్వారానే గుర్తుండి పోయాడు .ఈసప్ కధలను ‘’టెస్టమెంట్ ఆఫ్ క్రేస్సీద్ ‘’కధలను తీసుకొని కవిత లల్లాడు .విషాదాంత నాయికలకు ప్రాముఖ్యం ఇచ్చాడు .చాసర్ హాయిగా సరదాగా ఉండే పాత్రలు సృష్టిస్తే దానికి విరుద్ధం గా ఇలా చేశాడు .విషయాలు పూర్వకాలపువే అయినా వాటిని తీర్చి దిద్దటం లో హేన్రిసన్ కొత్త దారులు తొక్కాడు

 

 

.

స్కాట్ లాండ్ రాజు మొదటి జేమ్స్( 1394-1437)’’రాజులలో గొప్ప కవి  కవులలో గొప్ప రాజు ‘’అని పించుకొన్నాడు .మహా రాజు అయినా చాసర్ ,గోవర్ కవులంటే గౌరవం ఉన్న వాడు .ఈ రాజు రాసిన ‘’దికింగ్స్ క్వైర్’’(ది కింగ్స్ బుక్ )లో చివర ఈ ఇద్దరు కవులను ‘’dear masters Chauser and Gower’’అని ప్రస్తుతించాడు .ఈ కవితను జేమ్స్ ఒక్కడే రాయలేదని, చాలా మందికవుల హస్తం ఉందని అంటారు .దీన్ని రాసిన కీర్తిని మాత్రం రాజుకు అందించారు వీరందరూకలిసి .ప్రభు భక్తికి ఇది నిదర్శనం .’’సాంగ్ ఆఫ్ సాలెంస్ ‘’లో అరువు భావాలున్నా ,వ్యక్తీకరణ బాగుంటుందని స్పష్టంగా  చెప్పాడని ,స్వీయ చరిత్ర లా ఉంటుందని అన్నారు .

 

 

King James I of Scotland.jpg

అద్భుతాలు –నైతికత

ముడి సరుకు గా ఉన్న కవిత్వం నాటకరచనలో ప్రవేశించింది .మధ్యయుగం లో నటులు మతాధికారులు సన్యాసులు మాత్రమె .దీనికి  కారణం అప్పటి  నాటకాలు చర్చి బోధలకుబాహ్య రూపాలు అవటమే .ఇవి క్రిస్మస్ ,ఈస్తర్ పండగ విశేషాలకు ప్రాముఖ్యత నిచ్చేవి .తరువాత సీనును చర్చి నుండి పల్లె కు మారింది .పవిత్ర గ్రంధాలలోని విషయాలు మతాతీతమైనాయి .అంటే నటన ప్రీస్ట్ ల నుండి సామాన్య జనానికి మారింది .కధలు బైబిల్ వే అయినా కధనం లో చాలా తేడా వచ్చిందన్న మాట .ఔత్సాహిక నటులే కాక ,సామాన్య పనివారు కూడా నటులయ్యారు. దీనినే మిరకిల్ లేక మిస్టరి నాటకాలు  అన్నారు.అనేక సంస్థలు వీటిని స్పాన్సర్ చేసి రాయించి ఆడించేవి .’’నోవా అండ్ ది ఫ్లడ్ ‘’నాటకానని చేపలు పట్టేవారు ,సముద్రయాత్రికులు ఆడేవారు .’’ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ ‘’ను బట్టలు తయారు చేసే వారు ,వడ్రంగులు వేసేవారు .’’ది బాప్టిజం అండ్ క్రైస్ట్’’ను మంగలి వాళ్ళు ఆడేవారు .’’ది లాస్ట్ సప్పర్ ‘’నాటకాన్ని రొట్టెల వాళ్ళు వేసేవారు .వీటికి సబ్ ప్లాట్ లుండేవి .గృహానికి సంబంధించిన అన్ని వివరాలు అందులో చోటు చేసుకొనేవి .

ఇలా మిరకిల్ ప్లే లు దూసుకు పోతుంటే  నైతికత కు ప్రాధాన్యతనిచ్చే నాటకాలు సుదీర్ఘం గా ఉన్నా ,మత విషయాలు తక్కువగా ఉండి ఆ కట్టుకోనేవి .బైబిల్ కధలకు అధిక ప్రాధాన్యతను తగ్గించి నైతికతను ప్రోత్సహించే కధలు రాసి ,అనుభవం ఉన్న నటులే నటించేవారు .మనిషి చావును తప్పించుకొనే ప్రయత్నాలు ,హాస్యం నిజాయితీ తో ఇవి ఉండేవి .

ప్రజాకవిత్వం

ఇప్పటిదాకా చదవటం రాయటం ప్రీస్టులు విద్యావంతులకే పరిమితం .రాత ప్రతులను చదివి విజ్ఞానాన్ని పెంచుకొనే వారు .ఆనందానికే ఈ చదువు అనే భావం ఉండేది .’జాన్ గూటేన్ బర్గ్ ‘’అచ్చు యంత్రాన్ని కని పెట్టిన తర్వాత  ‘’దృశ్యం ‘’మారింది .1477లో’’ కాక్ స్టన్’’ఇంగ్లీష్ లో మొదటి పుస్తకాన్ని ముద్రించాడు .దీని తర్వాత పదేళ్లకు చాసర్ రాసిన ‘’కాంటర్ బరీ కధలు ‘’అచ్చయ్యాయి .అచ్చు పుస్తకాల వలన భాష లో స్థాయి రావటమే కాక ,ఆంగ్ల సాహిత్యం లో గణనీయ మైన మార్పులొచ్చాయి .కవిత్వం అనేది ప్రజలకోసం అనే భావన వచ్చింది .అన్ని తరగతుల వారూ కవిత్వం రాశారు .సరిహద్దులు దాటి సముద్రాలు దాటి కవిత ప్రవహించింది .చిన్న చిన్న దేశాలలోను గొప్ప కవిత్వం వచ్చింది .దీనినే ‘’గోలియార్దిక్ కవిత ‘’అన్నారు ఈ పేరు గోలియాస్ అనే ప్రీస్ట్  పేరు కాని ,’’గులా’’ అంటే దేశ సంచారులైన తిండి పోతులు అనే అర్ధం వచ్చే మాట నుంచి కాని వచ్చిఉంటుంది  .కొందరు యువకులు, మరికొందరు పెద్దలు ఊరూరా తిరిగి స్వేచా జీవనం ,అనైతికత ,విశ్రుమ్ఖలతలను ప్రజల్లో విపరీతం గా ప్రచారం చేశారు .’’మకార త్రయం ‘’అంటే మగువ, మద్యం  మంచి పాట’’ల కంటే ఇంకేమీ అక్కర్లేదని వాదించారు .నీటికి బదులు సారా ,మత పెద్దల కంటే ఆకర్షణీయ యువతులు ,బోరు కొట్టించే ప్రార్ధనా గీతాలకంటే సరదా గేయాలు తాగుడు కవిత్వాలకు ప్రాధాన్యత నిచ్చారు .గోలియార్డ్ కవిత్వానికొక ఉదాహరణ –

 

‘’pen and  copy book –how funeral they look –ovid’s songs ,how dull with age –stll more any other page –never mind what is not allowed –love is youth’s temptation  -here we go a glorious cloud –hell –bent for vacation ‘’.

మధ్యయుగ కాలం లోని ‘’బోహీమియన్’’లనే గోలియార్డ్స్ అంటారు ఆ నాటి నుంచి ప్రతి కొండా కోనా పల్లె ఆ కవిత్వాలను ప్రతిఫలించింది .ముఖ్యం గా విద్యార్ధులు ఆకర్షితులైనారు .కారల్ ఆర్ఫ్ దీన్ని ఆధునీకరించాడు మూడు వాల్యూములు ‘’సాంగ్స్ ఫ్రం వేగబాన్దియా ‘’పేర పందొమ్మిదో శతాబ్ది చివరలో ప్రచురించారు .ఈ కవితలనే  మధ్యయుగ బాలడ్స్ అంటారు .ప్రజల భాషలో ప్రజల కోసం రాసి పాడి రంజింప జేసేవారు .వీధుల మూలల్లో మార్కెట్లలో ,సంతలలో ఈ కవితలను పాడేవారు .రాజాస్థానాలు సంస్థానాల్లో రాజుల మెప్పు కోసం వచ్చిన కవిత ఇప్పుడు ప్రజా మార్గం పట్టి సామాన్యుడికి చేరువై ప్రజా కవిత అయింది .పాత అద్భుత కధలను  ,కొత్త సంఘటనలతో ,బీదవాడి చరిత్రను జోడించి ,సమకాలీన సమాజానికి వ్యాఖ్యానం గా వీటిని హాయిగా పాడే వారు .నిత్య జీవితన్నిప్రతిబిమ్బింప జేసేవారు సామాన్యుడు ఈ కవితల్లో ‘’మాన్యుడయ్యాడు’’ .వినే వాళ్లకు సహజం గా ఉండి, తమ కధే వింటున్న అనుభూతి నిచ్చాయి ఈ బాలడ్స్ .వీటిని పాడే గాయకులకు విలువ పెరిగింది  బాలద్ ఇప్పుడు ప్రజల సంపద అయింది .రాజుల యుద్ధ వీరుల సాహసికుల కధల స్థానం లో ప్రజలు ప్రతిస్టింప బడ్డారు .వీటిని ఏ ఒకరో రాసినవి కావు. తరతరాలు గా అనేక చేర్పులూ మార్పులూ పొందుతూ తరువాతి తరాలకు అందాయి .పది హేడవ శతాబ్దం లో’’ న్యూ వరల్డ్ ‘’అని పిలువ బడిన అమెరికాకూ చేరాయి .కెంటకీ ,కారోలీనా లో బహుళ ప్రాచుర్యం పొందాయి .

బాలద్ లో కద చిన్నదిగా ఉంటుంది .కొద్ది అవకాశమే ఉన్న వారికి వినటానికి హాయి .విన్న వెంటనే గొప్ప స్పందన కలిగించటం వీటి ప్రత్యేకత. హాయిగా తాపీ గా వినే అవకాశాలు తగ్గిపోయాయి .’’ఇన్స్టంట్ సక్సెస్ ‘’కావాలి .అదే బాలద్ సాధించింది .నాటకీయత దీనిలో ఉండటంవలన కాలం వృధాకాదు సద్యో స్పందన లభిస్తుంది  భావ తీవ్రతకు ప్రాధాన్యం ఉంటుంది .విషయం సూటిగా మనసుకు చేరి ప్రభావితం చేస్తుంది .సరళమైన భాషా లయా తూగు ఉండటం వలన ఒక పూనకం కలిగి కధలో వినే వారు లీనమై పోతారు .అందరికి అర్ధమయ్యే భాష వలన ఫలితం ఎక్కువ .’’the ballad maker is the perfect story teller in the sense that he is out side the story ,he tells the taale for what t is worth .he does not pass upon the quality or even its credibility .he does not comment upon the motives of his characters or the rights and wrongs in which they are involved .he leaves all judgement to his listeners ‘’

లార్డ్ లాందాల్ ,ఎడ్వర్డ్ ఎలీన్ , సర్ పాట్రిక్ స్పెంస్, జానీ ఆర్మస్త్రాంగ్ మొదలైన సంప్రాదయం గా వచ్చిన బాలడ్స్ ను జనం విపరీతం గా ఆదరించారు .ఇవి మొదటి ఆంగ్ల కవిత్వ ఆవిర్భావంలో వచ్చాయి .వీటిని మనం స్వంతం చేసుకోన్నాం .మన సాహిత్యం గా చెప్పుకొంటున్నాం .ఇవి సాధారణ భాష లో ఉండటం, చిన్న కధలతో ఉండటం వలననే కాక సామాన్య ప్రజల స్పందనకు కారణాలై ప్రసిద్ధి చెందాయి ఆ స్పందన లేక పోతే ఇంత కాలం నిలిచేవికావు . ‘’the rhythm of the world’s work is in the lines –the pull of the rope ,the turn of the wheel ,the swing of the axe, the fall of the hammer -they lie close to man’s heart –they beat in  his pulse every time they are heard ‘’. ఇదీ  బాలడ్  సొగసు ,సోంపు ,సౌభాగ్యం  సుభగత్వం ,శ్రావ్యత, శోభ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-14-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.