వేద పరమా (త్మ)ర్ధం
వేద పరమా (త్మ)ర్ధం
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏంతో ఆత్మీయం గా నేను తప్పక చదవాలని భావించి అమెరికా నుండి ఆర్డర్ పై స్వర్గీయ కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఆంగ్లం లో రాసిన ‘’వేదార్ధ మీమాంస ‘’కు వాడ్రేవు చిన వీర భద్రుడు చేసిన తెలుగు సేత పుస్తకాన్ని పంపారు .హైదరాబాద్ లో ఉంటున్న ఈ అయిదారు రోజుల్లో దాన్ని ఆసాంతం చదివాను .ఎన్నో విషయాలను గుది గుచ్చి ఒక చోట చేర్చి కరతలామలకం గా వేదం ఎందుకు చదవాలి ,అందులో ఉన్న పరమార్ధం ఏమిటి ,ఎందుకు దానికి దూరమై పోతున్నాం ,పాశ్చాత్యులు వేదం ను సరిగ్గా అర్ధం చేసుకో కుండా ,ఏవేవో చదివి విపరీతార్ధాలను ఎలా రాశారు ,దానివలన వేద పరామార్దానికి ఏర్పడిన ఇబ్బంది ఏమిటి అన్న విషయాలను నాలుగు వేదాలు ఉపనిషత్తులు ,మహా భారత భాగవత రామాయణ ,మనుస్మ్రుతులు మీమాంస ,శ్రీ శంకర ,రామానుజ ,మాధవాచార్యుల భాష్యాలు ,సాంఖ్య ,న్యాయ వైశేషిక ,బ్రహ్మ సూత్ర ,భగవద గీతాదుల నాధారం గా సవివరం గా శాస్త్ర ప్రమాణం గా చర్చించి నిగ్గుతేల్చి అతి సరళ భాషలో ఇంగ్లీష్ లో రచించి తన విశేష శేముషీ వైభవానికి ,పరిజ్ఞానానికి దర్పణం గా ‘’వేదార్ధ మీమాంస ‘’ను రాస్తే అంతకంటే సరళ సుందరం గా ప్రతి మాటను సాధికారికం గా ప్రతి భావాన్ని ఉజ్జ్వల తేజో విలసితం గా అనువాదం చేసి అసలు మూల గ్రందాన్నే చదువుతున్నామనే అమోఘ అనుభవాన్ని కలిగించారు చిన వీర భద్రుడు .నిజం గా వాణినా రాణి అన్న చిన వీరభద్రకవి అనిపించి ,పెద వీర భద్రుడే అనే నిశ్చయాన్ని కల్పించారు .మూల ,అనువాద రచయితలిద్దరికీ కై మోడ్పు ఘటిస్తూ అందులో నేను తెలుసుకొన్న నాకు నచ్చిన ముఖ్య విషయాలను ‘’వేద పరమా (త్మ)ర్ధం ‘’గా మీ ముందు ఉంచుతూ ,మీకూ ఆ అను భూతిని పంచుతున్నాను .
ఋగ్వేద,యజుర్వేదాలలో లో సత్యమే జ్ఞానమని ,యజ్ఞం కర్తవ్యమని యజ్నమంటే శుద్ధి చేసే కర్మ అని తెలియ జేశారు .రుక్కుల ద్వారా వర్ణింప బడింది సామం ద్వారా గానమైంది . అధర్వం అన్ని వేదాల సారమే .యజ్న మార్గానికి దారి చూపింది ‘’అధర్వుడు ‘’. ఆయన పేర ఆ వేదం పిలువ బడింది .భ్రుగువులు కూడా ఆయనకు సమానమే అందుకే దానికి అధర్వాన్గీరసం లేక భ్రుగ్వాన్గీరసమని పిలుస్తారు .కైవల్య పధం నాలుగు కొమ్ములు కల వృషభం అ కొమ్ములే నాలుగు వేదాలు యజ్న మార్గం లో పరమ పురుషుడిని తెలుసుకోవాలి .ప్రతిదీ ఈశ్వరునితో కూడుకొని ఉంది అనే భావం రావాలి .వేద వృక్షానికి పూసిన పువ్వే సామ వేదం .మానవుడిలో ఉన్న బ్రహ్మాన్ ను ఎరుక పరచేదే అధర్వ వేదం .వేదాల్లో యజ్న యాగాదులకు సంబంధించింది అంతా ‘’త్వం ‘’, భగ వంతుని గుణ గణాలను వర్ణించేది ‘’తత్ ‘’ వేదాంతం బ్రాహ్మణ ,ఆత్మల ఏకత్వాన్ని తెలియ జేస్తుంది .
వేదాలు ఎ భేదామూ లేకుండా ఒకే విషయాన్ని గూర్చి చెప్పాయని భగవత్ పాదులన్నారు .జీవితం లోని అత్యున్నత సూత్రం గా సత్యాన్ని ప్రతిస్టించటం ఉపనిషత్తులు చేసిన గొప్ప పని అని ‘’లూడర్స్ ‘’వివరించాడు . ఏధర్మాన్ని బ్రహ్మాన్ని ఎరుక పరుస్తుందో అదే వేదం .కోరిన కోర్కెలను తీర్చటానికే వేదాన్ని వాడుకో రాదు అంతకు మించిన అమూల్య జ్ఞానం ఉందని గ్రహించాలి .మానవ జీవితం లో ఏ కర్మ అయినా యజ్ఞమే .అదొక ఆరాధనా కార్య క్రమం .మన కోరికలు తీర్చుకోవటం కోసం దేవతలకు అర్పించే కానుకలే యజ్ఞం .యజ్ఞం మానవుల్ని దేవతల్ని కలిపి ఉంచే ఒప్పందాలు .యజ్ఞం చేయక పోవటం అమానుషం ,సామాజిక ఉపద్రవం .దేవతలు పురుషుడిని హవిస్సు చేసి యజ్ఞం చేశారు .అంటే మానసికం గా చేశారని భావం ,ప్రపంచం మహా పురుషుని దేహం .యజ్ఞం చేయటం పురుష స్వరూపమే అవుతుంది .యజమాని యజ్ఞం హవిస్సు ,అగ్ని అన్నీ పురుషుడే .’’పురుషాత్మకం సర్వం ‘’అన్నది వేదం .భగవంతుడు తనలోని సమస్త జీవుల్ని వెలికి తీసి వాటి అనుభవం కోసం తన సర్వస్వాన్ని వారికి ప్రసాదిస్తున్నాడు .ఈ సృష్టి భగవంతుడు చేసే యాగమే .
యజ్ఞం చేసేటప్పుడు మానవుడు తన పాత అస్తిత్వాన్ని దేవతలకు హవిస్సుగా అర్పించి దగ్ధం చేసుకొంటాడు . ఏరూపం లో కొలిస్తే ఆయన ఆరూపం లో చేరువౌతాడు బగవంతుడు .బ్రాహ్మణాలు ఆరణ్యకాలు యజ్ఞాన్ని ఒక కారుణ్య కర్మ గా మార్చాయి .తన మంచికోసం చేసేది యజ్ఞం .సమస్త ప్రాణులకోసమూ జ్ఞానోదయం కోసం చేస్తే మహా సత్రం అంటారు .అందరం బ్రహ్మ ,దేవ ,పితృ ,మనుష్య ,భూత యజ్ఞాలనే పంచ మహా యజ్ఞాలు చేయాల్సిందే ..వేదం అధ్యయనం చేస్తూ చిత్త ఏకాగ్రత ,ఇంద్రియ నిగ్రహం ,స్తిత ప్రజ్ఞత ,ఆధ్యాత్మిక శీలం ,యశస్సులో అభివృద్ధి బ్రాహ్మన్ కు హవిస్సులంద జేయటమే బ్రహ్మ యజ్ఞం .తన దగ్గర ఏది ఉందొ దాన్ని భగ వంతుడికి సమర్పించటం దేవ యజ్ఞం .బీదలకు, అవసరమున్న వారికి సాయం చేయటం మనుష్య యజ్ఞం .సర్వ భూత కోటికీ వీలైనంత సాయం చేయటం ,ప్రేమించటం భూత యజ్ఞం .మొత్తం జీవ కోటితో సంబంధమే భూత దయ .మనిషి విశ్వ ప్రణాళిక లో ఒక భాగం .మనిషి శాశ్వత ,అతీతమైన దానితో బాటు తాత్కాలిక అస్తిత్వం తో కూడా ముడి పడి ఉంటాడు .తనకోసం తోటివారికోసం భగవంతుడికోసం జీవించటమే అన్నిటికన్నా ఉత్క్రుస్ట మైన యజ్నం .
ఉపనిషత్తులు –ప్రజా పతియే తనను తానూ ఒక మహా యజ్న పశువుగా భావించి తనను తానె యజ్ఞం చేసుకొన్నాడని చెప్పింది మనిషి జీవితమంతా సోమయాగమే నంది .ప్రపంచమే ఒక హోమం .భూమి దాని ఇంధనం .అగ్ని దాని పొగ .రాత్రి దాని మంట .చంద్రుడు భస్మం .నక్షత్రాలు విస్ఫులిన్గాలు ఈ అగ్నికి దేవతాలు వర్షాన్ని హవిస్సుగా సమర్పిస్తారు .దాని నుంచి అన్నం వస్తుంది మనిషి ఒక అగ్ని .అతడికి దేవతలు అన్నాన్ని హవిస్సుగా అర్పిస్తారు .దానినుంచే జీవితం పుడుతుంది .పరబ్రహ్మ మనిషిలోనే ఉన్నాడు .మనిషి తినేది అంతా పరబ్రహ్మానికి నైవేద్యమే .కౌతికీ ఉపనిషత్తు –మనిషి నిద్రపోతున్నా మెలకువ గా ఉన్నా నిర్విరామం గా యజ్ఞం చేస్తున్నట్లే లెక్క అని చెప్పింది
స్వర్గీయ ఉప్పులూరి గణపతి శాస్త్రి యజ్ఞాల ఘట్టాలు అధ్యయనం ,పారాయణ యజ్ఞం చేసిన దానితో సమానమే అన్నారు .స్వాధ్యాయ ప్రవచానలకు మించిన యజ్ఞమే లేదు .బ్రహ్మ జ్ఞానమే మానవ జీవిత పరమార్ధం .భూత భవిష్యత్ వర్తమానాల మీద ఆధిపత్యం ఎవరికి ఉందొ ,ఎవరు ఈ ప్రపంచానికి అతీతం గా ఉన్నాడో ఆయనే శాశ్వతుడు నిత్య నూతనుడు .ఆయనే మర్త్య ప్రపంచం లో ఉన్న అమర్త్యుడు ,అతడు మృత్యువుకు భయ పడడు .గాఢం గా కోరుకొనే వారికి పరమ ధామం లో ప్రతిదీ ఏక రూపం ధరించినట్లే ఉంటుంది .అన్నిటి లోను పని చేసే ఏక సూత్రమే బ్రాహ్మన్ అని ఆరణ్యన్యకాలు అంటున్నాయి .అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మా .ఇవాళ ఉన్నది రేపు ఉండబోయేది ఆయన ఒక్కడు మాత్రమె .పరమ పదం లో దివ్య రూప రహితుడైన పురుషుడి నుంచే దేవ మనుష్య జీవరాశులన్నీ ప్రభ వీస్తున్నాయని ముండకోపనిషత్ అంటోంది .దేవాతలైనా బ్రాహ్మాన్ ను దాటి ముందుకు పోలేరు . ఈ మహా సత్యమే వేద సారం ఆ సత్యం తెలియక పోతే సారాంశం బోధ పడదు ‘’నా వేద విన్మనుతే తమ బృహంతం ‘’.
వేదాలు ఒక దానికొకటి అనుసంధించుకునే ఉన్నాయి .సత్యం జిజ్ఞాస ,మీమాంస వల్లనే గోచరిస్తుంది .’’పోస్ట్ మోడరన్ యుగ తాత్విక పధ్ధతి అయిన ‘’హెర్మ న్యూటి క్స్ ‘’అంటే ఇరవయ్యవ శతాబ్దపు పాశ్చాత్య తాత్వికులు తత్వ శాస్త్రం లో తాము కొత్తగా కనుక్కొనే సత్యం ఏదీ లేదని తాము ప్రాచీన తత్వ వేత్తల రచనలను మళ్ళీ పూర్తిగా చదివితే సరిపోతుందని భావించారు .గత పది హేను వందల ఏళ్లుగా భారతీయ ఆచార్యులేవ్వరూ తాము కొత్తగా యేదర్శనాన్ని ప్రతి పాదిస్తున్నట్లు చెప్ప లేదు ..పాత వాటికి భాష్యాలు మాత్రమె రాస్తున్నారు .భాష్య సంప్రదాయానికి ‘’హెర్మ న్యూటిక్స్‘’కు తేడా ఉంది .భాష్యం లో భాష్య కారుడు ఏదో ఒక సంప్రదాయానికి బద్ధుడై రాస్తాడు కానిహిర్మన్యూ టిక్స్ తటస్థ భావం తో నిష్పక్ష పాతం గా ,ఎటు వంటి లోగో సేంత్రిజం లోను కాకుండా ప్రాచీన రచనలను అర్ధం చేసుకొంటుంది .ఇదే విధానాన్నిపద్మ విభూషణ్ శ్రీ కొత్త సచ్చిదానంద మూర్తి గారు అవలంబించి వేద సారాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేశారు .ఇది నేడు భారత దేశానికి అత్యంత అవసరమైన రచన ‘అందుకే నాకు ఇష్టం ‘’అని అనువాదకులు శ్రీ చిన వీర భద్రుడు స్పష్టం గా తెలియ జేశారు .
‘’శబ్ద బ్రహ్మేతి యచ్చేదం శాస్త్రం వేదాఖ్య ముచ్యతే –తదిష్యదిధీస్టితం సర్వమేకేన పరమాత్మనా ‘’
వేదం గా పిలువ బడే ఈ శాస్త్రం అంతా శబ్ద బ్రాహ్మ స్వరూపం గా ,ప్రసిద్ధి కెక్కినది అంతా కూడా ఆ పరమాత్మ వల్లనే ప్రేరేపిత మైంది .ఆయనలోనే పాదుకుని ఉంది ..(తాంత్రిక వార్తికం లో కుమారిలుడు )
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-14-కాంప్-బాచుపల్లి –హైదరా బాద్
