సాధారణంగా కళాఖండాలుగా పేరొందిన చిత్రాలు ఆర్ధిక విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఆర్థికంగా విజయం సాధించిన చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం కూడా అరుదే. అయితే కళని, కాసుని కలగలపి ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు రూపొందించిన దర్శకుల్లో కదిరి వెంకటరెడ్డి(కె.వి.రెడ్డి)స్థానం చాలా ప్రత్యేకం. ‘భక్త పోతన’.’యోగి వేమన’ వంటి చిత్రాలను తీసిన ఆయనే ఆ తరువాత ‘పాతాళభైరవి’, ‘జగదేకవీరుని కథ’ వంటి అద్భుతజానపదాలను, ‘మాయాబజార్’ వంటి ఆణిముత్యాన్ని ప్రేక్షకులకు అందించారు. వినోదభరిత చిత్రాలతో పాటు ‘పెద్దమనుషులు’ వంటి ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలూ తీశారు. ‘దొంగరాముడు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’ వంటి అద్భుత సాంఘిక చిత్రాలు రూపొందించారు. 35 ఏళ్ల సుదీర్ఘమైన తన చలనచిత్రజీవితంలో ఆయన తెలుగులో 14, తమిళంలో 3, హిందీలో ఒక్క సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ప్రతి సినిమా దర్శకత్వశాఖలో కొత్తగా ప్రవేశించేవారికి ఒక పాఠ్యాంశమే. ఆయన పద్ధతుల్ని చాలా మంది అనుసరించారు కానీ ఆయన మాత్రం ఎవరినీ అనుసరించలేదు, అనుకరించలేదు.
కె.వి.రెడ్డి పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చే చిత్రం ‘మాయాబజార్’. జనబాహుళ్యంలో ఉన్న కథను ఆ చిత్రంలో ‘స్ట్రెయిట్ నేరేషన్’లో ఆయన చెప్పారు. అయితే అందులో ‘హైడ్ అండ్ సీక్’ పద్ధతిలో పాండవుల ప్రస్థావన మొదటి నుంచీ వస్తున్నా, వారు తెరపై ఎక్కడా కనిపించని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శక దిగ్గజం కేవీ. ఈ విధానం ఏకపాత్రాభినయాల్లోనూ, స్త్రీ పాత్రలేని నాటకాల్లోనూ సుపరిచితమే అయినా, తెరపై దానిని అద్భుతంగా పర డించిన తీరు నేటికీ ఆకట్టుకుంటుంది. నేటి మేటి దర్శకులుగా కీర్తిగడించిన స్టీవెన్ స్పీల్బెర్గ్, జార్జ్ లూకాస్ వంటివారు జపాన్ దర్శకుడు అకిరా కురసోవా తెరకెక్కించిన ‘వైప్ షాట్స్’ను వేనోళ్ళ కీర్తించారు. లూకాస్ తన ‘స్టార్ వార్స్’ చిత్రాల్లో వైప్ షాట్స్ రూపొందడానికి అకిరా ప్రభావమే కారణమని చెబుతారు. దాదాపు కురసోవా కాలంలోనే ‘పాతాళభైరవి’ (1951)లోనూ, ఈ ‘మాయాబజార్’లోనూ కేవీ అనుసరించిన ‘వైప్ షాట్స్’ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవు అని ఈ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అంత గొప్ప దర్శకుడు కేవీ. అలాగే ఈ చిత్రంతోనే ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణునిగా ఆవిష్కరించిన ఘనత కూడా ఆయనదే.
ఇవాళ్టి రోజుల్లో షాట్ పూర్తి కాగానే ఆర్టిస్టులు ఫ్లోర్ బయటకి వెళ్లి బాతాఖానీ ప్రారంభిస్తుంటారు. లేదా కార్వాన్లో వెళ్లి కూర్చుంటారు. కానీ దర్శకుడు కె.వి.రెడ్డి పద్దతి అదికాదు. ఆర్టిస్ట్ సెట్ బయటకు వెళ్లడానికి ఆయన ఒప్పుకొనేవారు కాదు. పని ఉన్నా లేకపోయినా షూటింగ్ చూస్తూ అలా కూర్చోవలసిందే. అలాగే సెట్లో గట్టిగా మాట్లాడటానికి వీల్లేదు. తనకు ఇబ్బందిగా అనిపిస్తే ‘ఏమా ఫిష్ మార్కెట్’ అనేవారు. అది కేవీ ఊతపదం. ఆయన షూటింగ్స్‌కు విజిటర్స్‌ని అనుమతించేవారు కాదు. పాత్రికేయులకు కూడా ప్రవేశం ఉండేదికాదు. మరీ తప్పనిసరి అయితే ముగ్గురో, నలుగురో విజిటర్స్‌కి సెట్లోకి అనుమతి లభించేది. వాళ్లయినా పది నిముషాల సేపు షూటింగ్ చూసి నిశ్శబ్దంగా వెళ్లిపోవాలి.
ఆయన చాలా డిసిప్లిన్ కలిగిన దర్శకుడు. పరిశ్రమలో ఆయన తరువాత అంత క్రమశిక్షణని పాటించే వ్యక్తిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకొన్నారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే ఆరున్నరకే మేకప్‌తో సహా ఆర్టిస్టులు సెట్లో ఉండేవారు. లేకపోతే కేవీ ఏమన్నా అంటారేమోనని పెద్దపెద్ద ఆర్టిస్టులు సైతం హడలిపోయేవారు. అదే పద్ధతిని దర్శకునిగా ఎన్టీఆర్ కూడా ఫాలో అయ్యేవారు. తను దర్శకుడు కావడానికి ప్రేరణ కె.వి.రెడ్డి అని ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్ వెల్లడించారు.( మరో విషయమేమిటంటే కేవీ రెడ్డి శిష్యులు చిత్రపరిశ్రమలో ఎందరో ఉనా ్న అవసరమైన సమయంలో ఆయన్ని ఆర్థికంగా ఆదుకొని గురుదక్షిణ చెల్లించిన ఏకైక శిష్యుడు ఎన్టీఆర్. ‘శ్రీకృష్ణ సత్య’ చిత్రాన్ని కేవీ దర్శకత్వంలో నిర్మించారు ఎన్టీఆర్. ‘ఉమాచండీగౌరీశంకరుల కథ’, ‘సత్యహరిశ్చంద్ర’ అపజయంతో ‘ప్లాప్ చిత్రాలతో తన కెరీర్ పూర్తవుతుందేమోననే ఆందోళన చెందిన కేవీకి ఊరట కలిగిస్తూ ఎన్టీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయం ఆయనకి ఎంతో మానసిక బలాన్ని ఇచ్చింది. ‘శ్రీకృష్ణ సత్య’ హిట్‌తో ఆయన సంతృప్తిగా తన వృత్తికి గుడ్‌బై చెప్పారు. ఆ సినిమా విడుదలైన కొద్ది కాలానికే కేవీ కన్నుమూశారు.)
ఒక సినిమా పూర్తయిన తరువాతే మరో సినిమా గురించి కేవీ ఆలోచించేవారు. తను ఎన్నుకొన్న కథని ఎటువంటి డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్పడం కేవీ స్క్రీన్‌ప్లేలో ప్రత్యేకత. నేల క్లాసు ప్రేక్షకుడికి పూర్తి వినోదం ఎలా అందించాలా అనే ఆయన ఆలోచించేవారు.
కె.వి.రెడ్డి క్రమశిక్షణ, కార్యదక్షత ఈ కాలం వారికి చాదస్తంగా అనిపించవచ్చు. అవసరానికంటే ఎక్కువగా షాట్స్ తీసేసి సినిమాలో ఏ షాట్ ఉంచాలో ఏది తీసెయ్యాలో తెలీక ఎడిటింగ్ రూమ్‌లో తికమక పడే దర్శకులు కె.వి. రెడ్డిని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే సినిమాని ఎన్ని అడుగుల్లో తీయాలో ముందే పక్కాగా అనుకొని దానికి తగ్గట్లుగానే సినిమాలు తీసిన దర్శకుడాయన. స్క్రిప్ట్ రీడింగ్ సమయంలోనే ఏ షాట్ నిడివి ఎంత ఉండాలో అనుకొని అంత నిడివిలో తీసిన ఏకైక దర్శకుడు కె.వి.రెడ్డి.
ఆయన సీన్ మొత్తం వివరించి నటించమని చెప్పేవారు. రెండు మూడు రకాలుగా ఆర్టిస్టులు చేసి చూపించేవారు. అవీ నచ్చకపోతే మరోలా చెయ్యమని చెప్పేవారు తప్పితే ఇలా చేయాలని నటించి చూపించే అలవాటు ఆయనకుండేది కాదు. ఇలాగే చేయండని నటించి చూపించకుండా నటీనటులకే స్వేచ్ఛ ఇచ్చి వారి నుంచి తను అనుకొన్న ఎఫెక్ట్ రాబట్టుకొనేవారు కేవీ.
దర్శకునిగా మారడానికి ముందు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవంతో తను ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా దానికి సంబంధించిన బడ్జెట్, ప్లానింగ్ అంతా కేవీ తయారు చేసేవారు. పాత్రకు తగిన ఆర్టిస్టులను నిర్ణయించడం, వారితో పారితోషిక వివరాలు మాట్లాడటం ఆయనే చేసేవారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే షూటింగ్ సమయంలో తనని, నిర్మాతని ఇబ్బంది పెట్టని నటీన టులను, సాంకేతికనిపుణులను ఆయన జాగ్రత్తగా ఎన్నుకొనేవారు. ‘నాకు సహకరించిన జీనియస్ కంటే సహకరించే సామాన్యమైన వారు చాలు బ్రదర్’ అనేవారట ఆయన.
అనుకున్న బడ్జెట్లోనే సినిమా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత. భారీ తారాగణంతో రూపుదిద్దుకొన్న ‘మాయాబజార్’ చిత్రం అనుకొన్న బడ్జెట్లో పూర్తికాదేమో అనే భయంతో నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి మధ్యలో షూటింగ్ ఆపేస్తే, తను చెప్పిన బడ్జెట్‌కు ఒక్క రూపాయి ఎక్కువైనా దాన్ని తనే భరిస్తానని వారికి అభయం ఇచ్చి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు కె.వి.రెడ్డి. తెలుగుజాతి గర్వించే చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకునిగా ప్రేక్షకుల హృదయాల్లో కె.వి.రెడ్డి స్థానం ఎప్పటికీ పదిలం. అయితే ప్రభుత్వమే ఆనాడు ఆయన్ని గుర్తించలేదు. ఏ అవార్డుతోనూ సత్కరించలేదు. (నేడు కె.వి.రెడ్డి జయంతి)