
భౌతికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీగుతున్న మానవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీవనంలోను, ఉద్యోగ వ్యాపారాల్లోను తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. వీటన్నింటికీ విరుగుడు ధ్యాన, జ్ఞాన మార్గాలే అంటారు సిద్దార్థ బుద్ద విహార ట్రస్ట్ ఛైర్మన్ వెన్. ఖేమాచార భిక్కు …
మన దేశంలో సుప్రసిద్ధ బౌద్ధ గురువుల్లో వెన్ దీపాంకర ఒకరు. ఆయన ఒక సారి టిబెట్‌లో దమ్మతత్వం మీద ప్రసంగించటానికి వెళ్లారు. ఆయన తనతో పాటుగా ఒక వంట మనిషిని కూడా తీసుకువెళ్లాడు. ఆ వంట మనిషికి వంట సరిగ్గా రాదు. పైగా పేచీకోరు. అది గమనించిన కొందరు భక్తులు- ’మీరు ఎందుకు ఆ వంటమనిషిని భరిస్తున్నారు? అతనిని వెనక్కి పంపేయండి. మీ అవసరాలు మేం చూసుకుంటాం’ అని దీపాంకర వద్దకు వచ్చి ప్రశ్నించారు. అప్పుడు దీపాంకరుడు- ’’ అతన్ని నేను ఒక నౌకరుగా చూడటం లేదు. ఒక గురువుగా భావిస్తున్నాను. అతని అసమర్థత, పేచీకోరుతనం నాకు ప్రతి రోజూ పాఠాలు నేర్పుతూ ఉంటాయి. నాలో సహనాన్ని, నిబ్బరాన్ని పెంచుతూ ఉంటాయి..’’ అని సమాధానమిచ్చాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటంలోనే మనిషి అసలైన సమర్థత దాగి ఉంటుంది.
జీవితం ఒక ఆనంద సీమ అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ, చాలా మంది జీవితం ఎందుకంత నిర్లిప్తంగా ఉంటోంది?- ఎందుకంటే మన జీవితంలో దేనికి స్థిరత్వం లేదు. ఏదీ శాశ్వతం కాదు. అయితే పరిణామక్రమంలో పరిణితి ఒక ప్రక్రియ. నిరంతరం చైతన్యశీలంగా ఉండటమే ఈ ప్రక్రియకున్న ఏకైక మార్గం. వ్యక్తుల అంతరంగాలు అనునిత్యం కొత్తదనాన్ని సంతరించుకోవాలి. అప్పుడే అవతలి వ్యక్తుల్లోని భిన్నత్వాన్ని, వ్యతిరేక తత్వాన్ని కూడా జీర్ణించుకోగలుగుతారు. కానీ ఆధునిక ప్రపంచంలో ఇది జరగడం లేదు. కొత్తదనాన్ని సంతరించుకోని వారిలో స్వార్థం పెరుగుతూ వెళ్తుంది. సర్వ అశాంతులకూ, సమస్త సంఘర్షణలకూ అదే కారణమవుతుంది. స్వార్థశక్తులకు, మార్పునకు మధ్య జరిగే ఘర్షణ వల్లే అశాంతి ఏర్పడుతుందంటాడు బుద్ధుడు.
తోటలో పువ్వుల్లా…
ప్రపంచంలో అందరూ ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా బతకగలిగితే ఇన్ని సమస్యలు ఉండవు. ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ ఒక సంఘంలో నివసిస్తున్నప్పుడు సహజీవనం అనివార్యమవుతుంది. ఇతరుల దృక్పథాల్ని, అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది. పరమ విరుద్ధమైన ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మనతో ఏకీభవించేవారితో కలవటానికే మనం ఇష్టపడతాం. కానీ దాని వల్ల వృద్ధి ఉండదు. అభిప్రాయాల మధ్య ఘర్షణ, ఆలోచనలలో రాపిడీ ఉన్నప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇతరుల వాదనలో ఉన్న సత్యాన్ని గ్రహించి, దానిని ఆచరించగలిగితే కొత్త మార్గాలు మన కళ్ల ముందు గోచరమవుతాయి. ఇతరులతో స్నేహంగా ఉండడం అంటే ప్రకృతితో స్నేహంగా, ఉండడమే. శరీరం కాలిపోయేంతటి ఎండలోనూ మనం జీవిస్తాం. దానికి పరమ విరుద్ధంగా ఉండే చలిలోనూ జీవిస్తాం. నిలువెల్లా తడిపి ముద్దచేసే వర్షంలోనూ జీవిస్తాం. వాటిలో మనం దేన్నీ ద్వేషించం. పరమ విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి మనం సిద్ధమైనట్లే విభిన్నమైన వ్యక్తుల మధ్య జీవించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనం మన శత్రువుల్ని ప్రేమించగలంతటి ఉన్నతులం కాకపోవచ్చు. కానీ, మన ఆరోగ్యం , మన సంతోషం కోసమైనా కనీసం వారిని మన్నించి మరిచిపోవాలి. సాధారణంగా అందరికీ వైరుధ్యం అంటే ఒక వ్యతిరేకత ఉంటుంది. దాని నుంచి దూరంగా జరిగిపోవటానికి ప్రయత్నిస్తారు. కానీ దానిని అర్థం చేసుకుంటే గొప్ప సత్యాలు తెలుస్తాయి.
దాంపత్యంలో….
పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. కానీ దాంపత్యం సరిగ్గా లేకపోతే ఆ జీవితాలు నరకకూపాలవుతాయి. దంపతుల హృదయాలలో కేవలం స్వార్థం మాత్రమే ఉంటే- ఆ బంధం ఎంతో కాలం నిలబడదు. అడుగడుగునా తలెత్తే వైరుధ్యాలను అర్థం చేసుకొని, అసూయ, ఆగ్రహం, అనుమానం వంటి మానసిక స్థితులకు అతీతంగా ఉండటానికి సహనం కావాలి. ఔన్నత్యం మనిషిని దేవుడిగా మారుస్తుంది. హీనత్వం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. ఇక్కడ మనం దేవతలంటే ఎవరో కూడా తెలుసుకోవాలి. దేవతలంటే సకల సద్గుణ సంపన్నులు అని కాదు. ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కాదన్న సత్యాన్ని గుర్తించి వ్యవహరించే వారని అర్థం. ఇలాంటి ఔనత్యాన్ని కలిగినప్పుడు దాంపత్యం సజావుగా సాగిపోతుంది.
మూలాలు పెకిలిస్తేనే…
అవగాహన, సహనం- ఈ రెండు గుణాలతో వైరుధ్యాలను అధిగమించవచ్చు. ఇది సాధ్యం కానప్పుడు అశాంతి ప్రబలుతుంది. ప్రస్తుతం మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మునుపెన్నడూ లేనంతగా మనం శాంతి కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు ఏర్పడిన అంశాంతి అంతా భౌతిక సంపద కోసం వెంపర్లాటం వల్ల వచ్చేదే. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిన అగ్ర రాజ్యాలు కూడా ఈ సమస్యతోనే బాధపడుతున్నాయి. భౌతికమైన పురోగతి మనిషిని సంతోషపెట్టలేదనే సత్యాన్ని మానవాళి విస్మరించింది. దానికి మూల్యం చెల్లిస్తోంది. జ్ఞానం- దాని వల్ల సంక్రమించే నీతి, ఉదాత్తత, ఇవి మాత్రమే శాశ్వతమైనవని గ్రహించిన రోజు శాశ్వతంగా శాంతి ఏర్పడుతుంది. ఆ శాంతి సాధనకు పునాదిగా నిలిచే జ్ఞానాన్ని సముపార్జించటానికి ధ్యానం తోడ్పడుతుంది.
. నవ్య డెస్క్