ఆర్ద్రములు చేరా స్మృతులు – చలసాని ప్రసాద్
బుధవారం నాడే ఫోనులో పలకరించా. బాగున్నానన్నాడు. కాస్త తమాయించుకున్నా. ఇంతలోనే మీ చేరా పోయాడు అంటూ ఫోను. నిలవలేకపోయా. నిబ్బరం కోల్పోయా.
మా స్నేహానికి యాభై ఏళ్ళు పై బడ్డాయి. అతనొక కమ్యూనిస్టు అభిమాని. విరసం గాఢాభిమాని. విరసంలో లేడుగాని, విరసంతోనే ఉండేవాడు.నేను విరసం వ్యవస్థాపక అసభ్యుడుని అని అంటూండేవాడు. మేమిద్దరం పరస్పరం అయోమయం అని పిలుచుకునేవాళ్ళం. ‘మీ ఇద్దరినీ మరెవ్వరూ ఏమీ అనక్కరలేకుండా చక్కని పేర్లు పెట్టుకున్నారు అంటూ మా విజయ, వాళ్ళ రంగనాయకి హాయిగా నవ్వేవాళ్ళు. మేము ఉత్తరాలు చాలా రాసుకునే వాళ్ళం. ‘ప్రియమైన అయోమయం’ అనే బదులు ‘ప్రియోమయం’ అని వాడవచ్చా? అని అడిగా. ఎందుకు వాడకూడదు? వైద్యుడిని ‘మందువాడు’ అని మన తిక్కన పేర్కొన్నా డు అంటూ భాషమీద చాలాసేపు బోధ చేశాడు. కవితాలోలుడు. ఆధునిక తెలుగు కవిత్వం అంటే పంచప్రాణాలు. కవిని అతిగా పొగిడితే ఎవరయినా ఏద్దేవా చేసేవారు. అలాంటప్పుడు అలిగేవాడు. ‘కవిత్వం జోలి నాకేల? నేను భాషావాదిని’ అని తాత్కాలికంగా అస్త్ర సన్యాసం చేసేవాడు.
కవిత్వం అంటే చాలా చాలా ఇష్టం. కాని తన కృషి భాషా శాస్త్రంలో అని పదేపదే చెప్పేవాడు. ‘చేరాతలు’ సాహిత్యాభిమానులకి మంచి ఊతకర్ర. చక్కటి విమర్శకుడిగా అందరి కళ్ళల్లోనూ వెలుగుతాడు. విడవకుండా కాలమ్ రాశాడు.
కొన్నేళ్ళుగా ఒంట్లో బాగోలా. అయినా అస్త్ర సన్యాసం చేయలేదు. సాహిత్య సభలనీ, సంగీత కచేరీలనీ మాత్రం మానేవాడు కాదు. మాటల్లోగాని, చేతల్లోగాని,రాతల్లోగాని పరుషత్వం ఏ కోశానా ఉండేవి కావు. ఒక రకంగా సౌమ్యశీలి అనవచ్చు. స్నేహాలని ప్రాణప్రదం గా కాపాడుకొనేవాడు. ఆడంబరం దర్పం అతనిలో లేవు. కంచుకాగడా పెట్టి వెదికినా కనిపించవు.
రచయిత బుచ్చిబాబు ఎక్కడో రాశాడు- ‘‘మనదేశం ఇంత విశాలంగా ఉండడం చేటు. స్నేహితులు దూరదూర తీరాలకి తరలిపోతారు. పదేపదే కలవాలంటే కుదరదు. బెంగలు పెరిగిపోతుంటాయి. ఆర్ద్రత, అభి మానం, ప్రేమ ఎప్పటికీ ఉండేవే. అవి ఇగిరిపోవు, ఇంకిపోవు, పరిమళాలు వెదజల్లుతూనే వుంటాయి’’
ఏది ఏమైనా స్నేహం మీద ఇంద్రగంటి వారి సూక్తులు అజరామరం.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి
వ్యష్టిజీవము చేదుపానీయమోయి…
– చలసాని ప్రసాద్
నేను ఒప్పుకుంటాను చేరా గారు… – విమల
ఎప్పుడు కలిసినా, ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరించే చేకూరి రామారావు గారు ఇక లేరనుకోవడం మనసుకి చాలా కష్టంగా వుంది. విద్యార్థి ఉద్యమాలలో నేను పనిచేస్తున్న ఆ తొలినాళ్ళ నుంచీ ఆయన నాకు తెలుసు. ఆ రోజుల్లో, నేనూ, రంగవల్లీ ఉస్మానియా యూనివర్సిటీ నేరేడుచెట్ల మధ్య నుంచి క్యాంప్ త్రీ బస్తీ కలియ తిరిగి, తుప్పలూ, తుమ్మచెట్లూ దాటుకొని, అడ్డదారుల్లో చేరా ఇంటికి వెళ్ళేవాళ్ళం. రంగవల్లికి ఆ ఇల్లొక విడిది. చేరాగారు ఒక గొప్ప భాషా శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు, రచయిత అన్న విషయాల కన్నా, ఆయన ప్రజా ఉద్యమాలకి సానుభూతిపరుడు అన్న ఒక్క సంగతే ఆరోజుల్లో మాకు ఎక్కువగా అర్థమైన విషయం. అప్పటి నుంచీ, విరసంలో ఓ కార్యకర్తగా పనిచేసిన కాలమంతా ఆయన్ని అనేక సార్లు కలిసేదాన్ని. నన్ను చూడగానే ఆయనకి అర్థమైపోయేది. కాసిన్ని కబుర్లుపోయాక ‘ఏం చేయాలిప్పుడు? ఏం కాగితాలు పట్టుకొచ్చావ్?’ అంటూ నవ్వేవారాయన. ఎదురుకాల్పుల హత్యను, అక్రమ అరెస్టులను, ప్రజా ఉద్యమాలపైన, విరసంపైనా పోలీసు దాడుల నుంచీ మొదలుకొని పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య, అమెరికా అగ్రరాజ్య దురహంకారం దాకా, అనేక ఖండనల ప్రకటనల పైన ఆయన తొలి సంతకం తీసుకుని, ఇతర మేధావుల దగ్గరికి వెళ్ళటం నా అలవాటుగా ఉండేది. ఆయన మారుమాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. ‘మీ విరసం వాళ్ళు సాహిత్యం కన్నా రాజకీయాల్ని మరీ ఎక్కువ పట్టించుకుంటున్నారు’ అంటూ అప్పుడప్పుడు నెమ్మదిగానైనా విసుక్కునే వారు.
ఏవైనా సభలు జరుగుతుంటే సానుభూతిపరులు, సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు పోగు చేసే మంచి సాంప్రదాయం ఒకటుండేది ఆ రోజుల్లో. అప్పుడు కూడా చేరాగారే నాకు మొదట గుర్తొచ్చేవారు. విరసంలో సభ్యురాల్ని అని ఆయనకు తెలుసుకానీ నేను రాస్తానన్న విషయం ఆయనకి తెలీదు చాలా కాలం. నేనూ చెప్పలేదు. ఎక్కడ చదివారో, ఎవరు చెప్పారో తెలీదు కానీ, నా కవితలు ఒకటి రెండు చదివి నాకోసం కాచుకు కూర్చున్నారాయన. షరా మామూలుగా ఏదో ప్రకటనపై సంతకాల కోసం వెళ్ళానాయన దగ్గరికి. ‘నువ్వు కవిత్వం రాస్తావన్న విషయం నాకసలు తెలీనే తెలీదు. నువ్వసలు ఎన్నడూ చెప్పనే లేదు’ అంటూ నిష్టూరంగా, కోప్పడి ఇప్పటిదాకా రాసిన కవిత్వం అంతా పట్టుకొచ్చి తనకివ్వమని ఆర్డర్ వేసారాయన. నెలలు గడిచినా ఆ విషయం నేను పట్టించుకోలేదు. అప్పుడు నేను పనిచేస్తున్న పార్టీ ఆఫీసులోనే నేను వుండేదాన్ని. పోరాటాలు, పార్టీ పత్రిక బాధ్యతల మధ్య తీరికేలేని, రాసుకున్నవన్నీ జాగ్రత్తగా దాచుకోవాలన్న స్పృహ లేని కాలం అది. చివరికాయన నువ్వు నీ కవిత్వం వినిపిస్తేనే పిటీషన్ల మీద సంతకం పెడతాననే వారు. ఆయన అలా వెంటబడి అడగటాన్ని తట్టుకోలేక, రెండు వంద పేజీల నోటు పుస్తకాల్లో దొరికిన నా కవిత్వం రాసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఎవరినడిగారో, ఎలా కనుక్కున్నారో తెలీదు కానీ, ఓ రోజు సాయంత్రం చేరాగారే స్వయంగా తిలక్‌నగర్ బతకమ్మ కుంట వద్ద మేడపైన వున్న విమోచన ఆఫీసుకి వచ్చారు. ‘నీకేం పట్టదు. నువ్వు రావు కదా! నేనే నీకోసం వెతుక్కుంటూ వచ్చా’’నన్నా రాయన. నా కవిత్వం గురించి సాహితీ కారుల టెక్నికల్ పరిభాషలో ఆయన చాలా సేపు మాట్లాడారు కానీ, చివరికి విషయం ఏమిటంటే మోడెస్టీని కాస్సేపు పక్కన పెట్టి నా కవిత్వాన్ని సంకలనంగా వేయమని. ఆయన చాలా గట్టిగా చెప్పిన కారణంగానే విరసం ద్విదశాబ్ది సభల సందర్భంగా నా మొదటి కవిత్వ సంకలనం ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ వచ్చింది.
ఆయన నాకో మాట తరచూ చెప్పేవారు. ‘నువ్వు కేవలం రాజకీయ కార్యకర్తవి మాత్రమే కాదు. కవివి అన్న విషయం మర్చిపోకు’ అని. నిజానికి అట్లా మరిచిపోయే అనేక పనులు మాలాంటి వాళ్లందరికీ వుంటుండేవి. నేను కవిత్వం రాయడానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదనేది ఆయనకి నాపై వున్న కంప్లెయింట్. చేరాగారూ నేను కూడా వొప్పుకుంటాను మీ మాట.
ఆయన్ని కలవటానికి వెళ్ళినప్పుడు రాజకీయ పరిస్థితులు, విరసం కార్యక్రమాల మీదా, వస్తు శిల్పాల మీదా చాలా చర్చలే జరుగుతుండేవి. నిజానికి ఆయన్ని వట్టి శిల్పవాది అంటూ అధిక్షేపించేలా మాట్లాడటం పట్ల నాకు ఎప్పుడూ అభ్యంతరం వుండింది. మంచి కవిత్వాన్ని, కొత్త కవుల్నీ ఆయన కనుగొని, ప్రోత్సహించినట్లుగా మరెవరూ చేయలేదు. చేరాతల గురించి, ఆయన సమీక్షల గురించి సాహితీ లోకం అంతా ఎదురుచూసిన కాలం ఒకటుండేది. నీలి కవిత్వం, బూతురాతలు అంటూ స్ర్తీవాద కవిత్వాన్ని ఖండఖండలుగా తెగనరుకుతున్నప్పుడు ఆయన తన రెండు చేతులనీ అడ్డు పెట్టి ఆ కవిత్వాన్ని అక్కున చేర్చుకున్నారు. ఆ సమయంలో ఆయన చూపిన సంయమనం గొప్పది. అస్తిత్వవాదనల వేదననీ, ఆగ్రహాన్నీ ఆయన సరిగ్గానే గుర్తించగలిగారు. పాత కొత్తలలో వున్న మంచిని, ప్రగతిశీలతని చూడగలిగిన, ఎల్లవేళలా, బాధితుల పక్షానా, పోరాడేవారి పక్షాన నిలబడిన, వ్యక్తిగత కీర్తికాంక్షల జోలికి పోకుండా వినమ్రంగా, నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ పోయిన ఆ పాత తరం మెల్లిమెల్లిగా అదృశ్యం కావటం చాలా బాధిస్తోంది.
అప్పుడప్పుడూ ఏ మీటింగుల్లోనో కలిసినప్పుడు ‘ఇంటికి రావచ్చు కదా!’ అని చాలా సార్లు నన్నడిగి విసుగుపుట్టి ‘ఇకనిన్నడగను’ అన్నారు. ఆ మధ్య మళ్ళీ కలిసినప్పుడు ఇంటి గుర్తులు చెప్పి, రమ్మన్నప్పుడు తప్పక వస్తానన్నాను. కానీ నా మాట నేను నిలబెట్టుకోలేదు. ఆయన మళ్ళీ కలవలేని తీరాలకు వెళ్లిపోయారు. ఏం చేయను ‘విప్లవ కవయిత్రి విమలకు అభిమానంతో చేరా’ అంటూ మీరు మీ పుస్తకం మీద రాసిచ్చిన చేరాతని చూస్తూ…
– విమల

