మంగమ్మ గారి మనవడికి ముప్ఫై ఏళ్ళు -కోడి రామకృష్ణ

తెలుగు చిత్రనిర్మాణసంస్థల్లో భార్గవ్‌ ఆర్ట్స్‌ సంస్థకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఇది నందమూరి బాలకృష్ణకు మాతృసంస్థలాంటిది. భార్గవ్‌ ఆర్‌ ్ట్స సంస్థతో బాలకృష్ణ, ఆయన వల్ల భార్గవ్‌ ఆర్ట్స్‌.. ఇలా ఒకరికొకరు అన్నట్లుగా ఎదిగారు. ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. అంతే కాదు బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్‌ ఆర్ట్స్‌ కాంబినేషన్‌కి శ్రీకారం చుట్టిన సినిమా కూడా ఇదే. భారతీరాజా తమిళంలో తీసిన ‘మన్‌ వాసనై’( మట్టి వాసన) చిత్రానికి ఇది రీమేక్‌. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడమే కాకుండా కమర్షియల్‌ అంశాలు జోడించిడంతో తెలుగు ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. బాలకృష్ణకు ఇది 15వ సినిమా. సోలోగా ఆయన నటించిన నాలుగో సినిమా. ఆయనకు ఇదే తొలి శతదినోత్స చిత్రం. అత్యధిక స్థాయిలో 565 రోజులు ఈ చిత్రం ప్రదర్శితమవడం ఒక రికార్డ్‌. సినిమాలో పంచె కట్టుతో బాలకృష్ణ కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. అలాగే తొలిసారిగా ఒక పాటలో రాముడు, కృష్ణుడు గెటప్స్‌లో ఆయన కనిపిస్తారు. సుహాసిని కథానాయిక. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన భానుమతీరామకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 1984 సెప్టెంబర్‌ 7న ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం విడుదలైంది. నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ ‘చిత్రజ్యోతి’కి వివరించిన విశేషాలు ఆయన మాటల్లోనే…

మద్రాస్‌లో చూసిన ఓ చిన్న సినిమా ఈ కథకు స్పూర్తి.. ఓసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా గోపాల్‌రెడ్డిగారికి కథ చెప్పాను. ఆయనకు నచ్చి ప్రొసీడ్‌ అన్నారు. అప్పటి వరకు భార్గవ్‌ ఆర్ట్స్‌ సంస్థ రెండు చిన్న సినిమాలు తీసింది.. ఆ బ్యానర్‌ నుండి వచ్చిన తొలి పెద్ద చిత్రమిది. చిన్న సినిమాలతో హ్యాపీగానే ఉన్నారుగా పెద్ద బడ్జెట్‌ చిత్రాలవైపు వెళ్ళడం ఎందుకని చాలామంది గోపాలరెడ్డిగారిని నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేశారాయన. బాలకృష్ణని హీరోగా తీసుకుందాం నేటివిటీ, సెంటిమెంట్‌ పాత్రలకు అతనే సూటవుతాడని చెప్పగానే అందుకు కూడా ఆయన అంగీకరించారు.

నిర్మాత భయపడ్డారు…
ఇందులో బాలయ్యకు బామ్మగా భానుమతిగారిని తీసుకుందాం అనగానే గోపాల్‌రెడ్డిగారు ఆమె చాలా యారొగెంట్‌ అని, టైమ్‌కి సరిగా రాదని, ఎక్కువ డిమాండ్‌ చేస్తుందేమోనని భయపడ్డారు. అదేంకాదని ఆయన్ని భానుమతిగారి దగ్గరకు తీసుకెళ్లాను. గోపాలరెడ్డిగారి భయం గురించి చెప్పగానే ఆవిడ పక్కున నవ్వి… ‘ఏమనుకుంటున్నావ్‌ నా గురించి, ఎన్టీఆర్‌, ఏయన్నార్‌తో సినిమాలు చేశాను. మొదట్నుంచీ నాకు సిస్టమేటిక్‌గా ఉండడం అలవాటు. దాన్ని యారోగెంట్‌ అనుకుంటే నేనేమీ చేయలేను. ఈ కథ నచ్చింది కాబట్టి మీరు చెప్పిన సమయానికి వచ్చి యాక్ట్‌ చేసి వెళ్తాను’ అని భరోసా ఇచ్చాక గోపాలరెడ్డి శాంతించారు.
ఆ డైలాగ్‌లు పలకలేనంది…
ఈ సినిమాలో మనవడి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, బామ్మ పాత్రకు కూడా అంతే ఉంది. ఓ రోజు భానుమతి గారి దగ్గరకు వెళ్ళి కొన్ని డైలాగ్‌లు చెప్పాను. వాటిని వినగానే‘ ఈ సినిమా నేను చెయ్యను. ఈ శృంగారపు సంభాషణల్ని నేను పలకలేను. విప్రనారాయణ వంటి సినిమాలు చేసిన నాతో ఇలాంటి డైలాగ్‌లు పలికిస్తావా? ఏమనుకుంటున్నావ్‌ భానుమతంటే’ అని కసిరేసి, ‘ ఆ మాటలు తొలగిస్తే… యాక్ట్‌ చేస్తా’ అనేశారు. మళ్ళీ గోపాలరెడ్డిగారికి టెన్షన్‌ మొదలైంది. అలాకాదని ఆమెకు నచ్చజెప్పి షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఉదయం 9 గంటలకు భానుమతిగారిని సెట్‌కి తీసుకెళ్ళి క్లోజ్‌ షాట్‌లో ఓ డైలాగ్‌ చెప్పించాను. ‘భయంగల బుల్లి బావగారొచ్చారని బట్టల్లేకుండా లేచి నిలబడింది’ అనే ఆ డైలాగ్‌ని ఆమె స్టైల్లో చెప్పించేసరికి షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నవాళ్ళతోపాటు షూటింగ్‌ చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చప్పట్లతో కోలహలం చేసేశారు. ‘భానుమతి డైలాగ్‌ చెప్తే జనాల స్పందన ఎలా ఉందో చూశావా’ అని ఆనందించారామె. ‘అమ్మా ఇందులో ఉన్న డైలాగ్‌లన్ని చెప్తే… థియేటర్‌ దద్దరిల్లిపోతుంది’ అనగానే ‘అంతేనంటావా’ అని సంతృప్తి చెందారు. ఆ ఆనందంలో అంతకుముందు తను చెప్పనన్న డైలాగులన్నీ చెప్పేశారు.
బాలయ్య పట్టుదల 
బాలకృష్ణ, నా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రమిది. ఈ సినిమాను 70 మంది యూనిట్‌తో మద్రాస్‌, ఆ పక్క గ్రామాలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. దీని కోసం బాలయ్య 40 రోజులు పనిచేశారు. మొత్తం సినిమా 48 రోజుల్లో పూర్తయింది. ప్రతి రోజు చెప్పిన టైమ్‌కంటే ముందు సెట్‌లో ఉండేవారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌లను అడిగి ఈ రోజు సీన్లేంటి అని తెలుసుకుని ఏకాగ్రతతో పనిచేసేవారు.. ఒకసారి బాలయ్య మాంచి జోరు మీద డాన్స్‌ చేస్తుండగా ఓ కాలులో చెట్టు మోడు దిగిపోయింది. అంతే. బాలయ్యని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాం. డాక్టర్‌ కాలుకి రెస్ట్‌ అవసరం అని చెప్పడంతో సాంగ్‌కి గ్యాప్‌ ఇచ్చి వేరే సీన్లు చేద్దామని నిర్మాతకు చెప్పాను. మర్నాడు ఉదయం బాలయ్య సెట్‌కొచ్చి సాంగ్‌ పూర్తి చేసేద్దాం నాకేమీ నొప్పి లేదు అంటూ ఆ సాంగ్‌ పూర్తి చేశారు. అప్పుడే పట్టుదల, క్రమశిక్షణ అనేది బాలయ్యలో చూశాను. అదే క్రమశిక్షణ, అంకితభావం ఆయనలో ఇప్పటికీ ఉంది. ఈగో అనేది ఆయనకి తెలీదు. సిఎమ్‌ కొడుకుని అనే ఫీలింగ్‌ ఆ రోజుల్లో ఆయనకి ఉండేదికాదు.
సొంత మనవడిలా చూసేది…
భానుమతిగారితో సెట్లో చాలా గౌరవంగా ఉండాలని ఎన్టీఆర్‌ స్వయంగా బాలయ్యకు చెప్పారట. అందుకే బాలయ్య ఆమె అంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. ఆవిడ కూడా బాలయ్యని సొంత మనవడిలా చూసేది. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండడంతో ఆ పాత్రలు పండాయి.
ఎన్టీఆరే స్వయంగా మేకప్‌ వేయించారు..
ఇందులో బాలకృష్ణతో రాముడు-కృష్ణుడు పాత్రలు వేయించాను. ‘నాన్నగారు చేసిన పాత్రలు చేయడం నా వల్ల కాదు. అది ఆయనకే సూటవుతుంది’ అంటూ మొదట్లో బాలకృష్ణ ఒప్పుకోలేదు. గోపాలరెడ్డిగారు కూడా ఎన్టీఆర్‌ నటించిన పాత సీన్స్‌ ఇందులో ఉపయోగిద్దాం అన్నారు. నేనేమో బాలయ్యతోనే చేయాలని ఫిక్స్‌ అయ్యాను. దాంతో తరువాత రోజు బాలయ్య ఆ పాత్రలకు తగ్గట్టు రెడీ అయివచ్చారు. మేకప్‌ టెస్ట్‌ చేశాం అంతా ఓకే అయింది. షూటింగ్‌ రోజున ఎన్టీఆర్‌గారి పర్సనల్‌ మేకప్‌మెన్‌ పీతాంబరం సెట్‌కి వచ్చారు. ఏంటిలా వచ్చారని బాలయ్య పశ్నించగా నాన్నగారు పంపారని చెప్పాడాయన. కాసేపట్లో స్వయంగా ఎన్టీఆర్‌గారే వచ్చారు. ‘రాముడు- కృష్ణుడు పాత్రలంటే వేళాకోళం అనుకుంటున్నారా? ఆ వేషం వేరేవారు వేయడం వేరు. రామారావు కొడుకు వేయడం వేరు’ అని ఆయన తొడపై బాలయ్యను కూర్చోబెట్టుకుని పీతాంబరం చేత మేకప్‌ వేయించారు. ఆయనే స్వయంగా బొట్టు పెట్టారు. ఆ పాత్రల్లో బాలయ్యని చూసి ఆడియన్స్‌ థ్రిల్‌ అయ్యారు.
ప్రశ్నించడం నిర్మాత లక్షణం…
ఏ నిర్మాతకైనా తన సెట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రశ్నించే లక్షణం ఉండాలి. అప్పుడే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. గోపాలరెడ్డిగారు విజన్‌ ఉన్న నిర్మాత. సినిమా విషయంలో ప్రేక్షకుడిలా ఆలోచించేవారు. ఈ సినిమా కోసం ఆయన అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది. ‘మంగమ్మగారి మనవడు’ నాకు, బాలకృష్ణకి, భార్గవ ఆర్ట్‌ సంస్థకి ఓ గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే గోపాలరెడ్డిగారు పెద్ద నిర్మాతగా మారారు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.