|
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించిన దర్శకులు అతి కొద్ది మంది. వారిలో బాపయ్య ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తీసిన మొత్తం 70 సినిమాల్లో 45 హిందీవే! దాదాపు మూడు దశాబ్దాలు బాలీవుడ్‌లో అప్రతిహతంగా తన హవాను సాగించిన బాపయ్య గురుతులు ఈ వారం..
నేపథ్యం..
మాది కృష్ణాజిల్లా కంకిపాడు సమీపంలోని కోలవెన్ను గ్రామం. నాకు ఇద్దరు తల్లిదండ్రులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు సుమతి, సత్యనారాయణ. అయితే నా మూడవ యేట అమ్మ, ఐదవ యేట నాన్న చనిపోవంతో మా బాబాయి కె.ప్రకాశరావుగారే నన్ను పెంచి పోషించారు. ఆయనను నేను ‘డాడీ’ అనే పిలుస్తాను. ప్రకాశరావు దంపతులే నన్ను ఇంతవాణ్ని చేశారు. నా ఇంటర్ చదువు పూర్తయ్యే నాటికి డాడీ ప్రముఖ డైరెక్టర్. మాకు చెన్నైలో స్టూడియో వుండేది. సెలవుల్లో సీనియర్ డైరెక్టర్ తిలక్ వద్ద పని నేర్చుకోమని నాన్న సూచించారు. తిలక్ గారు మొదట్లో ఫిల్మ్ ఎడిటర్. ఆయన వద్ద కొంచెం కొంచెం పని నేర్చుకున్నా. ఆ సమయంలోనే ఎడిటింగ్ నుంచి ఆయన దర్శకత్వంలోకి మారారు.
‘‘మీరు చెబితే నమ్మరు. నేను చేసిన తొలి సినిమా ‘ద్రోహి’ సూపర్‌డూపర్ ఫ్లాప్. ఇప్పటి వరకూ అంత చెత్త సినిమా మరెవ్వరూ తీయలేదేమో! ఆ సినిమాకు నాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చింది రామానాయుడు గారు. హీరో లేని సబ్జెక్టుతో కథ రూపొందించి సినిమా తీసాం. ఈ చిత్రాన్ని తమిళం, హిందీల్లో కూడా తీశారు. అక్కడ కూడా ఫ్ల్లాపే. ద్రోహి సినిమా ఫ్లాపవ్వడంతో మళ్లీ డాడీ (కె. ప్రకాశరావు) తీసిన ‘ప్రేమనగర్’కు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశా. ఆ తరువాత ‘మేమూ మనుషులమే’ తీశాం. ఈ రెండూ హిట్లు కావటంతో క్రాంతికుమార్ ‘ఊర్వశి’కి అవకాశం ఇచ్చారు. అదీ హిట్టే. ఆ తర్వాత తీసిన ‘వైకుంఠపాళి’ కూడా బాగా ఆడింది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఎదురులేని మనిషి!
1974 ప్రాంతంలో ఎన్‌టీఆర్ వయసు ముదిరిన పాత్రలు చేస్తున్నారు. మరోవైపు అక్కినేని తన స్టెప్పులతో దూసుకుపోతున్నారు. ఎన్‌టీఆర్ ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా వున్నా కొంతమందికి వెనుకంజలో వున్నారేమో అన్న భావన వుండేది. ఆ సమయంలో ఆయన హీరోగా ‘ఎదురు లేని మనిషి’ సినిమా తీశాను నేను. దీనికి వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ నిర్మాత. ఒకరకంగా చెప్పాలంటే ఎన్‌టీఆర్‌ను కొత్తగా చూపించాలన్న ఉద్దేశంతో పట్టుబట్టి మరీ ఆ సబ్జెక్టుతో సినిమా తీశా. ఆ సినిమాలో అప్పటి వరకూ ఎన్‌టీఆర్ వేయని డ్రెస్సులు, స్టెప్పులు వేశారు. షూటింగ్‌లో కూడా ‘ఇవన్నీ అవసరమా బ్రదర్’ అనేవారు. ఆ సినిమా కెమెరామెన్ కూడా ‘ఆ డ్రెస్సులు, డ్యాన్సులు చూడలేకపోతున్నాను. జనం ఈ సినిమాను చూడలేరు’ అని పెదవి విరిచేశాడు. డాడీ అయితే ‘బయట టాక్ లేదు. ఈ సినిమా విడుదల చేయవద్దు’ అన్నారు. రామానాయుడుగారు చూసి ‘ఇక ముందైనా ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చారు. ఇంత మంది పెద్దల మాటలు విన్న తర్వాత నాలో భయం మొదలయింది. నా అసిస్టెంట్లు బయట రష్ చూద్దామని సినిమా రిలీజ్‌కు ముందురోజు కారులో నెల్లూరు వెళ్లారు. ఆ రాత్రికి హోటల్లో పడుకొని ఉదయాన్నే థియేటర్ వద్దకెళ్లేసరికి విపరీతంగా జనాలున్నారట. వారు వెళ్లేసరికే ఉదయం 5 గంటలకు మొదలైన షో పూర్తి కావస్తోంది. సినిమా బ్రహ్మాండమని టాక్. అది బాగా ప్రచారం కావటంతో విపరీతమైన కలెక్షన్లు వచ్చాయి. ‘ఏదో మనవాడు అడిగాడు కదా అని చేశాను. జనం ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారోనని నాకూ అనుమానంగానే ఉండేది. ఇంత హిట్టవుతుందని అనుకోలేదు. కానీ ‘బాపయ్య హిట్ చేశాడు’ అని ఎన్టీఆర్ వందో రోజు ఫంక్షన్లో ప్రశంసించటం మరచిపోలేని అనుభవం.
ఎన్టీఆర్‌తో అనుభవాలు!
నేను బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత బాగా బిజీ అయిపోయా. ఎంత బిజీ అంటే- కొన్నిసార్లు ఒప్పుకున్న సినిమాల షూటింగ్ పూర్తి చేసేందుకు అదనపు డేట్స్ ఇవ్వడం కూడా కష్టమయ్యేది. ‘యుగపురుషుడు’ పూర్తిచేయటం కుదరకపోవటంతో- దానిలో రెండుమూడు సీన్లను డాడీయే తీశారు. అలాగే కృష్ణ హీరోగా నటించిన ‘ఊరికి మొనగాడు’ విషయంలో కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. దీనిలో కూడా కొన్ని సీన్లకు నాన్న దర్శకత్వం వహించారు. ఎన్‌టీఆర్ ఔట్‌డోర్ షూటింగ్‌కు రావడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఆయన ‘సాహసవంతుడు’ సినిమాను ఏకంగా నేపాల్‌లో షూట్ చేశాం. విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఆయన తొలిచిత్రమదే. ఓ సన్నివేశం విమానంలో తీయాలి. అప్పట్లో ‘మౌంటెయిన్ ఫ్లయిట్స్’ అని వుండేవి. సందర్శకులు మంచుపర్వతాలను చూసేందుకు ఏర్పాటు చేసిన విమానాలవి. ముందస్తు అనుమతి తీసుకుని ఆ విమానంలో షూటింగ్ మొదలుపెట్టాం. భూమికి 30 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా ఉదయం పూట షూటింగ్ ప్రారంభించాం. విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు బంగారురంగులో సూర్య కిరణాలు కనిపించాయి. పాత్రలో లీనమైన ఎన్‌టీఆర్ ఆ సూర్య కిరణాలు చూడగానే బిగుసుకుపోయారు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనై ఆ సుందర కిరణాలకు అలా ముకుళిత హస్తాలతో నమస్కరించారు.
అమితాబ్‌తో తప్ప..
ఎదురులేని మనిషి తరువాత ‘సోగ్గాడు’, ‘ముందడుగు’, సినిమాలకు దర్శకత్వం వహించా. అవీ హిట్టే. ఆ తరువాత కృష్ణ హీరోగా ‘ఇంద్రధనుస్సు’ చేస్తుండగా ‘సోగ్గాడు’ సినిమాను హిందీలో తీయాలని రామానాయుడు పిలిచారు. 1977లో జితేంద్ర, రేఖలతో తీసిన ఆ సినిమానే ‘దిల్‌దార్’. రామానాయుడు గారి వల్లనే బాలీవుడ్‌కు వెళ్లాను. ఆ తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. ఏకబిగిన హిందీలో 45 సినిమాలకు దర్శకత్వం చేశా. పద్మాలయ వారు తొలిగా హిందీలో జితేంద్ర హీరోగా ‘టక్కర్’ సినిమా తీశారు. దానికి నేనే దర్శకత్వం. ‘ఘర్ ఏక్ మందిర్’, ‘మవ్వాలి’, ‘మక్సద్’, ‘స్వర్గ్ సే సుందర్’, ‘పాతాళ భైరవి’ వంటి ఎన్నో సినిమాలు ఏడాదిపాటు థియేటర్లలో నిరంతరాయంగా ఆడాయి. ఒక్క అమితాబ్‌తో తప్ప మిగిలిన ఆ తరం బాలీవుడ్ హీరోలందరితోను పనిచేశా. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా తీద్దామని కొంతమంది నిర్మాతలు వచ్చారు. అప్పుడు ఇద్దరికీ డేట్స్ కుదరలేదు. ఇద్దరికీ డేట్స్ కుదిరేటప్పటికీ అమితాబ్ బాగా డౌన్‌లో వున్నారు. అప్పుడాయన ‘ఖుదా గవా’ సినిమా తీస్తున్నారు. ఆ సినిమా అయిన తరువాత ఆలోచిద్దామని అన్నారు. కానీ ఆ తరువాత ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది. దాంతో సినిమా తీయలేకపోయాం. హిందీలో నా చివరి చిత్రం మిథున్ చక్రవర్తి-మధుబాల జంటగా 2000 సంవత్సరంలో రూపొందిన ‘దియా ఔర్ తూఫాన్’.
అవి మాఫియా సినిమాలే!
నేను బాలీవుడ్‌లో ఉన్న సమయంలోనే మాఫియా వేళ్లూనుకుంది. నటులకు, డైరెక్టర్లకు భాయ్‌ల (మాఫియా) దగ్గర నుంచి బెదిరింపులు వస్తుండేవి. దిలీప్‌కుమార్, మిథున్ చక్రవర్తి, శ్రీదేవిలతో మెహబూబ్ స్టూడియోలో ‘ఇజ్జత్‌దార్’ అనే సినిమా ప్లాన్ చేశాం. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు రోజు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆ సినిమా ప్రారంభిస్తే చంపేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని నిర్మాతలకు చెప్పా. వారూ కొంత జంకారు. ఏదైతే అదవుతుందనుకుని సినిమా మొదలుపెట్టాం. స్టూడియో గేట్ నుంచి ఫ్లోర్ వరకూ కొన్ని వందలమంది సెక్యూరిటీ వారిని ఏర్పాటు చేసి షూటింగ్ ప్రారంభించాం. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలో మిథున్‌కు బదులు గోవిందాను, శ్రీదేవికి బదులు మాధురీదీక్షిత్‌ను తీసుకోవాల్సి వచ్చింది. కొంత కథను కూడా మార్చాల్సి వచ్చింది. మిథున్ చక్రవర్తి హీరోగా నిర్మితమైన ‘ముద్ధత్’, రిషికపూర్ హీరోగా ‘కసక్’ సినిమాలు మాఫియావారు తీసినవే. అయితే ఆ సినిమాలు తీసేటప్పుడు మాకు ఆ విషయం తెలియదు. ఆ తరువాత తెలిసింది అవి మాఫియా గ్యాంగ్‌లు వెనుకుండి తీయించిన సినిమాలని. ఎవరో వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు. కథ నచ్చింది సినిమా తీసేశాం. ఆ మనుషులు మాఫియా వారా కాదా అని అప్పుడు మనకు తెలియదు కదా! మాఫియా బెదిరింపులు చాలానే వచ్చేవి. ఒకరకంగా చెప్పాలంటే నన్ను కొంతవరకు ఇబ్బంది పెట్టాయి కూడా. ఇప్పుడు కార్పొరేట్ వారు బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడంతో మాఫియా రగడ తగ్గింది. కాకుంటే కార్పొరేట్ సంస్థల వల్ల చిన్న సినిమా బ్రతికే పరిస్థితి లేకుండా పోతోంది. అవార్డులు వచ్చాయా లేదా అనే విషయాన్ని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ హాలీవుడ్‌కు వెళ్లాలని మనసులో బాగా కోరిక వుండేది. ఒక యూకే సినిమా కోసం అప్పట్లో నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నా. కానీ డేట్స్ కుదరక ఆ అవకాశం మిస్సయ్యా.
ఎన్టీఆర్ మంచి విద్యార్థి!
తెలుగులో ఎన్‌టీఆర్, శోభన్‌బాబు, కృష్ణలతో బాగా సాన్నిహిత్యం. కథ వినేంత వరకే ఎన్‌టీఆర్ సీనియర్ నటుడు. షూటింగ్ ప్రారంభమైందంటే ఆయన మంచి విద్యార్థే. డైరెక్టర్ చెప్పినట్లు చేయడమే ఆయన లక్ష్యంగా వుంటుంది. డైరెక్టర్ అనుకున్న పర్‌ఫెక్షన్ వచ్చేంత వరకు ఆయన కష్టపడతారు. నేను, మా రాఘవేంద్రరావు ఎన్‌టీఆర్‌కు మోడ్రన్ థింకింగ్, మోడ్రన్ ఫ్యాషన్ అలవాటు చేశామనే చెప్పుకోవచ్చు. ఎన్‌టీఆర్‌కు సహాయం చేసే గుణం అధికం. ఆయన స్వంత బ్యానర్‌లో సినిమా తీసేటప్పుడు అధికారికంగా ఇచ్చింది కాకుండా ‘మీకేమైనా డబ్బు కావాలంటే చెప్పండి బ్రదర్’ అని అడిగేవారు. స్థిరాస్తులు కొనాలంటే ఆయన ఎంతైనా ఇచ్చేవారు. కానీ కారు కొనాలంటే మాత్రం పైసా కూడా విదిల్చేవారు కాదు. వృథా ఖర్చులకు డబ్బెందుకు ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం. ఇక హిందీలో దిలీప్‌కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. అంకితభావానికి, క్రమశిక్షణకు, పట్టుదలకు ఆయన మారుపేరు. నిత్యకృషీవలుడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ఎనలేని గౌరవం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో! ఒక సన్నివేశంలో నటించాలంటే దాని బ్యాగ్రౌండ్ ఏంటి, అప్పటి పరిస్థితేంటి, ఆ తరువాత స్థితిగతులేంటి అన్న విషయాలన్నీ తెలుసుకుని, అవగాహన చేసుకుని నటిస్తారాయన. దిలీప్‌కుమార్‌కు ఎన్నో భాషలు తెలుసు. ఆయనతో నేను రెండు సినిమాలు చేశాను. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు 10 సినిమాల అనుభవం వస్తుంది. ఇది నా మాట కాదు, మిగతా ఆర్టిస్టుల మాట కూడా.
మనకు సక్సెస్‌రేటు తక్కువ
అప్పటికీ ఇప్పటికీ డైరెక్టన్, స్టోరీ తీరులో మార్పు లేదు. టెక్నాలజీలో, దాని వినియోగంలోనే మార్పు వచ్చింది. తమిళంలో అప్పుడూ ఇప్పుడూ మంచి కథలే వున్నాయి. అవి నేటివిటీకి దగ్గర్లో వుంటాయి. ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేయడానికే తమిళ దర్శకులు ప్రయత్నిస్తారు. ‘ప్రేక్షకుడిని రంజింపజేయడానికే సినిమా తీస్తున్నాం’ అన్న స్పృహ వారి మనసులో ప్రధానంగా వుంటుంది. అందుకే కోలీవుడ్‌లో సక్సెస్‌రేట్ అధికం. బాలీవుడ్‌లో మరీ ఎక్కువ. అది తెలుగులో కనిపించదు.
– డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై |