విశ్వేశ్వరయ్య విలువలు కావాలి –

దేశంలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంజనీర్లుగా దేశంలోనే కాదు విదేశాల్లో రాణిస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. దానితోపాటే నేర్చుకున్న విద్యను హైటెక్‌ మోసాలకు వినియోగించి కటకటాలపాలవుతున్నవారు కూడా ఉన్నారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనది. కాసులకు కక్కుర్తిపడి నాణ్యతకు తిలోద కాలు ఇస్తూ అవినీతి నిరోధకశాఖ చేతికి చిక్కుతున్న సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఈ దుష్ప్రభావాల నుంచి ఈ రంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నేటి ఇంజ నీరింగ్‌ విద్యార్థులపై ఉంది. ఇందుకు మనం ఈ రంగంలో సేవలందించి, సమాజంలో విశిష్ఠ స్థానాన్ని పొందిన ఇంజనీరింగ్‌ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య (ఎం.వి) 1861 సెప్టెంబరు 15న కర్ణాటకలోని ముద్దనహల్లిలో జన్మించి 1883లో పూనా సైన్స్‌ కాలేజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. వివిధ హోదాల్లో పనిచేస్తూ ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారాయన. కర్ణాటకలో కృష్ణసాగర్‌ డ్యాం, దేశంలో విలువైన ఆస్తిగా గర్వంగా చెప్పుకుంటున్న భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్‌ సాండల్‌ సబ్బు కర్మాగారం ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించారు. ముఖ్యంగా సివిల్‌ ఇంజనీరింగ్‌లో ప్రావీణ్యత కారణంగా దేశంలో అనేక ప్రాజెక్టులను ఆయన రూపొందించారు. సుక్కూరు పట్టణానికి సింధునది నుండి నీటిని సరఫరా చేసేందుకు అతి క్లిష్టమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నీటి వృథాను అరికట్టడానికి ‘బ్లాక్‌ సిస్టమ్‌’ను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లో మూసీనదికి వరదలు వచ్చినప్పుడు నిజాం ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లను రూపకల్పన చేసిన విషయం మనకు తెలిసిందే.
విశ్వేశ్వరయ్య మైసూరు రాజ్యంలో దివాన్‌గా పనిచేస్తున్న సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు ఒకరు తన ఉద్యోగ ప్రమోషన్‌ కోసం ఒక సంతకం చేయమని అడుగుతారు. విశ్వేశ్వరయ్య దానిని సున్నితంగా తిరస్కరించడం చూస్తే ఒక ఇంజనీర్‌గా ఏ విధంగా నీతిపరమైన పాలనను అందించవచ్చో నిరూపించారు. దివాన్‌గా ప్రభుత్వం ఇచ్చిన కారును ప్రభుత్వ పనులకే ఉపయోగించి, తన పనిని, బాధ్యతలు ప్రజాసేవ కోసమే తప్ప స్వలాభం కోసం కాదన్న సూత్రాన్ని అనునిత్యం పాటించేవారు. దేశంలోని పేదరిక నిర్మూలన కోసం, పేదల అభివృద్ధి కోసం, వృత్తివిద్య ప్రాధాన్యతను పెంచే విషయంలోనూ అనేక కార్యక్రమాలు రూపొందించిన విశ్వేశ్వరయ్య ఉద్యోగ విరమణ తరువాత కూడా పలుదేశాల్లో పర్యటించి సలహాలు ఇస్తుండేవారు. ప్రతి వ్యక్తీ జీవితాంతం విద్యార్థిగానే ఉండాలని కాంక్షించే ఆయన ఎక్కడ ఏ కొత్త సమాచారం తెలిసినా నోట్‌ చేసుకునేవారు. దేశ స్వాతంత్య్రం రాకముందే దేశం సక్రమంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న దూరదృష్టితో 1920లో ‘భారత దేశ పునర్నిర్మాణం’, 1934లో ‘భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం’ అనే గ్రంథాలను రాశారు.
మౌలిక వసతుల కల్పనకు ఇంజనీరింగ్‌ రంగం ఎంత ప్రాథమికమైనదో, ప్రధానమైనదో జీవితాంతం కార్యశీలురుగా నిరూపించిన మహామనిషి ఆయన. నైతిక విలువల ఆధారంగా పనిచేసి ఇంజనీరింగ్‌ రంగానికి విశిష్టమైన గుర్తింపు, గౌరవం సంపాదించిపెట్టారు. అందుకే ఆ మహనీయుని జన్మదినాన్ని ‘ఇంజనీర్స్‌ డే’గా జరుపుకొనే అవకాశం మనకు దక్కింది. ఆయన వేసిన పునాది, చూపిన మార్గం, పాటించిన ఆదర్శాలతో నేటివరకూ ఎన్నో ఉన్నత లక్ష్యాలను చేరుకున్నాం. అనేక పరిశోధనలు జరిపి ఉత్పత్తులను ఎప్పటికప్పుడు ఆధునికీకరణ చేసుకొంటున్నాం. భారత్‌ వంటి సువిశాల దేశంలో ప్రజలకు అనేక సౌకర్యాలను కల్పించడంలో ఇంజనీరింగ్‌ రంగం సైతం విశేషమైన కృషి చేస్తుంది. విప్లవాత్మకమైన మార్పులు, ప్రయోగాలు వస్తున్నాయి.
దురదృష్టవశాత్తు ‘ఇంజనీర్స్‌ డే’ మొక్కుబడి కార్యక్రమంగా మారడంతో ఇంజనీరింగ్‌ రంగంలో ఉండాల్సిన నైతిక విలువలు పతనమవుతున్నాయి. విశ్వేశ్వరయ్య ఆశయాలు, ఆదర్శాలు మార్గదర్శకత్వం గాలిలో కొట్టుకుపోయాయి. బీహార్‌లో ప్రారంభానికి ముందే కూలిన వంతెన, హైదరాబాద్‌లో నడిబొడ్డున కూలిన ఫ్లై ఓవర్‌, ఏసీబీ, సీబిఐలకు చిక్కుకున్న అవినీతి బాగోతాలతో ఇంజనీరింగ్‌ రంగం అప్రతిష్ట పాలవుతున్నది. నాటి రోజుల్లో ఇంజనీరింగ్‌ రంగంలో ఉన్న వ్యక్తుల పట్టుదల, కార్యదీక్ష, నిజాయితీ, తపన నేటి రోజుల్లో ఏమి అయ్యాయన్నది, అందుకు కారణం ఎవరన్నది, విరుగుడు ఏమిటో పునరాలోచించాలి. నైతికత, నిబద్ధత కలిగని విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఇంజనీర్లు మార్గదర్శిగా స్వీకరించాలి. ఆయన విలువలను వ్యక్తిగతంగా, సామాజికంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరిగినప్పుడే భావిభారతం ప్రపపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది.
– పి. మోహన్‌ చారి
(నేడు విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్‌ డే)

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.