ఉద్యమాల గడ్డ సిద్ది పేటలో ఉయ్యాలలూగిన బతుకమ్మ


– పండుగ నిర్వహణలో సిద్దిపేటకు ప్రత్యేకత
– సద్దుల బతుకమ్మకు వేదికయ్యే కోమటి చెరువు

సిద్దిపేట : తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేది బతుకుమ్మ పండగ… తెలంగాణ జీవనవిధానంతో విడదీయరాని అన్ని వర్గాల ఆట, పాటే బతుకమ్మ..! ఈ పండుగ నిర్వహణలో వరంగల్‌, సిద్దిపేటలకు ఒక ప్రత్యేకత ఉన్నది. మెదక్‌ జిల్లా సిద్దిపేట తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల పురిటి గడ్డనే కాదు, తెలంగాణ సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ జరుపుకోవడంలోనూ సిద్దిపేటకొక ప్రత్యేకత ఉన్నది. పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మకు వేదిక కోమటి చెరువు.

తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేది బతుకుమ్మ పండగ… తెలంగాణ జీవనవిధానంతో విడదీయరాని అన్ని వర్గాల ఆట, పాటే బతుకమ్మ..! ఈ పండుగ నిర్వహణలో వరంగల్‌, సిద్దిపేటలకు ఒక ప్రత్యేకత ఉంది. మెదక్‌ జిల్లా సిద్దిపేట తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల పురిటి గడ్డనే కాదు, తెలంగాణ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ జరుపుకోవడంలోనూ సిద్దిపేటకొక ప్రత్యేకత ఉంది. పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మకు వేదిక కోమటి చెరువు. పూలతో పేర్చిన బతుకమ్మలన్నింటిని ఒక దగ్గర చేర్చడం… చుట్టూ ఆపడపచులందరూ వలయంగా చేరి కాళ్లు కదుపుతూ లయబద్దంగా చప్పట్లు కొట్టడం.. ఆ శబ్ద వ్యాసానికి అనుగుణంగా ఉయ్యాలో.. గౌరమ్మా.. చందమామ లాంటి పల్లవులతో శ్రుతికలిపి లయబద్దంగా కదులుతూ పాటలు పాడటం.. బతుకమ్మ పండుగ ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడైనా మహిళల ప్రాధాన్యతతో పండుగలున్నాయో లేవో కానీ తెలంగాణకు మాత్రం ఆ గొప్పదనం దక్కుతుంది.
పాశ్చత్య సంస్కృతి ప్రభావంతో మన పండుగలు, కళలు అంతరించిపోతున్న తరుణంలో తెలంగాణ సీ్త్రలంతా వైభవంగా ఆడుకునే, పాడుకునే పండుగ ఇది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణలోని ఊరురా, వాడవాడలా సీ్త్రల పాటల సందడి కనబడుతుంది. ఏటా బాధ్రపద బహుళ అమవాస్య రోజు ప్రారంభమయ్యే ఈ పండుగను ఆడపడుచులు కొన్నిచోట్ల ఏడొద్దులు, చాలా చోట్ల తొమ్మిదొద్దులు (తొమ్మిది రోజులు) వైభవంగా జరుపుకొంటారు. మధ్యలో ఒక రోజు అర్రమి మినహా మిగిలిన రోజులు సీ్త్రలంతా వయోబేధం విడనాడి లయబద్దంగా ఏర్పడి జరుపుకునే పండుగ ప్రధానఘట్టం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

కలుపు మొక్కలతో.. 
బతుకమ్మలను పేర్చడంలో ప్రధానంగా ఉపయోగించే పూలలో అత్యధిక భాగం పంట పొలాలు, బీడు భూములలో కలుపు మొక్కలుగా భావించే వాటివే కావడం గమనార్హం. తంగేడు, గడ్డి, గునుగు, కట్ల, గడ్డి చేమంతి రకాలను ఏ రైతూ ప్రత్యేకంగా పెంచేవి కావు. వర్షాధార పంటల కోతలు పూర్తయ్యాక వదిలేసిన భూములలో లేదా నిరుపయోగంగా ఉండే భూములలో విరిసే సుమాలివి. వ్యవసాయదారుని దృష్టితో చూస్తే బతుకమ్మ పండుగ కలుపుమొక్కలను తొలగించేందుకు ఉపయోగపడేదే. సృష్టిలో వాటి పట్ల చిన్నచూపు తగదన్న దృక్పధాన్ని చాటేందుకు ఈ పండుగ ఉపయోగపడ్తున్నది. అమావాస్య రోజు పేర్చే బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అని పిలుస్తారు. గ్రామాల్లో నివసించేవారే కాదు మెట్టినింటికి వెళ్లిన అడపడుచులు, బతుకుదారిలో వలసవెళ్లిన వారూ ఈ పండుగకు స్వగ్రామానికి చేరుకొంటారు. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ తొమ్మిదొవ రోజైన అక్టోబరు 2వ తేదీ పెద్దఎత్తున పేర్చే సద్దుల బతుకమ్మతో సద్దుమణుగుతుంది.
చౌరస్తాలలో సందడి..

అన్ని గ్రామాల్లోని ప్రధాన చౌరస్తాలు లేదా కూడళ్లలో బతుకమ్మలు చేర్చి మహిళలంతా కూడి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఆటపాటలయ్యాక వాటిని సమీపంలోని చెరువు లేదా కుంటలలో వేస్తారు. అక్కడే లేదా సమీపంలోని అనువైన స్థలంలో మహిళలంతా ఒక్కచోట చేరి సద్దులు పంచుకుంటారు. ఎవరిళ్లలో వండినవి వారు తెచ్చి ఒకరికొకరు పంచుకొని భిన్న రుచులను చవి చూస్తారు. చివరగా సద్దుల బతుకమ్మ రోజు అందరు ఉదయాన్నే గుమ్మడి ఆకులతో వివిధ రకాల పువ్వులతో ఒక్కరికంటే ఒక్కరు పోటిపడి పెద్ద పెద్ద సైజులో బతుకమ్మలు పేరుస్త్తారు. కొందరు తమ ప్రత్యేకతను చాటే రీతిలో వీటిని తీర్చిదిద్దుతారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన దశలో బతుకమ్మలపై తెలంగాణ నినాదాలు చోటు చేసుకోవడం విశేషం. ఈ బతుకమ్మలు పేర్వడానికి తంగెడు, గునుగు, కట్ల, బంతి, చామంతి, పట్టుకుచ్చుల పూలు, గడ్డిపూలతో పాటు, అందుబాటులో ఉండే వివిధ రకాల పూలను ఇందుకు వినియోగిస్తారు. చాలా మంది మహిళలు పట్టుచీరలు లేదా గొప్పగా భావించే చీరలు ధరించి బతుకమ్మ ఆటలో తలమునకలవుతారు. మంగళహారతులతో తొమ్మిదొవ రోజు గౌరమ్మను చేసి చెరువులో ఓలలాడిస్తారు. బతుకమ్మను చెరువులో మెల్లగా వదిలి ‘వెళ్లిరా గౌరమ్మ/బతుకమ్మ మళ్లీ రావమ్మా, మళ్లీ ఏడాదికి తిరిగి రావమ్మా’ అని సాగనంపుతారు. పసుపు గౌరమ్మను నీళ్లలో తడిపి ఒకరికొకరు మహిళలు పసుపును గదవల కింది భాగంలో రాసుకుంటూ తమ పసుపు కుంకుమలు బాగుండాలని వేడుకొంటారు. తర్వాత తెచ్చుకొన్న ప్రసాదాలను ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.

బొడ్డెమ్మ పండుగ
బతుకమ్మ పండుగ కు ముందు బొడ్డెమ్మ పండుగను కన్యలు జరుపుకుంటారు. చెక్కపీటను శుభ్రంగా కడిగి నల్లమట్టితో కాని, ఎర్రమట్టితోగాని ముద్దలు చేసి నాలుగు పక్కల పెడతారు. బియ్యం పిండి కుంకుమ బొట్టు పెడతారు. మట్టి ముద్దలకు రంధ్రాలు చేసి పూలతో అలంకరిస్తారు. ఈ బొడ్డెమ్మను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్త్తారు. ప్రతి రోజు కన్నె పిల్లలంతా సాయంత్రం ఒక చోట చేరి బొడ్డెమ్మ ఉన్న పీఠ నుంచి గుండ్రంగా తిరుగుతూ కోలలు ఆడుతూ పూజిస్తారు. కన్నె పిల్లలు చక్కెర, అటుకులు నైవేద్యంగా తింటారు. ఈ బొడ్డెమ్మని భక్తి శ్రద్దలతో పూజించిన కన్నె పిల్లలకు మంచి భర్తలు దొరుకుతారని ప్రతీతి. బతుకమ్మ, బొడ్డెమ్మల చుట్టూ సీ్త్రలు ఒక క్రమంలో లయబద్దంగా చప్పట్లు కొడుతూ శ్రావ్యంగా పాడే పాటలతో ఆడే విధానం కనుల పండుగను తలపిస్తుంది. ఏ వీధిలో ఆ వీధివారు, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వారు ఊరంతా కొత్తదనం, కోలాహలంతో నిండిపోయే ఏకైక పండుగ ఇది. పేద, ధనిక, తారతమ్యం లేకుండా అంతా తమ స్థాయిని బట్టి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం విశేషం.
కోమటి చెరువుకు కళ…
గ్రామాలు, పట్టణాలలో బతుకమ్మలాడిన తర్వాత సమీపంలోని చెరువులో వేసి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. సిద్దిపేటలో పండుగ చివరి రోజు దాకా అదే విధానం అమలవుతున్నది. సద్దుల బతుకమ్మ పండుగ రోజు మాత్రం సిద్దిపేట పట్టణంతో పాటు సమీప గ్రామాల వారందరి దారి కోమటి చెరువు వైపే. సద్దుల బతుకమ్మలు అలలు అలలుగా ఇక్కడికి తరలివస్తాయి. మహిళలతో పాటు కుటుంబ సభ్యులంతా కోమటి చెరువు వద్దకు చేరుకుంటారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం సద్దులు పంచుకోవడానికి ఆ ప్రాంతం వేదిక అవుతుందిట
బతుకమ్మ పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మకు వేదిక కోమటి చెరువు. పూలతో పేర్చిన బతుకమ్మలన్నింటిని ఒక దగ్గర చేర్చడం… చుట్టూ ఆడపడచు లందరూ వలయంగా చేరి కాళ్లు కదుపుతూ లయబద్దంగా చప్పట్లు కొట్టడం.. ఆ శబ్ద వ్యాసానికి అనుగుణంగా ఉయ్యాలో.. గౌరమ్మా.. చందమామ లాంటి పల్లవులతో శ్రుతికలిపి లయబద్దంగా కదులుతూ పాటలు పాడటం.. బతుకమ్మ పండుగ ప్రత్యేకత.
– కొమురవెల్లి అంజయ్య , సిద్దిపేట

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.