బందరు రామ లింగడు –కే .వై ఎల్ .యెన్ .
ఆయన సన్నగా కుదిమట్టం గా నుదుట ఒకే యెర్ర నిలువుబొట్టు ,తెల్ల పైజా లాల్చీ తో నవ్వుముఖం తో ఎప్పుడూ బందరులో ఏ సభలోనైనా కనిపించి మనుష్యులకు సన్నిహితం అయ్యే వ్యక్తీ .ఆయన హాజరుకాని బందరు సభ దాదాపు ఉండదు .కారణం ఆయన అందరికి సన్నిహితులు .ప్రార్ధన దగ్గరనుంచి జనగణమన వరకు ఓపికగా ఉండే సాహితీ పిపాసకుడు .చక్కని గాత్రం .సంస్క్రుతాన్ద్రాలను కాఛి వడపోసిన వాడు .గొప్ప వక్త .దేనినైనా నవ్వుతూ నవ్విస్తూ చెప్పే నేర్పున్నవాడు .బందరు సాహిత్య సంస్థలన్నిటికీ సన్నిహితుడు .మునిసిపల్ స్కూల్ లో తెలుగు టీచర్ గా దాదాపు రెండేళ్ళ కిందటే రిటైర్ అయ్యాడు .ఆ తర్వాత స్వంత ఇంటిని సమకోర్చుకొన్నాడు .అబ్బాయి వివాహం చేసి అమెరికా పంపాడు .ఎవరేసభకు ఆహ్వానించినా రెక్కలు గట్టుకొని వాలేసరస హృదయుడు స్వర్గీయ కే వై ఎల్ నరసింహా చారి .అంత పెద్ద పేరుతొ ఆయన్ను ఎవరూ పిలవరు .అందరికి కే వై ఎల్ గానే సుపరిచితుడు .
నరసింహం గారు ఎన్ని కవి సమ్మేళనాలలో పాల్గొన్నారో లెక్క వేయటం కష్టం .ఎన్నిఅష్టావధాన శతావదాననాదులలో
పాల్గొన్నారో చెప్టటమూకస్టమే .ఎన్ని సమస్యలిచ్చారో ,ఎన్ని దత్తపదులు అడిగారో ,ఎన్నిచమత్కార సంభాషణలతో ‘’అప్రస్తుత ప్రసంగాలు ‘’చేసి అవధానుల ఏకాగ్రతకు భంగం కలిగించారో కూడా అంతులేదు .సంస్కృత కవులపై ,ఆ కావ్య ,నాటకాలపై ఎన్ని ప్రసంగాలు చేశారో తెలీదు .ఏది చెప్పినా లోతులను చదివి రాగ యుక్తం గా శ్లోకాలు పాడుతూ వివరిస్తూ జీడిపాకాన్ని సైతం రసబంధురం గా మార్చే ప్రతిభ కే వై.ఎల్ యెన్ ది .అలాగే తెలుగు సాహిత్యం పైనా అనితర సాధ్య అభినివేశం ఉంది .వీటిపైనా గొప్పగా మాట్లాడే నేర్పున్న వారు .చక్కని సంభాషణా చతురుడు .శ్లోకాలు ,పద్యాలు నోటిపై నర్తిస్తాయి .ఒక రకం గా సరస్వతీ పుత్రుడు .
ఆయనతో నేను చాలా అవధానాలలో పాల్గొన్నాను .రావి రంగారావు గారు నిర్వహించిన అనేక అవధానాలలో ఇద్దరం పాల్గొన్నాం .తరచూ బందరు సభలలోను ,కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన అనేక కార్యక్రమాలలో కలుసుకోన్నాం .గుడివాడలో కోట ,కరిమేళ్ళ జంట శతావధానం లో ఇద్దరం అప్రస్తుత ప్రసంగం చేశాం .తన సరససల్లాపాలలతో అందరికి చేరువయ్యేవాడు .ఎకువ సభల్లో ప్రార్ధన ఆయనే చేసేవాడు .మాదుర్యమైన కంఠంతో పరవశం కల్పించేవాడు .అదీ ఆయన ప్రత్యేకత .
2013మార్చి లో అనుకుంటా కృష్ణా జిల్లా రచయితల సంఘం విజయవాడ లో ఏర్పాటు చేసిన సభలో శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు కే వైఎల్ యెన్ ను బందరు నుంచి ప్రత్యేకం గా ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూదండ ‘’ప్రార్ధన గీతాన్ని పాడటానికి బందరు నుంచిప్రత్యేకం గా పిలి పించారు .అద్భుతం గా గానం చేసి అందరిని మైమరపించారు .ఆ తర్వాత ఒక వారం లో ఉయ్యూరు లో సరసభారతి ఏర్పాటు చేసిన ‘’ఉగాది కవి సమ్మేళనం ‘’కార్యక్రమ ఆహ్వానాన్ని అందించాను .ఆయన ఏంతో సంతోషించి,ఫోన్ నంబర్ ఇచ్చి తప్పక వస్తానని చెప్పారు. ఆహ్వానం లో అయన పేరులేక పోయినా ఆయన వచ్చి పాల్గొని మంచికవిత రాసి కమ్మని గాత్రం తో వినిపించి అందరి అభిమానాన్ని పొందారు .ఇదే మొదటిసారిగా ఆయన మా సభల్లో పాల్గొనటం కాని సరసభారతి కార్యక్రమాలన్నీ పేపర్లలో చూస్తూనే ఉంటానన్నారు .మా కార్యక్రమాలలో వక్త గా ఆహ్వానిస్తాం వచ్చి మాట్లడమన్నాను .సరేనన్నారు .జూన్ లో జరిగిన శ్రీ హనుమజ్జయంతికి ఒక ఉపన్యాసం ఇమ్మని ఫోన్ చేశాను .వాళ్ళ అబ్బాయివివాహం ,కొత్త దంపతుల అమెరికా ప్రయాణం వలన రాలేక పోతున్నానని వినయం గా చెప్పారు .సరేనన్నాను ఇంకోసారి ఆహ్వానిస్తాను రావాలి అన్నాను .అలాగా అన్నారు .
2014శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో ’వివాహం దాంపత్యం ‘’శీర్షికన జరిగిన కవి సమ్మేళనానికి కే వై.ఎల్ ను ఆహ్వానించి వస్తానంటే ,ఆహ్వానం లో పేరు చేర్చాను .మాట నిలబెట్టుకొని వచ్చాడు .మొదట అవకాశం తనకే ఇవ్వమంటే ఇచ్చాము .సుదీర్ఘ పాట పాడారు .ఆలస్యమై పోతోందని డిన్నర్ చేయకుండా వెళ్ళిపోయారు .అదే చివరి సారి నరసింహ దర్శనం .2014జూన్ లో లో శ్ హనుమజ్జయంతికి మళ్ళీ ఆహ్వానించా .ఆయన భార్య ఫోన్ లో మాట్లాడి ఆయన రోజూ బెజవాడ వెళ్లి రాత్రికి చాలా పొద్దుపోయే దాకా రావటం లేదని ,ఉదయాన్నే వెళ్ళిపోతున్నారని చెప్పారు .సెల్ నంబర్ ఉందా అని అడిగితె లేదని చెప్పారు .అంటే లాండ్ లైన్ మీదనే ఆయన కాలక్షేపం చేస్తున్నట్లు అర్ధమయింది .ఒకటి రెండు సార్లు ప్రయత్నించి విరమించుకొన్నాను .
ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం సరసభారతి డెబ్భై వ సమావేశం లో శ్రీ శీలా వీర్రాజు గారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)ఏర్పాటు చేసిన ‘’బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’సరసభారతి ద్వారా అందజేసిన సభలో నరసింహం గారు కనిపిస్తారేమో నని ఎదురు చూశాను .కాని కనిపించలేదు .అలాగే ఉండే ఒక వ్యక్తీ సభ చివరలో వెడుతున్నట్లు చూశాను .బహుశా ఆయనే ఏ వై ఎల్ యెన్ అని అనుమానించాను .ఇవాళ సరసభారతి మింట్ బుక్ చూస్తె అందులో ఆయన సంతకం లేదు .కనుక రాలేదని అనిపించింది .
ఆ తర్వాత కిందటివారం మధ్యలో శ్రీ కే వై ఎల్ యెన్ మరణించారని ఆంద్ర జ్యోతి లో వార్తచూశాను .చాలా బాధ అనిపించింది .సంస్కారి ,సాహితీ పిపాసి ,వక్త ,సంస్క్రుతాన్ద్రాలలో దిట్ట,సరసుడు ,హాస్య వినోది ,జన రంజకుడు ,సుస్వర గాత్రం తో మంత్రం ముగ్ధులను చేసే గాయకుడు బందరు ప్రజలను వదిలేసి తన దారి తాను చూసుకొన్నాడు .ఆయన్ను అందరూ ఉపయోగించుకోన్నారేకాని ,ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదని నాకు అనిపిస్తుంది .ఇది నాభ్రమ కూడా కావచ్చు .ఆ సాహితీ జీవి ఆత్మకు శాంతికలగాలని ,వారి కుటుంబం ఈ దుఖాన్ని అధిగమించి ముందుకు సాగే ధైర్య స్తైర్యాలు ఆ పర మేశ్వరుడు కలిగించాలని నా తరఫునా సరస భారతి తరఫునా కోరుతున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి –ఉయ్యూరు – 30—9-14-

