తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ
Posted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్
సాంఘిక సేవా రంగంలోనూ భారత స్వాతంత్రోద్యమంలోను చురుకుగా పాల్గొని విద్యా రంగానికి ,మహిళా సంక్షేమానికియేన లేని సేవలందించి, తొలి జంట కవయిత్రిగా పేరొందిన శ్రీమతి పొనకా కనకమ్మ గారు చిరస్మరణీయులు .వారి జీవితం ఆదర్శ ప్రాయం .
పొనకా కనకమ్మ గారు నెల్లూరు జిల్లా మీనగల్లు గ్రామం లో 10-6-1892 న జన్మించారు .తండ్రి మరుపూరు కొండారెడ్డి. తల్లి కామమ్మ .మంచి సంపన్న స్థితిలోని కుటుంబానికి చెందినవారు .చిన్నతనం లోనే బాల్య వివాహం జరిగింది .ఆమె అప్పటిదాకా పెద్దగా ఏమీ చదువుకోనట్లే లెక్క .స్వయం కృషితో ఆంద్ర ,ఆంగ్ల ,సంస్కృతాలను నేర్చి పాండిత్యాన్ని సాధించిన విదుషీమణి .సమాజ ఉద్ధరణ ఆమె జేవిత ధ్యేయం గా ఎంచుకొన్నారు .1913లో నెల్లూరు కు దగ్గరలలో ఉన్నపొట్ల పూడి గ్రామం లో ‘’సుజన రంజని సమాజం ‘’ అనే సేవా సంస్థను స్థాపించి అర్హులకు సేవలు అంద జేశారు .ముఖ్యంగా హరిజనులకు ,సమాజం లో అట్టడుగున ఉన్న దీనులకు ఉన్నత స్తితికల్పించటం లో ఆమె సేవలు సఫలమయ్యాయి .వారి జీవితాలను చీకటినుండి వెలుగు లోకి తెచ్చి సఫలీ క్రుతురాలైనారు కనకమ్మ గారు .ఆ ఏడాదే ఆమె స్నేహితులందరూ కలిసి నెల్లూరు రామానాయుడు వంటి వితరణ శీలుర ప్రోత్సాహం తో కొత్తూరు గ్రామం లో ‘’వివేకానంద గ్రంధాలయం ‘’ఏర్పాటు చేసి పుస్తకాలతో విశ్వదర్శనం చేయటానికి గొప్ప అవకాశం కల్పించారు .కనకమ్మ గారు కొద్దికాలం అతివాద భావాలకు లోనై పని చేశారు .కాని ఆ మార్గాన్ని మరల్చుకొని జాతీయోద్యమం లో మహాత్మా గాంధీ గారి శిష్యురాలై భారత స్వాతంత్రోద్యమం లో గణనీయంగా తన వంతు సేవలు అందించారు .
కనకమ్మ గారి సేవా దృక్పధాన్ని గుర్తించిన మహాత్మా గాంధీ నెల్లూరు కు పదికిలో మీటర్ల దూరం లో ఉన్న పల్లి పాడు గ్రామం లో స్థాపించిన ‘’పినాకినీ సేవాశ్రమం ‘’ను 7-4-1921న తన అమృత హస్తాలతో ఆవిష్కరించారు .చతుర్వేదుల కృష్ణయ్య ,దిగుమర్తి హనుమంతరావు మొదలైన వితరణ శీలురు ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి కనకమ్మ గారు తన వంతు సహకారం గా 13 ఎకరాల భూమిని దానం గా ఇచ్చి ప్రోత్సహించారు .మహాత్ముడు ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం లోను ,సహాయ నిరాకరణ ఉద్యమం లోను చురుకుగా పాల్గొని భారత దేశ దాస్య విముక్తికి తోడ్పడ్డారు .దీనికి ప్రతిఫలం గా రెండు సార్లు రాయ వెల్లూర్ జైలుకు వెళ్లి కఠిన కారాగార శిక్ష అనుభ వించారు .1907 లో పాల్ త్రయం లో ఒకరైన బిపిన్ చంద్ర పాల్ నెల్లూరు వచ్చినప్పుడు తమ ఇంట ఆతిధ్యమిచ్చారు కనకమ్మ గారు .
గాంధీ గారి సాంఘిక సేవాకార్యక్రమం లో భాగం గా కనకమ్మ గారు నెల్లూరులో ‘’కస్తూరి దేవి విద్యాలయాన్ని ‘’బాలికల కోసం 1923లో స్థాపించారు .దీని శాశ్వత భవన నిర్మాణానికి బాపూజీ 1929లో వచ్చి శంకు స్థాపన చేయటం విశేషం .ఈ విద్యాలయాన్ని తరువాత 23ఎకరాల సువిశాల క్షేత్రం విస్తరింప జేసి ,చిరస్మరణీయం చేశారు కనకమ్మ గారు . కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొంటూ సమాజ సేవ ను అంద జేశారు ..కొంతకాలం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు . ఆంద్ర కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలైనారు .కనకమ్మ గారిఒక్కగానొక్క కూతురు ప్రముఖ రచయిత్రి సంఘ సేవకురాలు శ్రీమతి వెంకట సుబ్బమ్మ ఆకాలమరణం చెందింది .దీనితో కనకమ్మ గారిలో కొంత విరక్తిభావం ఏర్పడింది .మనశ్శాంతి కోసం భగవాన్ రమణ మహర్షి శిష్యురాలైనది .అన్నారెడ్డి పాలానికి చెందిన రామ యోగి వద్ద ఆధ్యాత్మ సాధన చేసింది .
ఆంధ్రదేశం లో తోలి జంట మహిళా కవులు పొనకాల కనకమ్మ ,మరియు ద్రోణం రాజు లక్ష్మీ బాయమ్మలు .వీరి జంట కవిత్వం ఎందరినో ఆనాడు అలరించి ,ఆదర్శం గా నిలిచి ప్రేరణ నిచ్చింది .ఇద్దరూ కలిసి రమణ మహర్షి పై అనేక ఆధ్యాత్మిక తాత్విక కవితల గ్రంధాలు రాశారు .అందులో ముఖ్యమైనవి ‘’ఆరాధన ‘’మరియు ‘’నైవేద్యం ‘’పుస్తకాలు .ఈ జంట స్త్రీకవులు భగవద్ గీతను ‘’జ్ఞాన నేత్రం ‘’పేరుతొ అద్భుతం గా అనువాదం చేసి మహర్షికి మహదానందం కలిగించారు .కనకమ్మ గారు రామయోగి గారి జీవిత చరిత్రను తెలుగులోనూ ,ఆంగ్లం లోను రాసి అందర్నీ మెప్పించి వారిపై తనకున్న ఆరాధనా భక్తిని చాటుకొన్నారు .నెల్లూరు లో జమీందారీ రైతు ఉద్యమానికి బాసట గా ‘కనకమ్మ గారు ‘’జమీన్ రైతు ‘’అనే వార పత్రిక ప్రారంభించి నడిపారు .వెంకట గిరి జమీందార్ దీనికి కినిసి ,పగబట్టి ,కసితో హింసా దౌర్జన్యాలతో ఆమె ఆస్తులన్నిటిని లాగేసుకొన్నాడు .ఆర్ధికం గా ఆమె చాలా కోల్పోయింది .
కనకమ్మ గారు రాసిన అనేక కధలు ,కవితలు, వ్యాసాలూ అనసూయ ,గృహ లక్ష్మి ,హిందూ సుందరి ,భారతి ,జమీన్ రైతు మొదలైన పత్రికలో ముద్రింప బడేవి .పత్రికలకు విరివిగా రాసేవారుకనకమ్మ గారు. సమాజం లో వెనక బడిన స్త్రీల అభ్యుదయం కోసం ‘’పారిశ్రామిక శిక్షణా కేంద్రం ‘’ఏర్పాటు చేశారు కనకమ్మ గారు .స్వగ్రామం పొట్ల పూడిలో ని స్వగృహం లో కనకమ్మ గారు ఎందరెందరో స్వాతంత్ర సమరయోధులకు ,ప్రముఖ నాయకులకు కవులకు కళా కారులకు ఆతిధ్యమిచ్చి ఆదరించి గౌరవించారు .మద్రాస్ లోని ఆంధ్రమహిళా సభ రజతోత్సవాలలో సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి దుర్గా బాయి దేశముఖ్ గారు కనకమ్మ గారిని ఆహ్వానించి సన్మానించి వెండిపళ్ళెం కానుక గా ఇచ్చి గౌరవించారు .కనకమ్మ గారు ‘’గృహ లక్ష్మి స్వర్ణ కంకణ ‘’సన్మానాన్ని పొందారు .71 ఏళ్ళు సార్ధక జీవితాన్ని గడిపి పొనకా కనకమ్మ గారు 15-9-1963న మరణించారు .2011లో కనకమ్మ గారు రాసిన స్వీయ జీవిత చరిత్ర’’కనక పుష్యరాగం ‘’గ్రంధాన్ని డాక్టర్ కపిల పురుషోత్తం గారు ఆవిష్కరించి ఆంద్ర జనులకు అందజేశారు .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

