నా దారి తీరు -77 గారెల హెడ్మాస్టారు

నా దారి తీరు -77

గారెల హెడ్మాస్టారు

పామర్రు లో మా హెడ్ మాస్టారు హయగ్రీవం గారు .తెల్లని మల్లు పంచె ,పైన తెల్ల చొక్కా ఉత్తరీయం తో కుదిమట్టం గా లావుగా మధ్యరకం భారీ పర్సనాలిటి. అంతపడవూకాదు పొట్టీ కాదు .లావుకు తగినట్లు ఉంటారు .కొంచెం గండ్ర ముఖం .వెడల్పు ముఖం .త్వర త్వరగా మాట్లాడుతారు .ఇంగ్లీష్ లో మాంచి దిట్ట .గొప్ప డ్రాఫ్ట్ రైటర్ అని పేరుంది .ఎక్కడా ఇరుక్కోకుండా , చేతికి మట్టి అంటకుండా  కార్య సాఫాల్యత చేస్తారు .నాతొ బాటు ఉయ్యూరులో  పని చేసిన క్రాఫ్ట్ మేష్టారు కోడె రామ మోహన రావు కూడా పామర్రు బదిలీ మీద వచ్చి చేరాడు .ఇద్దరం ఉయ్యూరు నుండే వచ్చేవాళ్ళం బస్ లో .మధ్యాహ్నం టిఫిన్ ఇంటి నుంచి తెచ్చుకోటమో  లేక రామ మోహన్ హోటల్ లో తినటం చేసేవాళ్ళం .సరదాగా గడిచిపోతోంది .కొడాలి రంగారావు అనే డ్రిల్ మాస్టర్ ఇక్కడ రింగ్ లీడర్ .కాంగ్రెస్ నాయకుడు  ఎలమర్రు వాసి కొడాలి జగన్మోహన రావు గారి తమ్ముడు .అందరూ ఆయనంటే భయ పడేవారు .ట్రాన్స్ ఫర్ చేయించటానికి రాజకీయం గా పలుకు బడి ఉపయోగించి చేయించేవాడు .నాకు ఆతను మెత్తని కత్తి అనిపించేది .అతనితో చాలా జాగ్రత్త గా ఉండాలని అందరూ చెప్పేవారు .తెలీకుండా కాటా దెబ్బ కొట్టే రకం .

బదిలీ అయిన వారికి టీపార్టీ లు బాగా జరిగేవి .డ్రిల్ మాస్టారు జ్ఞానేశ్వర రావు స్టాఫ్ సెక్రెటరి గా ఉండేవాడని గుర్తు .ఒక కాలు కుంటి ఉన్న సోమి రెడ్డి అనే డ్రిల్ మాస్టారు ,కురుమద్దాలి నుంచి వచ్చే సుబ్బారావు అనే లావుపాటి మాటకారి డ్రిల్ మాస్టారు ,ఎప్పుడూ ‘’మందులో ‘’ఉండే బలరాం అనే డ్రిల్ మాస్టారు ,శామ్యూల్ ?అనే ‘’మందు’’ డ్రిల్ మాస్టారు ఉండేవారు .ఇందులో సుబ్బారావు ఎనమల రామ కృష్ణుడికి వియ్యంకుడునని చెప్పేవాడు .గుడివాడలో కాంగ్రెస్ నాయకుడు కఠారి సత్యనారాయంతో దోస్తీ ఎక్కువ .సంస్కృతానికి సూరపనేని ఆనంద రావు గారు ఉర్దూకి షరీఫ్ గారు ?ఉండేవారు .తెలుగుకు కొడాలి నుంచి రోజూ వచ్చే సుబ్బయ్య శాస్త్రిగారు ,పామర్రు వాసి కొడాలి గాంధి గారు ,హిందీకి సుందరమ్మ గారు జూనియర్ తెలుగు పండిట్ సీతామహా లక్ష్మి గారు ,సైన్స్ కు నాతొ బాటు నరసయ్య గారు పామర్రు వాసి  నందిపాటి వీరా రెడ్డి గారు ,లెక్కలకు పొద్దుటూరు ఆయన వెంకటేశ్వరరావు ,జగదీశ్ ,బొమ్మారెడ్డి అంజిరెడ్డి ,,కోడాలినున్చివచ్చే వెంకటేశ్వరరావు వగైరా ఉండేవారు .దాదాపు అందరూ యంగ్ బాచ్ .అష్టపడి పని చేసేవాళ్ళే. సోషల్ కు గూడూరు ఆచార్యులుగారు ,రాళ్ళబండి సాంబశివరావు గారు కొండిపర్రు రాధాకృష్ణ మూర్తిగారు ,గోపాల క్రిష్నయ్య ,కురుమద్దాలి శివరామ క్రిష్నయ్య  గారు మాతో పని చేశారు .

హయగ్రీవం గారు మంచివారే .కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్లు కనిపించేవారు .మాట గట్టిదేకాని మనసు మెత్తన .ఒక ఆదివారం ఉయ్యూరులో మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాను .భోజనానికి రాలేదు కాని మధ్యాహ్నం మూడింటికి వచ్చారు .మా శ్రీమతి అప్పటికప్పుడు మినపపప్పు రుబ్బి వేడి వేడిగా గారెలు చేసింది .ఆరగా ఆరగా దాదాపు ఇరవై దాకా లాగించి ఉంటారు .అల్లం చట్నీ ,మామూలు చట్నీ కూడా చేసింది .అందుకనే మా ఆవిడ ఆయననను గుర్తు చేసుకోన్నప్పుడల్లా ‘’గారెల హెడ్ మాస్టారు ‘’అనేది .అదే ఇంట్లో పేరుగా మారిపోయింది . మా ఆవిడకు థాంక్స్  చెప్పి మంచి టీ తాగి వెళ్ళారు .ఆ గారెల రుచి ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు .వీలైనప్పుడల్లా ‘’ఏమయ్యా ప్రసాద్ !మీ శ్రీమతి ఆ రోజు చేసిన గారెలు జీవితం లో మర్చిపోలేనయ్యా .అంత రుచిగా ఉన్నాయి .థాంక్స్ చెప్పు ‘’అనేవారు.చిరునవ్వు నవ్వేవాడిని .ప్రతి సోమవారం టీచింగ్ నోట్స్ అంటే లెసన్ ప్లాన్ చూపించి హెడ్ మాస్టారితో సంతకం పెట్టిన్చుకోవాలి . స్కూల్ వేసవి సెలవల తరువాత  తెరవగా నే ప్రతిసోమవారం రాసి చూపించేవాడిని .రెండు నెలల తర్వాత బద్ధకం వచ్చేది .ఇక రాయటం తగ్గించేసి ఎస్కేప్ అయ్యేవాడిని .ఆయన నాతొ చాలా చనువుతో ఉండేవారు . అందుకని నెమ్మదిగా రూమ్ లోకి ఎవరూ లేనప్పుడు పిలిచి ‘’ఏమయ్యా!నువ్వు ఏదో బుద్ధిమంతుడివి అనుకొన్నా .మొదట్లో లెసన్ ప్లాన్ రెగ్యులర్ గా చూపించేవాడివి .ఈ మధ్య రాయటం లేదేమటయ్యా ?కాస్త రాయవయ్యా .నువ్వే రాయక పొతే మిగతా వాళ్లకు నేనేం చెప్పను?’’అని బతిమాలేడేవారు .’’సారీ మాస్టారూ !ఈ వారం నుంచి రెగ్యులర్ గా రాసి చూపిస్తా ‘’అనేవాడిని .మళ్ళీ రెండుమూడు వారాలు రాసి డుమ్మా కొట్ట్టే వాడిని .ఇది హయగ్రీవం గారి దగ్గరేకాదు ఏ హెడ్ మాస్టారి దగ్గరైనా నేను అలానే చేసేవాడిని .రాసిన దానికంటే బాగా బోధిస్తానని గ్రహించి ఎవరూ పెద్దగా పట్టించుకొనే వారుకాదు .అసలు రాయకుండా ఎప్పుడూ లేను .ఇన్స్పెక్షన్ ముందు చాలా పకడ్బందీ గా రాసేవాడిని .అందరూ మేచ్చు కోనేవారు మోడల్ లెసన్ ప్లాన్ అనే వారు ..ప్రతిదీ డిటైల్ గా రాసేవాడిని .ఆ తర్వాత మళ్ళీ కద మామూలే .హయగ్రీవం గారు కొద్దికాలం తర్వాత కొండపల్లి కి ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోయారు .

ఉద్యోగుల జీతాలు మింగేసిన గుమాస్తా

హయగ్రీవం గారి తర్వాత కే వి వి ఎస్ శర్మ గారు అనే హెడ్ మాస్టారు ప్రమోషన్ మీద వచ్చారు .సాధువు .ఇంతపెద్ద హైస్కూల్ లో ఆయన పని చేయటం ఇబ్బందే అనిపించింది .కొంచెం చామన చాయగా పొడుగ్గా సరిపడా ఒంటితో పంచా చోక్కా తో ఉండేవారు .ఆఫీసుస్టాఫ్ లో  సీనియర్ గుమాస్తా  నెల్లూరు యాసమాట్లాడే ఆయన  ఉండేవాడు .పంచ ,చొక్కా తో రమణా రెడ్డి లాగా ఉండేవాడు .మంచి సాహితీ ప్రియుడు .నేనూ సుబ్బయ్య మేష్టారు ఆయనతో ఖాళీ ఉన్నప్పుడల్లా సాహితీ గోష్టి జరిపేవాళ్ళం .చాలా కబురుర్లు చెప్పేవాడు .మంచిసాహిత్య జ్ఞానం ఉన్నవాడే ..ఒకసారి నెల్లూరి యాసాయన  జీతాల చెక్ మార్చి కొంతమందికి జీతాలు ఇచ్చి మిగిలిన డబ్బుతో పరారయ్యాడు .నేనూ క్రాఫ్ట్ రామ్మోహన్ ఎందుకో ముందే జీతం తీసుకొన్నాం .మిగిలిన వాళ్ళు ల్లబో దిబో .పెద్ద కేసు అయింది .హెడ్ మాస్టార్ని సస్పెండ్ చేశారు .పోలీసు కేసు పెట్టారు పారిపోయిన గుమాస్తాకోసం గాలింపు సాగించారు .కొన్ని నెలలకు పట్టుబడ్డాడు. జైల్లో పెట్టారని తెలిసింది .ఇవ్వాల్సిన జీతం బాకీలు హెడ్ మాస్తారైన శర్మ గారి నుంచి ముందు వసూలు చేయించి స్టాఫ్ కు ఇప్పించింది జిల్లా పరిషత్ .పాపం శర్మగారికి ఇందులో ఏ సంబంధ లేదు .చెక్ మార్చి సాధారణం గా గుమాస్తాకు డబ్బు అప్పగించటం అందరు హెడ్ మాస్టర్లూ  చేసేపని. శర్మ గారుకూడా పాపం అలానే చేశారు .ఎరక్క పోయి ఇరుకు పోయారు .ఆరు నెలలు కేసు మీద ఎంక్వైరీ జరిగింది శర్మ గారు డబ్బున్న వారు కాదు .స్టాఫ్ మీటింగ్ పెట్టి తన గోడు వెళ్ళ బోసుకొన్నారు .సాయం చేయమన్నారు .కాని ఎవరూ కనికరం  చూపలేదు .ఆర్దికసాయానికి ముందుకు రాలేదు. ఉన్నబంగారం అమ్మి ఎక్డో  తంటాలు పడి  డబ్బు తెచ్చి సుమారు యాభై వేలకు పైనే బకాయి జీతాల డబ్బు అంతా కట్టేశారు .కేసు తేలి ఆయన ఉద్యోగం ఎప్పుడో మళ్ళీ ఇచ్చేశారు వేరే చోట .అప్పటినుంచి హెడ్ మాస్టర్లు దగ్గరుండి జీతాలు బట్వాడా చేయటం ప్రారంభించారు .న్యాయం గా ఇది నమ్మకం మీద జరిగే వ్యవహారం .ఎవడో అలాంటి వాడుఒకడు ఉంటాడు .అలాంటి వాళ్ళ వాళ్ళ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది నమ్మకానికి విలువ లేకుండా పోతుంది .

సశేషం

దసరా శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.