కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు
- 29/09/2014
8-9-2014 సాహితిలో జయధీర్ తిరుమలరావుగారు ‘లెజండరీ పోయట్’ అనే వ్యాసంలో కాళోజీ గురించి రాస్తూ ఆఖరున ఒక వ్యాఖ్య చేసిన్రు. ‘‘కాళోజీ పీఠం పేర శుష్క అభిమాన దళం మూగి ఉంది. డికాస్టిఫై ఐన కాళోజీ ఇప్పుడు భద్రపురుషుల చేతుల్లో బందీ. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అన్ని వర్గాలవారు సొంతం చేసుకోలేకపోతున్నారు. కాళోజీ పేర ఇచ్చే అవార్డులు కాళోజీ యిజాన్ని వ్యతిరేకించే వారికి ఇవ్వడం విషాదం’’. ఇంకా..
కాళోజీ ఫౌండేషన్ కాళోజీ బతికున్నప్పుడే 1996లో ఆయన అనుమతి ఆశీస్సులతో ఏర్పడ్డదే. అందులో శుష్క అభిమానులున్నారో లేరో కాళేజీకి నాడే తెలుసు. ఇక ఆయన్ను అన్ని జిల్లాలవారు సొంతం చేసుకోలేకపోతున్నారన్నమాట. ఇదివరకు ఒక కాళోజీ జయంతి సభలో కాళోజీ ఫౌండేషన్ అన్నమాట కాళోజీ ఎవరి పేటెంటూ కాదు. ఎవరికి వారు కాళోజీని వాడుకున్నారు అవసరమున్నప్పుడు. వారు సొంతం చేసుకుంటే అడ్డుకున్నవారు గానీ, కాపీరైటున్నదన్నవారు గానీ లేరు. అనలేరు కూడా. వారు ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నారో వారే ఇంకోసారి ఆలోచించుకోవాలె.
ఇక పురస్కారాల సంగతి. మూడు ఏండ్లనుంచే ఫౌండేషన్ ఈ పురస్కారాలు ఇస్తున్నది. మొట్టమొదటి పురస్కారం ప్రముఖ సాహితీవేత్త సంగీతంలోనూ, ఆంగ్ల సంస్కృత సాహిత్యంలోనూ పండితుడు సామల సదాశివ (ఆదిలాబాద్)గారికి ఇచ్చినం. రెండో పురస్కారం మాజీ ఎం.ఎల్.సి. చుక్కా రామయ్య సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నవాడు. విద్యారంగానికి విశేష సేవ చేస్తున్నవాడు. మూడో ఏడు డా.రామక లక్ష్మణమూర్తి, వైద్య రంగానికి చెందిన వారికి, వరంగల్‌లో ఈయన తెలియనివారూ ఈయన సేవాభావం తెలువని వారూ ఉండరన్న సంగతి వరంగల్ వాసి తిరుమలరావుగారికే తెలుసు. ఈ నాలుగో సంవత్సరం జస్టిస్ సుదర్శనరెడ్డిగారికి ఇవ్వాలని కార్యవర్గం నిర్ణయించింది. న్యాయమూర్తి సుదర్శనరెడ్డిగారి గురించి దేశమంతటా తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఆయన తీర్పులు జనానికి తెలిసిందే. ఇందులో కాళోజీ వ్యతిరేకులెవరో తిర్మలరావుగారు తెలిపితే బాగుండేది.
ఫౌండేషన్ ఏర్పడ్డ ఈ 18 ఏండ్లల్లో తనకున్న పరిమిత వనరులతో, అభిమానుల మిత్రుల సహకారంతో నాలుగైదు పుస్తకాలను ముద్రించింది. ఆయన కవితలను హిందీ అకాడెమీ ద్వారా, హిందీలోకి అనువదించటంలో సహకరించింది. ఆయన కథలు హిందీ అనువాదాలు అచ్చులో ఉన్నాయి. హిందీ అకాడెమీలో కాళోజీని గుర్తుచేసుకుంటానికి తెలుసుకుంటానికీ సమావేశాలు ఏర్పాటుచేస్తునే ఉన్నది. ఇతరులెవ్వరినీ కాళోజీ విషయంలో శాసించే స్థితిలో ఫౌండేషన్ లేదు. సొంతం చేసుకోదల్చుకున్నవారికి అడ్డం పడిందీ లేదు. వారికున్న అడ్డంకులేమిటో వారికే తెల్వాలె.
కాళోజీ శత జయంతి సందర్భంగా ఐదారు విశ్వవిద్యాలయాలల్లో దాదాపు రెండు మూడు వందల విద్యాసంస్థల్లో కాళోజీ గురించిన సమావేశాలు జరిగినయి. వీళ్ళందరూ కాళోజీని సొంతం చేసుకోబట్టే గదా సమావేశాలు పెట్టుకొని కాళోజీని తల్చుకున్నారు, తెల్సుకున్నారు. వీళ్ళనెవ్వర్నైనా ఎందుకడ్డుకుంటారు!
కాళోజీ ఫౌండేషన్ పీఠం కాదు. ఆ పీఠాల నిర్వహణ తెలువదు మాకు. ఇక్కడ కాళోజీ అన్నమాట ఒకటి గుర్తుచేస్తా, ‘‘మీకు ఎవరికైనా తలంటి పోయాలనుంటే పోయండి, ఇంకొకని మీద దుమ్ముపోయకండి.’’
– నాగిళ్ళ రామశాస్ర్తీ
అధ్యక్షుడు, కాళోజీ ఫౌండేషన్, వరంగల్

