|
గీతామాధురి, మహ్మద్ ఇర్ఫాన్, కారుణ్య, హేమచంద్ర, దీపు, కృష్ణచైతన్య… ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పేర్లు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ గాయనీగాయకులుగా వెలిగిపోతున్నారు. ఇలాగే మరెన్నో గొంతులు సినీ పాటల పూదోటలో విహరిస్తున్నాయి. బుల్లితెరమీదా తమ ప్రతిభను చాటుతున్నాయి. ఇన్ని సుమధుర గళాలు తయారైందెక్కడో తెలుసా… మన హైదరాబాద్‌లోనే. వీళ్లని తయారుచేసిన ఘనత మాత్రం ఒకేఒక్కరికి చెందుతుంది. ఆయనే కొమాండూరి రామాచారి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన సంగీత ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెట్టకుండా సాగిపోతున్న నిత్యకృషీవలుడు. ఆయన పాటల ప్రయాణం గురించి…
అకాడమీ ప్రారంభించినప్పుడు లైట్ మ్యూజిక్ నేర్పించడమేంటి అన్నారు. ఉచితంగా ఎన్నాళ్లు నేర్పించగలరు అన్నారు. ఎలా నిలదొక్కుకుంటాడో చూద్దాం అన్న వారూ ఉన్నారు. అయితే ఆ మాటలు నన్ను నిరుత్సాహపరచలేదు. వాటన్నింటినీ సలహాలుగానే తీసుకున్నాను. అకాడమీ ప్రారంభించిన మూడేళ్లలోనే మంచి సక్సెస్ సాధించాను. మా అకాడమీ మొదటి బ్యాచ్‌లో మహమ్మద్ ఇర్ఫాన్, కారుణ్య, హేమచంద్ర, దీపు, ఆ తరువాతి బ్యాచ్‌లో గీతామాధురి, కృష్ణచైతన్య తదితరులు ఉన్నారు. ఆల్‌సెయింట్ స్కూల్లో టీచర్‌గా పన్నెండేళ్లు పనిచేశాను. స్కూల్లో పనిచేస్తూనే పాటలు పాడేవాడ్ని. సినీ నేపథ్యగాయనీగాయకుల్లో ఇప్పుడు ఎక్కువమంది ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లే. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకి మాత్రమే శిక్షణ ఇచ్చి… వాళ్లు సంగీతాన్ని కెరీర్‌గా మలచుకునేలా తీర్చిదిద్దుతారాయన. గాయకుడిగా నిలదొక్కుకుంటున్న రోజుల్లోనే చిన్నారులకు సంగీత శిక్షణ ఇవ్వాలనుకున్నారాయన. ఈ ఆలోచన ఎందుకువచ్చింది? గాయకుడిగా స్థిరపడాలనుకోలేదా? అని ‘నవ్య’ అడిగితే ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారాయన..
‘‘నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా శివంపేట్ మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామంలో. పదో తరగతి వరకు అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నా బాల్యం మోటబావి, ప్రకృతి ఒడిలో గడిచిపోయింది. చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలు విని నేర్చుకునేవాడ్ని. మా నాన్న కీర్తిశేషులు కొమాండూరి కృష్ణమాచార్యులు. ఆయన పౌరోహిత్యం, అర్చకత్వం రెండూ చేసేవారు. హరికథలు కూడా చెప్పేవారు. అమ్మ పేరు యశోదమ్మ. మంగళ హారతులు ఎంతో శ్రావ్యంగా పాడేవారు. సంగీతం పట్ల ఆసక్తి కలగడానికి మా తల్లిదండ్రులు కొంతవరకు కారణం. నేను స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కోసం మా ఊరికి కొందరు ప్రభుత్వాధికారులు వచ్చేవారు. వాళ్లు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో నేను పాటలు పాడేవాడ్ని. అలా పాడుతున్నప్పుడు ఆ అధికారుల్లో ఒకరైన భారతి గారు నా గొంతును మెచ్చుకుని సంగీతం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అదే విషయాన్ని నాన్నకి చెప్పాను. బాగా చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని నీకు నచ్చింది చెయ్యి అన్నారు. కాని నాకేమో సంగీతం అంటే ఇష్టం. పదో తరగతి ఫెయిల్ అయ్యాను. ఖాళీగా ఉండడం ఇష్టంలేక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. సంగీతం నేర్చుకుంటూనే పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాను. ఇంటర్మీడియెట్ మేడ్చల్‌లో చదువుకున్నాను. అప్పుడే సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరాను.
ప్రోత్సహించిన ఆకాశవాణి స్టార్‌ని చేసిన దూరదర్శన్
రేడియో తరువాత దూరదర్శన్‌లో పాడడం మొదలుపెట్టాను. అది నాకు స్టార్‌డమ్ తెచ్చింది. ఆ తరువాత కొన్నాళ్లకు దక్షిణాదిలోనే మొదటి రియాల్టీషో ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని ఈటివి ప్రసారం చేసింది. ఆ కార్యక్రమం ప్రారంభంలో అప్పటికే గాయకులుగా ఉన్న వాళ్లని పార్టిసిపెంట్లుగా తీసుకున్నారు. నేను ఆ కార్యక్రమంలో ఫైనలిస్టుగా వచ్చాను. ఫైనల్స్‌లో మలయాళం పాట పాడాను. దాన్ని ఎక్కువ శృతిలో పాడడం వల్ల మొదటి స్థానాన్ని అందుకోలేకపోయాను. కాని గాయకుడిగా మంచి పేరు వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, మిగతా జడ్జిలు ఇచ్చిన సలహాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. గాయకుడినుంచి గురువుగా…
తెలుగు వాళ్లు ఎక్కువగా శాస్ర్తీయ సంగీతం మాత్రమే పాడేవారు. అందుకని మన దగ్గర సినిమాలకు పాడేవారు లేరు అనుకునేవారు. అలా అనుకోవడమే నాలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఇక్కడ మన పిల్లల్ని మంచి గాయకులుగా ఎందుకు తయారుచేసుకోకూడదు అనిపించింది. అప్పుడప్పుడే గాయకుడిగా ఎదుగుతున్న నేను టీచింగ్ చేయడం ప్రారంభిస్తే గాయకుడి కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టే. అయినప్పటికీ నేను టీచింగ్‌నే ఎంచుకున్నాను. నా ఆలోచనను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితో పంచుకున్నాను. ఆయన ‘గో ఎ హెడ్’ అన్నారు. అలా 1998లో ‘లిటిల్ మ్యూజిక్ అకాడమీ’ ప్రారంభమయ్యింది. జానపదులు ఎక్కువ
ఈ మహాయజ్ఞం మొదలుపెట్టి పదహారేళ్లు అవుతోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలకి సంగీతం నేర్పించాను. నేర్పిస్తున్నాను. యుఎస్‌ఎ, ఆస్ర్టేలియాల్లో కూడా నేర్పిస్తాను. స్కైప్‌లో క్లాసులు తీసుకుంటున్నాను. విదేశాల్లో మాత్రం చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లకి కూడా నేర్పిస్తున్నాను. అనాథ, అంథ బాలలు ఉండే ప్రదేశాలకు వెళ్లి పాటలపట్ల ఆసక్తి ఉన్న వాళ్లకి నేర్పిస్తున్నాను. మా ఇనిస్టిట్యూట్ పిల్లలందరూ కలిసి ఆల్మా (అల్యూమ్ని ఆఫ్ లిటిల్ మ్యూజిక్ అకాడమీ) ఏర్పాటుచేశారు. దీనిద్వారా కొత్త పిల్లలకు నేర్పిస్తూ, సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్లలో ఎక్కువమంది పిల్లలు సినిమాల్లో పాడుతున్నారు. సంగీతంతో పాటు జీవితం పట్ల ప్రణాళిక, సరైన ఆలోచనా విధానం, విలువలు, సత్ప్రవర్తన, మానవత్వం వంటివి కూడా నేర్పిస్తున్నాం. మా పిల్లల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉంటుంది. మాది సంగీత కుటుంబం
మా ఇంటిల్ల్లిపాదికి పాటలంటే ప్రాణం. మా ఆవిడ సుజాత లెక్చరర్‌గా పనిచేస్తోంది. మా పిల్లలు సాకేత్, సాహితిలు ఇద్దరూ పాడతారు. మేమందరం కలిసే పనిచేసుకుంటాం. మీకో విషయం చెప్పాలి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ‘పాటే నా ప్రాణం’ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేశాను. ఇప్పుడు సంగీత దర్శకుడిగా భక్తిగీతాల ఆల్బమ్స్ ఎక్కువగా చేస్తున్నాను. దుక్కిదున్ని, విత్తనాలు వేశాను. పంట పండి మంచి ఫలాలను ఇస్తోందిప్పుడు. వాటిని ఆస్వాదిస్తున్నాను. కళాకారులకు వసతి గృహం…
భవిష్యత్తులో సంగీత పాఠశాలను కాచిగూడ, సికింద్రాబాద్, ఇమ్లిబన్ స్టేషన్లకు మధ్యలో ఏర్పాటుచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వేరే ఊళ్ల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ల కోసం బస్సు, రైలు స్టేషన్లకు సమీపంలో ఉండాలని. ఈ పాఠశాలలో తరగతి గది, గ్రంథాలయాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతానికి సంబంధించిన పుస్తక సంపదను ఇక్కడ ఉంచుతాను. జానపద, శాస్ర్తీయ, బాల గీతాలను తరువాతి తరాలకు అందించాలనేదే నా ప్రయత్నం. వృద్ధకళాకారుల కోసం ఒక వసతి గృహాన్ని నడపాలనే ఆలోచన కూడా ఉంది. నా లక్ష్యాలు వినేందుకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. కాని నాతోడుగా ఉన్న చిన్నారి సైన్యాన్ని చూస్తే ఆ లక్ష్యాలే ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి’’ అని ముగించారు. |


