గీర్వాణ కవుల కవితా గీర్వాణం -21
19- వీరశైవ కవి –ఉదాహరణ కావ్య నిర్మాత -పాల్కురికి సోమనాధుడు
శివకవులలో ముఖ్యుడైన పాల్కురికి సోమనాధుడు సంస్కృతం, కన్నడం , తెలుగులో అనేక గ్రంధాలు రచించిన మహా పండిత కవి .శివకవి త్రయం లో సోమనాధుడు ,మల్లికార్జున పండితారాధ్యుడు ,నన్నే చోడ కవిరాజు ఉన్నారు .సోమనాధుడు వరం గల్లు జిల్లాలోని పాల్కురికి గ్రామం లో జన్మించాడు .తండ్రి విష్ణు రామ దేవుడు .తల్లి శ్రియా దేవి .1160-1240కాలం వాడు .శివుడి ప్రధమ గణాలలో ‘’భ్రుంగి ‘’అవతారం అని వీరశైవుల విపరీత నమ్మకం .బ్రాహ్మణుడే అయినా ,ఇతర బ్రాహ్మణ శివకవులు బ్రాహ్మణులను విమర్శింపక పోయినా సోమన బ్రాహ్మణులను విపరీతం గా విమర్శించాడు .వీరశైవ వ్యాప్తికి ఇది బాగా దోహద పడింది .వీరశైవ మతదీక్ష తీసుకొని గురువు కట్టకూరి పోటి దేవర వద్ద శైవ ఆగమాలను అధ్యయనం చేశాడు .వీరశివులకు కుల గోత్ర పట్టింపు ఉండదు .వీరిని వీర మహేశ్వర వ్రతులు అంటారు .జంగమ దేవరలు గా వీరిని ఆరాధిస్తారు .వీరికి తలిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే నంటారు .
తెలుగు ,కన్నడ కవితా గీర్వాణం
సోమన లేక సోమనాధుడు గా ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాధుడు తెలుగులో బసవ పురాణం ,వృషాధిప శతకం ,చతుర్వేద సారం పండిత రాధ్య చరిత్ర రాశాడు .కన్నడం లో సద్గురు రగడ ,చెన్న బసవ రగడ ,బసవ లింగ నామావళి రచించాడు .అచ్చతెలుగు పదాలను తెలుగు ఛందస్సులను విరివిగా ఉపయోగించాడు .’’రగడ ‘’అనే కొత్త ఛందస్సు సృష్టికర్త సోమనాదుడే దీనిని ‘’బసవ రగడ ‘’అంటారు .ద్విపదకు పద సంపద జోడించి బహు విధ విన్యాసాలు చేయించాడు .సీసపద్యాలూ రాశాడు .త్రిభంగి తరువోజ ,క్రౌంచ పధం వన మయూరి ,చతుర్విధ కందం ,త్రిపాద కందం అనే వివిధ ఛందో రీతుల్ని సాహిత్యం లో ప్రచారం చేశాడు .కాకతీయులకాలపు విప్లవ కవిగా గుర్తింపు పొండాడు .ఆనాటి సమాజం లో ఉండే సాంఘిక స్తితి గతులను రచనలలో స్తానం కల్పించి వాటి విశిష్టతలను జనాలకు తెలియ జెప్పాడు .జానపద కళా రూపాలకు ,యక్షగానాలకు ఆటలకు ,పాటలకు తన గ్రంధాలలో చోటు కల్పించాడు .తోలుబొమ్మలాటలు జంతు విన్యాసాలు ,నట్టువ కత్తేల నాట్య విలాసాలు గురించి మనకు తెలియ జెప్పాడు .శ్రీశ్రీ కంటే ముందే ఛందస్సు వ్యాకరణాలను శివకవులు అధిగమించారు. భాషలో నిరంకుశులై వర్తిల్లారు .ఇతరభాషా పదాలను యధేచ్చగా చేర్చివాడారు .జాను తెలుగుకు పట్టాభిషేకం చేసింది శివకవులే .దేశికవితకు మార్గ దర్శకులుగా నిలిచారు .
అన్నిటా ప్రధముడు సోమనాధుడు
సోమన అన్నిటా ప్రధముడుగా నిలిచాడు .వీర శైవాగ్రేసరుడు అంటారు సోమనాధుని .బసవేశ్వరుని చరిత్రను పురాణం గా రాసి కొత్త దారి తీశాడు .చరిత్రకు పురాణ వైశిస్ట్యాన్ని సంతరించిన మొదటికవి పురాణకర్త .జైన భాషా లక్షణాలతో తెలుగులో దేశి పురాణాన్ని రాసిన తొలిల తెలుగుకవి అనిపించుకొన్నాడు .అచ్చతెలుగు ఛందస్సు అయిన ద్విపదకు కావ్య గౌరవాన్ని ,పురాణ గౌరవాన్ని కలిగించిన ప్రధమాంధ్ర కవి .మత విజ్ఞానానికి ,ప్రచారానికి కావలసిన ప్రక్రియలన్నిటిని సంతరించి ,ఉపయోగించి సఫలుడై తన సర్వజ్ఞాత్వాన్ని లోకం లో చాటిన మొదటికవి సోమనాధుడు .లిఖిత ,మౌఖిక సంప్రదాయానికి వారధి నిర్మించిన తొలి తెలుగుకవి .మూల రసవాదానికి తెలుగులో ప్రచారం తెచ్చిన ప్రధమకవి .భక్తిరసాన్ని తెలుగు దేశం లో పార మెరుగ కుండా పారించిన తొలిభక్తకవి. సంస్క్రుతాన్ద్రాలలోనేకాక ప్రక్క భాష కన్నడం లోను కవిత్వం చెప్పిన మొదటికవి .తనను గురించి కావ్యాలలో అతి తక్కువగా చెప్పుకొన్నాడు .ఇతర రచనలలో సోమన గురించి చెప్పబడిన వాటివలననే ఆయన చరిత్ర కొంతవరకు తెలుస్తోంది .కన్నడం లో ‘’తోంతాడ సిద్ధకవి ‘’సోమన పై ‘’పాలకురికి సోమేశ్వర పురాణం ‘’రాశాడు ..పన్నెండవ శతాబ్దం లో తెలుగు దేశం ‘’తొమ్మిది లక్షల గ్రామాల విస్తీర్ణం కలది ‘’-నవ లక్ష తెలుంగు ‘’అని వర్ణించాడు .తెలుగులో జాతీయ సాంస్కృతిక ఉద్యమ ఆరంభకుడు సోమనాధుడు అన్నారు డా జి వి పూర్ణ చంద్ .పదలాలిత్యం తో బాటు వైరిసమాసాల ప్రయోగాలు హెచ్చుగా ఉంటాయన్నారు పూర్ణ చంద్ .సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా నడిపిన మొదటి తెలుగు కవి సోమన అనటానికి సందేహమే లేదు .ప్రధమ తెలుగుకవి సంస్కర్తకూడా సోమనాధుడు .నిమ్న కులాల వారిని దగ్గర చేర్చిన కవి .వారి గురించి రాసిన కవికూడా .బసవ పురాణాన్ని తొలి తెలుగు సాంఘిక కావ్యం గా గుర్తించారు .మల్లమ దేవిపురాణం ,సోమనాధ స్తవం ,అనుభవ సారం చెన్నమల్లు సీసాలు ,చతుర్వేద సారం సోమన రచనలో ప్రముఖాలు .
గీర్వాణ కవితా గీర్వాణం
గీర్వాణ భాషలో అంటే సంస్కృతం లో ‘’సోమనాధ భాష్యం ‘’,రుద్ర భాష్యం ‘’,సంస్కృత బసవోదాహరణలు, వృషభాస్టకం ,త్రిలింగాస్టకం ‘’రాశాడు .
వృషభాస్టకం
వ్వృషభాస్టకం లేక వృషాధిప శతకం చాలా ప్రసిద్ధి చెందింది .ఇందులో మొదటి నలభై శ్లోకాలు బసవేశ్వరుని గురించి చెప్పాడు .ఇతర శివ భక్తులైన శివనాగమయ్య ,చెన్న బసవయ్య ,మాచయ్య లనూ ఇందులో స్తుతించాడు .ఇది అనేక భాషలలోకి అనువాదం పొందింది .1884లో మద్రాస్ లో ఇది మొదటిసారిగా ప్రచురింప బడింది .సోమన మొదటి ఎనభై తెలుగులో రాశాడు .ఇదొక వింత.ఒకటినుంచి నలభై తోమ్మిదివరకు తెలుగుపద్యాలే .ఆతర్వాత కొన్ని ఇతరభాషలైన మరాటీ ,కన్నడ ,మణిప్రవాల శ్లోకాలు రాసి మళ్ళీ తెలుగులో పద్యాలు చెప్పాడు .పద్యం అంతా సంస్కృతం లో ఉన్నట్లు అనిపించినా చివరి మాటలు తెలుగలో చెప్పటం విశేషం –‘’ఎంచు సంస్కృత భాష నుతింతు నిన్ను విద్వన్నుత నామ ధేయబసవా ‘’అంటాడు .వీటిలో యాభై నుంచి యాభై నాలుగు వరకు పూర్తీ స్వచ్చ సంస్కృత శ్లోకాలున్నాయి .చివరి పంక్తి అయిన ముక్తకం సంస్కృతం ,ఇతరభాషా మిశ్రమం లో ఉంటుంది .59 శ్లోకాలు సంస్కృత తెలుగు కలగా పులగం .అరవయ్యవ శ్లోకం లో ద్రావిడ సంస్కృత తెలుగు మిశ్రమం ఉంటుంది .అరవైనాలుగులో సంస్కృత కన్నడ మిశ్రమం ఉంది .మిగిలిన వన్నీ తెలుగు పద్యాలే . .ఇది స్తుతి శతకమే .వసంత తిలక ఛందస్సులో రాశాడు ఈ శతకాన్ని .ఒక శ్లోకం చూద్దాం
‘’శ్రోత్రం శ్రునోతిపతతి వినిస్చితార్ధం –సోదాతు యాతి వృషభాద్రి పతే ప్రసాద –ఇలాభావత్ విశుద్ధ పద భక్తీ –ఫతదాభి లస్టకం
రుద్ర భాష్యం
రుద్ర భాష్యం దొరకలేదు .కాని దీనిని పిడపర్తి సోమనాధుడు ఉదాహరించాడు .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత భాండారం లో ఒక ప్రతికనిపిస్తోంది .ఇది సోమనాధ కృతం కాదు .బ్రహ్మ విద్యా తీర్ధ రాసింది .తాటాకు గ్రంధమూకాదు .విడివిడి కాగితాలపై రాసింది .ఇరవై తోమ్మిదిపెజీలే ఉన్నాయి .కనుక ఇది సోమన రాసినది కాదని తేలింది .రుద్రభాష్యం యజుర్వేదం లో ఉంది దీన్ని శ్రీ రుద్రం అంటారు .శతరుద్రీయం అనే పేరుకూడా ఉంది .ఇందులో కొన్ని సూక్తాలు సోమన రాసిన పండితారాధ్య చరిత్రలో కనిపిస్తాయి .కనుక రుద్ర భాష్యం ఒక వ్యాఖ్యానం మాత్రమె అని భావిస్తున్నారు .
సంస్కృత బసవోదాహరణ
ఇది కన్నడ మండలేశ్వరుడైన బిజ్జలుని ముఖ్య మంత్రి ,వీరశైవ మత ప్రాపకుడు బసవేశ్వరుని చరిత్ర . బసవడు మాదిరాజ ,మదలంబ అనే శుద్ధ బ్రాహ్మణుల తనయుడు .వీరు నందీశ్వరుని పరమ భక్తులు .నంది అనుగ్రహం తో పరమ భక్తాగ్రేసరుడైన బసవడు జన్మించాడు .ఆయన నందీశ్వరుని అవతారం గా భావిస్తారు .కనుక బసవ అని పేరుపెట్టారు .వైశాఖ శుద్ధ తదియనాడు 1131లో అన్మించాడు .ఎనిమిదవ ఏట ఉపనయనం చేస్తుండగా ఇష్టపడక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు .కూడల సంగమేశ్వరం చేరి ఏకాంతం లో ఆత్మ జ్ఞానాన్ని పొందాడు .అతని వీరశైవభావాలను గమనించి మేనమామ కూతురు గంగమ్మ నిచ్చి వివాహం చేశాడు .తర్వాత బిజ్జలుని మహా మంత్రి అయ్యాడు . వీరశైవ మతాన్ని స్తాపించి వ్యాపింపజేశాడు .సంఘ సంస్కరణ లు చేబట్టి అస్పృశ్యతను నివారించే ప్రయత్నం చేశాడు .ఇది చాందస బ్రాహ్మణులకు బాధకలిగిస్తే రాజు కు చెప్పారు .రాజు వీరివలన ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయ పడ్డాడు .బ్రాహ్మణులకు అస్ప్రుశ్యులకు బసవడు వివాహాలు జ రిపించాడు .’’శైవ శరణులను’’ రాజు నిషేధించాడు .అహింసా వలంబి అయిన బసవడు హింసా ప్రజ్వలనం తో బాధపడ్డాడు .కళ్యా ణ్ లో తాను చేయాల్సిన పని పూర్తీ అయిందని భావించి కూడల సంగమేశ్వరం వెళ్ళిపోయాడు .అక్కడ ఏకాంతం గా శివారాధన చేస్తూ సంగమేశ్వరునిలో 1167లో బసవేశ్వరుడు ఐక్యమయ్యాడు .సంస్కర్తగా, వీరశైవ మత స్తాపకుడిగా బసవేశ్వరుడు చిరకీర్తి పొందాడు. ఎన్నో తరాలను ప్రభావితం చేశాడు .
ఇది ఉదాహరణ కావ్యం .ఎనిమిది విభక్తులతో సోమన రాశాడు .ప్రతివిభక్తిలో ఒక టి రెండు శ్లోకాలు ఆతర్వాత కళిక ,ఉత్కళిక లు రాశాడు .మొదటి విభక్తిలో ప్రాణ లింగాన్ని ఆరాధించే బసవేశ్వరునికి వందనం చెప్పాడు .రెండవ విభక్తిలో బసవని జ్ఞాన ప్రభావాన్ని ఆవిష్కరించాడు .వేదపరమార్ధ రహస్య భేది ,పిశున వ్యాపార పారంగతుడని పొగిడాడు .వేదాంతం లో అసామాన్యుడేకాక బసవ వచనాలు రాసిన కవి అన్నాడు .మూడవ విభక్తిలో బసవేశ్వరుని మహిమలను వర్ణించాడు .బసవని సుమేరుపర్వటం తోపోల్చాడు .తరువాత వీర శైవ దీక్షావిదానాలను ఆచరణలను ,శాస్త్ర గ్రందాల గురించి రాశాడు .తెలుగులో బసవ పురాణమూ రాశాడని ముందే చెప్పుకొన్నాం .బసవడు వీర శైవ ప్రచారకుడిగా చేసిన పనులు వివరించాడు .ప్రకృతిలో బసవానికి ప్రతిది శివరూపం గా దర్శనమిస్తున్దన్నాడు .
ఉదాహరణ కావ్యాలు సంస్కృతం లోనుంచి తెలుగు లోకి వచ్చాయి .ఇదొక రకమైన సాహిత్య ప్రక్రియ .సంస్కృతం లో మొదటి ఉదాహరణ కావ్యం రాసిన వాడు పాల్కురికి సోమనాదుడే .ఆ తర్వాత ఓరుగల్లుకవి విద్యానాధుడు రాశాడు .ఆతర్వాత తెలుగులోనే ఉదాహరణ కావ్యాలు వచ్చాయి .ఉదాహరణ అనేది 26 శ్లోకాలుండే లఘుకావ్యం .ఏడు విభక్తులతో పాటు సంబోధన ప్రధమా విభక్తిలో కావ్యం ఉంటుంది .ఒక్కో విభక్తిలో మూడేసిపద్యాలుఉంటాయి . .మొదటిపద్యం ఒక ఛందస్సులో రెండవ పద్యం రగడగా ,మూడవ పద్యం అర్ధ రగడగా ఉండాలి అనే నియమం ఉంది .రగడకు ఎనిమిదిపాదాలు ఉంటాయి కనుక అర్ధ రగడలో నాలుగే పాదాలుంటాయి .వీటినే కళిక అని ఉత్కళిక అనీ అంటారు .వీటి తర్వాత సర్వ విభక్తి శ్లోకం ఉండాలి .సంస్కృత ఉదాహరణ కావ్యాలన్నీ తెలుగు ఉదాహరణ కావ్యాలనే పోలిఉంటాయి .అసలు సంస్కృత ఉదాహరణలు రాసింది తెలుగు కవులే .అందుకే సోమనాధుడు మొదటి సంస్కృత ఉదాహరణ కావ్య కవి అనిపించుకొన్నాడు .విద్యానాధకవి తన ప్రతాప రుద్రీయ కావ్యం లో ఉదాహరణ కావ్య లక్షణాలు వివరించాడు .ఋగ్వేద కుంతక సూక్తాలలో ఉదాహరణకావ్య చాయలున్నాయని అంటారు .ఇవన్నీ క్రియా విభక్తులు. కనుక సకల క్రియలూ ఆ పరమేశ్వరునికి చెందినవే అని ఈ ఉదాహరణ కావ్యాలలో ఉన్న అంతరార్ధం .దీనినే విశ్వనాధ ‘’ప్రపంచమంతా క్రియా జన్యం .ఈ క్రియల తో భగవంతుని చేరవచ్చు .ఈ విభాక్తులతో పరమాత్మను కీర్తించటం అంటే ఈ క్రియలకు మూల పురుషుడు ఆద్యుడు పరమేశ్వరుడు అని తెలుసుకోవటమే .ఇదే ఉదాహరణ కావ్య పరమార్ధం ‘’అని చక్కగా విశ్లేషించారు .
త్రిలింగాస్టకం
సోమనాధుడు మూడు లింగాలపై సంస్కృతం లో చెప్పిన ఎనిమిదేసి శ్లోకాలున్న కావ్యం .స్వస్థలింగం ,ప్రాణ లింగం ,భావ లింగం అనేవి మూడు లింగాలు .ఈ శ్లోకాలను అనుష్టుప్ చందసులో చెప్పటం విశేషం .ఉదాహరణకు –
‘’పంచాకాశం మహా కాశం పంచాకరం ప్రకాశితం –ప్రణవోక్షరం మాయాకారం స్వేస్త లింగమహం భజే ‘’
జీవాధారం శివాధారం నానాధారం పరాత్పరం –సర్వ వ్యాపక మంత్రార్ధ ప్రాణ లింగమహం భజే ‘’
చివరలో ఒక శ్లోకం లో ఫల శృతి చెప్పాడు .’’పండిత సోమనాదేన కృత లింగాస్టక త్రయం –యః పఠేత్ సతతం విద్వాన్ ముక్తి ఫలప్రదం ‘’అని చెప్పాడు .
తెలుగువాడైన సోమనాధుడు చతుర్భాషా కవిగా గుర్తింపుపొంది తెలుగు వారి కీర్తిపతాకను ఎగర వేశాడు ఎన్నిటికో ఆద్యుడై ,సాహిత్యారాధకుడై తరాలను ప్రభావితం చేశాడు .
మరోకవితో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-14-ఉయ్యూరు

