| బహుజన గీతాకారుడు – డాక్టర్ కోయి కోటేశ్వరరావు |
|
ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు.
మట్టి నవ్వితే పరమాన్నం ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒకచోట రాశి పోస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ‘పైడి’ సాహిత్యంలా ఉంటుంది. నిద్రను నిట్టనిలువునా నరికే వైతాళిక గానం ఎలా ఉంటుంది? వేటగాడి గుండె జారిపోయే సింహనాదం ఎలా ఉంటుంది? నాలుగు పడగల హైందవ నాగరాజు కోరలు పీకే పౌరుషం ఎలా ఉంటుంది? సామ్రాజ్యవాదం పొగరణిచే సాహసం ఎలా ఉంటుంది? గొడ్లు కాసే పిలగాడి పిల్లంగోవి రాగం ఎలా ఉంటుంది? అన్నింటికీ మించి అంబేద్కర్ పల్లవైన పాటకు ఆపకుండా చిందేస్తే ఎలా ఉంటుంది? అమ్మతోడు తెరేష్‌బాబు కవిత్వంలా ఉంటుంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యామ్నాయ భావవిస్ఫోటనం పైడి తెరేష్‌బాబు. అక్షరాలను చండ్ర నిప్పు కణికల్లా మార్చి, మాటలను మర ఫిరంగుల్లా పేల్చి, కవితా వాక్యాల్ని కరెంటు తీగల్లా తీర్చి, నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ప్రసరించిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు తెరేష్‌బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, దళిత కవులకు వచన కవిత్వమెందుకని ఘనత వహించిన కవిపుంగవులు నోరుపారేసుకుంటున్నప్పుడు, రెప్పపాటులోనే ‘దళితవాదం’పై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు ఈ సంక్లిష్ట సందర్భంలో తెరేష్ బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు. ‘రాత మాకు కొత్తకాదు/ మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు/ మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం/ మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగితప్పడవలైనపుడు/ మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం/ మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయ్యింది.’’ (నిశాని) అంటూ ‘పైడి’ దళిత పులిలా గాండ్రించి, సాంద్రతరమైన, తాత్విక సమన్వితమైన కవిత్వానికి సంకేతంగా భాసిల్లాడు. సంగీత, సాహిత్య కళా రంగాల్లోను, టి.వి. రేడియో వంటి దృశ్యశ్రవణ మాధ్యమాల్లోను తెరేష్‌బాబు పట్టిందల్లా బంగారమయింది. కవిత, కథ, నాటకం, పాట, గజల్ వంటి ప్రక్రియల్లో ఆయన రాసింది రత్నమయింది. ‘నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను/ నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీచేతిలో పెట్టడానికొచ్చాను’ అని తెలుగు పాఠకుడి చేతిలో చేయివేసి బాస చేసిన తెరేష్‌బాబు మహత్తరమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి మూడు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానాన్ని ముగించుకొని సెప్టెంబర్ 29 సాయంత్రం నేలతల్లి గుండెల్లో కలిసిపోయాడు. కవన నక్షత్రమై గగనమెక్కాడు. పైడి తెరేష్‌బాబు జీవిత సాహిత్య గ్రంథపుటలను తిరగేస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది. |
| కోటి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా – రెహమాన్ | |
‘‘ఆకాశం హద్దుగా మన లక్ష్యం ఉండాలని మా గురువు పార్ధసారథిగారు ఎప్పుడూ చెబుతుండేవారు. నేను దాన్నే పాటించేవాణ్ణి. కోటిగారి దగ్గర పని చేసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో మధుర క్షణాలన్నీ కోటిగారితోనే ముడిపడి ఉన్నాయి’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. సిద్దాన్స్, అక్షర జంటగా కమల్ జి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయకుడు’. లక్ష్మి సమర్పణలో ఽథీరు ఫిలింస్ పతాకంపై జమ్మలమడుగు రవీం రఽదనాఽథ్ నిర్మిస్తున్నారు. కోటి తనయుడు సాలూరి రోషన్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాజ్-కోటిలిద్దరూ నాకు సోదర సమానులు. వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సాలూరి రాజేశ్వరరావుగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఆకాశంలాంటివారు. ఆయనను హద్దుగా భావించి కోటిగారి మార్గంలో పయనించి రోషన్ మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలి’’ అని అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘‘సాలూరి రాజేశ్వరరావుగారి కుటుంబం నుండి మరో సంగీత దర్శకుడు రావడం ఆనందంగా ఉంది. 15 ఏళ్ళ వయసు ఉన్న నన్ను ఓ ఆర్కెస్ర్టాలో చూశారు. ఆయన ఆటోగ్రాఫ్ అడిగితే భవిష్యత్తులో నువ్వు మంచి నేపథ్య గాయకుడివి అవుతావు అని ఆ పుస్తకంలో రాసి సంతకం చేశారు. నా అదృష్టవశాత్తు ఆయనతో కూడా కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. అటువంటి కుటుంబం నుండి వస్తున్న రోషన్‌కి సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు రావాలి. ‘గాయకుడు’ పాటలు బావున్నాయి’’ అని అన్నారు. ‘‘నన్ను గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కోటిగారే. ఎస్పీ కోదండపాణి స్టూడియోలో గొప్ప గొప్ప పాటల రికార్డింగ్‌లను ఆయన దగ్గరుండి చూపించేవారు’’ అని దేవిశ్రీప్రసాద్ అన్నారు. ‘‘పాటలు, సంగీతం అంటే ప్రాణమిచ్చే ఓ కుర్రాడి కథ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘మా అబ్బాయిని ఇంత గ్రాండ్‌గా లాంచ్ చెయ్యడం ఆనందంగా ఉంది’’ అన్నారు కోటి. సిద్దాన్స్, అక్షర సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా మణిశర్మ, మిక్కీ జె..మేయర్, హారీస్ జైరాజ్, తమన్, బి.గోపాల్, రాఘవేంద్రరావు, నరేశ్, అనూప్ రూబెన్స్, ఆర్.పి.పట్నాయక్, కె.ఎమ్.రాధాకృష్ణన్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
|

