![]() |
‘‘నేను కొమురం భీం వారసుడిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. భీం కొడుకు మాధవరావు, ఆయన కొడుకును నేను. మా తమ్ముడి పేరు కూడా మాధవరావే. భీం పోరాట యోధుడని చెప్పడమేకాని 73 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఆయన వర్ధంతి వచ్చినా మేము ఏమీ కోరకుండానే.. అదిగో అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హడావిడి తప్ప.. ఆఖరికి చేసింది ఏమీ లేదు. కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు లేవు. సొంత ఇళ్లు లేవు. మా బతుకులు చాలా దారుణంగా ఉన్నాయి. నా బిడ్డ వరలక్ష్మి ఇంటర్ చదువుతోంది. నా కొడుకు మాధవరావు టీటీసీ చేసిండు. వీళ్లిద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరినం. ఆయన సరే అన్నరు. వ్యవసాయానికి భూమి అడుగుతున్నం. అప్పుడెప్పుడో మా నాన్న భూమి 2 ఎకరాల 8 గుంటలు ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నం. మా కుటుంబంతో సహా మేమంతా 60 మంది దాకా ఉంటాం. అందరం పేదరికంలోనే ఉన్నాం. మా సోదరి సోంబాయి జోడెఘాట్‌లో ఉంటోంది. కొమురం భీం ఏం కోరుకున్నారు? గిరిజనుల హక్కులు కోరుకున్నారు. భూమి మీద ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు.
భీం కోరిక నెరవేరేనా?
ఇన్ని సంవత్సరాలకు మా తాత కొమురం భీం కోరిక నెరవేరేటట్టున్నది. మా భూమిలో మా రాజ్యం ఏర్పడేటట్టున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 8వ తారీఖు జోడెఘాట్‌కు రావడం సంతోషంగా ఉన్నది. సీఎంకు ధన్యవాదాలు. గిరిజన యూనివర్శిటీ ఇస్తరట. మ్యూజియం, పెద్ద పార్కు పెడ్తమన్నరు. పర్యాటక
కేంద్రం చేస్తమన్నరు. మా ఆదివాసీల బతుకులు బాగు చేస్తమన్నరు. మాకు భూములిస్తమన్నరు. ఇంతకంటే ఎక్కువేం గావాలే. మా తాత కోరింది గూడ ఇదే. మా భూమి మాకు, మా అడవి మీద మాకు హక్కు కల్పిస్తరని నమ్ముతున్నం. మా తాత భూమికే పట్టాలేదట. మాకెక్కడ నుంచి వస్తది. ఆ పట్టాల కోసమే మా ఆదివాసీలు పోరాడుతున్నరు. జల్, జమీన్, జంగల్ కోసం మా తాత పోరాడి నేలకొరిగిండు. ఇంతకుముందు లీడర్లు ఐదెకరాల చొప్పున మాకు భూమి ఇస్తమన్నరు. ఇంకా చాలా హామీలిచ్చిండ్రు. ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు అమలు అయితయని కేసీఆర్ నమ్మకం బుట్టించిండు. తెలంగాణ వస్తే కచ్చితంగా ఆదివాసీల జీవితాలు బాగుపడతయని ఆయన 2007లో ఒకసారి జోడెఘాట్‌కు వచ్చినప్పుడు చెప్పిండు. మేమందరం కుటుంబ సభ్యులమంతా కలిసి జోడెఘాట్‌కు పోతున్నాం. జోడెఘాట్ వద్ద సీఎంను కలుస్తాం. మా తాత కలలు 73 ఏండ్ల తర్వాత నెరవేరుతున్నయనే సంతోషం చాలా ఉన్నది. ఆదివాసీలను కాపాడుకోవడమన్నది ప్రభుత్వ బాధ్యత. ఇక్కడి చెట్టును, పుట్టను నమ్ముకుని బతికే గరీబోళ్లం. అదే లేకుంటే మా బతుకులు ఎట్ల ఉంటయి. జ్వరాలొచ్చి చాలా మంది చచ్చిపోతున్నరు, తిండి లేక రక్తం ఉండటంలేదు. ఇటువంటి చాలా విషయాలున్నయి.
నిజాం సైన్యంపై తిరుగుబాటు..
-ఎండీ. మునీర్, మంచిర్యాల



