గీర్వాణకవుల కవితా గీర్వాణం -24
22-వ్యాస వాల్మీక సమానుడు –గుణాధ్యుడు
గుణాధ్యుడు బృహత్కధ రాశాడు .ఇది సంస్కృతం లో ప్రాకృతం లో ఒక భేదమైన పైశాచీ భాషలో రాయబడింది .గ్రంధం మొదట ఉదయన రాజు చరిత్ర ఉంటుంది ,ఆయన వాసవ దత్త వివాహం తర్వాత అసలుకద అతనికొడుకు నరవాహన దత్తుడితో ప్రారంభమవుతుంది .తర్వాత దత్తుని సాహస యాత్రలు ,అనేక మంది స్త్రీలతో వివాహాలు వస్తాయి .విద్యాధరులకు రాజు అవటం ,మధ్యలో అనేక కధలు చేరుతాయి . అంటే కదాకావ్యం అన్నమాట .గునాధ్యుడు వ్యాస వాల్మీకి అవతారం అన్నారు .రామాయణ మహా భారతాలు బృహత్కధ అనే త్రివేణీ సంగమం లా కవిత్వాన్ని ప్రవహింప చేశాడని గోవర్ధనాచార్య అన్నాడు .గుణాధ్యుడు శ్రుతార్ధ అనే బ్రాహ్మణ స్త్రీకి కీర్తి సేనుడు అనే నాగ రాజుకు గాంధర్వ వివాహం లో జన్మించాడని అంటారు .సుప్రతిస్టాన పురం అతని నివాసం .అతనికాలం క్రీ శ అయిదు ఆరు నుంచి క్రీ పూ .ఒకటవ శతాబ్దం దాకా ఊహించారు .చివరికి స్మిత్ పండితుడు క్రీ పూ ఒకటవ శతాబ్ది వాడే నని నిర్ణయం తో అందరూ ఏకీభ విస్తున్నారు
పైశాచిలో రాయటానికి నేపధ్యం
సుసంపన్నం అయిన సంస్కృతాన్ని వదిలి పైశాచీ భాషలో ఎందుకు రాశాడు ?దీనికి ఒక కద ప్రచారం లో ఉంది .శాతవాహన రాజు కుంతకుడు రాణి తో జలక్రీడ లో ఆమెపై నీరు చల్లుతాడు. ఆమె సంస్కృతం లో ‘’మొదకైస్తాడయ ‘’’’అన్నది అర్ధం తెలియని రాజు మొదకాలు అంటే ఉండ్రాళ్ళుకావాలని అడుగుతున్దేమోనని భావించి తెప్పించి విసిరాడు .అతని అజ్ఞానానికి ఆమె పరిహసించింది ..ఉక్రోషం వచ్చిన రాజు ఆస్థాన పండితుడు గుణాధ్యుడిని ఆశ్రయిస్టస్తే ఆరేళ్లలో పండితుడిని చేస్తానంటే అక్కడేఉన్న శర్వ వర్మ ఆరునెలల్లో చేస్తానని సవాలు విసిరాడు .వర్మ నిజం గా అలాచేస్తే తానూ సంస్కృత ,ప్రాకృత ,మొదలైన దేశ భాషలను త్యజిస్తానని గుణాధ్యుడు శపథం చేశాడు .శర్వ వర్మ కాతంత్ర అనే వ్యాకరణాన్ని రాసి అన్నమాట ప్రకారం రాజును సంస్కృతం లో పండితుడిని చేశాడు. మాటనిల బెట్టుకోవటానికి గుణాధ్యుడు సంస్క్రుతాది భాషాలు త్యజించేశాడు ,భూతాల భాష అయిన పైశాచి లో కావ్యం రాశాడు .
బృహత్కధ –కవితా గీర్వాణం
గుణాధ్యుడు శివ గణాలలో ఒకడుఅని కదా సరిత్సాగరం లో ఉంది .శివుడు పార్వతికి ఈ కధలు చేబుతూండగా పుష్పదంతుడనే శివ గణం లోని వాడు చాటుగా విన్నాడు .ఇది గమనించిన పార్వతి మానవునిగా పుట్టమని శపించింది. రహస్యం గా విన్న ఎడుకధాలను పిశాచం గా ఉన్న కాన భూతికి చెప్పి కైలాసానికి రమ్మని ఆదేశించింది అతని సోదరుడు మాల్యవంతుడు మధ్యలో అడ్డుకోగా అతన్నీ మనిషిగా పుట్టమన్నది .పుష్పదంతుడు వర రుచిగా పుట్టి మగధ పాలకుడు నంద రాజు దగ్గర మంత్రి అయ్యాడు .ముసలితనం లో వింధ్య పర్వతాలను చేరి కాన భూతిని కలిసి కధలు చెప్పి కైలాసం చేరాడు .మాల్య వంతుడు గుణాధ్యుడుగా పుట్టి ప్రతిష్టానపురం లో శాతవాహన రాజ మంత్రి చేసి ,తర్వాత వింధ్య ప్రాంతానికి వెళ్లి పైశాచి భాష నేర్చాడు .కాన భూతి చెప్పిన కధలు విన్నాడు. భూతి పిశాచ రూపం పోయింది. కాన భూతి చెప్పిన వాటిని ప్రచారం చేస్తూ భూలోకం లో ఉండి శిష్యులు గుణ దేవా ,నందిదేవుల తో సలహా తో శాతవాహన రాజుకు చూపాడు .పైశాచీ భాషలో ఉండటం వలన దాన్ని నిరాకరించాడు రాజు .అవమానం పొంది వింధ్యకు వెళ్లి చితి పేర్చుకొని రాసిన గ్రంధం లో ఒక్కో పత్రం మంటల్లో వేసి కాల్చేస్తున్నాడు .రాజు తప్పు తెలుసుకొని వచ్చి ఆపాడు .అప్పటికే ఆరు వంతుల గ్రంధం దగ్ధమైంది .నరవాహన దత్తుని వృత్తాంతం ఉన్న లక్ష పద్యాలే మిగిలాయి దీన్ని శిష్యులకిచ్చి శాప విమోచనం పొంది కైలాసం చేరాడు
శిష్యులను రాజదానికి తీసుకొని వెళ్లి రాజు వారిని సత్కరించి దానికి ఆముఖం గా ‘కదా పీఠం ‘’రాశాడు అప్పటి నుంచి బృహత్కధ గా ప్రచారమైంది .మూల పైశాచీ గ్రంధం లోకం లో లేకుండా పోయింది బాణాది కవులు దీన్ని ఉదహరించారు .పైశాచీ భాష భారత దేశం లో ఉత్తర –పశ్చిమ అంటే వాయవ్య దిశలో ప్రచారం లో ఉండేదట .ఈనాటి దర్దిక్ భాషకు దగ్గరలో ఉంటుందట .పాంచాల ,కేకయ ,బాహ్లిక నేపాల ,కుంతలా గాంధార ప్రజలు పైశాచీ ని మాట్లాడేవారని పిశేల్ అనే చారిత్రకుడు అన్నాడు .శౌరసేని కి దగ్గరగా ఉంటుందని అన్నారు. బౌద్ధ భిక్షువులు దీనిని నేర్చుకోనేవారట .అంటే నిత్య జీవితం లో ప్రజలు మాట్లాడేభాష గా పైశాచి ఉండేదని తెలుస్తోంది .నాగరకులు కాక మిగిలిన సామాన్యులు మాట్లాడే భాష .భోజరాజు పైశాచి ని నిషేధించాడట .ప్రజాసామాన్య భాష కనుకనే గుణాధ్యుడు దీనిలో బృహత్కధ రాశాడని గ్రహించాలి .ఇప్పుడు బృహత్కధ క్షేమేంద్రుడు రాసిన బృహత్ కదా మంజరిగా ,సోమదేవుడు రాసిన కదా సరిత్సాగరం గా దర్శన మిస్తోంది .బృహత్కధలో రాజు విక్రమాదిత్యుడిని పేర్కొన్నాడు గుణాధ్యుడు .గాదా సప్త శతి రాసిన హాలుడు ,గుణాధ్యుడు విక్రమాదిత్యుని కాలం లో ఉండేవారు .మహారాష్ట్రలో పైఠాన్ అనే ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజు ఆస్తానం లో గునణాధ్యుడు ఉండేవాడు .గుణాధ్యుడు తన కావ్యాన్ని సకల కళాసారం గా రచించాడు .అతడు అన్నిటా ఆరితేరిన వాడనిపిస్తాడు .ఈ కదా కావ్యాన్ని ఉత్తమ పురుషలో రాసి తానె మనకు చెబుతున్నట్లు రాయటం విశేషం .తన దృష్టికోణం లో కధలను వివరిస్తాడు .
ప్రభావం
బృహత్కధను క్షేమేంద్రుడు ,బుద్ధ స్వామి సోమదేవుడు అనువాదం చేశారని చెప్ప్పుకోన్నాం .ఇందులోని కధలెన్నో పంచతంత్రం భేతాళ వింశతి ,శుక సప్తతి వంటివాటిల్లో చేరాయి .బౌద్ధ జాతక కధల్లోనూ దూరాయి ‘.’కదా అనే గద్య ప్రక్రియ పై కూడా దీని ప్రభావం ఉంది .బాణుడు, సుబందు దీన్ని చాల గౌరవించారు .ఉదయనుడి భార్య వాసవ దత్త పేరును సుబందు తన కావ్య నాయికకు పెట్టాడు .బాణుడు ఉజ్జయిని లో బృహత్కదా కుశలురు ఉండేవారని తెలియ జేశాడు .కదా మహాకావ్యాలకు బృహత్కధ ప్రేరణ నిచ్చింది. దశకుమార చరిత్ర ,కాదంబరి కధలపై దీని ప్రభావం ఉంది .అనేక దేశ విదేశీ భాషల్లోకి అనువదింప బడింది .
గుణాలకు ఆధ్యుడు అతిగొప్ప గ్రంధం బృహత్ కధను రాసి ఎందరికో ప్రేరణ నిచ్చాడు .జన సామాన్య భాషలో సామాన్య జనాలకు అర్ధమయ్యేట్లు రాసి వ్యావహారిక భాషోద్యమానికి ఆనాడే పునాది వేసిన మార్గ దర్శి గునాధ్యుడు .
మళ్ళీ మరోకవితో
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు

