గీర్వాణ కవితా గీర్వాణం -22
20-తృతీయ పంధా తొక్కిన -మురారి
‘’అనర్ఘ రాఘవ ‘’నాటకం తో అందరిని ఆకట్టుకొన్న మహా రచయిత మురారి .చాలా రాశాడని అంటున్నా మిగిలింది ఈ నాటకం ఒక్కటే .’’గరిటడైన చాలు గంగి గోవు పాలు ‘’అన్నదానికి ఉదాహరణగా సంస్కృత సాహిత్యం లో నిలిచినకవి మురారి .ఎనిమిది ,పది శతాబ్దాల కాలం వాడి గా మురారిని అంచనా వేస్తారు .ఒరిస్సాకు కాని దక్షిణ భారత దేశానికి కాని చెందిన బ్రాహ్మణుడిగా భావిస్తారు.అత్యద్భుతమైన భావాలకు ఆలవాలం మురారి .పండితకవి .తండ్రి శ్రీ వర్ధమానకుడు .తల్లి తంతుమతి .విమర్శకుల మనస్సులను దోచుకొన్న కవి .’’మురారే తృతీయ పంధా ‘’అని మెచ్చుకొంటారు .బాల వాల్మీకి ,మహాకవి బిరుదాంకితుడు .రామాయణ కధను నాటకం గా రాయటం వలన ఆపేరు వచ్చి ఉండచ్చు .రామాయణం లోని రసవద్ ఘట్టాలను నాటకీకరించి ,యుద్దాలనూ జోడించి శోభ చేకూర్చాడు .బహువిధ ఛందో వైవిధ్యం తో ఆకర్షించాడు .ప్రాచీన భారత దేశ నగర ,పట్టణాలను ,అరణ్య నదీ అందాలను ,దేవతలా దెయ్యాల మంత్రం తంత్రాలను కలిపి ఉత్సుకత ను పెంచాడు .
అనర్ఘ రాఘవ నాటకం లో నటనకు ప్రాధాన్యత తక్కువే ఉంటుంది .అడపా దడపా యుద్ధాలు ,యుద్దాలమధ్య కద జరిగిపోతూ ఉంటుంది .భయానక ,భీభత్స దృశ్యాలు ఒళ్ళు గగుర్పౌడుస్తాయి .నాటకాన్ని గమనిస్తే కేరళ లోని ‘’కుట్టియాట్టం ‘’విధానం గుర్తుకొస్తుంది .కాని మురారి నాటకం లోకంటే కుట్టియాట్టం లో నటనకు ఎక్కువ అవకాశం ఉంటుంది .మురారి కవిత్వం మోహనం గా ఉండటం తో నాటకం బాగా రక్తికడుతుంది .నాలుగవ అంకం లో ప్రాకృత భాషను ఉపయోగించాడు .దీన్ని మిశ్ర విష్కంభ అన్నారు . రావణ మంత్రి మాల్యవంతుడు సరైన నాటకాన్ని ఆడించటం లేదని విశ్వామిత్రుడిని నిందిస్తాడు .’’ఇది దుర్నాటకం ‘’గా ఉందని తన మనస్సుకు త్రుప్తినివ్వటం లేదనీ అంటాడు .విష్ణు భట్ట అనే వాడు విశ్వామిత్రుడే అన్నీ తానెసూత్రదారుడిగా అయి చేస్తున్నాడని ‘’స్వయం సూత్ర వత్ సర్వ ప్రేరక ఇతి భావా ‘’అని అంటాడు .నాటకం లో రామకధమధ్య మధ్య మాత్రమె వస్తుంది .ఇలా మురారి రాయటానికి కారణం భవభూతి రచించిన ఉత్తర రామ చరితను అనుసరింటమే నంటారు విమర్శకులు .’’రామా బియాండ్ ప్రైస్’’అని ఆంగ్లం లో కి ఈ నాటకాన్ని అనువదించారు .కాని భవభూతి మీద స్పర్ధతో రాశాడనే వారూ ఉన్నారు .మురారికి మాఘ భావభూతులకున్న సరుకు లేదని పిస్తుంది .
కవితా గీర్వాణం
అనర్ఘ రాఘవం ఏడు అంకాల నాటకం .మొదటి అంకం లో దశరధ విశ్వామిత్రుల సంభాషణ ,యాగ రక్షణకు రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకు వెళ్ళటం ఉంటుంది .రెండవ అంకం లో రావణ పరిచయం విష్కంభం ద్వారా చూపాడు. ముని, సోదరులతో మిధిల చేరుతారు .మూడవ అంకం లో రావణుడు సీతను పెళ్లి చేసుకొంటానని విష్కంభం ద్వారా చెప్పిస్తాడు మురారి .రాముడు శివ ధనుర్భంగం చేయగానే రావణ పురోహితుడు శేష్కలుడు దీనికి ప్రతీకారం జరుగుతున్దంటాడు .నాలుగులో శూర్పణఖ తనకు జరిగిన అవమానాన్ని అన్న రావణునకు తెలియ జేస్తుంది .మాల్యవంతుడు రాముడిని వనవాసం చేయటానికి కైకేయిని ప్రేరేపించాని శూర్పణఖకు బోధిస్తాడు .పరశురాముడు మిధిలకు చేరినట్లు మొదలైనవి విష్కంభం ద్వారా తెలియ జేయ బడుతాయి .రామ వనవాసం ప్రారామ్భమౌతుంది .పంచమాంకం లో జాంబ వంతుడికి శ్రవనుడికి మధ్య సంభాషణ విష్కంభం ద్వారా తెలుస్తుంది .సీతాపహరణం జరుగుతుంది వాలివధ సుగ్రీ వ పట్టాభిషేకం జరిగిపోతాయి .ఆరులో రాముడు సేతుబంధనం ,రాముడు లంకా ప్రవేశం లను శుక శారణులు రావణుడికి తెలియ జేస్తారు .రామ రావణ యుద్ధాన్ని విద్యాధరులు వివరిస్తారు .సప్తమాంకం లో రామాదులు అయోధ్యకు చేరటం అంతా రామాయణం పదమూడవ సర్గ లో చెప్పినట్లు జరుగుతుంది నగర ,పర్వత పట్న వర్ణన లుంటాయి .భరతుడు రాముడికి స్వాగతం చెబుతాడు .శ్రీ రామ పట్టాభి షేకం తో అనర్ఘ రాఘవ నాటకం పరి సమాప్త మౌతుంది .
మురారి పాత్ర చిత్రణ ఆకర్షణీయం గా ఉండదు .రామాయణ కధలో మార్పులు చేశాడు .విష్కంభాలతో కద ఎక్కువ భాగం చెప్పటం ఒక గొప్ప ముందడుగు .రక్తి కట్టించటానికి బదులు బోరు కొట్టిస్తుంది .కధాగమనం కుంటినడక నడుస్తుంది .వస్త్వైక్యం కొరవడి ఇబ్బంది కలిగిస్తుంది .చదువుకోవటానికే కాని ప్రదర్శనకు అనుకూలించని నాటకం .దీనికి తోడూ ప్రసిద్ధాలు కాని పదాలు చాలా వాడటం వలన మనకు అర్ధం కావు .పండతకవి అని ముందే చెప్పుకొన్నాం .’’చిత్తం అనే శుక్తి (ముత్యపు చిప్ప)తో అనేక స్వాతి బిందువుల రూపం లో ఉన్న శాస్త్రాలను తాగేసి అక్షర రూపం అయిన ముత్యాల హారాన్ని రాశాను ‘’అని చాటింపు వేసుకొన్నాడు మురారి .కాని అంత ‘’సీను’’ మనకు దృశ్యమానం కాదు . లాక్షణికులు మురారి ప్రౌఢ కవిత్వాన్ని శ్లాఘించారు .అందుకే వారు –‘’
‘’దేవీ వాచం ఉపాసతేహి బహావస్సారంతు సారస్వతం –జానీతే నితరా మాసౌ గురుకుల క్లిస్తో మురారిః కవిః’’అన్నారు అంటే సరస్వతీ దేవిని చాలా మంది ఉపాసిస్తారు కానీ సారస్వత సారం ,క్లిష్టమైన గురుకుల వాసం చేసిన మురారికే తెలుస్తుంది .’’
ఆధునికులు కూడా మురారి పాండిత్యాన్ని ,కవిత్వాన్ని మెచ్చుకోలేదు .వీర రసం కోసం దీర్ఘ సమాసాలు రాశాడు ,అవి ఓజో గుణాన్ని కలిగించాయి శైలికి తోడ్పడ్డాయి .శార్దూల విక్రీడితాలనే ఎక్కువగా వాడాడు .పరిసర పరిజ్ఞానం బాగా తక్కువ అనిపిస్తాయి అతని నగర వర్ణనలు .శ్రీశ్రీ ‘’పొడిచేస్తానన్నవాడు పొడి పొడి చేశాడు ‘’అని ఎప్పుడో అన్నట్లు తన నాటకం లో ‘’గంభీరత ‘’ఉంటుందని మురారి చెప్పుకొన్నా పేలవం గా నడిచింది .పాత్రలన్నీ ‘’స్టీరియో టైప్ గా టైలర్ మేడ్ షర్ట్ లు’’గా ఉన్నాయి .ఉబ్బెయ్యటం ఉత్ప్రేక్షల్తో ఆకాశానికి ఎగరేయటం తో నేలవిడిచిన సాము అయింది .జాంబ వంత ,జటాయువుల మధ్య జరిగిన సంభాషణలు మరీ చౌకబారు .రసవంతమైన, అర్ధవంతమైన, ఆలోచనాత్మకమైన సంభాషణలు కాగడా వేసి వెతికినా కనిపించటం కష్టం .కాని మురారి సంస్కృత భాషను వాడుకొన్న తీరు అద్భుతం అన్నారు . చెవికి ఇంపైన శబ్ద ప్రయోగాలు ,తగిన ఛందో రీతులను వాడి మనసులనూ ఆకర్షిస్తాయి .ఈ నవ్యతకు అబ్బుర పడ్డారు .
‘’ఆనేన రంభోరు భవన్ముఖేన తుషారా భానోస్ తులయా ధ్రతస్య –ఊనస్య నూనం ప్రతిపూర న్యాయ –తారా స్పురంతీప్రతిమాన ఖండాః’’-భావం –‘’త్రాసులో చంద్రుడినిపెట్టి తూస్తే ,అందమైన ముఖం కల ఓఅమ్మాయీ నీ కు సాటి రాక తారల భారాన్నీ కలుపుకోవాల్సి వస్తోంది చంద్రుడికి ‘.’ఇలా కొన్ని మెరుపులు మెరిపిస్తాడు .మొత్తం మీద చూస్తె ఆహా అనలేం ఓహో అనలేం .కాళి దాస భవభూతులకంటే మధ్యే మార్గం తృతీయ పంధా తొక్కి ‘’అనర్ఘ రాఘవం ‘’అంటే అతివిలువైన లేక విలువే కట్ట లేనంత వీర శూరా పరాక్రమ శీలుడైన శ్రీరాముని చరిత్రను నాటకం గా మలచిన మురారి మాత్రం కవిగా ‘’అనర్ఘం ‘’అని పించుకోలేక పోయాడు .
మరోకవి దర్శనం రేపు
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-14-ఉయ్యూరు

