మహిళలు చదువుకోకూడదు. బురఖాలు వేసుకోకుండా బయటకి రాకూడదు. కనీసం నెయిల్ పాలిష్ కూడా వేసుకోకూడదు… తాలిబన్ ఫత్వాలివి. ఇస్లాం అందరికి సమాన హక్కులిచ్చింది. నేను చదువుకుంటే ఏమవుతుంది? బురఖా వేసుకోకుండా స్కూలుకు వెళ్తే ఏం చేస్తారు?- అని ఒక పన్నెండేళ్ల పిల్ల ప్రశ్నించింది. అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించిన తాలిబన్ ఈ ప్రశ్నలకు నివ్వెరపోయింది. ఏం చెప్పాలో తెలియక ఆమెపై బులెట్ల వర్షం కురిపించింది. కాని ఆ పిల్ల బులెట్లను సైతం తట్టుకొంది. దాడి జరిగిన ఏడాది లోపునే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. ఇప్పుడు అతి చిన్న వయస్సులో నోబెల్ శాంతి బహుమతిని పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కింది. ఆమె పేరు మలాలా. ఆమె ఆత్మకథే ‘ఐయామ్ మలాలా’. గతంలో ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను ‘ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం’ ప్రచురించింది. ఆ కథనమే ఇది..
గోళ్లకు రంగు వేసుకుంటే కొరడా దెబ్బ
గ్రామంలో మహిళల జీవితం అనేక కట్టుబాట్ల మధ్య నడిచేది. మహిళలు బురఖా వేసుకోకుండా బయటకు రాకూడదు. సన్నిహిత బంధువులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడకూడదు. నేను టీనేజర్‌ను అయిన తర్వాత కూడా బురఖా వేసుకొనేదాన్ని కాదు. దీనితో మా బంధువులకు చాలా కోపంగా ఉండేది. మా తెగలో మహిళలను సరిగ్గా చూసేవారు కాదు. వారికి చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఎవరితోనైనా ప్రేమలో పడితే- నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఇలాంటి వాటితో పాటుగా- మా తెగలో స్వర అనే ఒక సంప్రదాయముండేది. మాకు, వేరే తెగవారికి మధ్య తగువు వస్తే- దానిని పరిష్కరించుకోవటానికి ఒక అమ్మాయిని ఆ తెగ వారికి ఇచ్చేసేవారు. ఆ తెగలో పురుషులు ఆ అమ్మాయిని తమ సుఖాలకు వాడుకొనేవారు. ఈ ఆచారాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాని అనధికారికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పస్థూన్ సంప్రదాయం ప్రకారం- . ఇలాంటి వాటి వల్ల మహిళలు నష్టపోతున్నారని చాలా సార్లు మా నాన్నతో వాదించేదాన్ని. గతంలో పరిస్థితులు మరింత కఠినంగా ఉండేవని చెప్పేవాడు నాన్న. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రకరకాల చట్టాలు చేశారు. మహిళలు నవ్వటాన్ని నిషేధించారు. తెల్ల రంగు పురుషులకు మాత్రమే చెందుతుందని ప్రకటించి- మహిళలు తెల్ల బూట్లు వేసుకోవటాన్ని నిషేధించారు. గోళ్ల రంగు వేసుకుంటే కొరడాతో కొట్టేవారు. ఇలాంటివన్నీ నాన్న చెబుతున్నప్పుడు నా ఒళ్లు భయంతో జలదరించేది.
అర్థరాత్రి పుట్టిన దేశం నాది. మధ్యాహ్నం నేను మరణానికి చేరువయ్యాను..
ఏడాది క్రితం.. నేను ఇంటి నుంచి స్కూలుకు వెళ్లా. మళ్లీ ఇప్పటి దాకా నేను మా ఇంటికి తిరిగి వెళ్లలేదు. నన్ను తాలిబన్లు బుల్లెట్లతో కాల్చారు. కొందరు నేను మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లనన్నారు. కాని ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వెళ్తానని నా మనసుకు తెలుసు. మనం ఎంతగానో ప్రేమించిన దేశాన్ని వదిలి వెళ్లాలని ఎవరూ అనుకోరు. నేనూ అంతే! ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కళ్లు తెరిచి చూస్తా. నా స్వదేశం నుంచి ఐదు గంటల దూరంలో ఉన్నాననే సత్యం ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులతో పోలిస్తే నా దేశం వందల ఏళ్లు వెనకబడి ఉంది. సుఖవంతమైన జీవితానికి అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రతి కుళాయి నుంచి వేన్నీళ్లు, చన్నీళ్లు వస్తాయి. స్విచ్ వేసిన వెంటనే లైట్లు వెలుగుతాయి. చమురు దీపాల అవసరమే ఉండదు. బజారు నుంచి గ్యాస్ సిలిండర్లు తేవాల్సిన అవసరముండదు. ఇక్కడ మన తిండి కూడా ప్యాకెట్లలో తినటానికి రెడీగా ఉంటుంది. కిటికీలో నుంచి బయటకు చూస్తే పెద్ద పెద్ద భవంతులు కనబడతాయి. నల్లటి రోడ్ల మీద వాహనాలు ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. మరో వైపు చూస్తే లాన్లు కనిపిస్తాయి. కానీ నా కళ్లు మూసుకుంటే- స్వాట్ వ్యాలీ- కళ్ల ముందు కనిపిస్తుంది. ఒక వైపు మంచు కొండలు… మరో వైపు పచ్చని చెట్లు… వేగంగా ప్రవహించే నదులు… ఇవన్నీ గుర్తుకొస్తే నా మనసు పులకించిపోతుంది. నా స్కూలు గుర్తుకొస్తుంది. నా స్నేహితురాలు మోనిబా కళ్లముందు కదులుతుంది.
కాని నేను లండన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్నది నిజం. కల చెదిరిపోతుంది.
ఆ రోజు మర్చిపోలేను..
2012, అక్టోబర్ 9. నా జీవితం మారిపోయిన రోజు. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వాస్తవానికి నాకు పరీక్షలంటే భయం లేదు. స్వాట్ వ్యాలీలో తాలిబన్ల పాలన తర్వాత స్కూలు బోర్డులన్నీ మాయమైపోయాయి. బయట నుంచి చూస్తే లోపల స్కూలు ఉందనే విషయం కూడా తెలియదు. నాలాంటి అమ్మాయిలకు స్కూలు ఒక వేరే ప్రపంచం. అప్పటి దాకా మా ముఖాలను కప్పి ఉంచిన స్కార్ఫ్‌లన్నీ మాయమైపోతాయి. మేము మా గ్రౌండ్‌లోకి వస్తాం. పైన ఆకాశం.. చుట్టూ పర్వతాలు.. మధ్యలో మేము. ఒక అమ్మాయి ‘ఆసాన్ భాష్’ (స్టాండ్ ఎట్ ఈజ్) అని అరుస్తుంది. మేము మా కాళ్లను నేలకు వేసి కొడతాం. ‘అల్లా’ అని అరుస్తాం. ఆ తర్వాత ఆమె ‘హోషియార్’ (అటెన్షన్) అని అరుస్తుంది. మేమందరం మళ్లీ అల్లా అని అరుస్తాం. ఆ స్కూలును నేను పుట్టకముందు మా నాన్న స్థాపించాడు. గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న గోడ మీద ‘కుషాల్ స్కూల్’ అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది. మేము వారానికి ఆరు రోజులు స్కూలుకు వెళ్తాం. ఉర్దూ గ్రామర్ చదువుతాం. ఇంగ్లీషులో స్టోరీలు రాయటానికి ప్రయత్నిస్తాం. నా స్నేహితుల్లో చాలామందికి డాక్టర్ కావాలనేది ఒక కల. వారు డాక్టర్లు కావటం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని స్కూలు బయట చాలా మంది అలా అనుకోరు. స్వాట్ వ్యాలీలోని ప్రధాన నగరమైన మింగోరాకు చెందిన కొందరికి, తాలిబన్‌లకు అమ్మాయిలు చదువుకోవటం ఇష్టం లేదు.
ఆ రోజు కూడా మామూలుగానే ప్రారంభమయింది. పరీక్ష మాత్రం ఒక గంట ఆలస్యంగా మొదలయింది. ఉదయాన్నే నాన్న ప్రతి రోజు మాదిరిగానే ‘టైం అయిపోయింది..జానేమన్’ అని లేపాడు. ‘కొద్దిసేపు పడుకోనీ..అబ్బా’ అన్నా. ఆ తర్వాత అమ్మ వచ్చి ‘పిషో’ అని గట్టిగా అరిచింది. పర్షియన్‌లో పిషో అంటే పిల్లి అని అర్థం. అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరిది. ‘‘బాబీ..లేటు అయింది..’’ అని గట్టిగా అరిచా. మా సంస్కృతిలో మగవాళ్లందరిని సోదరులని పిలుస్తాం. అమ్మను ఏడిపించాలంటే అప్పుడప్పుడు నేను కూడా అలా పిలుస్తూ ఉంటా. మా ఇంటి ముందు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ఒక బెడ్, ఒక బీరువా ఉంటుంది. ఈ ఫర్నిచర్‌ను నేనే కొన్నా. స్వాట్ వ్యాలీలో శాంతి కోసం ప్రచారం చేసినందుకు, ఆడపిల్లలు స్కూలుకు వెళ్లాలని ప్రచారం చేసినందుకు నాకు వచ్చిన అవార్డుల ద్వారా ఈ ఫర్నిచర్ కొన్నాను. స్కూలు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. గతంలో నడిచే వెళ్లేదాన్ని. తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత బస్సులో వెళ్ళాల్సి వచ్చేది. బస్సులో వెళ్తే ఐదు నిమిషాలు పడుతుందంతే. నాకు బస్సులో వెళ్లడమంటే ఇష్టం. బస్సు డ్రైవర్ ఉస్మాన్ అలీని ‘భాయిజాన్’(సోదరుడు) అని పిలుస్తాం. అతను రకరకాల కథలు చెప్పి మమల్ని నవ్విస్తుంటాడు. నేను బస్సులో వెళ్లటానికి మరో కారణం ఉంది. ఏడాది నుంచి నాకు పత్రికల్లో వార్తల రూపంలో తాలిబన్ల నుంచి కొన్ని బెదిరింపులు వచ్చాయి. చిన్న చిన్న చీటీల మీద బెదిరింపులు రాసి గుర్తు తెలియని వ్యక్తులు నా మీద విసిరేవారు. దీనితో మా అమ్మ నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ నడిచి స్కూలుకు వెళ్లనిచ్చేది కాదు. తాలిబన్లు ఎప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకోలేదు. అందువల్ల నేను పెద్దగా భయపడలేదు. మా నాన్నపై దాడి చేస్తారనే భయం మాత్రం ఉంది. మా నాన్న తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. అందుకే వాళ్లు నాన్న స్నేహితుడు జహీద్‌ఖాన్‌ను నుదుటి మీద కాల్చి చంపేశారు. మసీదుకు ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో అందరూ నాన్నను- ‘‘జాగ్రత్తగా ఉండు.. ఇక నీ వంతే’’ అని హెచ్చరిస్తుండేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు భయమేసేది.
మా వీధిలోకి బస్సు రాదు. అందువల్ల వీధి చివరే బస్సు దిగి ఇంటికి నడిచివచ్చేదాన్ని. ఎవరైనా దాడి చేస్తే ఇక్కడే చేస్తారని అనుకొనేదాన్ని.
నేను వీధిలో నడుస్తూ ఉంటే హఠాత్తుగా ఒక టెర్రరిస్టు నా మీదకు దూకి కాల్చేసినట్లు కలలు వచ్చేవి. ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచించేదాన్ని. కాలికి ఉన్న చెప్పు తీసి ఆ టెర్రరిస్టును కొట్టాలనుకొనేదాన్ని. కానీ అలా చేస్తే నాకు, టెర్రరిస్టుకు తేడా ఏముందనిపించేది. దాని కన్నా అతనిని- ‘‘నన్ను కాల్చు. కానీ నేను చెప్పేది విను. నువ్వు చేస్తున్నది తప్పు. నాకు, నీకు ఎలాంటి శతృత్వం లేదు. ప్రతి అమ్మాయి స్కూలుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా. అంతకు మించి నాకేం తెలియదు’’ అని ప్రార్థించాలనిపించేది.
రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత గేటు తాళం పెట్టేదాన్ని. చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తూ పడుకొనేదాన్ని. నా ఆలోచనలన్నీ నా ప్రాణ స్నేహితురాలు మోనిబాకు చెప్పేదాన్ని. నాకు మోనిబా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. జస్టిన్‌బీవర్, ట్విలైట్ మూవీస్ దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల దాకా అన్ని విషయాలు మాట్లాడుకొనేవాళ్లం. మోనిబాకు ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది కోరిక. కానీ వాళ్లింట్లో ఒప్పుకోరని తెలుసు. అందువల్ల అందరితోను డాక్టర్ అవుతానని చెబుతుండేది. మా సమాజంలో అమ్మాయిలు టీచర్లు కావాలి. లేదా డాక్టర్లు కావాలి. ఇతర వృత్తుల్లో చేరటానికి అవకాశమే ఉండదు. నాకు చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఉండేది. ఆ తర్వాత సైంటిస్ట్ కావాలనుకున్నా. రాజకీయాల్లోకి వెళ్లాలని ఉండేది. ఈ విషయం చెబితే మోనిబా భయపడింది. తాలిబన్లకు తెలిస్తే చంపేస్తారని హెచ్చరించింది. ‘‘ఏం భయపడకు. మనలాంటి వాళ్ల కోసం తాలిబన్లు బులెట్లు వేస్ట్ చేసుకోరు’’ అని ఆమెకు చెప్పా.
ఆ రోజు బస్సు హారన్ మోగిన వెంటనే మేమందరం పరిగెత్తుకుంటూ వీధి చివరకు వెళ్లాం. బస్సు అంటే మామూలు బస్సు కాదు. టయోటా టౌన్ ఏస్ ట్రక్కులో మూడు బెంచీలు వేసి ఉండేవి. దానిలో 20 మంది విద్యార్థులం, ముగ్గురు టీచర్లు కూర్చునేవాళ్లం. నా పక్కనే మోనిబా కూర్చునేది. మా బ్యాగులన్నీ బెంచీల కింద పెట్టేవాళ్లం. ఆ రోజు ఉదయం ఎండగా ఉంది. బస్సు లోపల చాలా ఉక్కగా ఉంది. ట్రక్కు అన్ని వైపులా మూసేసి ఉంది కాబట్టి బయటకు చూడటానికి కూడా లేదు. బయట బాగా ఎండగా ఉందని మాత్రం తెలుస్తోంది. బస్సు కుడివైపునకు తిరగటం మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత అంతా ఒక కలలా జరిగిపోయింది. మాకు కుడివైపు స్వాట్ వ్యాలీ తొలి ఆర్థిక మంత్రి షేర్ మహ్మద్ ఖాన్ సమాధి ఉంది. ఎడమ వైపు ఒక ఫ్యాక్టరీ ఉంది. రోడ్డుకు అడ్డంగా లేత రంగు బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చాడు. బస్సును ఆపమని చేతులు ఊపాడు. ‘‘కుషాల్ స్కూలు బస్సు ఇదేనా?’’ అని మా డ్రైవర్‌ను అడిగాడు. భాయ్‌జాన్ అవునని సమాధానమిచ్చాడు. ‘‘కొంత మంది పిల్లలకు సంబంధించిన సమాచారం కావాలి’’ అని ఆ వ్యక్తి డ్రైవర్‌ను అడిగాడు. ‘‘స్కూలు ఆఫీసులో తెలుసుకోండి’’ అని భాయ్‌జాన్ సమాధానమిచ్చాడు. ఒక వైపు అతను మాట్లాడుతుంటే- మరో వైపు ఒక వ్యక్తి బస్సు వెనకవైపు వచ్చాడు. ‘‘ఎవరో జర్నలిస్టు నిన్ను ఇంటర్వ్యూ చేయటం కోసం వస్తున్నాడు..’’ అంది మోనిబా. ఆ వస్తున్న వ్యక్తి మొహానికి రుమాలు కట్టుకున్నాడు. ఒక కాలేజీ స్టూడెంట్‌లా ఉన్నాడు తప్ప జర్నలిస్టులా లేడు. బస్సుపైకి ఎక్కి- ‘‘మలాలా ఎవరు?’’ అని అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. కాని చాలా మంది నావైపు చూశారు. బస్సు మొత్తం మీద మొహాన్ని కవర్ చేసుకొంది నేను ఒక్కదాన్నే. అతను నల్లటి తుపాకీని బయటకు తీసాడు. బస్సులో ఉన్నవారందరూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నేను మోనిబా చేతిని గట్టిగా పట్టుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అతను మూడుసార్లు కాల్చాడని నా స్నేహితులు తర్వాత చెప్పారు. ఒక బుల్లెట్ నా కంటిలోపలి నుంచి వెళ్లిపోయింది. మరో బుల్లెట్ ఎడమ భుజాన్ని తాకింది. మూడో బుల్లెట్ నా ఎడమ చెవికి తగిలింది. నాపక్కన కూర్చున్న షాజియా, కైనాత్ రియాజ్‌లకు కూడా బులెట్లు తగిలాయి. కాలుస్తున్న సమయంలో ఆ వ్యక్తి చేతులు వణికాయని నా స్నేహితులు చెప్పారు. నేను ఆసుపత్రికి వెళ్లే సమయానికి మోనిబా ఒళ్లంతా రక్తమే.
అనువాదం : సివిఎల్‌ఎన్