కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. కాకతీయ ప్రభువుల సామంత రాజులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ నేపథ్యంలో వల్లూరు మండలం చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ‘వల్లూరు’ను కూడా ఓరుగల్లు తరహాలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి.
తెలుగువారి తరగని వెలుగుల వీరనారి, కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి గురించి చలన చిత్రం చిత్రీకరిస్తున్న విషయం తెలుగు వారికి విదితమే. ఈ చిత్రంలో రాణి రుద్రమదేవి మరణానికి కారకుడైన కాయస్థ అంబదేవుడిగా జయప్రకాశ్ రెడ్డి ఓ పాత్ర పోషిస్తున్న సంగతీ తెలిసినదే. కాకతీయుల నమ్మక సామంతులే కాయస్థులు. ఆ కాయస్థ వంశీయులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి కాకతీయ ప్రభువుల ఎడల విశ్వాసపాత్రులై, సామంత రాజులై కడప జిల్లాలోని ప్రాంతాలను కడపకు చేరువలో ఉన్న ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ నేపథ్యంలో వల్లూరు మండలం చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. పురాతన పుష్పగిరి ఆలయాలు, ప్రాచీన పీఠాలు, విజయనగర సామ్రాజ్య గురువులైన విద్యారణ్యస్వామి స్థాపించిన విద్యాకేంద్రం వల్లూరు మండలంలో ఉన్నాయి. వల్లూరు మండలంలో శ్రీ చక్రమున్న ఆలయాన్ని శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. చోళులు, కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులు, విజయనగర రాజాలు నిర్మించిన అద్భుత శిల్పకళా సంపదలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయలను చదరంగంలో ఓడించిన శ్రీ బొడ్డుచర్ల తిమ్మన పుట్టిన కొప్పోలు గ్రామం ఈ మండలంలోనిదే. 150 సంవత్సరాల క్రితం డచ్చి నిర్మాణ కట్టడమైన ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వల్లూరు మండలంలోనే ఉంది. నాచన సోమనాథుడు నడయాడిన ప్రదేశమిది. పంచమనదీ సంగమ ప్రదేశమైన వల్లూరు మండలం పర్యాటకులకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతోంది.
రాజరిక, చరిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న వల్లూరు వేదికగా కాకతీయ సామ్రాజ్యాధినేతలకు, సామంత కాయస్థులకు చాలా సన్నిహిత సం బంధం ఉంది. ఆంధ్ర దేశాన్ని ఏక చక్రాధిపత్యంగా పాలించిన రాజవంశాలలో కాకతీయుల కీర్తి గోలుకొండ కోటంత ఘనమైనదీ, గండికోట అంత లోతైనది. మొదట చాళుక్య రాజ్య పతనాంతరం స్వతంత్ర రాజ్యం స్థాపించి తెలుగు వారి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పరచిన ఘన చరిత్ర కలిగినవారు కాకతీయులు. అట్టి కాకతీయుల విశ్వాసపాత్రులైన సైన్యాధ్యక్షులు, సామంతులు కాయస్థులు. కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు విజయపరంపరలతో తెలుగుదేశాన్ని సమైక్యం చేసి, ఆంధ్రులలో వినూత్న జాతీయోత్సాహం కల్గించాడు. ఓరుగల్లు ఆంధ్రానగరి అయింది. గణపతి దేవుడు ఆంధ్రాధీశుడయినాడు. ఈ గణపతి దేవుడకి విశ్వాస పాత్రుడిగా అనేక యుద్ధాలలో పాల్గొని తన ప్రభువునకు విజయం సాధించి పెట్టిన మహావీరుడు కాయస్థ గంగాయసాహిణి. గణపతిదేవుని దక్షిణ దిగ్విజయ యాత్రలో నెల్లూరు తెలుగు చోళరాజు మనుమసిద్ధికి గంగాయసాహిణి సహాయం చేశాడు. కడప జిల్లా ‘వల్లూరు’ పట్టణమును రాజధానిగా చేసు కొని, చోళరాజ్యంపై దండెత్తిన రాయదేవ మహారాజు అనబడే రక్కస గాంగ అను వైదుంబ రాజును సాహిణి జయించాడు. శ్రీ.శ. 1250 నాటి కడప జిల్లా నందలూరు శాసనం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నవి. ఈ యుద్ధంలో గంగాయసాహిణితో పాటు అతని మేనల్లుడైన జన్నిగదేవుడు కూడా పాల్గొన్నాడు.
ఈ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని గణపతిదేవుడు గంగయసాహిణిని పానగల్లు నుంచి మహారాజవాడి వరకు (మహారాజవాడి అనగా కడప జిల్లా పులివెందుల తాలూకా మోపూరు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా చింతామణి తాలూకా మిండగల్లు వరకు ఉన్న ప్రదేశం) ఉన్న ప్రాంతానికి అధిపతిగా నియమించాడు. క్రీ.శ. 1255 నాటి మాచుపల్లె శాసనం గంగాయసాహిణి సామంతుడు సోమిదేవుడు వల్లూరు పట్టణం రాజధానిగా పాలిస్తున్నట్లు తెలుపుతున్నది. ఆ విధంగా కడప జిల్లా వల్లూరు రాజధాని కేంద్రంగా కాకతీయుల సామంతులైన కాయస్థుల పాలన కడప జిల్లాలో ప్రారంభమైనది. గణపతి దేవుడు గతించిన తర్వాత రుద్రమదేవి రాజ్యానికి వచ్చిన వెంటనే ప్రతిభ ప్రాతిపదికన సమర్థులకు, నమ్మకస్తులకూ ప్రాధాన్యం ఇస్తూ, కుల మత ప్రాంతాలకతీతంగా, ప్రధాన పదవుల్లో వారిని నియమించింది. వారిలో శివదేవయ్య, కాయస్థ జన్నిగదేవుడు, త్రిపురాంతక దేవుడు, గోనగన్నారెడ్డి, రేచర్లప్రసాదిత్యనాయుడు ముఖ్యలు. వీరందరూ రాణి రుద్రమకు అహర్నిశలు అండగా ఉండి, తమయావత్తూ శక్తియుక్తులూ కాకతీయరాజ్య క్షేమానికై, విస్తరణకై శ్రమించిన శౌర్యులు రాజనీతి కోవిదులు.
ఈ కాయస్థ జన్నిగదేవుడు వల్లూరు రాజ్య ప్రాంతాలను కలుకడ (కలకడ) వకైదుంబ రాజు భుజబలం వీర నారాయణుని నుంచి జయించాడు. గంగాయసాహిణికి పుత్రసంతానం లేకపోవడం వల్ల అతని మేనల్లుడైన జన్నిగదేవుడు కాయస్థ రాజ్యానికి వారసుడైనాడు. క్రీ.శ. 1258-59 మధ్య కాలంలో జారీ చేయబడిన జన్నిదేవుడి శాసనాలు కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. తన మేనమామ గంగయసాహిణి వలెనే పానగల్లు నుంచి మహారాజుపాడి వరకు ఉన్న ప్రాంతాన్ని పాలిస్తూ గణపతిదేవునికి విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. జన్నిగదేవుడి తర్వాత అతని సోదరుడైన మొదటి త్రిపురారి దేవుడు రాజైనాడు. ఇతడు కూడా రుద్రమదేవికి సామంతునిగా ఉంటూ తన పూర్వీకులైన గంగయసాహిణి, జన్నిగదేవుడు నిర్వహించిన పదవులను నిర్వహించినాడు. త్రిపురారి దేవుడు రుద్రమదేవికి ప్రధాన సైన్యాధ్యక్షునిగా ఉండి కమ్మనాడు, మాలికెనాడు, పొత్తపెనాడు, గండికోట మొదలగు సీమలకు అధికారిగా కాకతీయుల ప్రతినిథిగా పాలించాడు.
ఒక స్ర్తీ రాణి కావడం ఓర్చుకోలేని రుద్రమదేవి సవతి కుమారులైన హరహర మురారి దేవులు రుద్రమపై తిరుగుబాటు చేసారు. రేచర్ల ప్రసాదాదిత్యుడు, కాయస్ఠ జన్నిగదేవుడు, అతని సోదరులైన త్రిపురారి దేవుడు, అంబదేవుడు, గోన గన్నారెడ్డి మున్నగు సేనానుల సహకారంతో రుద్రమ దేవి ఆ తిరుగుబాటును తిప్పికొట్టింది. రుద్రమదేవి దక్షిణ దేశ జైత్రయాత్ర చేపట్టింది. త్రిపురారి దేవుడు (1270-72) తర్వాత అంబదేవుడు (1272-1302) ముప్ఫై సంవత్సరాలపాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇతడు అనేక మంది రాజులను జయించాడు. 72 మంది రాజులను వధించాడు. కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర కాయస్థ రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. క్రీ.శ. 1287 నాటి అత్తిరాల శాసనం ద్వారా అంబదేవుడు వల్లూరు పట్టణం రాజధానిగా గండికోట, ములికినాడు, రేనాడు, పెనదాడి, పెడకల్లు, సకిలి, ఏఱువ, పొత్తపినాడు మొదలగు దేశాలను ఏలినట్లు తెలుస్తోంది.
క్రీ.శ. 1290 ప్రాంతంలో కాకతీయ యువరాజు ప్రతాపరుద్రుడు, రాణి రుద్రాంబ తరపున అంబదేవునిపై దండెత్తి అతని రాజ్యంలోని ఉత్తర ప్రాంతాలు జయించినట్లు తెలుస్తూ ఉంది. అంబదేవుడి బుద్ధి చెప్పాలని రాణీ రుద్రమదేవి తలపోసింది. అంబదేవునితో రుద్రమదేవి పోరాటం భీకరంగా సాగింది. క్రీ.శ. 1290లో అంబదేవునితో యుద్ధంలో తన సైన్యాధ్యక్షునితో సహా రుద్రమ దేవి మరణించిందని చందుపట్ల గ్రామంలోని కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం తెలియజేస్తుంది. కాకతీయలకు విధేయులుగా సామంతులుగా ఉన్న కాయస్థుల కార్యక్షేత్రమైన ‘వల్లూరు’ను కూడా ఓరుగల్లు తరహాలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి.
– మొగిలిచెండు సురేశ్