గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31

29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి  అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది .గంభీరమైన రచన తో సాగి ఉత్కంఠ రేకెత్తిస్తుంది .దీన్ని విశాఖ దత్తుని ముద్రా రాక్షసం తో పోలుస్తారు .రాక్షసం లో స్త్రీ పాత్ర లేదు ఇందులో ద్రౌపది ఉన్నది .అది ముఖ్యమైన భేదం .భట్ట నారాయణుడు కన్యాకుబ్జ బ్రాహ్మణుడు .బెంగాల్ రాజు ఆది సూరుని ఆహ్వానం మేరకు  బెంగాల్ లో స్తిర వాసం ఏర్పరచుకొన్న అయిదుగురు బ్రాహ్మణులలో భట్టు ఒకడు .టాగూర్ వంశ మూల పురుషుడు భట్ట నారాయణుడు అని బావిస్తారు .బెంగాల్ రాజు ఆదిసూరుడు బ్రాహ్మణాభిమాని కనుక ఈ కుటుంబాలను ఆహ్వానించి పోషించాడు .నారాయణుడికి ‘’భట్టు ‘’అనేది బిరుదు వాచకం .అలాగే ‘’మృగ రాజలక్ష్మ’’అనేది, సింహ అనేది కూడా ఇతని బిరుదే .వేణీ సంహారం లో తనను గురించి ఏమీ చెప్పుకోలేదు .ఇతరులు చెప్పింది ,లోకం లో ప్రచారం లో ఉన్న వాటిని బట్టే వివరాలు తెలిశాయి .వామనుడు వేణీ సంహారం నుంచి కొన్ని ఉదాహరణలిచ్చాడు .దండి కూడా భట్టును గురించి రాశాడు .కనుక వీరిద్దరికంటె ముందువాడు అని  నిర్ణ యించారు .భట్టు మూడు రచనలు చేశాడని దండి అన్నప్పటికీ వేణీసంహారం ఒక్కటే లభించింది .వేణీ సంహారం అనేదానికి పెద్దలు –జుట్టు ముడి వేయటం కోసం సంహారం అని ,వేణి వలన జరిగిన కౌరవ సంహారం అని ,వేణికి సంహారం అంటే జుట్టుకు నివృత్తి అని అర్ధాలు చెప్పారు .ఇందులో మొదటిదే బాగా ఉందనిపిస్తుంది

వేణీసంహారం లో భట్టు కవితా పట్టు

వేణీసంహార నాటకం మహా భారత ఇతి వృత్తం .  .వేణి అంటే జడ .ఇందులో ఆరు  అంకాలున్నాయి .ప్రధమాం కం లో శ్రీకృష్ణుని కౌరవుల వద్దకు రాయ బారిగా ధర్మ రాజు పంపి సంధి చేయమని కోరటం భీమ ద్రౌపదులకు ఇష్టం ఉండదు .సహదేవుడు భీముడిని శాంత చిత్తుని చేస్తాడు .కాని నిండుసభలో పాండవ రాజ పత్నియైన ద్రౌపది  తీవ్ర అవమానం పొందటం హృదయ శల్యం గా భావించి భీముడిని రెచ్చ గొట్టే ప్రసంగం చేసి అతనిలోని పౌరుషాగ్నిని రగుల్గొల్పుతుంది .ఈ మాటలకు ఉద్రేకం, ఉత్తేజం పొందిన భీముడు తన గద తో దుర్యోధనుడి తొడలను విరుగ గొట్టి ,దుశ్శాసనుడి వక్షస్తలాన్ని చీల్చి రక్తం తాగి ,ఆ రక్తం తో తడిసిన చేతులతో ద్రౌపది కేశ పాశాన్ని ముడుస్తాను అని ఘోర ,భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపది దీనితో శాంతిస్తుంది .విఫలమైన సందిరాయబారం తో వికల మనస్కుడై కృష్ణుడు అప్పుడే తిరిగి వస్తాడు .ధర్మ రాజు ఇక గత్యంతరం లేక కురుక్షేత్ర సంగ్రామానికి పూనుకొనగా భీముడు రెట్టించిన ఉత్సాహం తో యుద్ధ భూమిలో ప్రవేశిస్తాడు .

రెండవ అంకం లో దుర్యోధనుడి భార్య భానుమతికి  నూరు పాములను ఒక ముంగిస చంపి నట్లు కల వచ్చి కీడు ను శంకించి కలవర పడుతుంది  .శాంతికోసం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తుంది .దుర్యోధనుడు వచ్చి భార్యను ఓదారుస్తాడు  .భార్య భర్తలు ప్రేమ సాగిస్తారు .జయద్రదుడి తల్లివచ్చి తనకొడుకును అర్జునుడు చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వార్త తెలియ జేస్తుంది .గాంధారీ పుత్రుడు యుద్ధానికి వెడతాడు .

మూడో అంకం లో ద్రుస్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపుతాడు .ఈ వార్త ద్రోణ సుతుడు ఆశ్వతామకు తెలిసి క్రోధం తో ఉడికి పోతుంటే మేన మామ కృపుడు ఊరడించి దుర్యోధనుడి దగ్గరకు తీసుకుకొని వెళ్లి మేనల్లుడిని సేనాపతిని చేయమంటాడు .అంతకు ముందే కర్ణుడిని చేస్తానని ఆతను మాట ఇచ్చానంటాడు .కర్ణ ఆశ్వత్థామల మధ్య తీవ్ర వాదోప వాదాలు నడుస్తాయి రాజు సమక్షం లోనే. కర్ణుడు బతికుండగా తాను  ఆయుధం దాల్చనని ప్రతిజ్ఞ చేస్తాడు ద్రోణ సుతుడు .ఇంతలో భీముడు దుస్శాసనుడిని చంపి వక్షస్థలం చీల్చి నెత్తురు తాగాడన్న వార్తా తెలుస్తుంది .

నాలుగో అంకం లో – కర్ణుడికొడుకు వృష సేనుడు చనిపోయాడని వార్తాహరుడు రాజుకు చెబుతాడు .రెట్టించిన కోపం తో ద్రుత రాష్ట్ర సుతుడు యుద్ధానికి సన్నద్ద మవుతాడు .ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు యుద్ధం వద్దని పాండవులతో సంధి ముద్దు అని హితం చెబుతారు .

ఐదో అంకం -లో భీముడు అర్జునుడు దుర్యోధనుడు ఎక్కడో దాక్కున్న సంగతి తెలిసి వెతుకుతూ ఉంటారు .భీముడిని ద్వంద్వ యుద్ధానికి రమ్మంటాడు రాజు .కాని అర్జుండు కల్పించుకొని ఆపేస్తాడు .ధర్మ రాజు వీరిద్దరిని రమ్మన్న వార్త విని అన్నగారి దగ్గరకు వెళ్ళిపోతారు .అశ్వత్థామ వచ్చి రాజును కలుస్తాడు .

చివరిది అయిన ఆరవ అంకం –కౌరవ పక్షం లో అందరూ యుద్ధం లో చనిపోతారు .దుర్యోధనుడోక్కడే మిగిలాడు .ప్రాణ భీతితో ఒక సరస్సులో దాక్కుంటాడు రాజు .పసికట్టిన భీముడు సరస్సు సమీపానికి వస్తాడు .దుర్యోధనుడు పైకి వచ్చి భీముడితో గదా యుద్ధం చేస్తాడు .ధర్మ రాజు గూఢచారి భీముడి చేతిలో దుర్యోధనుడు చనిపోయినట్లు చెబుతాడు .అందరూ సంతోషిస్తారు. ధర్మ రాజుకు పట్టాభిషేకం ద్రౌపదికి వేణీ సంహారోత్సవానికి సర్వం సిద్ధ చేస్తారు .ఇంతలో దుర్యోధనుడి రాక్షస స్నేహితుడొకడు చార్వాక ముని వేషం లో వచ్చి ద్వంద్వ యుద్ధం లో భీముడు నిహతుడైనట్లు వార్త చెపుతాడు .ఇది వరకు తానూ చేసిన ప్రతిజ్ఞా ప్రకారం ధర్మ రాజు మరణ ప్రయత్నం చేస్తాడు .ఈలోగా ఒళ్ళంతా రక్త ప్రవాహం తో తడిసి అలసిన  భీకర రూపం లో భీముడు  రంగ ప్రవేశం చేస్తాడు .అతడే దుర్యోధనుడు అనుకోని యుదిస్థిరుడు యుద్ధం చేయటానికి సిద్ధమవుతాడు .కాసేపటికి రక్తం ఓడుతున్నవాడు దుర్యోధనుడిని చంపిన భీముడుగా అందరూ గుర్తిస్తారు .భీముడు  దుశ్శాసన రక్తం తో నిండిన చేతులతో ద్రౌపదీ దేవి వేణి కి పూసి కురులను ముడిచి వేణీ సంహారం చేస్తాడు ,శ్రీకృష్ణుడు వచ్చి భరత వాక్యం పలుకుతాడు .

వేణి లో నారాయణ భట్టు నాటక రీతి

భారత యుద్ధ క్లైమాక్స్ ఘట్టాలను ఎన్నుకొని ,నాటకీయతను పోషించి మంచి ఉత్సుకతను నింపాడు వేణీ సంహారం లో కవి భట్ట నారాయణుడు .నాటక భాగాలైన సంధి దాని అంగాలను చక్కగా వినియోగించుకోన్నాడని విమర్శక ప్రశంసలు పొందాడు .ధనుంజయ ,విశ్వనాధ మొదలైన నాటక లక్షణ కారులు ఈ నాటకాన్ని చాలా చోట్ల ఉదాహరించారంటే దాని ప్రతిభ ఏమిటో అర్ధమవుతుంది .ఇందులో వేణీసంహారానికే ప్రాధాన్యత నిచ్చి రాశాడు .యుద్ధ ఫలితం అయిన పాండవ రాజ్య ప్రాప్తికి అంత ప్రాధాన్య మీయ లేదు .ఫల ప్రాప్తి నిర్వహణ లో బహుముఖీన ప్రజ్న చూపాడుకవి .మొదటి అంకం లో ముఖ సంధి ద్వితీయం లో ప్రతిముఖ సంధి తర్వాత గర్భ సంధి చివర అవముఖ సంధి లను భట్టు నిర్వహించాడని తెలుస్తోంది .యుద్ధ ఫలితం చివరి అంకం లో డోలాంన్దోళనం లో కాసేపు పడేశాడు చార్వాక రాకతో .కనుక ఫలాపేక్ష అనిశ్చితం అనిపిస్తుంది .టెంపో సృష్టించి కుతూహలం పెంచి కధను నడిపాడు .దుర్యోధనుడు చచ్చాడనిఒక సారి ,కాదు, భీముడే అసువులు బాశాడనిఒక సారి ప్రేక్షకులు భావించే సస్పెన్స్ మెయింటైన్ చేశాడు కవి .అలాగే ఇంకోమలుపు –వస్తున్న భీముడే దుర్యోధనుడనుకొని ధర్మ రాజు రెచ్చిపోయి యుద్ధానికి దిగటం నాటకీయ పరాకాష్ట అనిపిస్తుంది .వీటినన్నిటినీ అద్భుత భయానక భీభాత్సాలతో ఆశ్చర్యాలతో నిర్వహించిన భట్ట బాణుడి నాటక నిర్వహణ తీరుకు హాట్స్ ఆఫ్ అన  బుద్ధి వేస్తుంది .

ఇంతబాగా నాటకం ఉన్నా ఇందులో కొన్ని లోపాలూ ఉన్నాయి .సన్నివేశాలు వేగం గా నిర్వహింప బడలేదు కృత్రిమ సంఘటనలు ఆకట్టుకోలేదు సుదర్శ కుడు అనే చార్వాక  సంభాషణ ‘’సుదీర్ఘ సుత్తి’’ అనిపిస్తుంది .వర్ణనలు సాగదీయటం తో గమనం మంద గించింది .కాని ఈ నాటకం లో శైలిని ‘’రసాభాస ‘’అన్నారు .ఇది పాత్రల చిత్రణకు దోహద పడింది .ఈ దృష్టిలో ఇది శ్రేష్టమైన నాటకం అనిపించింది .సందట్లో సడేమియా అన్నట్లు యుద్ధం లో దుర్యోధనుడు భార్యతో ప్రేమకలాపం చేయటం ఎబ్బెట్టు,అనౌచిత్యం  అనిపించి ‘’దా.వీ .శూ.కర్ణ ‘’(దాన వీర శూర కర్ణ )లో దుర్యోధన ‘’ఎన్టిఆర్,’’ భానుమతి ‘’ప్రభ’’ తో పాడిన డ్యూయెట్ గుర్తుకొస్తుంది .దీన్ని ‘’ముమ్మటుడు ‘’కూడా అధిక్షేపించాడు .మనకే అలా ఉంటె ఆయనకు ఉండటం లో ఆశ్చర్యమేముంది?భానుమతి స్వప్నం షేక్స్పియర్ నాటకం జూలియస్ సీజర్ భార్య కల ను జ్ఞాపకం చేస్తుందన్నారు .కవిత్వ పరం గా వేణి సంహారం తొంభై మార్కులు సాధించినా నాటక కళా ధర్మం ప్రకారం ‘’అత్తెసరు మార్కులు ‘’అంటే పాస్ మార్కులే పొందింది .వీర రసం కోసం వాడిన దీర్ఘ సమాసాలు క్లిస్ట పదాలు ప్రేక్షకులకు కొరుకుడు పడవు .

భట్టు శైలి హృదయ గతం మనోగతం కాదు అదేపెద్ద లోపం వాచ్యార్ధమైన శైలి .మన ‘’పరుచూరి బ్రదర్స్ రకం’’ అన్నమాట .ఇన్ని లోపాలున్నా  వేణీ సంహార నాటకాన్ని సంస్కృత నాటకాలలో విశిస్ట నాటకం గానే భావిస్తారు .శృంగారాన్ని అంగాంగం లో పూసి వదిలిన నాటకాల కంటే భిన్నం గా  వీరానికి ‘’ వీర తాళ్ళు’’ వేసి రంజించే ప్రయత్నం చేసి వినూత్న మార్గానికి దారి వేశాడు భట్ట బాణుడు .ఈ గొడవ ఇలా ఉంటె ఇందులో నాయకుడు ఎవరు అనే ప్రశ్న వేసుకొని విమర్శకులు బుర్రలు బద్దలు చేసుకొన్నారు .ధర్మ రాజే అన్నారు .భారత వాక్యం ద్వారా ఫల ప్రాప్తి పొందాడుకనుక ఆయనేనన్నారు .కవికికూడా ఇది ఇస్టమేనన్నట్లు కధాగమనం వలన అర్ధం అవుతుంది .

ఇది కుదరదు –మొదటి అంకం లో ప్రతిజ్ఞ చేసి చివరి అంకం దాకా కదా నడిపించి అన్నదమ్ములిద్దర్నీ చంపి రక్తం తాగి తొడలు విరగ్గొట్టి ద్రౌపదికి  వేణీసంహారం చేసింది భేముడే కనుక రియల్ హీరో ఆయనే అన్నారుకొందరు .ఫల ప్రాప్తి కలిగించిన వాడు భీముడు ఫల భోక్త ధర్మ రాజు .ప్రధాన సాధకుడు భీముడు ..సాధన ఫలాన్ని పొందిన వాడు పెద్దన్న యుదిస్థిరుడు .కనుక భీముడికే హీరో గా ఎక్కువ మార్కులు .ఇక్కడ ముద్రా రాక్షస నాటకాన్ని దీనీతో పోలుస్తున్నారు అక్కడ చాణక్యుడు కార్య సాధకుడు ,చంద్ర గుప్త మౌర్యుడు ఫల భోక్త .అక్కడ చాణక్యుడు ఇందులో భీముడు తిరుగు లేని నాయకులు అనుకొంటే సరిపోతుంది .

ధర్మాధికారి ,మహోపాధ్యాయ బిరుదాంకితుడైన ‘’జగద్ధార పండితుడు ‘’వేణీ సంహారానికి గొప్ప వ్యాఖ్యానం రాశాడు . వేణీ సంహారాన్ని వడ్డాది సుబ్బరాయ కవి తెలుగు లోకిఅందమైన  కందపద్యాలలో అనువాదం చేశారు . దీన్ని చిలక మర్తి వారికి చదివి వినిపించారట వ సు కవి .ఏంతో బాగుందని మెచ్చి ఆశువుగా –‘’వేణీ సంహారంబును –వాణీ ధవ తుల్యుడైన  వసురాయడు తా—నాణేముగా తెనిగించెను –ప్రాణంబులు లేచి వచ్చు పద్యము విన్నన్ ‘’అని మెచ్చుకున్నారు .వసురాయని వేణీ సంహార అనువాద పద్య గద్యాలను రంగ స్థలం పై పఠించేవారట.

వేణీ సంహారం కొన్ని అద్భుత శ్లోకాలను చూద్దాం .భట్టు వైవిధ్యమైన ఛందస్సును వాడాడు .పద్యా వక్త్రం ,లలితా ,ఔప చ్చ్చందసిక ,ఆర్యా ,ద్రుత విలంబిత ,ప్రహర్షిని ,పృధ్వీ ఛందస్సులను మామూలు వాటితో పాటు సందర్భోచితం గా ఉపయోగించి రక్తికట్టించాడు .

‘’చంచద్భుజ భ్రమిత చండ గదాభి ఘాత-సంచూర్నితోరుయుగళస్య సుయోధనస్య

స్యానవ నద్ద ఘన శోణిత సిక్త పాణి –రుత్తం సయిష్యతి కచాస్తవ దేవి భీమః ‘’-దీని అర్ధం –‘’వేగం గా కదిలే భుజాల చండ గదయొక్క దెబ్బలతో ముక్కలైన తోడలుకల సుయోధనుడి రక్తం తో పూసుకొన్న చేతులతో భీముడు నీ సిగను ముడి వేస్తాడు ‘’అని భీముడు ద్రౌపదికి చేసిన ప్రతిజ్ఞ ఇది .వసంత తిలక వృత్తం లో వీర రసస్పోరకం గా భట్టు రాసిన శ్లోకాన్ని అందరూ ఉదాహరిస్తారు .ఇది మన నన్నయ్య గారు భరతం లో భీమునితో నిండు సభలో ‘’అమ్భోరు నిజోరు దేశమున పంచిన ఇద్దురాత్ము చందా ఘదాహతిన్ భగ్నోరు తరోరు జేసెద యుగ్ర రణాంతరంబునన్ ‘’’ ‘’అనిపించిన పద్యం గుర్తుకు తెస్తుంది .భట్టు తనను ‘’కవి మృగ రాజు ‘’అంటే’’ కవి సింహం ‘’అని పిలుచుకొన్నాడు .మాఘుదడిలాగా విలక్షణమైన వినూత్న, పదాలను ఉపయోగించాడు భట్టు .’’కొణాఘాతమ్ ‘’అనే శబ్ద ప్రయోగం యుద్ధ సందర్భం లో చేశాడు .అంటే లక్ష ధక్కలు ,వెయ్యి భేరులు ఒకే సారి మోగితే వచ్చే శబ్దం అని అర్ధంట .కరభం అనే శబ్దాన్ని వాడాడు అంటే –మణికట్టు నుంచి చిటికెన వేలి వరకు ఉన్న భాగమట.తొడలు కలిగినదీ అనే అర్ధం కూడా ఉందట .

నాటకం లో హాస్యం పండించే విదూషక పాత్ర లేకుండా రాశాడు భట్టు .కాల వస్తు ,సమయ నటన ఐక్యతలు లేవని పాశ్చాత్య విమర్శకులు విల్సన్ ,బారువాలు ఎత్తి చూపారు .దుర్యోధనుడు భానుమతితో సరసాలు  ఆడుతుంటే ద్వారపాలకుడు ఒక్కసారిగా ప్రవేశించి ‘’భగ్నం భగ్నం ‘’అని అరుస్తాడు .అంటే ఆ గది బయట దుర్యోధనుడి రాజధ్వజం పెనుగాలికి విరిగి ఊడి పడిందని అర్ధం .ఈ సన్నివేశ కల్పనా అతనికి జరుగ బోయే కీడుకు సంకేతం గా కవి చెప్పించాడు .నాటక ప్రస్తావనలో  ధార్తరాస్త్రులు’’ అనే శబ్దాన్ని  హంసలకు,కౌరవులకు చక్కగా అన్వయించే గొప్ప శ్లోకం  చెప్పాడు .

మరో కవిని దర్శిద్దాం

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.