గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33
31- తొలిశాస్త్ర కావ్య కవి -భట్టి
‘’రావణ వధ ‘’అనే మహా కావ్యాన్ని రాసిన కవి భట్టి .దీనికి ‘’భట్టికావ్యం ‘’అనే పేరుంది .భర్త్రు కావ్యం ,రామ కావ్యం ,రామ చరిత్ర అనేపేర్లూ ఉన్నాయి .ఏడవ శతాబ్దానికి చెందిన కవి భట్టి .సంస్కృత శబ్దం ‘’భర్త్రి ‘’ప్రాకృతం లో ‘’ భట్టిఅయందని అంటారు .భర్త్రు హరి కొడుకే భట్టి అనే ఒట్టి భ్రమా ఉంది . ‘’పాణిని వ్యాకరణాన్ని రామాయణ కధకు జోడించి కవితామయం చేశాడు కావ్యాన్ని.ఒక రకం గా పాణినికి ఇది వ్యాఖ్యాన రామకధా రూపం అని చెప్ప వచ్చు . శ్రీరాముని సకల సద్గుణాభిరామునిగా తీర్చి దిద్దాడు .అగ్ర కవుల సరసన చేర్చే కావ్యం గా రావణ వధ కావ్యాన్ని నిర్వహించాడు .ఈ కావ్యం లో రావణ వధ భాగం అతి చిన్నదే అయినా ,మిగిలిన రామాయణ కావ్యాలకు భిన్నంగా ఉండాలని ‘’రావణ వధ ‘’అని టాగ్ తగిలించాడని పిస్తుంది .సంస్కృత సాహిత్యం లో శాస్త్ర కావ్యాలలో ఇదే మొట్టమొదటిది .శ్లోకాలలో రాసి దాని గౌరవాన్ని మరీ పెంచాడు .ఈ కావ్యం పాఠ్య గ్రంధం అయింది అంటే దాని విశేషమేమిటో కవి ప్రతిభ ఎలాంటిదో తెలుస్తుంది .భట్టి ని భట్టికవి ,భట్టిపండిత ,భట్టి బ్రాహ్మణ అనికూడా పిలుస్తారు .భామహుడి సమకాలికుడు .
భట్టి కవితా భట్టీయం
భట్టి రావణ వదాకావ్యం లో పూర్తిగా వాల్మీకినే అనుసరించాడు .యుద్ధ కాండ తో ఆపేశాడు .ఉత్తరా రామ చర్తిత్ర జోలికి పోలేదు .పాణిని వ్యాకరణాన్ని జన సామాన్యానికి అందించాలనే తపన తో రాసిన గొప్ప ప్రయోగ ,ప్రయోజన కావ్యం .శబ్దాల వ్యుత్పత్తి ,ప్రయోగ వైచిత్రీ వివరించిన కావ్యం ఇది .వ్యాకరణ అంశాలను కావ్యం ద్వారా బోధించాడు కనుక శాస్త్ర కావ్యం అనే మాట సరిపోయింది .కావ్యం లోని సర్గలకూ వ్యాకరణ సంజ్ఞలను పెట్టటం మరో విశేషం .మొదటి అయిదు సర్గల వరకు ‘’తిగంత’’రూపాలు చెప్పాడు వీటికే ‘’ప్రకీర్ణ కాండం ‘’అనే పేరు .ఆరవ సర్గ నుంచి తోమ్మిదివరకు చాలా లక్ష్య రూపాలను తెలియ జేశాడు .వీటికి ‘’అధికార కాండం ‘’అని పేరుంది.పదో సర్గనుందడి పదమూడవ సర్గ వరకు గుణాలంకార లక్ష్యాలు వివరించాడు .వీటినే ‘’ప్రసన్న కాండం ‘’అంటారు .పదకొండు నుంచి చివరి ఇరవై రెండవ సర్గ వరకు ‘’లట్ ‘’మొదలైన తొమ్మిది లకారాల విశిష్ట రూపాలను తెలియ జేశాడు .వీటిని తిన్గంత కాండమని పేరు .ఈ విధం గా పాణిని చెప్పిన వ్యాకరణ అంశాలను ,అలంకారాలతో మిళితం చేసి రామకధా వస్తువును ఎన్నుకొని కావ్యాన్ని రాశాడు భట్టి . శాస్త్రం ,కావ్యం అనేజోడు గుర్రాల స్వారీ చేశాడన్నమాట .వ్యాకరణ ఉదాహరణలకు శ్లోకాలు రాశాడు .వర్ణనలు వర్ణనల కోసమే రాసినట్లు ఉండికృత్రిమత కనిపిస్తుంది .
కవిత్వం విషయం గురించి చెప్పాలంటే ధారా శుద్ధి బాగా ఉంటుంది .శైలి రమ్యం గా రస బంధురం గా ఉండటం మరీ కావ్య శోభను పెంచింది .యమకాలను విస్తృతం గా ప్రయోగించటం తో కర్ణ మాధుర్యం ప్రస్పుటమైంది .ఇదేమి వ్యాకరణం రా బాబోయ్ అని అనిపించదు .ఆ ప్రవాహం లో అలా కొట్టుకు పోతాం .కధకు వ్యాకరణ బోధకు తగిన శబ్దాలను ఎంచుకొని ప్రయోగించటం లో భట్టి అసమాన మైన గట్టి పాండిత్య ప్రతిభను ప్రదర్శించాడు .శబ్ద ప్రయోగం ఆశువుగా వచ్చి చేరి నిండుదనాన్ని ,రామణీయకతనూ చేకూర్చింది .నూతన శబ్దాలకు ,సంధులకు భట్టి కావ్యం భాండాగారం గా నిలిచింది .భాష మీట పట్టు ఉందని చూపటానికి భట్టి ప్రసిద్ధం లో లేని పదాలనూ ప్రయోగించి సత్తా చాటుకొన్నాడు .చిన్న చిన్న సమాసాలే వాడి చదువరులకు గొప్ప ఆసక్తినికలిగించి వైదర్భీ రీతికి న్యాయం చేశాడు .
భట్టికవి అలంకార,వ్యాకరణాలలోనే కాదు నాట్య ,సంగీత ,వేద,వేదాన్గాలలోను అర్ధ ధర్మ శాస్త్రాలలోను అసమాన పండితుడు .రానీతిని ఔపోసన పట్టినట్లు కావ్యం తెలియ జేస్తుంది .సంభాషణా చతురుడనిపిస్తాడు .సామాన్యులు ఈ కావ్యాన్ని చూసి పారిపోరు .ఆప్యాయం గా చదివి ఆనందిస్తారు .అదీ భట్టీయం .చాలా చోట్ల భారవిని అనుకరించినట్లు తోస్తుంది .మాఘుడు భట్టిని అనుకరించాడు అదీ భట్టికి ఉన్న ప్రత్యేకత .ఉచితమైన సందర్భ శుద్ధికల వర్ణనలే భట్టి చేసి సెబాస్ అనిపించాడు .శరద్రుతువును వర్ణిస్తూ భట్టి చెప్పిన శ్లోకం మహా భేషుగ్గా ఉంటుంది .చూడండి –
‘’నతజ్జలంయన్న సుచారు పంకజం –న పంకజం తద్యదలీన షత్పదం-నషత్పదోసౌ నజుగుమ్జ యః కలం న గుంజితం తన్న జహార యన్మనః ‘’ –భావం –‘’కమాలలు వికసించని సరస్సులు సరసులేకావు .భ్రమరాలు మూగని కమలాలు కమలాలే కావు .ఝంకారం చేయని తుమ్మెదలు తుమ్మెదలే కావు .మానవుల మనస్సులను ఆకర్షించని ఝంకారాలు భ్రమర ఝమ్కారాలేకావు .’’
ఉదయ సూర్యుని గురించి వర్ణిస్తూ ‘’ప్రపంచం అంతా పెను చీకటి అనే బురదలో కూరుకు పొతే ఉదయాద్రి మీద ఉదయించే భాణుడు తన కిరణాలు అనే తాళ్ళ చేత ప్రాణులను పైకి లాగుత్న్నట్లు ఉన్నాడు ‘’
హనుమంతుడు లంకను కాలిస్తే అగ్ని జ్వాలలు వ్యాపించి లంక యెంత కల్లోలం గా ఉందొ యమకం లో మహా గమకం గా చెప్పాడు భట్టి .అర్ధం అక్కర లేదు శబ్ద సౌందర్యం తో ఆ విషయం అంతా అర్ధమైపోతుంది –
‘’సరసాం సరసాంపరి ముచ్యతమం పతతాం పతతాం కకుభో బహుశః
సకలైః సకలైః పరితః కరుణై రుదితై రుదితైరివ ఖం నిచితం
నగజా నగజా దయితా దయితా విగతం విగతం లలితం లలితం
ప్రమదా ప్రమదా మహతా మహతా మరణం మరణం సమయాత్ సమయాత్ ‘’
వ్యాకరణం అనే కళ్ళజోడు పెట్టుకొన్న వారికి తన కావ్యం దీపం లాంటిది అని భట్టి స్వయం గా తెలిపాడు –‘’
‘’దీప తుల్యః ప్రబందోయం శబ్ద లక్షణ చక్షుషాం-హస్తా మర్ష ఇవాంధానాం భవేద్ వ్యాకరణాద్యతే’’-అంటే దీపం గుడ్డివాడికి వస్తువులను చూపించలేదు .అలాగే వ్యాకరణ చక్షువులు ఉంటేనే నా కావ్యం ,దీపం లాగా కదన వస్తువులను దర్శింప జేస్తుంది అని భట్టి స్వయం గా చెప్పాడు .’’తెలుగున వ్యాకరణ దీపం చిన్నది ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు .పెద్ద వ్యాకరణ కళ్ళజోడు పెట్టుకొంటేనే భట్టీయం అర్ధమవుతుంది .ఉత్త కావ్య ‘బట్టీయం’’ వలన అందం గోచరించదు .ఈ కావ్యాన్ని పగల గొట్టి అందరికి అర్ధమయ్యేట్లు చేయటానికి ఇరవై రెండు వ్యాఖ్యానాలు వచ్చాయి .పెద్ది భట్టు అనే తెలుగు ఆయన మంచి వ్యాఖ్య రాశాడు .మల్లినాద సూరి మనుమడే పెద్ది భట్టు .మల్లినాదుడుకూడా భట్టి కావ్యానికి ‘’సార్వ పధీనా ‘’పేరుతొ వ్యాఖ్యానం రచించాడు .శ్రీధరుడు కూడా తెలుగులో వ్యాఖ్యానించాడు .శ్రీనాధుడుఅనే పెరుగలాయన ‘’భట్టి రూప ప్రకాశం ‘’పేరుతొ వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .ఇతను మన శృంగార శ్రీనాదుడుకాదని ఈయనే రఘువంశ ,నైషధాలకూ వ్యాఖ్యానం రాశాడని భావిస్తున్నారు .ఏమైనా భట్టి మంచి రసపట్టు ఉన్న దిట్టమైన కవి అనటానికి సందేహం లేదు .
భట్టి ఈ కావ్యం లో పదమూడవ సర్గ లో మరో గొప్ప ప్రయోగం చేశాడు .అదే ‘’భాషాసమ ‘’అంటే ఒకే శ్లోకం ను సంస్కృతం లోను ప్రాకృతం లోను చదువుకోవచ్చు .సంధులు విడగోట్టుకొంటే అలా చదవటం సాధ్యమవుతుంది .మన ద్వార్దికావ్యాలలో లాగా .భట్టికావ్యానికివిదేశీ ప్రాచుర్యమూ దక్కింది .జావా దేశం లో పురాతన ‘’జావనీయ రామాయణానికి’’ ‘’సోర్స్ బుక్ ‘’గా భట్టికావ్యాన్ని ఉపయోగిస్తున్నారు .జావా రామాయణం అతిపురాతనకావ్యం దీన్ని’’కాకావిన్ ‘’అని గౌరవం గా సంబోధిస్తారు .భట్టికావ్యం జావా ప్రజలకు అరాధనీయం భట్టికావ్యం లోని యమకాలను,శ్లేషను వాళ్ళు బాగా ఉపయోగించుకొన్నారు .
భట్టికావ్యం అనే రావణ వధ వీరకావ్యమని ,చతుర్విధ పురుషార్ధ సాధన ధ్యేయం గా రాశాడని ,నగర ,పర్వత ,సముద్ర ,ఋతు ,ఉదయాస్తామయ వర్ణనలు కలిగిఉందని ,ప్రేమ శృంగార సమన్వితమని ,సంస్కృత పంచకావ్యాల సరసన చేరి ఆరవ మహా కావ్యం అనిపించుకోందని ,’’ఆలివర్ ఫాలన్ ‘’అనే విమర్శకుడు భట్టికావ్య ఆంగ్ల అనువాదానికి ఉపోద్ఘాతం రాస్తూ చెప్పాడు .
మరోకవితో మరోసారి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-14-ఉయ్యూరు

