సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌
మాతృభూమి విముక్తి కోసం అటు భారత జాతీయ సైన్యం యోధునిగా ఆంగ్ల సైన్యాలతో తలపడి, ఇటు సామ్యవాదం లక్ష్యంగా ఎంచుకుని సాగుతున్న రాజకీయ పోరాటాలలో నిన్నటి దాకా చురుగ్గా పాల్గొన్న కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ 1920 జనవరి 3న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ జిల్లా ఖుర్‌జా గ్రామంలోని జమీందారి కుటుంబంలో జన్మించారు. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని అంగీకరించని ముస్లిం రాజపుత్ర కుటుంబం నుంచి వచ్చిన అబ్బాస్‌ అలీ ఉన్నత పాఠశాల విద్యార్థిగా సర్దార్‌ భగత్‌ సింగ్‌ స్థాపించిన ‘నౌ జవాన్‌ భారత సభ’లో సభ్యులయ్యారు. ఆ తరువాత ఉన్నత విద్య కోసం అలీఘర్‌ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన ఆయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్‌ కున్వర్‌ ముహమ్మద్‌ అష్రాఫ్‌ శిష్యరికంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యత్వం పొందారు. అష్రాఫ్‌ ప్రేరణతో బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో తిరుగుబాటుకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అబ్బాస్‌ అలీ వ్యూహాత్మకంగా 1939లో బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1941లో ఆయన సింగపూర్‌ వెళ్ళారు. 1942లో జపాన్‌ సైన్యాలకు బ్రిటిష్‌ బలగాలు లొంగిపోవడంతో ఇతర సైనికులు, సైన్యాధికారులతోపాటుగా అబ్బాస్‌ అలీ యుద్ధఖైదీ అయ్యారు. ఆ సందర్భంగా, 1943లో చివరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షాహ్‌ జఫర్‌ సమాధి వద్ద నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన ప్రసంగం మాతృభూమి విముక్తి కోసం అంకితమయ్యేందుకు అబ్బాస్‌ను సంసిద్ధం చేసింది. భారత జాతీయ సైన్యంలో చేరిన ఆయనకు ‘కెప్టెన్‌’ హోదా లభించింది. సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదానికి అనుగుణంగా ఆంగ్ల సైన్యాలతో పోరాటానికి అబ్బాస్‌ అలీ అరకాన్‌ యుద్ధక్షేత్రం వెళ్ళారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పరాజయంతో భారత జాతీయ సైన్యం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో బ్రిటిష్‌ సైన్యం భారత జాతీయ సైన్యం యోధులతో పాటుగా ఆయనను అరెస్ట్‌ చేసింది. అరెస్టు తరువాతు బ్రిటిష్‌ సైన్యాధికారులు కోర్టు మార్షల్‌ జరిపి అబ్బాస్‌కు మరణశిక్ష ప్రకటించారు. ఈలోగా బ్రిటిష్‌ వలస పాలకుల నుంచి భారత దేశానికి పూర్తిగా స్వాతంత్య్రం లభించడంతో ఆయనకు విధించిన మరణశిక్ష రద్దయ్యింది. స్వాతంత్య్రం లభించాక 1948లో ఆచార్య నరేంద్రేవ్‌, జయప్రకాష్‌ నారాయణ, డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా సహచర్యంలో సోషలిస్టు పార్టీ నాయకులుగా అబ్బాస్‌ అలీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఈకృషిలో భాగంగా ప్రజల పక్షంగా అబ్బాస్‌ అలీ సాగించిన పోరాటం ఫలితంగా 1948 నుంచి 1974 వరకు ఆయన 50 సార్లకు పైగా అరెస్టు, ప్రభుత్వ నిర్బంధాలకు గురయ్యారు. చివరకు 1975లో ఏర్పడిన అత్యాక పరిస్థితి, నియంతృత్వ పోకడలను వ్యతిరేకించినందుకు గాను అబ్బాస్‌ అలీ 19 మాసాలు జైలులో గడపాల్సి వచ్చింది. 1978లో ఉత్తరప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఆయన ఎన్నికయ్యారు. చివరిశ్వాస వరకు సమసమాజ స్థాపన ప్రధాన లక్ష్యంగా సాగుతానని ప్రకటించిన ఆయనన్యూఢిల్లీ కార్యక్షేత్రంగా తన కృషిని సాగించారు. కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ స్వల్ప అస్వస్థత తరువాత 2014, అక్టోబర్‌ 11న కన్నుమూశారు.

– నశీర్‌ అహమ్మద్‌
చరిత్రకారులు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.