కాశ్మీర్ ప్రక్రుతి వికృతి గా ఎందుకు మారింది?

ప్రకృతి…. వికృతి

ధవళకాంతులతో శోభిల్లే హిమాలయ పర్వత శిఖరాలు…అందమైన తులిప్ తోటలు…నోరూరించే యాపిల్ పళ్లు…దాల్ సరస్సుపై తేలియాడుతూ వెళ్లే కుటీరాల్లాంటి పడవల పరుగులతో కళకళలాడే కాశ్మీర్ అందాలు ఒక్కసారిగా ఎందుకు కకావికలమయ్యాయి? ఎండాకాలం ఉండగానే ఒక్కుదుటున కుండపోత వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? రుతుపవనాల గమనంలో అనూహ్య మార్పులు ఎందుకొస్తున్నాయి? సాగరాలు చెలియలకట్టలు దాటి ఎందుకు తెగబడుతున్నాయి? ఊళ్లకు ఊళ్లను ఎందుకు ఊడ్చేస్తున్నాయి? శీతాకాలంలోనూ ఉక్కపోత ఎందుకు ఎక్కువవుతోంది? భూతాపం ఎందుకు పెరిగిపోతోంది…అంటే జవాబు తెలియనివారు ఎవ్వరూ లేరు. అనుభవాలనుంచి పాఠాలు నేర్వని మనిషి పదేపదే కష్టాలపాలవుతున్నాడు. అభివృద్ధి పేరిట మానవుడు చేపట్టిన విధ్వంసకర చర్యలు ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో పెనుమార్పులు సంభవించి ప్రకృతి విపత్తులకు దారితీస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో గతేడాది వరదలు సృష్టించిన బీభత్సం, కొనే్నళ్లక్రితం సంభవించిన గుజరాత్, లాతూర్ భూకంపాలు, సునామీ, ఇక దేశంలో చాలాప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలు, కరవు, కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లే. ఈ విపత్తుల బెడద ఒక్క మనదేశంలోనే కాదు…యావత్ ప్రపంచంలోనూ ఉంది. పెనుతుపానులు, భూకంపాలు, కార్చిచ్చులు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు… ఇలా విపత్తులు తలెత్తున్నాయి. వీటిలో ఒకటీఅరా సహజంగా ముంచుకొస్తున్నప్పటికీ మొత్తమీద మానవుడి నిర్లక్ష్యం, అత్యాశ పెనువిపత్తులకు కారణమని తేలిపోయింది. విపత్తులను నివారించడం, ఎదుర్కోవడం, కనీసం వాటివల్ల వచ్చే నష్టాన్ని తగ్గించగలగడంపై ఇప్పుడు దృష్టిపెట్టాలి. విపత్తుల కారణాలు తెలుసుకోవడం, ఏయే ప్రాంతాల్లో అవి విరుచుకుపడే అవకాశం ఉందో గుర్తించడం, ఎదుర్కోవడమెలాగో తెలుసుకోవడం, విపత్తుల నియంత్రణ, కనిష్టనష్టాలు ఉండేలా జాగ్రత్తపడటం ప్రస్తుతం మానవాళి కర్తవ్యం. ఇందుకు పెద్దఎత్తున ప్రజల్లో అవగాహన, చైతన్యం అవసరం. అందుకే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విపత్తుల ప్రమాదాన్ని వీలైనంతవరకు తగ్గించే దిశగా అడుగులుపడుతున్నాయి. ఏటా అక్టోబర్ 13న ప్రకృతి విపత్తుల నియంత్రణ దినోత్సవంగా కార్యక్రమాలు చేపడుతోంది. మనుగడకే ముప్పు మార్స్‌పై మానవ మనుగడ సాధ్యమా? కాదా? అన్న అంశంపై శాస్తవ్రేత్తల పరిశోధనల ప్రయాణం మంగళకరంగానే సాగుతోంది. ఎటొచ్చీ భూమిపైనే జీవరాశి మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. అభివృద్ధి, అత్యాశలతో మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తూ చేపడుతున్న కార్యక్రమాలు, పారిశ్రామికీకరణ, అభివృద్ధి పనుల పేరిట యధేచ్ఛగా చేపడుతున్న చర్యలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాయి. సెలయేళ్ళు, నదుల గమనమార్గాన్ని అడ్డుకుంటూ, లేదా నీటిప్రవాహ మార్గాన్ని మారుస్తూ విచ్చలవిడిగా చేపడుతున్న నిర్మాణాలు పెనుముప్పునకు కారణమవుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు వరదనీరు వెళ్లేమార్గం లేక ఊళ్లలోకి, నగరాల్లోకి ఆ వరద ముంచేస్తోంది. తాజాగా కాశ్మీర్‌లో జరిగింది అదే. చెట్ల నరికివేత వల్ల నీటిప్రవాహాన్ని నెమ్మదింపచేయగలిగే వ్యవస్థ ధ్వంసమైపోయినట్లవుతోంది. భూమిలోపలికి చొచ్చుకువెళ్లే వాటి వేళ్లు, మొదళ్లు నీటిప్రవాహవేగాన్ని నియంత్రించి భూసారాన్ని కాపాడతాయి. ఇప్పుడు చెట్లే లేకపోవడంతో ఆకస్మిక వరదలు ఊహించని వేగంతో వచ్చి ముంచేస్తున్నాయి. మరోవైపు పరిశ్రమలు, వాహనాలు, ఫ్రిజ్, ఏసీ మిషన్లువంటి ఆధునిక యంత్రాలవల్ల ఉత్పత్తి అవుతున్న కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణం కలుషితమవుతోంది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. భూమిమీద ఉన్న జీవజాతుల్లో ఎన్నో అంతరించిపోతున్నాయి. ఇది ఆహారోత్పత్తి, మానవ మనుగడకు ముప్పు తెస్తోంది. పెరుగుతున్న జనాభాపై ఇది పెనుప్రభావం చూపబోతోంది. 1970నుంచి 2010లోగా జీవరాశిలో, ముఖ్యంగా సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, జంతువులలో 52శాతం మేర అంతర్థానమయ్యాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. వరల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ చేసిన అధ్యయనం చెప్పిన వాస్తవం ఇది. ఇదంతా మానవ తప్పిదాల ఫలితమే. భూమిపై జీవ వైవిధ్యం దెబ్బతింటే మనిషి మనుగడ ప్రశ్నార్థకమే. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది? 80వ దశకంలో ప్రకృతి విపత్తుల జోరు పెరిగింది. అన్నింటికీ మానవాళే కారణం. నష్టపోయేదీ వారే. ప్రమాదాన్ని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి విపత్తుల ప్రమాదాన్ని తగ్గించి, నష్టాన్ని కనిష్టం చేసే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి నడుంకట్టింది. 1989లో ఈమేరకు సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానం చేసింది. అక్టోబర్ 13ను విపత్తుల నియంత్రణ దినంగా ప్రకటించింది. ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు ది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యుఎన్‌ఐఎస్‌డిఆర్) సంస్థను తనకు అనుబంధంగా నెలకొల్పింది. ప్రపంచంలోని 168 దేశాలు దీనిద్వారా చర్యలు చేపట్టాయి. 2015నాటికి విపత్తుల నివారణకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించేందుకు 2010నుంచి అడుగులు వేయడం ప్రారంభించింది. పిల్లలు, యువకులు, వయోజనులు, వికలాంగులు, ఇలా పధ్నాలుగేళ్లుగా, ఏడాదికో వర్గంనుంచి అభిప్రాయాలు సేకరించింది. వారు ఎదుర్కొన్న విపత్తులు, నష్టాలు, కష్టాలు, నివారణోపాయాలపై వారినుంచి సమాచారాన్ని సేకరించింది. 2014లో వయోవృద్ధుల సంవత్సరంగా ప్రకటించి వారి అభిప్రాయాల్ని సేకరించింది. వీటన్నింటి నుంచి సారాన్ని క్రోడీకరిస్తోంది. విపత్తులను తగ్గించగలగడం, ఎదుర్కోవడం, నష్టాన్ని నియంత్రించడంపై ఈ సంస్థ ప్రజలను చైతన్యం చేస్తోంది. 2015లో జపాన్‌లోని సిండాయ్‌లో జరిగే ప్రపంచస్థాయి సదస్సులో ఈ అంశాలపై చర్చిస్తుంది. విపత్తుల నివారణ ఎలా? మనదేశంలో సునామీ సృష్టించిన బీభత్సం తరువాత ప్రపంచ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రకృతి విపత్తుల నివారణ, నియంత్రణ లక్ష్యంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవిర్భవించింది. విపత్తుల సమయంలో స్పందించి చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా ఆ సంస్థ చురుకుగా స్పందించాల్సిన అవసరం ఉంది. విపత్తులు ఏర్పడే ప్రాంతాల గుర్తింపు, వివిధ ప్రాంతాల్లో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లు, అక్కడికక్కడ ఎదుర్కొనే యంత్రాంగం ఇంకా ఏర్పడలేదు. దేశరాజధానినుంచే ఆ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఏపీలోను, ఆ మధ్య ఉత్తరాఖండ్, ఒడిశా, తాజాగా కాశ్మీర్‌లో సంభవించిన తుపానులు, వరదల వేళ ఢిల్లీనుండి బృందాలువెళ్లి సహాయం చేశాయి. అదే ఆయా రాష్ట్రాల్లోనే ఉంటే సకాలంలో స్పందించి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేది. శాస్త్ర,సాంకేతిక విజానాన్ని బాసటగా చేసుకుని సవాళ్లను ఎదుర్కోవాలి. ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని, వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలి. ముందుజాగ్రత్త చర్యలతో చాలావరకు నష్టాన్ని నియంత్రించవచ్చు. ఒడిశాలో ఆమధ్య వచ్చిన ఫైలిన్ తుపాను సమయంలో ఆ జాగ్రత్తే ప్రాణ, ఆస్తినష్టాల్ని నియంత్రించింది. విపత్తుల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికల కేంద్రాలు, డాప్లర్ రాడార్ కేంద్రాల ఏర్పాటు, జాతీయ విపత్తు ప్రాంతీయ కేంద్రాల నిర్వహణ అవసరం. తీరప్రాంతాలకు దూరంగా జనావాసాలు ఉండటం, నదీగమన ప్రాంతాల్లో నిర్మాణాలను అడ్డుకోవడం, నదులు, సెలయేళ్ళలో ఇసుక తవ్వకుండా చూడటం కనీస జాగ్రత్తలు. పర్వతసానువుల్లో నిర్మాణాలు నిరోధించడం, కొండలపైన, దిగువ చెట్లను నరికివేయకుండా చూడటం, పర్వత సానువులను చదను చేయకుండా ఉండటం అతిముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలస్థాయి, ప్రభావం బాగా తగ్గిపోతాయి. ఉత్తరాఖండ్‌లో ఏం జరిగింది? హిమాలయ పర్వత సానువుల్లోని ఈ రాష్ట్రం పర్యాటక రంగం విస్తృతికోసం ఇచ్చిన అనుమతులు, జలవిద్యుత్‌కేంద్రాలకోసం చేపట్టిన చర్యలు కేదార్‌నాథ్ విలయానికి కారణమయ్యాయి. మందాకిని, అలకనంద వంటి నదుల మార్గాల్లో విధ్వంసక చర్యలు చేపట్టడం, వేలాది ఎకరాల్లో అడవులు నరికి జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వాతావరణం దెబ్బతిని హఠాత్తుగా వర్షాలు, వరదలు ముంచెత్తాయి. 37వేల ఎకరాల్లో చెట్లను నరికి, 3200 ఎకరాల్లో ఇసుకను తవ్వేసి 51 జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ప్రకృతి ఇలా స్పందించిందన్నమాట. నిజానికి ఈ రాష్ట్రంలో మరో 47 జలవిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో ఉండగా 234 ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. విపత్తుల ప్రమాదం ఎక్కువగా ఉన్న హిమాలయ పరీవాహక రాష్ట్రాలైన కాశ్మీర్, ఉత్తరాఖండ్‌సహా పలు ప్రాంతాల్లో రాడార్లు, వాతావరణ హెచ్చరిక కేంద్రాలు, విపత్తు నిర్వహణ కేంద్రాలు లేవంటే అక్కడి పాలకులకు, నేతలకు ఎంత శ్రద్ధో అర్ధమవుతుంది. ఆ మధ్య మహారాష్టల్రోని పూనేలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇక్కడ పర్వతాల దిగువ ప్రాంతాన్ని చదును చేసి 28వేల చెట్లను నరికేశారు. అక్కడభూమి గుల్లబారిపోవడం, భారీవర్షాలు కురియడంతో మట్టిపెళ్లలు జారిపోయి ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. దేశం మొత్తంమీద 75 శాతం ప్రాంతాలు విపత్తులకు అవకాశం ఉన్నవే. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే అంశం ఇది. ఇక ప్రభుత్వాలూ అది తెలుసుకుని అడుగులు వేయాల్సిందే. మన దేశంలో మహా విపత్తులు ఇవీ… 1770-బెంగాల్ కరవు-బెంగాల్, ఒడిశా, బీహార్‌లో కరవుతో 10లక్షలమంది దుర్మరణం. 1769-73 మధ్య కరవు విలయతాండవం చేసింది. ప్రపంచ మహావిపత్తులో ఇది ఒకటి. 1839-ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలోని కోరింగ ప్రాంతంలో సంభవించిన పెనుతుపాను. 20వేల మంది మృత్యువాతపడ్డారు. ముప్ఫైరెండేళ్లక్రితం సంభవించిన దివిసీమ ఉప్పెనా అలాంటిదే. 1894-ప్లేగ్ విజృంభణతో 12 లక్షలమంది మృతి. మనదేశం, చైనాల్లోనే ఇది సంభవించింది. దాదాపు రెండేళ్లు పీడించిన అంటువ్యాధి ఇది. కోల్‌కతా, ముంబై పోర్టులలో ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించి లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. 1979-లాహాల్ అవలాంచ. హిమానీనదం కరిగి లాహాల్ లోయలో మీదపడటంతో 200మంది సజీవసమాధి అయ్యారు. మృతులపై 200 అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. 1993-లాతూర్ భూకంపం-మహారాష్టల్రోని లాతూర్‌లో తీవ్ర భూకంపం ధాటికి 10 వేలమంది మరణించారు. మరో 40వేల మంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. 1999-సూపర్‌సైక్లోన్ 05బిగా చెప్పుకున్న ఈ తుపాను తాకిడికి 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టానికి లెక్కేలేదు. 2001-గుజరాత్ భూకంపం-ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవంనాడు జరిగిన భూకంపం ధాటికి 20వేలమంది మరణించారు. కచ్ జిల్లాలో ఇది పెనువిధ్వంసం సృష్టించింది. 2002-వడగాడ్పులు-దేశంలో వడగాల్పులకు వేయిమంది మరణించారు. ఏపీలో ఈ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2004-సునామీ-హిందుమహాసముద్రంలోఇండోనేసియాలో వచ్చిన సునామీ 14 దేశాల్లో తీరప్రాంతాలపై ప్రభావం చూపింది. మనదేశంలోని అండమాన్ నికోబార్ సహా హిందూమహాసముద్రతీర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. సునామీ తాకిడి ఉన్న అన్ని ప్రాంతాల్లో కలపి 2లక్షల 30వేలమంది మరణించారు. 2007-బీహార్ వరదలు-గడచిన 30 ఏళ్లలో ఎన్నడూలేనివిధంగా వచ్చిన వరదలు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందలమంది మరణించారు. ఆస్తినష్టం లెక్కలేదు. 2005-ముంబై వరదలు. వాతావరణంలో వచ్చిన మార్పులతో భారీవర్షాలతో వరదలు. 5వేలమంది మృతి. 2010-తూర్పుభారతదేశంలో తుపానుతో పెనునష్టం. వందమంది మరణించగా 92వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2013-మహారాష్టల్రో కరవు. లక్షలాదిమంది ఆకలికేకలు. గత 40 ఏళ్లలో ఎన్నడూలేని నీటిఎద్దడి. దాదాపు రెండేళ్లపాటు జల్నా, జలగావ్, ధూలే జిల్లాలు విలవిల. ఉత్తరాఖండ్-్ఫ్లష్‌ఫ్లడ్-ఆకస్మిక వరదలతో వెయ్యిమంది మృతి, 5వేలమంది గల్లంతు. వేలాది ఇళ్లు, ఊళ్ళకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం. 2014-కాశ్మీర్ వరదలు-శ్రీనగర్‌సహా పలు గ్రామాలు జలదిగ్బంధం. 250పైగానే మరణాలు. నాలుగువారాలపైగానే అనేక గ్రామాలు నీటిలోనే ఉండిపోయాయి. జాతీయవిపత్తుగా కేంద్రం ప్రకటన. * ఇలా చేయాలి… ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, నష్టాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా దేశాలు అడుగులేయాలి. భూకంపాలు, వరదతాకిడి సమయాల్లో వాటిని తట్టుకునేలా భవన నిర్మాణాలు సాగాలి. కొత్త టెక్నాలజీని వినియోగించాలి. పర్యావరణ అనుకూల విధానాలు పాటించాలి. కర్బన వాయువుల విడుదలకు కారణమవుతున్న వ్యవస్థలకు కళ్ళెం వేయాలి. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఆహారోత్పత్తులు పెంచాలి. ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందించాలి. ఏయే ప్రాంతాల్లో విపత్తులు ముంచుకొస్తాయో శాటిలైట్, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలి. ఉపద్రవం స్థాయిని అంచనా వేయాలి. ముందస్తు సమాచారంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలి. ఇదీ విపత్తుల విశ్వరూపం విపత్తులు ఒక్క మనదేశానికే పరిమితం కాదు. విశ్వమానవాళి సమస్య ఇది. ప్రకృతి విపత్తులు రెండు విధాలుగా నష్టాన్ని కలిగిస్తాయి. ఒకటి ప్రాణ, ఆస్తినష్టాలు. మరోటి జీవరాశిని దెబ్బతీయడం. విపత్తునుండి కోలుకోవడానికి ఏళ్లతరబడి సమయం, లెక్కలేనంత ధనవ్యయం తప్పదు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం 1980నుంచి 2011 మధ్య ప్రపంచంలో మొత్తంమీద 3455 ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. 2689 తుపానులు అల్లకల్లోలం సృష్టించాయి. 470 ప్రాంతాల్లో కరవు విలయతాండవం చేస్తే..395 ప్రాంతాల్లో ఉషోగ్రతలు బాగా పెరిగిపోయాయి. 2000-12 సంవత్సరాల మధ్య జరిగిన విపత్తుల వల్ల 1.7 ట్రిలియన్ డాలర్ల ఆస్తినష్టం సంభవించింది. 2.9 బిలియన్లమంది ప్రజలపై పెనుప్రభావం చూపాయి. 12 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అధికారికంగా లభ్యమైన సమాచారం. ఇక అనధికారిక నిజాలు దేవుడెరుగు. కాశ్మీర్ గుణపాఠం హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాలకు ప్రకృతి విపత్తుల బెడద ఎక్కువ. మానవతప్పిదాల దానికి తోడవడంతో పెనునష్టాలు సంభవించాయి. జీలం, చీనాబ్, రావి నదుల ప్రవాహ గమన మార్గాలను అడ్డుకుని విశృంఖలంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రిసార్టులు నిర్మించారు. ఫలితంగా నదీజలాల గమనంలోను, వేగంలోనూ తీవ్రపరిణామాలు సంభవించాయి. వరదలు వచ్చినపుడు నీరు వెళ్లే మార్గాలు లేక అవి నగరాల్లోకి, గ్రామాల్లోకి వచ్చాయి. గత శతాబ్దంలో ఎన్నడూలేని విధ్వసం సృష్టించడానికి ఇదే ప్రధాన కారణం. హిమాలయ ప్రాంత రాష్ట్రాలన్నింటికీ ఈ విపత్తుల ముప్పు ఉంది. అడవుల నరికివేత, పర్వతసానువులు చదునుచేయడంతో వరదప్రవాహాన్ని అడ్డుకుని, నెమ్మదింపచేసే వ్యవస్థలు ధ్వంసమై ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, నాయకుల నిర్లక్ష్యం, స్వార్థంవల్లే భారీ ప్రాణ,ఆస్థినష్టం సంభవించింది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.