అలుపెరుగని సాధన.. అద్భుత సృజన..
- -సుధామ
- 11/10/2014

సృజన
-శ్రీకాంతశర్మ సాహిత్యం
ఒకటవ సంపుటి
ప్రతులకు: ఇంద్రగంటి ఫ్యామిలీ
104, సాహితి రెసిడెన్సీ,
ప్రేమ్‌నగర్ కాలనీ, (జి.కె.కాలనీ)
సైనిక్‌పురి పోస్ట్, సికిందరాబాద్-94
వెల: రూ.2500
(రెండు సంపుటాలకూ కలిపి)
‘మనం ఎంచుకున్న మార్గాన్నిబట్టి
మన జీవనక్రమం నిర్ణయవౌతుంది’
(‘సుపర్ణ’ కావ్యంలో)
సప్తతి పూర్తి చేసుకున్న కవి పండితుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సమగ్ర సాహిత్యం ‘సృజన’ పేర రెండు సంపుటాలుగా వెలువడింది. కథలు, నవలలు, నాటకాలు ఎన్నో రాసినా, వౌలికంగా శ్రీకాంతశర్మకు కవిగా, పండితునిగానే పేరు. 1168 పేజీల ఈ ఒకటవ సంపుటిలో 398 పేజీలే ఆయన కవితా మూర్తిమత్వం. మిగతావన్నీ వచన రచనలే. అందులోనూ నాటకాలు, నాటికలే ప్రథమగణ్యం. ఆ తరువాతనే ఆయన నవలలూ, కథలూ. లలిత గీతాలు, యక్షగానాలూ కవిత్వ పార్శ్వాలే. ఒక సృజనకారుడి బహుముఖీనతకు ఈ ప్రక్రియా వైవిధ్యం నిలువుటద్దం. వ్యాసాలు, సమీక్షలు, మున్నుడులు, పరిచయాలు వంటి రచనలన్నీ వారి పాండితీ వైభవ సంకేతాలే కావడంతో శ్రీకాంతశర్మ అనగానే కవి పండితుడు అనీ, పండిత కవి అని భావించేవారే అధికం. ఆయన విమర్శనా రచనలు కూడా పాండిత్యంలో భాగాలే.
నిజానికి శ్రీకాంత శర్మ వృత్తిరీత్యా ప్రధానంగా ఎంచుకున్న మార్గాలు రెండు. ఒకటి పత్రికా మాధ్యమం, రెండవది శ్రవ్య మాధ్యమం అయిన ఆకాశవాణి. ఈ రెండింటి కారణంగానే ఆయన జీవనక్రమం నిరంతర సాహిత్య ప్రస్థానంగా సాగింది. రెండింటా అనివార్యంగా కలం పట్టక తప్పని అవసరం, స్వతహాగా వివిధ సాహిత్య ప్రక్రియా రచనలు చేయాలన్న అభిమతం, ఇన్నాళ్లుగా ఇనే్నళ్లుగా తన చేత రాయిస్తూ, సహస్రాధిక పుటల రెండు సంపుటాల రూపంలో ఇవాళ అభివ్యక్తమవుతోంది. వీటిల్లోకి రాని రచనలు ఇంకా మిగిలే ఉంటాయన్నది వాస్తవం. ఎందుకంటే తానే స్వయంగా ఓ ‘ఎడిటర్’. తొలుత ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ ఉపసంపాదకునిగా, ఆపై ఆకాశవాణిలో రచయితగా, కార్యనిర్వహణాధికారి అయినా ఆకాశవాణి నుంచి పదవీ విరమణ చేసి తిరిగి ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సంపాదకునిగా, తన ఉద్యోగ భూమికను నిర్వర్తించినందువల్లనే- ఆయనకు తను రాస్తున్నది ఏమిటో, తాను చేస్తున్నది ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. మనసు పెట్టి చేసిన రచనలే కానీ, మనసు చంపుకుని రాసినవి ఇందులో లేవు.
శ్రీకాంతశర్మ సుకుమార భావుకుడు, అనుభూతి ఆరాధకుడు. విశ్వసించిన దానిపట్ల ఎప్పుడూ విముఖత చెందని జగమొండి. గాలివాటుగా ఉద్యమాల వెంటబడి ఆ మూసలో కవి అనిపించుకున్నవాడు కాదు. సంప్రదాయాన్నీ, అభ్యుదయాన్నీ మేళవించి, మానవీయ అనుభూతులకు అక్షరాకృతుల నిచ్చినవాడు. చాలామంది రచయితల రచనలు పాఠకులకు మాత్రమే చేరుతాయి. పత్రికలు కేవలం అక్షరాస్యులకే! అయితే వాటిని చదివేవారిలో – ఒక పాఠక హృదయం మాత్రమే వుండదు. సామాజికుడయిన ప్రతి వ్యక్తిలో ఒక పాఠకుడూ, ఒక శ్రోతా, ఒక ప్రేక్షకుడు వున్నారు. ఒక రచయిత సృజన అంతా త్రిముఖంగా సామాజికులకు చేరి సంతృప్తినిచ్చి ఉపయుక్తం కాగలిగినప్పుడే, ఆ రచయిత ప్రతిభావంతునిగానూ, ఆ రచన ప్రయోజనదాయకంగానూ భాసించడం వీలవుతుంది. అదిగో ఆ ప్రజ్ఞామతి అయిన రచయిత శ్రీకాంతశర్మ.
శ్రీకాంత శర్మ రచనలు పాఠకులనూ, శ్రోతలనూ, ప్రేక్షకులనూ ఏకకాలంలో సామాజికునిలో వున్న ఆ మూడు పార్శ్వాలనూ తట్టగలిగేవిగా ఉం టాయి. అందుకే అంతటి కవి పండితుడూ సామాన్యమైన సా మాజికులనూ తన రచనలతో మెప్పించగలిగాడు.
పత్రికలకు కథలు, నవలలు, వ్యాసాలు, సమీక్షలు, కాలమ్స్ రాసిన వాడే – రేడియోకి పాటలు, నాటకాలు, నాటికలు, రూపకాలు ఎన్నో రాశాడు. ప్రసంగాలు చేశాడు. అలాగే రంగస్థలానికి కావలసిన నాటకాలు, నృత్య రూపకాలు రాశాడు. కొన్ని సినిమాలకు పాటలూ రాశాడు. అచ్చు అక్షరాల్లోనే కాక, ఇలా శ్రవ్య, దృశ్య మాధ్యమాల్లో అక్షరాలుగా వినబడ్డాడు. కనబడ్డాడు. కనుకనే ఆయన జీవన క్రమం వైవిధ్యభరితమైంది. మూస ధోరణులకు భిన్నంగా ఎప్పటికప్పుడు వికాసవంతమైంది.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం వైభవ ప్రాభవాలకు శ్రీకాంత శర్మ రచనా (ప్ర)వృత్తి ఎంతగానో దోహదపడింది. తనకు సంతృప్తినీ, సంస్థకు దీప్తినీ కలిగించింది. ఈ సంపుటంలో లలిత గీతాలు, యక్షగానాలు, నాటకాలు, ఇరుగుపొరుగు నాటికలు విభాగంలోని రచనలు – రేడియో రచనలను కలిగి వున్నాయి. 1982- 2003 వరకు ఆకాశవాణి వార్షిక జాతీయ పురస్కారాలలో ఏడు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు, అయిదు యోగ్యతా పత్రాలు సాధించిన ఘనత శ్రీకాంత శర్మ రచనలదే! అవన్నీ సృజనాత్మకం, సంగీత రూపకం, డాక్యుమెంటరీ, నాటకీకరణ విభాగాలవే. ఆ రచనలకు రూపకల్పన చేసింది సి.రామమోహనరావు, ఎస్.బి.శ్రీరామమూర్తి, కలగా కృష్ణమోహన్, పాండురంగారావు ప్రభృతులే కావచ్చుగాక, కానీ రికార్డు స్థాయిలో అన్ని బహుమతులకు శ్రీకాంతశర్మ రచనలే మూలకందం. ‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’ అనే బాలల గీతం నుండి, ఈ మాసపు పాటలు, సంగీత రూపకాలు ఎన్నో ఆకాశవాణి ద్వారా ప్రసారమైన శ్రీకాంత శర్మను రేడియోవాడిగా శ్రోతల హృదయాల్లో సుప్రతిష్ఠితం చేశాయి.
రెండేళ్ల క్రితం 2012లో వెలువడిన శ్రీకాంతశర్మ ‘ఏకాంత కోకిల’ ఒక రకంగా ఆయన జీవన రేఖలు కొన్నింటి కవితాత్మక ప్రదర్శనమే. అందులోని నివేదనములో తన ఆకాశవాణి సహోద్యోగి గూర్చి-
ప్రహరాజు పాండురంగడు
అహరహమును నాకు తోడనంగా, వృత్తిన్
సహచరుడై ఏ చరించెను
విహరించితి నతడి వెంట వివిధ విధములన్
అంటూ – తన నాటక నాటికాభిరుచులకు దోహదమైన మిత్రునిగా తలుచుకున్నారు. అలాగే ‘స్వస్ర్తి అభిశంస’ అంటూ – తను ప్రేమించి పెళ్లాడిన, సాహిత్య సంగీత సమలంకృత ‘జానకీబాల’ గురించి కూడా సరదాగా రాశారు. బహుశా గొప్ప గాయని కూడా అయిన జానకీబాల, కుమార్తె కిరణ్మయిలే ఆయన పాటల రచనా పాటవానికి పరోక్ష ప్రేరకులు కావచ్చు. ‘ఏకాంత కోకిల’లో శర్మగారి ‘ఆరాటాలు’ ‘ఆలోచనలు’ ‘కవి హృదయం’ అవిష్కృతమయ్యాయి. బహుమతులు బడసిన తమ సృజన రేడియో రచనల్లోని పాటలను కూడా ఇందులో చేర్చారు.
రూప, చైతన్య సంగమ రూఢి దెలుపు
సృజనశక్తికి శాస్తమ్మ్రు సిగ్ధతనువు
గంధలహరిని బోలెడు కళ మనస్సు
మనుపజేసెడి యనుభూతి మనిషిభూతి
అంటారు. అనుభూతి కవిగా శ్రీకాంత శర్మను కవితా లోకం ఏనాడో గుర్తించింది. తిలక్, ఇస్మాయిల్ వంటి వారిని అజంతాను ఎంతో ఇష్టపడతారు శర్మగారు. యక్షగాన రచనలో శర్మగారి కవితా ప్రావీణ్యం వల్లనే ఆయనను పండిత కవి అనేవారున్నారు. రేడియోలో సంగీత రూపకాలు, వేదికలపై శోభానాయుడు వంటి నర్తకీమణుల కోరికపై రచించి ఇచ్చిన నృత్య రూపకాలు శ్రోతలను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నవే. కొన్ని సినిమా పాటలు రాసినా సినీ కవిగా స్థిరపడ(దలచ)లేదు ఆయన.
శ్రీకాంత శర్మ నాటకాలు పధ్నాలుగు, నాటికలు పదిహేను ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. పాత్రోచిత సంభాషణలతో, ఔచితీమంతమైన సన్నివేశ కల్పనలతో, ఇతివృత్తానికి దృశ్య శ్రవణ స్పర్శనిచ్చే ప్రజ్ఞ కానవస్తుంది. ‘శిలామురళి’ ‘కెరటాల పల్లకి’ ‘స్మృతి’ ‘ఆషాఢమేఘం’ ‘తెరలు’ వంటి నాటకాలు, 1990-91 నడుమ విజయవాడ ఆకాశవాణి నుండి ‘ఇరుగు పొరుగు’ పేర నలభై వారాలపాటు ప్రసారమైన నాటికలు శ్రోతృజన హృదయ రంజకాలైనవే.
‘సమూహం నుంచి ఏకాంతానికి
ఏకాంతం నుంచి సమూహానికి
లోలకం మాదిరి ఊగులాడుతూ
ఎంత ఉద్విగ్నత!!’
అంటూ ‘సుపర్ణ’ అనే తన ఒక పక్షి ఆత్మకథా కావ్యంలో పేర్కొన్నట్లు – శ్రీకాంతశర్మ అనుభూతి కవిగా ఒక ఏకాంతం నుంచే జన మాధ్యమాలైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల సమూహానికి చేసిన రచనలెన్నో ఉన్నాయి. కథకునిగా కన్నా ఎక్కువగా ‘తూర్పున వాలిన సూర్యుడు’ ‘ఉపాసన’ ‘క్షణికం’ అనే మూడు నవలలతో ఒక నవలా రచయితగా కూడా నిలిచారు. క్షుద్ర సాహిత్యం రాసారన్న అపవాదు కొంత పొందినా, నిజానికి ఆ శాస్త్ర వైదుష్యమే తద్రచన కావించిందని గ్రహించినప్పుడు, ఆయన పాండితీగరిమను ప్రశంసించక ఉండలేం!
ఈ మొదటి సంపుటి ఆయనలోని అనుభూతి కవికీ, శ్రవ్య, దృశ్య రచనా ప్రతిభా పాటవాలకు నెలవైన రచయితకూ అద్దం పడుతోంది. మనిషి సామూహికంగానూ, పది మందిలో ఒంటరిగానూ కూడా జీవించవలసి రావడం బ్రతుకు యధార్థం. వ్యక్తి సమూహాలను శాసించగలుగుతాడనేది పాక్షిక సత్యమే కావచ్చు కానీ, వ్యక్తులవల్లే వ్యవస్థలకు దీప్తి! ఎన్ని అవస్థలు పడినా వ్యవస్థలోనే వ్యక్తి ఉనికి, మనికి! నిత్య చైతన్యశీలమైన పత్రికా ప్రసార రంగాల భిత్తికపై శ్రీకాంతశర్మగారి ‘సృజన’ పాఠకుల, శ్రోతల, ప్రేక్షకుల ప్రశంసాపాత్రమైంది. మనిషితనం ప్రయోజనాలను కాపాడింది. వెనుదిరిగి చూసుకుంటే.. ‘సంతోష స్వాంతం’ మించినదేముంది? ఈ ‘సృజన’లో శాశ్వతంగా నిలిచేదేదో, విస్మృతమయ్యేదేదో నిర్ణయించేది మాత్రం కాలమే! ఇంద్ర పదవికి నూరు యజ్ఞాలు చేయాలిట కనీసం! శ్రీకాంత శర్మ నిరంతర రచనా యజ్ఞం నిజమైన ‘ఇంద్ర’గంటి.
—
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం

వ్యాస సుందరం
వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారి
భాషా వ్యాస సంకలనం
వెల: అమూల్యం,
ప్రతులకు: వి.కన్యాకుమారి, 202
విశ్వలక్ష్మిటవర్స్,
రవీంద్రనగర్, 3వ లైను, గుంటూరు-6
వెలమకన్ని సుందరరామశాస్ర్తీ ప్రధానంగా చారిత్రక పరిశోధకులు. లోగడ విష్ణుకుండినుల వంటి రాజ్యాలపై ప్రామాణిక సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. వారి కుమార్తెలు తమ తండ్రి స్మృత్యర్థం ఇప్పుడు ఒక గ్రంథం తెచ్చారు. ఇందులో రెండు భాగాలున్నాయి. మొదటిది శతరుద్రీయ వ్యాఖ్యానం. రెండవది చారిత్రక వ్యాసములు. శతరుద్రీయము అంటే యజుర్వేదమునకు అనుబంధమైన తైత్తరీయ సంహితలోని నమక విభాగము. ఇది అభిషేక వియోగమునకు భక్తులు వాడుకోవటంవలన దేశములో ఈ అధ్యాయానికి విస్తృతమైన ప్రచారం ఉంది. శతరుద్రీయములో ప్రతిపాదించబడిన శివుడు రుద్రశబ్దంలో ప్రధానంగా పిలువబడ్డాడు. ఈ రుద్రుడు సూర్యమండల అంతర్వర్తియే. వేదమునకు ప్రాచ్యపాశ్చాత్యులు ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. సంప్రదాయ సాయణ భాష్యములవంటి వానితోబాటు ఆధునికమైన అరవింద, దయానందుల భాష్యాలు కూడా లభ్యమవుతున్నాయి. వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారు సంద్రాయ భాష్యములను పరిగణనలోనికి తీసుకోకుండా లింటర్‌నెడ్జ్ మాక్సుముల్లర్ వంటి పాశ్చాత్యుల పరిశోధనలను అధ్యయనంచేసి రుద్రశబ్దాన్ని ఇందులో వివరించారు. అలాగే తర్వాతి విభాగంలో భాషాశాస్త్ర పాఠాలున్నాయి. ఆర్.ఎస్.శర్మ వంటి సెక్యులరిష్టులు చేసిన చారిత్రకాంశాలు కూడా వెలమకన్నివారి దృష్టికి వచ్చాయి. ఈ విషయం వాటి ఉపయుక్త గ్రంథ సూచినిబట్టి గ్రహించవచ్చు. వెలమకన్ని వారు ఈ గ్రంథంలో ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని ఆమోదించారు.
ప్రాచీన పురాణాలలోని యక్షులు దక్షిణ భారతీయ భాషలో బ్రాహ్మీలిపి నుండి పుట్టాయా? ‘‘స’’ ‘హ’గా ఎందుకు మారుతున్నది? ముండా-తలవర శబ్దాలు సమానార్థకాలా? ఇలా చాలా లోతైన పరిశోధనను వెలమకన్నివారు చేశారు. మారెమ్మా పూజ తెలుగునాట ఉండేదని మార్కాపురం మారన వంటి రూపాలు చూపించారు. (87వ పుట.) ఐతే ఈ ‘‘మార’’ శబ్దం సంస్కృతమేమో పరిశీలింపవలసి ఉంటుంది. పిత్రూణం తీర్చుకునే దిశలో వెలమకన్ని సుందరరామశాస్ర్తీగారి రచనలలో కొన్నింటిని వారి కుటుంబ సభ్యులు గ్రంథ రూపంలో తీసుకొని రావటం ముదావహం. వారి ఇతర అముద్రిత వ్యాసాల్ని కూడా వీలువెంట వెలువడుతాయని ఆశింపవచ్చు. ఇంత విలువైన పుస్తకం అమూల్యం అని ప్రకటించటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.
మన పాఠ్యపుస్తకాలు ఇలా వుంటే ఎలా…?
గ్రూప్-4 పరీక్ష రాసిన నలుగురు ఇంజనీరింగు విద్యార్థులు రైల్లో ప్రయాణిస్తూ, పరీక్షలో అడిగిన ప్రశ్నల గూర్చి చర్చించుకుంటున్నారు. ‘గ్రీన్‌విచ్ మీన్’ అంటే ఏంటో నాకర్థం కాలేదని ఒక విద్యార్థి అంటే, అలాంటి సూత్రాన్ని ఎప్పుడు వినలేదని మిగతావారి సమాధానం! అదే రైల్లో ప్రయాణిస్తున్న ఈ వ్యాస రచయిత ‘అ క్షాంశ, రేఖాంశాల గూర్చి తెలుసా..?’ అని వా రిని ప్రశ్నించగా ఎప్పుడో చదువుకున్నట్లు జ్ఞాపకంగాని, వాటి గూర్చి తెలియదని మూ కుమ్మడి సమాధానం!
****
అది పదో తరగతి సాంఘిక శాస్త్రం. 16 మంది రచయితలు, ఇద్దరు సమన్వయకర్తలతో పాటు, 14 మంది సంపాదక వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ 2014-15 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి రాష్ట్ర విద్యార్థులకై తయారుచేసిన పుస్తకమిది. రచయితలల్లో విశ్వవిద్యాలయ స్థాయి నుంచి, సెకండరీ స్థాయి ఉపాధ్యాయులదాకా ఉన్నా రు. ఇక సంపాదక వర్గంలో మధ్యప్రదేశ్ ఏకలవ్య, బెంగుళూర్ అజీం ప్రేమ్‌జీ, న్యూఢిల్లీలోని ఎన్‌సిఇఆర్‌టి, ఉస్మానియా, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వున్నారు. రాజీవ్ విద్యామిషన్, ఎస్‌సిఇఆర్‌టిలో విద్యా రంగంపై పట్టు, విశేష అనుభవం గలవారి నాయకత్వంలో తయారైన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు తయారుచేసిన వారికి కాకు న్నా, బోధిస్తున్నవారికి కూడా దృష్టిలో పడకపోవడం శోచనీయం!
ఈ పుస్తకం బోధన ప్రారంభమై గత సెప్టెంబర్‌నాటికి నాలుగు నెలలు గడిచాయి. ఈ నాలుగు నెలల్లో రెండు నెలసరి పరీక్షలు, ఒక టర్మ్ (మొడు నెలలు) పరీక్ష జరిగింది. ఉపాధ్యాయులు ప్రశ్నలు సంధిస్తే విద్యార్థులు రాస్తున్నారు. పేపర్లు దిద్దారు, మార్కులు వేశారు. పిల్లల మార్కుల్ని చూసి సంతసించే తల్లిదండ్రులు, మార్కులు బాగా సంపాదించే విద్యార్థులుంటే సంబరపడే ఉపాధ్యాయ వర్గమున్న వ్యవస్థ మనది. పాఠ్యాంశాలు ఎలా వున్నాయనే ధ్యాస, తల్లిదండ్రులకు సరే, ఉపాధ్యాయులకు, అందునా అదే విషయ పరిజ్ఞానంతో బోధించే ఉపాధ్యాయులకు లేకుండాపోవడం కొంత ఆశ్చర్యమే!
సాధారణంగా పుస్తకాల్లో అచ్చుతప్పులు దొర్లడం సహజం. గతంలో తప్పొప్పుల పట్టిక ఒకటి పుస్తకం చివర వుండేది. దీనికిప్పుడు కాలం చెల్లింది. లేదా పుస్తకాలు వెళ్లిపోయాయని భావిస్తే ఓ సర్క్యులర్ ద్వారా తప్పుల్ని గుర్తించి, సరిచేసుకొని చదవాలనే సూచనలుండేవి. ఇవేమి లేవంటే, తయారుచేసిన పుస్తకాన్ని ఎవరూ రెండోమారు చూడలేదని అర్థం!
భాగం ఒకటిలో ఒకటో పాఠం. భారతదేశం:్భగోళిక స్వరూపాలు పేజీ (2) మొదటి వాక్యం- ‘్భరతదేశం చాలా విశాలమైన దేశం ఇది పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉంది. దేశం 8-50 డిగ్రీల ఉత్తర రేఖాంశంగల మధ్య 68-9డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంది’. …పై పటం చూసి (ప్రపంచ) ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం వుందని ఊహించుకోండి.. మీ జీవితంలో ఏయే తేడాలుంటాయి..?
పైనగల రెండు వాక్యాలలో తప్పొప్పుల గూర్చి పక్కన పెడదాం. పరస్పర విరుద్ధ వాఖ్యానాలు దేన్ని స్ఫురిస్తున్నాయి. దక్షిణార్థగోళంలో భారతదేశం వున్నపుడు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం వుండడానికి వీలులేదు. కాబట్టి ఎలాంటి ఊహలకు తావుండదు. లేదా మొదటి వాక్యమే సరియైనదైతే, అంటార్కిటికా వృత్తంలో ఉన్నట్లుగా భారతదేశాన్ని ఊహించుకోవాలి. పేజీ నెంబర్ మూడు: పటం (2)ను చూస్తే భారతదేశం ఏయే అక్షాంశాల మధ్యన, ఏయే రేఖాంశాలమధ్యన వుందో కనీస పరిజ్ఞానం వున్నవారు గుర్తించగలరు. పటంలో ప్రస్తావించిన వాస్తవ స్థితికి చూపిన కోణాలకు, రెండవ పేజీలోని వాక్యాలకు పరస్పర విరుద్ధం కనపడుతుంది. భారతదేశం 8.4’-37.6’ డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్యన, 68.7’-97.25’ డిగ్రీల తూర్పు రేఖాంశాలమధ్యన వున్నట్లు స్పష్టంగా వుంది. ఇదే పుస్తకంలోని పేజీ నెం.(49)లో ‘ఉత్తరార్థ భూగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో భారతదేశం ఉంది..’ అనే వాక్యం కూడా సరిగానే వున్నది. తిరిగి పేజీ నెం.(47)లో మొదటి పేరాలో కూడా.. ‘్భమధ్య రేఖకి దూరంగా ఉన్న రేఖాంశాల కంటే దగ్గరగా ఉన్న రేఖాంశాల వద్ద ఈ తీవ్రత (ఉష్ణోగ్రత) ఎక్కువగా ఉంటుంది…’. భూమధ్య రేఖకు దూరంగా, దగ్గరగా వుండేది అక్షాంశాలుగాని రేఖాంశాలు కావు. ఇదే పేజీలోని రెండవ పేరాలో.. ‘్భరతదేశం సుమారుగా 8-37 డిగ్రీల రేఖాంశాల మధ్య వుంది. రెండో పేజీలో ప్రస్తావించిన 8-50 డిగ్రీల ఉ. రేఖాంశాలమధ్య.. దానికి కూడా ఇది భిన్నంగా వుంది. ఇదీ 8.4’-37.6’ డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్యనే అనే వుండాలి.
అయిదవ పాఠ్యాంశంలోని (59)వ పేజీలో ప్రస్తావించిన సింధూ నది వ్యవస్థ, గంగానదీ వ్యవస్థల గూర్చి అసంపూర్తి సమాచారం, తప్పుడు భావనల్ని కల్గించేలా వున్నాయి. సాధారణంగా ఒక నది మరో నదిలో కలిస్తే, కలిసిన నది ఉపనది అవుతుంది. సింధూ నది టిబెల్‌లోని మానస సరోవరం చుట్టూగల కైలాస పర్వత శ్రేణుల్లో పుట్టి, లడక్ ద్వారా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. పుస్తకంలో ప్రస్తావించినట్లు పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతో ఈ నదికి సంబంధం లేదు. కాని దీని పరీవాహక ప్రాంతంలోని అనేక ఉపనదులు ఈ రాష్ట్రాల్లో పుట్టి ప్రవహిస్తాయి. కాశ్మీర్‌లో ప్రవహించే జీలం, చీనాబ్, తావి, పంజాబ్‌లో ప్రవహించే రావి, బియాస్ సట్లెజ్‌లు ఒకదాంట్లో ఒకటి ఉపనదిగా కలుస్తూ సట్లెజ్ నదిగా పాకిస్తాన్‌లో సింధూ నదితో కలుస్తుంది. చీనాబ్ (ఉధంపూర్ గుండా ప్రవహించే) నదిలో జమ్మూ పట్టణం ద్వారా ప్రవహించే తావి, శ్రీనగర్ పట్టణం ద్వారా ప్రవహించే జీలంలు, పంజాబ్ పఠాన్‌కోట ద్వారా ప్రవహించే రావినదులు కలిసిన తర్వాత బియాస్ నదిని కలుపుకొని సట్లెజ్ చీనాబ్‌తో సంగమం చెందుతుంది (అయినా అట్లాస్‌ను చూడాలి). గంగానదీ వ్యవస్థ గూర్చి ప్రస్తావిస్తూ, ఇదిరెండు నదుల కలయిక అని రాసారు. నిజానికి దేవప్రయాగ దగ్గర అలకనందతో కలిసి గంగానదిగా ఏర్పడే భాగీరథిలో ‘బిలంగ్‌నా’ అనే ఓ ప్రధాన నది, రుద్ర ప్రయోగ దగ్గర కేదార్‌నాధ్‌పైన గల గాంధీ సరస్సు (చార్‌బరీ), వాసుకీతల్‌ల నుంచి పుట్టిన మందాకిని నది అలకనందతో కలిసి అలకనందగా మారుతుంది. ఈ విధంగా ప్రధాన మూడు నదుల కలయిక గంగానది అయితే, అలహాబాద్ దగ్గర యమునా నదితో కలిసి మరింతగా విశాలమైన గంగానదిగా మారుతుంది. యమునానది ప్రస్తావన లేకుండా గంగానదిని ప్రస్తావించలేం. ఇక బ్రహ్మపుత్ర నది ప్రారంభంలో అనేక పేర్లతో వుండి, బంగ్లాదేశ్ గుండా బంగాళాఖాతంలో కలిసేముందు అనేక పాయలుగా డెల్టాలను ఏర్పర్చుతూ కలుస్తుంది. ఈ పాయలలో పద్మ, జమున, మధుమతి, మేఘనలు ముఖ్యమైనవి. పేజీ నెం.(60)లోని పటంలో ఈ విషయాలు స్పష్టంగా వున్నాయి. ప్రస్తావన కూడా వుండాల్సింది. ఇన్ని అంశాలు అవసరమా అనే భావన కొందరికి రావచ్చు! పాఠశాల విద్యాదశలో పదవ తరగతి చివరి దశ. ఈ దశ తర్వాత విద్యార్థి చదువంతా ఐచ్ఛికంగా వుంటుంది. కాబట్టి, పుస్తకంలో ముందే ప్రస్తావించిన విద్యా ప్రమాణాల్లోని సామర్థ్యాలను పొందాలంటే, భూగోళ శాస్త్రం వాస్తవికంగానే వుండాలి. చారిత్రక అంశాలు అన్వయంలో వ్యత్యాసాలు వుండవచ్చు! పాలకుల భావజాలాన్ని బట్టి ప్రపంచ చరిత్రను, యుద్ధాల్ని, విప్లవాల్ని చూడడం జరుగుతుంది. కాని భౌగోళిక విషయాలు ఎలాంటి మార్పునకు గురికాలేవు.
గతంలో పాఠ్యపుస్తకాల రూపకల్పన కేంద్రీకృతంగా, ఒకరిద్దరు రచయితలచే, అదీ తరగతి గది బోధనతో సంబంధంలేని వ్యక్తులచే లిఖించబడేవి. ఈ పుస్తకాల తయారీపై అనేక విమర్శలు వచ్చేవి. కాని పరిస్థితుల్లో మార్పు రావడం, నిధుల కొరతను అధిగమించడం, రాజీవ్ విద్యామిషన్ (ఎస్‌ఎస్‌ఎ) చొరవతో మారుమూల ప్రాంతాలలో నిష్ణాతులని గుర్తించబడిన తరగతి గది బోధకులచే ఎంపిక చేసి, చర్చలు జరిపి, వర్కుషాపుల్ని నిర్వహించి, ముందు ప్రణాళికను, తర్వాత అంశాలను, అంశాలవారిగా పట్టు వున్న ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి, వీరికి దేశవ్యాపితంగా గల నిపుణులచే సూచనల్ని, సలహాల్ని ఇప్పించి, వారు కూడా ఈ వర్కు షాపుల్లో పాల్గొనేలా చేసి తయారుచేసిన పుస్తకాలు ఇలా తప్పుడు భావనలతో వుంటే విద్యార్థులు అవే తప్పుడు భావనల్ని అవగాహన చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే.
పొరపాట్లు జరగడం సహజమే అయినా- వాటిని కనీసంగా గుర్తించకపోవడం అతి ధీమానే అవుతుంది. ఎవరి చాప్టరును వారే రాసుకొని, చేతులు దులుపుకోవడం జరగడం, సంపాదక వర్గం కనీసంగా అన్ని అధ్యాయాల్ని క్షుణ్ణంగా చూడకపోవడం ఒక లోపమైతే, నాలుగు నెలలుగా ఈ పుస్తకాన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణతో బోధిస్తున్న విషయ నిపుణులైన ఉపాధ్యాయులు గుర్తించకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. అంటే పాఠ్యాంశాల్లో పేజి పేజిని బోధించడం, వాటి కనుగుణంగానే ప్రశ్నలు సంధించడం, జవాబుల్ని కూడా సరిగా చూడకుండా మార్కులు వేయడం జరిగిపోతూనే వున్నది. అందుకే, సాంఘిక శాస్త్రంలో అతి తక్కువ మంది ఫెయల్ అవుతూ వుంటారు.
ఈ విషయాల్ని గుర్తించడానికై పెద్దగా విషయ పరిజ్ఞానం అవసరంలేదు. అట్లాసును చూసినా, గ్లోబును పరిశీలించినా అన్ని విషయాలు అవగతం అవుతాయి. కాని మన పాఠశాలల్లో అట్లాసులు వున్నాయా అనేది ఒక ప్రశ్న అయితే, వున్నా అవి బీరువాలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇక గ్లోబు సంగతి సరేసరి! ఎప్పుడో కొన్న గ్లోబు ప్రధానోపాధ్యాయుని బల్లపై, లేదా పక్కనేగల బీరువాపై భద్రంగా వుంటుంది. అదెన్నడు తరగతి గదిలోకి ప్రవేశించదు. పటాలు చుట్టచుట్టన్నా వుంటాయి, లేదా స్ట్ఫారూంలో వేళాడుతూ చిరిగిపోతూ వుంటాయి. ఓ తరగతి గదిలోకో, వరండాలోకో వచ్చి వేళ్ళాడితే, అక్కడో పాయింటర్ వుంటే ఏ ఉపాధ్యాయుడికి సహాయం లేకుండా విద్యార్థులే పట నైపుణ్యాల్ని పెంపొందించుకుంటారు. విషయ అవగాహన పెరుగుతుంది. ఉపాధ్యాయుడు పుస్తకంలోని విషయాన్ని ఎత్తి చదివి, బోధన చేస్తున్నానని భ్రమపడితే పరిస్థితి పైన ఉదహరించిన ఇంజనీరు విద్యార్థుల్లాగానే వుంటుం ది. పాఠ్యాంశాల లొసుగులు ఒక్క సాంఘిక శాస్త్రంకే పరిమితం కాలేదు. ఆరో తరగతి సామాన్య శాస్త్రంలోని ‘మన ఆహారం’ అనే మొదటి పాఠం మొదటి పేజీలో పొందుపర్చిన తొమ్మిది రకాల ఆహార పదార్థాలను చూస్తే, మన పాఠ్యాంశాలు ఏ వర్గ ప్రయోజనాల్ని కాంక్షిస్తున్నాయో తెలుస్తుంది. శ్రమజీవులు, హరిజన, గిరిజనులే కాదు, రాయలసీమ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల ఆహార పదార్థాలు కనీసంగా చూపకపోవడం పుస్తక రచయితల అవగాహనా రాహిత్యమే! ఇప్పటికైనా కొత్త రాష్ట్రాలకు, వాస్తవ చింతనతో పుస్తకాల తయారీకి పూనుకుంటే విద్యార్థులకు మేలుచేసినవారమవుతాం!

