”దాదా మౌని ”-అశోక్ కుమార్ జయంతి

రతీయ సినిమాపై ‘దాదామోని’ ముద్ర

అశోక్‌కుమార్‌నూ, భారతీయ సినిమానూ వేరుచేసి చూడలేం. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది డెబ్భై ఏళ్ల భాగస్వామ్యం. తనకు అమితమైన పేరు తెచ్చిన మొదటి సినిమా ‘అచ్చుత్‌ కన్య’ (1936)లో నటించేందుకు ఆయన మొదట నిరాకరించారన్నది నిజం. డైరెక్టర్‌ హిమాంశు రాయ్‌ బలవంతం మీద ఆ సినిమా చేశారు. ఆ సినిమా నుండి ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలుగలేదు. అందులో నాయిక దేవికా రాణి.
ఆ రోజుల్లో అశోక్‌కుమార్‌, దేవికా రాణి కాంబినేషన్‌ అంటే ప్రేక్షకులకు కన్నుల పంటే. ‘జీవన్‌ నైయా’ (1936), ‘ఇజ్జత్‌’ (1937), ‘సావిత్రి’ (1937), ‘నిర్మల’ (1938) వంటి చిత్రాలలో ఆ జోడీ బాగా రాణించింది. అశోక్‌కుమార్‌ అసలు పేరు కుముద్‌లాల్‌ కుంజిలాల్‌ గంగూలీ. 1911 అక్టోబర్‌ 13న భాగల్పూర్‌లో జన్మించిన ఆయన ఖండ్వాలో పెరిగారు. కలకత్తాలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నాక, బాంబే టాకీస్‌లో లేబరేటరీ అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అదే కంపెనీ నుంచి నటునిగా మారారు. దేవికా రాణి తర్వాత లీలా చిట్నీస్‌తో కలిసి ఆయన నటించిన ‘కంగన్‌’ (1939), ‘బంధన్‌’ (1940), ‘ఝూలా’ (1941) సినిమాలు సూపర్‌ హిట్టయి అశోక్‌కుమార్‌ను అగ్రశ్రేణి నటునిగా మార్చాయి. ‘కిస్మత్‌’ (1941)లో చేసిన యాంటీ హీరో రోల్‌ ఆయన కెరీర్‌లో మోస్ట్‌ ఫేమస్‌ రోల్‌గా పేరు తెచ్చుకుంది. అందులో ఆయన సిగరెట్‌ తాగే స్టయిల్‌ను ఆ కాలంలో ఎంతోమంది అనుసరించడం ఆ పాత్ర సాధించిన విజయం. అప్పటి నటుల తరహాలో ఆయన కూడా తన పాటలను తనే పాడారు. వాటిలో ‘మై బన్‌ కీ చిడియా’, ‘చల్‌ చల్‌ రే నౌజవాన్‌’, ‘న జానే కిదర్‌ ఆజ్‌ మేరీ నావో చలీ రే’ వంటివి బాగా పాపులర్‌ అయ్యాయి. ‘ఆర్తి’ (1962), ‘గుమ్‌రాహ్‌’ (1963), ‘బందిని’ (1963) చిత్రాల్లో నటునిగా ఆయన ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రత్యేకించి ‘బందిని’లో ప్రతి సన్నివేశంలోనూ నూతన్‌, అశోక్‌ ఒకరిని మించి మరొకరు అద్భుత నటన ప్రదర్శించారనే పేరు తెచ్చుకున్నారు.
కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా…
ఆరవ దశకం ద్వితీయార్ధంలో చేసిన ‘మమత’ (1966), ‘హాతే బజారే’ (1967) చిత్రాల తర్వాత ఆయన కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. ‘జ్యూయల్‌ తీఫ్‌’ (1967)లో విలన్‌గా, ‘మిలి’ (1975)లో సానుభూతికి నోచుకునే తండ్రిగా, ‘ఆశీర్వాద్‌’ (1968), ‘చోటీ సీ బాత్‌’ (1975) సినిమాల్లో వృద్ధునిగా, ‘జవాబ్‌’ (1970)లో రేపిస్ట్‌గా, ‘విక్టోరియా నెం. 203’ (1972)లో మోసగానిగా, ‘ఖూబ్‌సూరత్‌’ (1980)లో భార్యా విధేయుడైన ఇంటిపెద్దగా వైవిధ్యమైన పాత్రల్లో రాణించారు అశోక్‌కుమార్‌. అప్పట్నించే ఆయనను అందరూ ప్రేమగా ‘దాదామోని’ (పెద్దన్నయ్య)గా పిలుచుకోవడం ప్రారంభించారు. ఎనిమిదో దశకానికి వచ్చేసరికి ఆయన సినిమాలను బాగా తగ్గించేసుకున్నారు. టెలివిజన్‌లో అడుగుపెట్టి దూరదర్శన్‌లో ప్రసారమైన మొదటి ధారావాహిక ‘హమ్‌ లోగ్‌’ (1984)కు ప్రయోక్తగా వ్యవహరించారు. 1986లో ప్రసారమైన ‘బహదూర్‌ షా జఫర్‌’ సీరియల్‌లో టైటిల్‌ రోల్‌ పోషించారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో ఆయన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ను అందుకున్నారు. వృద్ధాప్యం కారణంగానూ, అనారోగ్య కారణాల వల్లనూ ఆయన తొమ్మిదో దశకం మధ్య నుండి సినిమాలకూ దాదాపు దూరమయ్యారు. నటునిగా ఆయన చివరి చిత్రం ‘ఆంఖోం మే తుమ్‌ హో’ (1997). సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన తొంభై ఏళ్ల వయసులో గుండెపోటుతో 2001 డిసెంబర్‌ 10న మృతిచెందారు.
(నేడు అశోక్‌కుమార్‌ జయంతి)
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.