”భాష కోసమే బతుకుతున్నా ”అంటున్న కేన్సర్ పీడితుడు -తాతా రమేష్ బాబు –

భాష కోసమే బతుకుతున్నా

కళ మనిషిని బతికిస్తుందా? అంటే అవుననే అంటారు తాతా రమేష్‌బాబు. తనను కేన్సర్‌ ఏ క్షణాన్నైనా కబళించే అవకాశం ఉందని తెలిసినా జానపద కళల కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జానపద కళల పునరుజ్జీవంతోనే తెలుగు భాష వికసిస్తుందని నమ్మి, గత మూడు దశాబ్దాలుగా అందుకోసం కృషి చేస్తున్నారు రమేష్‌బాబు.

గుంటూరు జిల్లా భట్టిప్రోలులో జన్మించిన తాతా రమేష్‌బాబు గుడివాడలో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే తెలుగు భాషా వికాసం, తెలుగు భాషా చైతన్యం కోసం కృషి చేశారు. జానపద కళలు, సూక్ష్మచిత్రకళ, పెయింటింగ్స్‌, బొమ్మలాటలు, పప్పెట్‌ షోలు… ఇలా అనేక విధాలుగా తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తుండటం విశేషం. ఇప్పటి వరకు 30కి పైగా పుస్తకాలు రాశారు. దూరదర్శన్‌, రేడియోలో పప్పెట్‌ షోలు చేశారు. ఆకాశవాణిలో ధారావాహిక ప్రసంగాలు చేశారు. కవితలు, కథలు, సభల సమీక్షలు నిర్వహించారు. రంగస్థలంపై నాటకాలకు కొదవ లేదు. ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులను అందుకున్నారు. గుంటూరు శేషేంద్రశర్మ సాహితీ పురస్కారంతో పాటు జాతీయ ఉగాది పురస్కారాలు వరించాయి.

‘‘తెలుగు భాష గొప్పది..’’ అంటూ దీర్ఘ ఉపన్యాలు ఇస్తే వినడానికి జనాలు అంత ఆసక్తి చూపరు. అదే ఏ పప్పెట్‌తోనో, జానపద గేయంతోనో చెబితే వింటారు. నిర్వాహకుల లక్ష్యమూ నెరవేరుతుంది. తాతా రమేష్‌బాబు ఆ పనే చేశారు. జానపద కళలను బతికించుకోవాలని తాపత్రయ పడుతూనే.. మరో వైపు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారాయన.
ఆంగ్ల చదువులొచ్చాక మాతృభాష పట్ల తగ్గుతున్న ఆసక్తిని గమనించి ఆయనీ పని చేస్తున్నారు. ‘‘తెలుగు భాష తీరు ఇలాగే కొనసాగితే మరో 30 ఏళ్లలో కనుమరుగు కావడం ఖాయం’’ అని ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆయనలో తీవ్ర ఆలోచనలు రేకెత్తించింది. తెలుగు భాషను కాపాడుకోవాలనే దృఢ సంకల్పాన్ని కలిగించింది. తెలుగు భాష అప్పుడెందుకు పరిఢవిల్లింది? ఇప్పుడెందుకు నీరసిస్తోంది? అన్న ప్రశ్నలు రమేష్‌బాబు మదిని నిత్యం తొలిచేవి. కారణాలు ఎన్నున్నా.. జానపద కళలు అంతరించిపోతుండటమూ ఒక కారణమన్నది రమేష్‌బాబు అభిప్రాయం. ‘‘జానపద కళలు పునరుజ్జీవం పొందినప్పుడే భాషకు కొత్త వెలుగు వస్తుంది. పాతికేళ్ల క్రితం చదువురాని వారికి సైతం రామాయణం, మహాభారతం కంఠతా వచ్చేవి. దానికి కారణం జానపదకళలే కదా! తెలుగు భాష వికాసం జరగాలంటే ఆ కళలను మళ్లీ బతికించుకోక తప్పదు’’ అని చెప్పారు.
కేన్సర్‌ కబళిస్తున్నా…
తెలుగు భాషా చైతన్యం కోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చైతన్యయాత్రలు నిర్వహించారు రమేష్‌బాబు. ఇందుకోసం ఏడు లక్షల రూపాయల వరకు తన సొంత డబ్బును ఖర్చు చేశారాయన. ప్రభుత్వం గానీ, ఇతర సంస్థలు గానీ ఎటువంటి సహాయం చేయలేదు. అయినా సరే వెనుకంజ వేయకుండా ఊరూరా తిరిగి జానపద కళలు, వాటి ప్రాముఖ్యత, తెలుగు భాష గొప్పదనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అయితే అదే సమయంలో ఆయనను విధి వెక్కిరించింది. కేన ్సర్‌ రూపంలో అనారోగ్యం బయటపడింది. కేన్సర్‌ అనగానే తన గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తారు ఎవరైనా. కానీ తను అందుకు భిన్నంగా- చనిపోయేలోగా సమాజానికి ఏదైనా చేయాలని సంకల్పించారు. వ్యాధి గురించి తెలిశాకే తన కోరిక మరింత బలపడిందని ఆయన అంటారు. టీచర్‌ వృత్తిని వదిలేసి జానపద కళల ప్రాచుర్యంపై పూర్తి దృష్టి సారించారు. ‘‘కళాసాహిత్య సేవా పీఠాన్ని నెలకొల్పి కళ, సాహిత్యం, సేవ, భాష, సంస్కృతి, చరిత్ర.. ఇలా ఆరు అంశాల్లో పేద కళాకారులకు నగదు బహుమతిని అందజేయాలనుకుంటున్నాను. నేను ఉన్నా లేకున్నా ప్రతి ఏటా ఇది కొనసాగడానికి కొంత నిధిని ఏర్పాటు చేశాను. పేద కళాకారులకు ఇది కొంతైనా సహాయపడుతుందని నా ఆశ. ప్రతి ఒక్కరు సమాజం నుంచి లాభం పొందుతుంటారు. వాళ్లు తిరిగి సమాజానికి కొంత ఇవ్వడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే సమాజం ఆనందంగా ఉంటుంది’’ అని తెలిపారు రమేష్‌బాబు.
కేన్సర్‌ కబళిస్తున్నా ‘అడవి పూలు, గంగతో రాంబాబు’ వంటి సీరియల్స్‌లోనూ ఆయన నటిస్తున్నారు. రేడియో, టీవీల్లో జానపద కళలకు ప్రాచుర్యం తీసుకొస్తున్నారు. గోశాల నుంచి కొన్ని ఆవులను దత్తత తీసుకుని వాటి ఆలనాపాలనా చేస్తున్నారు. అనాథ బాలలకు తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఊరికే ఒక్క పైసా విదల్చని ఈ కాలంలో అంత డబ్బు ఎలా ఖర్చుపెడుతున్నారని అడిగితే ‘‘నాకు అందులోనే ఆనందం ఉంది. టీచర్‌గా పనిచేస్తూనే రాత్రిపగలు నా భార్య, నేనూ స్ర్కీన్‌ప్రింటింగ్‌ నడిపే వాళ్లం. వృథాగా ఎక్కడా డబ్బు ఖర్చు పెట్టలేదు. నా దృష్టిలో ఖర్చు చేయకపోవడం అంటే సంపాదించడమే. అలా నేను సంపాదించిన, పొదుపు చేసుకున్న డబ్బులో నుంచే నాకిష్టమైన వ్యాపకాల కోసం తీసుకునే వాడ్ని. దీనికి నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు’’ అన్నారు రమేష్‌బాబు.
– నవ్యడెస్క్‌

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.