రంగుల తెలంగాణ -కళాకారుల ఆవిష్కరణ

రంగుల తెలంగాణం

ఆర్ట్‌ అంటే – కాన్వాస్‌, బ్రష్‌లు, రంగులు కాదు. నింగి, నేల, మనుషులు, యాస గోస, బతుకులు, కష్టాలు కన్నీళ్లు. వాటన్నిటినీ అద్దంలో చూపిస్తుంది పెయింటింగ్‌. తెలంగాణలో అలాంటి పెయింటింగ్స్‌కు కొదవ లేదు. ఇక్కడున్నంత మంది ప్రముఖ ఆర్టిస్టులు ఇంకెక్కడ లేరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రంగుల్లోకి కన్వర్ట్‌ చేసి కాన్వాస్‌ మీద ప్రతిఫలించి.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఘనత వీరిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అందరు ఆర్టిస్టులు ఒకచోట చేరి చిత్రకళకు నీరాజనం పలికారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ ఆర్ట్‌క్యాంప్‌ విశేషాలే ఇవి..

పెయింటింగ్‌ను వృత్తిగా, ప్రవృత్తిగా ఎంచుకున్న మహిళలు తక్కువేనని చెప్పవచ్చు. అయితే ఉన్న కొద్ది మంది మహిళలు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, పేరును సంపాదించుకున్నారు. మరి కొంత మంది తమ వృత్తిని కొనసాగిస్తూనే ఆర్టిస్టులుగా అప్పుడప్పుడు కుంచె పట్టుకుంటున్నారు. ‘‘తెలంగాణలో 12 మంది మహిళా ఆర్టిస్టులున్నారు. అందులో నేను ఒకరిని కావడం నా అదృష్టం. ఇండియన్‌ మైథాలజీపై నేను రీసెర్చ్‌ చేస్తున్నాను. అందులో భాగంగానే తెలంగాణ గ్రామదేవతలపై పరిశోధన సాగిస్తున్నాను. నేను వేసే పెయింటింగ్స్‌లో కూడా గ్రామదేవతలు ఉంటారు. ఈ క్యాంప్‌లో గాడెస్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో బతుకమ్మ చిత్రాన్ని గీసాను. ఒక ఆధునిక మహిళ కల్చర్‌ను ఎలా యాక్సెప్ట్‌ చేస్తోంది.. కల్చర్‌తో పాటు ఎలా ముందుకెళుతోందనే అంశాలను నా చిత్రాలు ప్రతిబింబిస్తాయి’’ అంటున్నారు మహిళా ఆర్టిస్ట్‌ నిర్మల. తను ఇఫ్లూలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేస్తూనే ఉమెన్‌ ఓరియెంటెడ్‌ పెయింటింగ్స్‌ వేస్తూ మహిళాభ్యున్నతికి తన వంతు కృషి చేస్తున్నారు.
ప్రత్యక్షంగా చూసే అవకాశం
ఒక అద్భుతమైన పెయింటింగ్‌ను చూసినపుడు ఎలా గీసి ఉంటారో అనిపిస్తుంది. అయితే అలాంటివి వేసేటప్పుడు చూసే అవకాశం లభించదు. ఇలాంటి ఆర్ట్‌ క్యాంప్‌లు ఆ అదృష్టాన్ని అందిస్తాయి. ‘‘ఇదొక హిస్టారికల్‌ ఈవెంట్‌. ఇక్కడ సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. వారితో ఇంటరాక్ట్‌ కావడం వల్ల టెక్నికల్‌ అంశాలు తెలుసుకోగలిగాం. తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులందరికీ దక్కిన ఒక అరుదైన అవకాశం ఇది’’ అని కరీంనగర్‌ జిల్లాకు చెందిన కిరణ్‌ వరికిల్ల అన్నారు. ఈయన అద్భుతమైన ఎరోటిక్‌ పెయింటింగ్స్‌ను ఈ క్యాంప్‌లో వేశారు. ఆర్టిస్టులు వేస్తున్న సమయంలోనే సందర్శకులు ఆసక్తిగా తిలకించి వారి చిత్రకళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అంతేకాకుండా చిత్రకళలో అపారనైపుణ్యం ఉన్న ఆర్టిస్టులను ఇప్పుడిప్పుడే ఆర్టిస్టులుగా ఎదుగుతున్న వారు చూసి నేర్చుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడింది.
స్వేచ్ఛకు ప్రతీక..

తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత నిర్వహించిన మెగా ఆర్ట్‌ క్యాంప్‌ కావడంతో చిత్రాలలో తెలంగాణం వెల్లివిరిసింది. ప్రతి పెయింటింగ్‌లో తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు సందర్శకులను కట్టిపడేశాయి. ‘‘స్వేచ్ఛకు చిహ్నంగా పావురాన్ని ఎంచుకుంటారు. కానీ నా చిత్రంలో కాకిని ఎంచుకున్నాను. ఇందులో ఎరుపు పోరాటాన్ని, నీలం నిరసనను తెలియజేస్తుంది. ఆకుపచ్చ రంగు అభివృద్ధికి సూచికగా నిలుస్తుంది. మొత్తంగా దళిత స్వేచ్ఛను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది’’ అని ప్రముఖ ఆర్టిస్ట్‌ అక్బర్‌ అన్నారు. ‘‘సీనియర్స్‌ పెయింటింగ్‌ చేస్తుంటే చూడాలనే ఒక ఆసక్తి ఉండేది. అది ఈ క్యాంప్‌లో తీరింది. ఆర్టిస్టులు మంచి మంచి పెయింటింగ్స్‌ వేయడానికి ఇలాంటి ఎన్విరాన్‌మెంట్‌ బాగా ఉపకరిస్తుంది. అంతరించిపోతున్న రూరల్‌ కల్చర్‌ను పట్టి చూపిస్తాయి నా చిత్రాలు’’ అని మెదక్‌ జిల్లా కాస్లాబాద్‌కు చెందిన కంది నర్సింలు అంటున్నారు. ఈయన ఆర్ట్‌ క్యాంప్‌లో వేసిన పెయింటింగ్‌ పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లి అప్పటి అలంకారం ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూపించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఆర్ట్‌ క్యాంప్‌ ఇది. ఈ క్యాంప్‌ విజయవంతం కావడం మాలో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడిప్పుడే ఆర్టిస్టులుగా ఎదుగుతున్న వారికి ఈ తరహా క్యాంప్‌లు చాలా ఉపయోగపడతాయి. సీనియర్‌లతో ఇంటరాక్షన్‌ కావడం వల్ల చిత్రకళలో మెలకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. రంగులు ఎలా అప్లై చేయాలి? కర్వ్స్‌, డ్రాయింగ్‌, ఫినిషింగ్‌ వంటి పనితనం తెలుస్తుంది. ఒక పెయింటింగ్‌ని చూసినపుడు ఈ కర్వ్‌ ఎలా వేసి ఉంటాడు ? ఫినిషింగ్‌ అద్భుతంగా ఉంది, ఎలా చేసి ఉంటాడని అనిపిస్తుంది. అవన్నీ ఇక్కడ స్వయంగా చూసే భాగ్యం కళాభిమానులకు కలిగింది.
– బి.నర్సింగరావు, ప్రముఖ దర్శకులు, చిత్రకారులు

ఆర్టిస్టులందరినీ ఒకే వేదికపై తీసుకురావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. మేం ఆ ప్రయత్నం చేసి సఫలమయ్యాం. 100 సంవత్సరాల హిస్టరీని డాక్యుమెంట్‌ చేశాం. 150 మంది ఆర్టిస్టుల ప్రొఫైల్స్‌ను పుస్తకరూపంలో తీసుకువచ్చాం. ఇందులో సీనియర్‌ ఆర్టిస్టుల నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆరిస్టుల వరకు వివరాలు ఉన్నాయి. పాతతరం ఆర్టిస్టుల వివరాలు కావాలంటే ఎక్కడా దొరకవు. ఈ పుస్తకంతో ఆ లోటు తీరింది. ఒక డాటా బ్యాంక్‌ మాదిరిగా ఈ పుస్తకం ఉపయోగపడనుంది.
– ఏలె లక్ష్మణ్‌, ప్రముఖ చిత్రకారుడు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.