”కదిలే బొమ్మలకు”ప్రాణం పోసిన రఘు పతి వెంకయ్య జయంతి

కదిలే బొమ్మకు ప్రాణం పోసిన బ్రహ్మయ్య
నేడు రఘుపతి వెంకయ్య జయంతి

వందేళ్ల భారతీయ సినిమా సంబరాలు జరుపుకున్నాం. మనదేశంలో సినిమా పుట్టుకకి కారణమైన వ్యక్తుల గురించి, వారు చేసిన కృషి గురించి స్మరించుకున్నాం. అయితే 1910లో ‘పుండలీక్‌’ సినిమా నిర్మించిన దాదాభాయి టోర్నీ కంటే , 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రం తీసిన దాదాసాహెబ్‌ ఫాల్కే కంటే ముందే ఒక తెలుగువాడు 1909లోనే భారతీయ సినిమా పరిశ్రమకు పునాది వేశాడన్నది చరిత్ర చెప్పే సత్యం. తెలుగు సినిమాకే కాదు దక్షిణాది సినిమాకే ఆద్యుడైన ఆ వ్యక్తి పేరు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన వేసిన పునాది మీదే దక్షిణాదిన సినిమా వేళ్లూనుకుని దినదిన ప్రవర్థమానమైంది. మనదేశంలో తొలి ప్రదర్శకుడు, తొలి పంపిణీదారుడు ఆయనే. వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం.

ప్రభుత్వంలోని సైనిక శాఖలో సుబేదారుగా పనిచేసిన మచిలీపట్నం వాస్తవ్యుడు అప్పయ్యనాయుడు రెండో కొడుకు రఘుపతి వెంకయ్య. 1873 అక్టోబర్‌ 15న జన్మించారు. వెంకటేశ్వరుని భక్తుడైన అప్పయ్యనాయుడు తన పెద్దకొడుకుకి వెంకటరత్నం అనీ, చిన్నకొడుక్కి వెంకయ్య అని పేరు పెట్టారు. తండ్రి ఉద్యోగ బదిలీ మీద వెంకయ్య తన 18వ ఏట మద్రాసులో అడుగుపెట్టారు. చిన్నతనం నుంచి చిత్రలేఖనం మీద ఆసక్తి ఉండటంతో మౌంట్‌రోడ్‌లో ఒక ఇల్లు తీసుకుని దానిని ఒక కళాకేంద్రంగా తీర్చిదిద్దారు వెంకయ్య. ఆయన వేసే బొమ్మలు, చెక్కే రాతిబొమ్మలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఆ రోజుల్లో బొబ్బిలి, విజయనగరం, కళ్లికోట, చెట్టినాడ్‌ సంస్థానాలకు చెందిన మహారాజులు గిండిలో జరిగే గుర్రపు పందాలకోసం వస్తుండేవారు. వారి దృష్టిని వెంకయ్య ఆకర్షించారు. అలాగే బ్రిటీషు ప్రభుత్వ అధికారుల ప్రశంసలు కూడా ఆయన పొందారు.
పెయింటింగ్స్‌తో పాటు ఫొటోగ్రఫీలో కూడా ప్రవేశం ఉండటంతో కొత్త ప్రయోగాలు చేసేవారు. ఒకరోజు పేపరు తిరగేస్తుంటే ‘క్రోనోమెగాఫోన్‌’ నే సినిమాటోగ్రాఫ్‌ మెషీన్‌ను కనిపెట్టారనీ, దాని మీద పిక్చర్‌ ప్రొజెక్ట్‌ అయ్యేటప్పుడు రికార్డెడ్‌ డిస్క్‌ సాయంతో సంగీతాన్ని, ఇతర శబ్దాలను వినిపించవచ్చనే వార్త వెంకయ్యని ఆకర్షించింది. లండన్‌లోని గౌమాంట్‌ కంపెనీ అధినేతలు ఈ ఎక్విప్‌మెంట్‌ సృష్టికర్తలనీ, బకింగ్‌హామ్‌ భవనంలో ఐదో జార్జి, మేరీ రాణి సమక్షంలో ఇచ్చిన తొలి ప్రదర్శన విజయవంతమైందనీ ఆ వార్త సారాంశం. కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే వెంకయ్య వెంటనే మద్రాసులోని జాన్‌ డికెన్‌సన్‌ కంపెనీవారిని కలుసుకొని ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. దాని ఖరీదు రూ. 30 వేలు. తన భార్య నాంచారమ్మ సలహాతో తన ఫొటో స్టూడియోను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ‘క్రోనోమెగాఫోన్‌’ ఎక్విప్‌మెంట్‌ తెప్పించుకున్నారు వెంకయ్య. నాలుగువందల అడుగుల పొడువున్న 12 లఘు చిత్రాలను తయారు చేసి, వాటిని తొలిసారిగా విక్టోరియా పబ్లిక్‌ హాలులో ప్రదర్శించారు. ‘అండర్‌ ది పెనామా’, ‘స్వింగ్‌ సాంగ్‌’, ‘సీ సర్పెంట్‌’, ‘ఫైర్‌మర్‌ సాంగ్‌’, ‘మికాడో’… ఇటువంటి టైటిల్స్‌తో ఆ చిత్రాలను ప్రదర్శించేసరికి జనం ముగ్ధులయ్యారు. తొలి ప్రదర్శనకి ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. అయినా వెంకయ్య నిరాశ పడలేదు. చిన్న చిన్న కరపత్రాల ద్వారా ఈ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను జనానికి తెలిసేట్టు చేశారు.
ప్రేక్షకుల నాడి పసికట్టిన వెంకయ్య 1910లో ఎస్‌ప్లనేడ్‌(ఇప్పటి రాజా అన్నామలై హాలు)లో టెంట్‌ సినిమా ఏర్పాటు చేసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అవి విజయవంతమయ్యాయి. ఆ తర్వాత తన టెంట్‌ సినిమాతో బెంగుళూరు, ఆంధ్రదేశంలోని ముఖ్య పట్టణాలు తిరిగి ప్రదర్శనలిచ్చారు. దీని వల్ల లాభాలు రాకపోయినా నష్టం మాత్రం రాలేదు. నాటకాల ప్రభావం నుంచి కొంత బయట పడి సినిమాలు చూడటం కోసం జనం వస్తున్నందుకు ఆయన సంతోషించారు.
దేశంలోనే కాదు సింహళదేశానికీ తన టెంట్‌ సినిమాతో వెళ్లి అక్కడ ప్రదర్శనలిచ్చేవారు. తన తయారు చేసిన చిత్రాలే కాకుండా విదేశాల 500 అడుగుల పొడవు కలిగిన లఘు చిత్రాలను దిగుమతి చేసుకొని ప్రదర్శించేవారు. సింహళం నుంచి బర్మా వెళ్లి అక్కడ రంగూన్‌, పెరూ పట్టణాల్లో సినిమా ప్రదర్శనలు ఇచ్చారు. ఇవి జనంలో సినిమా చైతన్యాన్ని కలిగించాయి.
1911లో మద్రాసుకు తిరిగి వచ్చిన వెంకయ్య గెయిటీ టాకీస్‌ను నిర్మించారు. మద్రాసులోని తొలి సినిమా థియేటర్‌ ఇదే. ‘మిలియన్‌ డాలర్‌ మిస్టరీ’, ‘మిస్టరీస్‌ ఆఫ్‌ మీరా’, ‘క్లచింగ్‌ హాండ్‌’ వంటి లఘు చిత్రాల్ని ఇందులో ప్రదర్శించేవారు. ఆ తర్వాత మింట్‌ స్ర్టీట్‌లో క్రౌన్‌ థియేటర్‌ని, పరుశువాకంలో గ్లోబ్‌ థియేటర్‌ను వెంకయ్య నిర్మించారు. యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన లఘు చిత్రాలను ఇందులో ప్రదర్శించేవారు.
1913లో మౌంట్‌ సీ్ట్రట్‌లో క్రౌన్‌ థియేటర్‌ వెనుక ‘స్టార్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిలిం’ అనే సంస్థను నెలకొల్పి, తన చిత్రనిర్మాణకార్యక్రమాలను ప్రారంభించారు వెంకయ్య. ఆ రోజుల్లో కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో దానిని అధిగమించడం కోసం గ్లాస్‌ స్టూడియోను నిర్మించారు. ఎండ వచ్చి స్టూడియోల్లోని అద్దాల మీద పడుతుంటే ఆ వెలుగులో షూటింగ్‌ చేయవచ్చనే ఆలోచన ఆయనది. ఇటువంటి ప్రయోగం చేయడం భారతదేశంలోనే తొలిసారి. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్స్‌లో ఉపయోగిస్తున్న రిఫ్లెక్టర్స్‌ విధానానికి ఆ రోజుల్లో అలా శ్రీకారం చుట్టారు వెంకయ్య.
వెంకయ్య పెద్ద కొడుకు సూర్యప్రకాశ్‌ ఇంగ్లాండ్‌ వెళ్లి సినిమా సాంకేతిక శాసా్త్రన్ని నేర్చుకుని విలియం సన్‌ సైలెంట్‌ కెమెరాతో స్వదేశానికి తిరిగివచ్చారు. తండ్రీకొడుకులు కలసి గ్లాస్‌ స్టూడియోలో ‘గజేంద్రమోక్షం’, ‘మత్స్యావతారం’, ‘భీష్మప్రతిజ్ఞ’ తదితర మూకీ చిత్రాలు నిర్మించారు.
ప్రారంభంలో కాలానికి ఎదురీది కొత్త ప్రయోగాలు చేసిన వెంకయ్య చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులకు లోనయ్యారు. ఆస్తులన్నీ కోల్పోయారు. మూకీ యుగం అంతరించి టాకీల నిర్మాణం పెరగడం కూడా వెంకయ్య వెనకబడటానికి కారణం అయింది. 1941 మార్చి 15న ఆయన కన్నుమూశారు. కానీ ఆనాడు ఆయన సేవల్ని ప్రజలు, ప్రభుత్వం మరిచిపోలేదు. రాష్ట్రవిభజనకు పూర్వం ఆయన పేరిట ఒక అవార్డ్‌ ఏర్పాటు చేసి, చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఏటా అందించేవారు. ఇకపై కూడా రెండు రాష్ట్రప్రభుత్వాలు ఆ అవార్డ్‌ను కొనసాగించాలని సినీజనం కోరుకుంటోంది. అలాగే రఘుపతి వెంకయ్య జీవిత చరిత్రకు సినిమా రూపం ఏర్పరచి దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో సతీశ్‌ నిర్మించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నరేశ్‌ ఇందులో వెంకయ్య పాత్ర పోషించారు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.