గీర్వాణకవుల కవితా గీర్వాణం -40
40-ధ్వన్యాలోక కర్త –ఆనంద వర్ధనుడు
ఆనంద వర్ధనుడు అనగానే ‘’ధ్వని సిద్ధాంతం ‘’జ్ఞాపకం వస్తుంది ధ్వని సిద్ధాంతంపై విపులమైన చర్చ చేసి ధ్వన్యాలోకం లేక ‘’కావ్యాలోకం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన వాడు ఆనంద వర్ధనుడు .ఇది అలంకార శాస్త్రం లో ఒక కుదుపుకుదిపి కొత్తమలుపుకు తిప్పింది .శ. 855-883 వాడిన ఈ ఆలంకరికుడు కాశ్మీర రాజు అవంతి వర్మ ఆ స్థానపండితుడు .ఆనంద వర్ధనుడు ఒక యుగ కర్త అయ్యాడు .ధ్వని యొక్క ప్రకాశమే ధ్వన్యాలోకం .ధ్వని అనే కాంతి దర్శనమే ధ్వన్యాలోకం .సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రిగారు దీనికి తెలుగులో విపులమైన వ్యాఖ్య రాశారు .ఆంగ్లం లో జెఫ్రీ మౌసఫ్ మాసన్ పట్వర్ధన్ లు అభినవ గుప్తుని లోచన వ్యాఖ్య ఆధారం గా అనువదిస్తే హార్వర్డ్ యూని వర్సిటి ప్రెస్ 1990లో ప్రచురించింది .బిడ్యుత్ భరన్ ఘోష్ చేసిన వ్యాఖ్యానాన్ని సాంస్క్రిట్ పుస్తక భాండార్ వారు ముద్రించారు .
ఆనంద వర్ధనీయం
ధ్వన్యాలోకం లో నూట ఇరవై తోమ్మిదికారికలున్నాయి .వీటిని ధ్వనికారికలు అన్నాడు ఈ కారికలకు రాసిన వృత్తినే ధ్వన్యాలోకం అంటారు ధ్వనియోక్క ఆలోకనం అన్నమాట .దీనికి నూటయాభై ఏళ్ళ తర్వాత అభినవ గుప్తుడు ‘’లోచనం ‘’అనే మహా గొప్ప వ్యాఖ్య రాశాడు .కావ్య ప్రారంభం లో ఆనంద వర్ధనుడు ‘’పూర్వ ఆలంకారికులు కావ్యాత్మనే ధ్వని అన్నారు .కొందరు కాదన్నారు .కొందరు లక్షనాన్తర్గతం అన్నారు. కొందరు అది గోచరించదు అన్నారు .నేను ఇప్పుడు సహృదయుల సంతృప్తికోసం ధ్వని తత్వాన్ని వివరిస్తున్నాను ‘’అని చెప్పుకొన్నాడు .కాని కొందరు దేశీయ కొందరు విదేశీయ పండితులు ధ్వన్యాలోకం ఆనంద వర్ధనుడు రాయలేదన్నారు .అంతకు ముందే ధ్వని ఉందన్నారు
‘’ధ్వనినా గతి గభీరేణ కావ్య తత్వ నివేశినా –ఆనంద వర్ధనః కస్య నాసీ దానంద వర్ధనః ‘’అన్నదాన్ని బట్టి సందేహ నివృత్తి కలుగుతోంది దీనిభావం –‘’అతి గంభీరమైన కావ్య తత్వ పరిపుష్టమైన ధ్వని యొక్క స్వరూప స్వభావాలను నిరూపించటం చేత ఆనంద వర్ధనుడు ఎవరికి ఆనంద వర్ధనుడు కాదు ?అలాగే ఇంకొక శ్లోకం లో ఉన్నదాన్ని బట్టి –
‘’సత్కావ్య తత్వ విషయం స్పురిత ప్రసుప్త –కల్పం మనస్సు పరిపక్వ దియాం యదాసీత్
తద్వ్యాకరో త్సహృదాయో దయ లాభ హేతో –రానండ వర్ధన ఇతి ప్రథితాభి దానః ‘’-అంటే ‘’పరిపక్వమైన బుదద్ధికల విపస్చిత్తుల మనస్సులలో స్పురించి ,,సుప్తావస్తలో ఉన్న కావ్య తత్వాన్ని సహృదయుల ఆనందానికి సహృదయుడు వ్యాఖ్యానించి చెప్పాడు ‘’.కనుక ఆనంద వర్ధనుడికి పూర్వమే ‘’కావ్యాత్మ ధ్వని’’అని ఉన్నాదని ,దాన్ని నిరూపించి పండితులను అంగీకరించేట్లు వ్యాఖ్యానించాడని భావం .కాణే,ఎస్ కే డే వింటర్ నిత్స్ పండితులు కారికలు రాసింది ‘’సహృదయ ‘’అనే పేరుగల వాడన్నారు ఈ కారికలు ఆనంద వర్ధనుడికి పూర్వమే నూట యాభై ఏళ్ళ కిందటనే ఉన్నాయన్నాడు డే .మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే అప్పటికే వ్యాప్తిలో ఉన్న ధ్వని ని సిద్ధాంతీకరించి వ్రుత్తి రాసి ప్రచారం లోకి తెచ్చిన వాడు ఆనంద వర్ధనుడు అనుకొంటే ఏ ఇబ్బందీ ఉండదు ఎవరితోనూ .
ధ్వన్యాలోక అవ్యక్త ధ్వని
ధ్వన్యాలోకం లో నాలుగు ఉద్యోతాలున్నాయి .మొదటిదానిలో ప్రాచీన అలంకారికులు ధ్వనిని గురించి ఏమేమి చెప్పారో వాటిని గురించి వాటిపై వచ్చిన ఖండనల గురిచి చెప్పి ధ్వని స్వరూపాన్ని ధ్వని భేదాలను ,గుణీ భూత వ్యంగ్యాన్ని తర్క భూమికపై వ్యాఖ్యానించాడు .తర్వాత ధ్వని నిరూపణ ప్రయోజనాన్ని వివరించాడు .అభినవ గుప్తుడు లోచన వ్యాఖ్యానం రాశాడని చెప్పుకొన్నాం .అతడు ‘’చంద్రిక అనే వ్యాఖ్యానాన్ని గురించి చెప్పి లోచనం లేక పొతే చంద్రిక ఉన్నా ‘’ఆలోకం ‘’కనపడదని చమత్కరించాడు .వర్ధనుడు తన రచనలైన దేవీశతకం, అర్జున చరిత్ర మహా కావ్యం ,విషమ బాణ లీల ,హరవిజయం నుంచే లక్షణాలకు ఉదాహరణలు ఇచ్చాడు .ఇందులో దేవీశతకం ఒక్కటే లభ్యం .విషమ బాణ లీల ,హరవిజయాలు ప్రాకృత భాషలో రాశాడు .
ఇంతకీ ధ్వని అంటే ఏమిటి?కావ్యం లో వాచ్య లక్ష్యార్దాలకంటే వేరైనది ఒకటి అంతరార్ధం గా భాసిస్తుంది .దాన్ని వ్యంగ్యార్ధం అని అంటారని అదే ధ్వని అని ఆనంద వర్ధనుడు నిర్వచించాడు .ధ్వని వాచ్య ,లక్షణార్దాలకంటే చమత్కార రంజకమై ఆనందాన్నిస్తుంది .ధ్వని రామణీయకత్వం సహృదయ వేద్యం .ఇది స్త్రీల అలంకారాల కంటే భిన్నం గా ఉండే లావణ్యం లాంటిది .
‘’ప్రీతీయమాన పునరన్య దేవా –వస్త్వ్యస్తి వాణీషుమహా కవీనాం
యత్తత్ ప్రసిద్దావయ వతి రిక్తం –విభాతి లావణ్య మివ అంగనాసు ‘’
‘’గంట కొడితే వచ్చే చెవులు భరించలేని టంకార ధ్వనికంటే దాని ఝంకార ప్రతిధ్వని ఆహ్లాదం కలిగించినట్లుగా ,గుణ , అలంకారాదులకంటే రమణీయమైన ప్రతీయమానమైన అర్ధం సహృదయ జనాలకు ఆకర్షణీయం అవుతుంది ‘.అదే ధ్వని ‘’అని గంటకొట్టి ధ్వని సిద్ధాంతం లోని రహస్యాన్ని చెప్పాడు .ధ్వనియే కావ్యాత్మ అన్నాడు .ధ్వని లక్ష్య అర్ధాలలో దొరకదని ,దాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయాలను ఖండించాడు .తర్క ,పాండిత్య ఆధారాలుగా ధ్వని సిద్ధాంతాన్ని స్తాపించాడు .ధ్వనిలో ఉన్న అతి సూక్షమైన భేదాలను వివరించటం లో ఆతను తీసుకొన్న మార్గం మహా విశిష్టమైంది .ఉదాహరణలు లేకుండా ఏదీ చెప్పలేదు .ధ్వనిలో అభిదా మూల ధ్వని ,లక్షణామూల ధ్వని అని ధ్వనిలో రెండు భేదాలనాను వివరించాడు .భరతుని రస సిద్ధాంతమే రసధ్వని శ్రవ్య కావ్యాలకు అన్వయించ బడింది .వ్యంగ్యార్ధం అనే ముసుగు వేసుకొన్న రస సిద్ధాంతమే ధ్వని సిద్ధాంతం అనిపిస్తుంది .రసభావ సమన్వితమైన కావ్యాన్నే ఉత్తమ కావ్యం అన్నాడు .అలంకార రచన ఉత్తమ కావ్యం అని పించుకోదు అని స్పష్టం గా చెప్పాడు ఆనంద వర్ధనుడు .
ఎంతటివాడికైనా సమకాలీనులు అడ్డు తగలటం సర్వ సామాన్యం.ఇది ఆనంద వర్ధనుడికీ తప్పలేదు .మొదట్లో పండితులు ధ్వని సిద్ధాంతాన్ని చూసి పెదవి విరిచారు .కాని కాలం గడిచిన కొద్దీ కావ్య సిద్ధాంతాలలో ధ్వని సిద్ధాంతమే ఉత్తమోత్తమమిందని తెలుసుకొన్నారు. వ్యాప్తీ ,ప్రచారమూ చేసి నెత్తి కెత్తుకొన్నారు అందరూ .ఒక రకం గా అప్పటివరకు ఉన్న భామఃహ దండిల అలంకార వాదం ,వామనుడి రీతి వాదం వరకు అన్నిటి సమన్వయ పరచిన గొప్ప అలంకారికుడు ఆనంద వర్ధనుడు .మౌలిక తర్క సిద్ధాంత శైలిని ఎన్నుకొని ఎదురు లేని మొనగాడు అనిపించుకొన్నాడు .’’ధ్వని ధ్వని అని లోకం చెవుల్లో మారుమోగేట్లు’’ చేసిన ఆనంద వర్ధనాచార్యుడు ‘.
‘’కావ్యాత్మ స ఏవార్ధః తధాచాది కవే ఃపురా –క్రౌంచ ద్వంద్వ వియోగోత్తః శోక శ్లోకత్వ మాగతః ‘’అని మొదట్లోనే ఆనంద వర్ధనుడు అన్నాడు ..కావ్య సృష్టి ఎలాంటిదో కావ్యాన్ని అర్ధం చేసుకొని అభినందించటమూ అంత గొప్ప అన్నాడు ఆనంద వర్ధనుడు .’’The unexpressed is not is not understood by those who only know grammar and lexicon but only by men of taste and literary instinct who know the essence of poetry .It is the province of the sahridaya ,the connosseur who is expert in discerning through the intricate meshes of veiled word and sense into the aesthetic relish of deeper significance .The aesthetic emotion istransfered only when there is ideal reawakening of it in the reader .Ananda vardhana clearly states that appreciation of poetry is essentially the same as the creation of it ‘’Aesthetic consciousness has no end out side of itself .Aesthetics experience charactarised by the immersion of the subject in the aesthetic object is akin to the beatitude of ecstacy or the Brahman or Self .’’అని డా .కే సుబ్రహ్మణ్యం ధ్వని సిద్ధాంతం పై చక్కని వ్యాఖ్య చేశారు .
మరోకవితో కలుద్దాం
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-14-ఉయ్యూరు

