గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41

41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు

రుద్రటుడు తొమ్మిదవ శతాబ్దానికి చెందినా కాశ్మీర పండిత కవి అలంకార శాస్త్రవేత్త .తొమ్మిదవ శతాబ్ద మొదటిభాగం లో ‘’కావ్యాలంకార ‘’అనే  అలంకార గ్రంధాన్ని రాశాడు .అతని గురించి పెద్దగా వివరాలు  తెలియ రాలేదు .కాని అతని గ్రంధం లోని అయిదవ అధ్యాయం లోని పన్నెండునుండి  పద్నాలుగువరకు ఉన్న శ్లోకాలపై ‘’నమి సాధు ‘’రాసిన వ్యాఖ్యానం వలన రుద్రటుడికి’’ సదానంద ‘’అనే మరోపేరు ఉన్నట్లు,.తండ్రిపేరు భాముకుడు అన్నట్లు తెలుస్తోంది .రుద్రటుడు తనకు పూర్వం ఉన్న ఆలంకారికుల మార్గం లోనే కావ్యాలంకారం రాశాడు .అందులో పదహారు అధ్యాయాలు ,734శ్లోకాలున్నాయి .రుద్రటుడు తొమ్మిదో శతాబ్దానికి పూర్వార్ధం లో ఉండినట్లు భావిస్తారు .పద్నాలుగు ప్రక్షిప్త శ్లోకాలున్నాయి .

రుద్రట ప్రతిభా రౌద్రం

కావ్యాలంకారం లో అష్టవిధ నాయికల గురించి రుద్రటుడు పేర్కొన్నాడు .శ్లోకాలను ఎక్కువ భాగం ‘ఆర్యా వృత్తం ‘’లో రాశాడు . పదమూడవ అధ్యాయం లో కేవలం పదిహేడు శ్లోకాలు మాత్రమె ఉండి అతి చిన్న అధ్యాయం గా కనిపిస్తుంది .కాని ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో వరుసగా 111 ,మరియు110శ్లోకాలు ఉండి పెద్ద అధ్యాయాలుగా ఉంటాయి .మొదటి అధ్యాయం లో గణేశ ,గౌరీ స్తుతి చేసి కావ్యారంభం చేశాడు .చదరంగం ఆటగురించి దానిలో నిష్ణాతులైన వారి గురించి ,దాని చరిత్రను గురించి కూడా రుద్రటుడు రాయటం విశేషం .వీరుల పర్యటన (NIGHT;S TOUR) చిత్రాలంకారంఅంటే ‘’తురగ పద బంధం ‘’కూడా ఉండి  వాటి విశేషాలు తెలుస్తాయి .ఔచిత్య చర్చ విశేషం గా చేశాడు .రుద్రట కృతిపై మూడు వ్యాఖ్యానాలున్నాయి .అందులో ముఖ్యమైనది శ్వేతాంబర జైనుడైన నమిసాదురాసినది ,పదకొండవ శతాబ్దం వాడైన శైల భద్రుడు రాసినవి ముఖ్యమైనవి .గోపాల దేవుడు కూడా రాశాడు .గోపాల భట్టు ‘’రస తరంగిణి ‘’పేరిట వ్యాఖ్యానం రాశాడు .

రుద్రటుడు కావ్యాలంకారం లో 495 కారికలున్నాయి మిగిలినవి శ్లోకాలే .ప్రౌఢమైన అలంకార గ్రంధం గా పరిగణింప బడింది .రుద్రటుడు ఏ కొత్త సిద్ధాంత ప్రతిపాదనా చేయలేదు .చర్చ అంతా పరమ శాస్త్రీయ విధానం లో నిర్వహించి మెప్పుపొండాడు .అలంకారాలను శబ్దాలంకారాలు గా అర్దాలంకారలుగా విభజించి కొత్త దారి తొక్కి, తరువాతి వారికి మార్గ దర్శి అయ్యాడు .మొత్తం యాభై ఏడు అలంకారాల గురించి వివరించాడు .అలంకారాన్ని సమర్ధించినా రస నిష్పత్తికి విలువ నిచ్చాడు .అందరికంటే ఇంకొక అడుగు ముందుకు వేసి ‘’ప్రేయోరాసాన్ని ‘’పదవ రసం’’ గా ప్రతిపాదించాడు .దీనికి స్నేహం స్థాయీభావం గా చెప్పాడు .స్నేహాన్ని చక్కగా నిర్వచించాడు –‘’సహృదయ వ్యవహారం తో కూడిన నిశ్చలమైన ,నిర్వ్యాజమైన మనో వృత్తియే స్నేహం ‘’అని రుద్రటుడు నిర్వచించాడు .స్నేహం వలన ఏర్పడిన ప్రేమ ,విశ్వాసం తో సద్భావం తో కోమలం గా పరస్పర స్పందనలుగా ఉంటుంది .మనసు ఆర్ద్రం అవటం ,ఆహ్లాదం తో కళ్ళ వెంట అశ్రుజలాలు కారటం ,స్నిగ్ధ భావం తో ఒకరినొకరు ఆపేక్షగా చూసుకోవటం ఇందులో అనుభవానికి వచ్చే విషయాలు .స్నేహం లో కామం ,రతి ప్రస్తావన ఉండదు .మానసిక రతి ఉంటుంది .అందువలన పుత్రప్రేమ, దాస్య ప్రేమ , దాంపత్య  ప్రేమ (కులపాలికా ప్రేమ),ప్రక్రుతిప్రేమ ,దేశ భక్తీ ,గొప్ప వారియెడ గౌరవ భావం మొదలైన వన్నీ ప్రేయో రసానికి అంతర్గతం గా ఉంటాయి .తరువాత కాలం వారైన భోజుడు మొదలైన వారు ప్రేయోరసాన్ని బాగా ఆదరించారు .ప్రేయోరసం అంటే ‘’అమలిన శృంగారం ‘’మన రాయప్రోలు  సుబ్బారావు గారు దీనిపైనే ‘’తృణ కంకణం ‘’అనే ఖండ కావ్యం రాశారని మనకు తెలిసిన విషయమే .రుద్రటుడు పూర్వం ఉన్న వైదర్భి ,పాంచాలీ ,గౌడీ రీతుల తో బాటు కొత్తగా ‘’లాటి ‘’అనే రీతిని గుర్తించాడు . ఉపమ రూపక  ఉత్ప్రేక్షాలంకారాలను  చక్కగా వివరించాడు .సరిగ్గా నిర్వచనం లేని  వాటిని వాస్తవాలంకారాలన్నాడు .వాస్తవ అంటే వస్తు సంబంధమైనవి అనే అర్ధం లో చెప్పాడు .శ్లేషను అర్దాలంకారం గా ఒప్పుకోలేదు .అదొక విచిత్రాలంకారం అన్నాడు .

రుద్రటుడి తురగ పద బంధం

తురగ పద బంధం ను మొదటి సారిగా అలంకార శాస్త్రం లో చెప్పిన వాడు రుద్రకుడు .ఇది గుర్రపు నడకను పోలి ఉండటం చేత ఆపేరు వచ్చింది .ఇందులో ఒక్కొక్క పంక్తికి ఎనిమిదేసి అక్షరాల వంతున నాలుగు పంక్తులుంటాయి .వీటిని ఎడమ నుంచి కుడి కి చదవ వచ్చు .లేక అశ్వ పద మార్గం లోనూ చదవ వచ్చు అదీ ఇందులో విశేషం .ఇందులోని ప్రతి అక్షరం చెస్ బోర్డ్ లోని ఒక చదరానికి సంకేతం .రుద్రకుడు ఇచ్చిన ఒక ఉదాహరణ ను గమనిద్దాం’

‘’సే నా లీ లీ లీ నా నా నా లీ

లీ నా నా నా నా లీ లీ లీ లీ

న లీ నా లీ లీ లే నా లీ నా

లీ లీ లీ నా నా నా నా నా లీ’’

మొదటి పంక్తి ని ఎడమ నుండి కుడికి మామూలుగా చదవ వచ్చు .లేకపోతె మొదటి చదరం నుండి రెండవ పంక్తికి వెళ్లి మూడవ అక్షరాన్ని తురగ బంధం లో ఒకటికి చేరి చదవ వచ్చు .లెక్కల రూపం లో చెప్పాలంటే -5to2,7to4,8to3,6,to4,4,to3,2.

ఈ తురగ పదబంధాన్ని  చేదించిన  మొదటి గణిత శాస్త్రజ్ఞుడు ‘’లియోన్ హార్డ్ యూలర్ ‘’.దీనికి విధానాన్ని  ‘’వారంస్ డార్ఫ్ రూల్ ‘’గా వివరిం చిన వాడు 1803 కాలపు వాడైన H .C .Von Warns dorff .వీటినే ఆల్గారిదం ‘’అంటున్నారు .వీటికే ‘’Rudraka cycles’’అని పేరుపెట్టి అందులో ప్రవేశించటానికి చాలా ప్రయాసపడ్డారు .అంతటి మేధావి రుద్రకుడు .

Inline image 1Inline image 2

 

మరో కవితో పరిచయం అవుదాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-14-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.