తెలంగాణా పల్లె బతకు ల్లొమోగుతున్న ”చావు డప్పు ”-

పల్లె తెలంగాణలో చావురుతువు(సంధర్బం) – కె.శ్రీనివాస్
మెదక్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్‌, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్‌ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే తెలంగాణ ప్రతిష్ఠ నిలబడుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను కాపాడడం ఇప్పుడు కెసిఆర్‌ వంతు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది.

నోరుతెరుచుకున్న నిర్లక్ష్యపు బోరుబావిలో నలభై అడుగుల లోతులోకి నాలుగేళ్ల గిరిజ పడిపోయినప్పుడు, ఆ పసితల్లిని ప్రాణాలతో వెలికి తేవడం సాధ్యమవుతుందని ఎవరూ గట్టిగా నమ్మి ఉండరు. కుటుంబసభ్యులంతా పత్తి ఏరడానికి వెళితే, పనిచేయలేని వయసు కాబట్టి ఆడుకోవడానికి కాసింత వెసులుబాటు దొరికితే, ఆ పిల్ల అట్లా చావుబొరియలోకి జారి పోయింది. ప్రాణం లేని బొమ్మ లాగా వెలికిరావడానికి నలభైఎనిమిది గంటలపైనే పట్టింది కానీ, గిరిజ ప్రాణం కొన్ని గంటల్లోనే పోయి ఉంటుంది. ఏం జరిగిందో తెలియని స్థితిలో భయంతోను, ఊపిరాడకుండాను ఆ పాప ఎంతటి నరకం అనుభవించిందో ఊహించలేము. అయినా, లోపల ఇంకా సజీవంగానే ఉంటుందని, ప్రయత్నించి బయటికి తెస్తే బతికించుకోవచ్చునని గిరిజ తల్లిదండ్రులే కాదు, ప్రభుత్వయంత్రాంగమూ చుట్టుపక్కల ప్రజలూ టీవీల్లో ఆ విషాదాన్ని చూస్తున్న ప్రేక్షకులూ అంతా ఆశించారు. లాభం లేదు లెమ్మని ఎవరూ ప్రయత్నించకుండా మానుకోలేదు. ఫలితంతో నిమిత్తం లేకుండా ఒక మరణాన్ని నివారించడానికి మానవీయమైన ప్రయత్నమంతా జరిగింది.
బోరుబావి పాతాళమెట్లా ఉంటుందో, శ్వాసదొరకని చీకటి నరకమెంత బీభత్సంగా ఉంటుందో గిరిజే కాదు, తెలంగాణ రైతాంగానికంతటికీ తెలుసు. అప్పుల ఊబి, నిరాశ చీకటి, కాసింత వెసులుబాటునివ్వని దుర్భిక్షం, కావలసినవేళ కనీసంగానైనా దొరకని కరెంటు- వీటన్నిటి మధ్య రైతులు పరిస్థితి కూడా బోరుబొరియల్లో పడ్డ పసిపాపల వలెనే ఉంటుంది. వారిని ఎవరో ఆ అగాధాల్లోంచి ఉద్ధరించాలి. వారికి ఊపిరాడడానికి ఎవరో కాసింత ప్రాణవాయువు అందించాలి. బతుకుతారో లేదో తెలియదు కానీ, బతికించే ప్రయత్నమేదో చేయాలి. అట్లా చేస్తున్నట్టు సమాజానికి తెలియాలి.
తెలంగాణ రైతుల దురదృష్టమేమిటోకానీ, సొంత రాష్ట్రంలో ఏర్పడిన తొలిప్రభుత్వంలోనే వారి వేదన అరణ్యరోదనగా మారుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి రెండువందల యాభై మందికి పైగా రైతులు ప్రాణం తీసుకున్నారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే, అతను ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభంలోనే దాదాపు కొన్ని వందల మంది ఉంటున్నారని లెక్క. పత్తి రైతులే కాదు. వరి రైతులు కూడా నిరాశలోకి కుంగిపోతున్నారు. గురువారం నాడు వరంగల్‌ జిల్లాలో వరిపొలాలను రైతే స్వయంగా తగులబెట్టుకున్నాడు. ప్రతిరోజూ అయిదుగురో ఆరుగురో పదిమందో ఉసురు తీసుకుంటున్నారు. పల్లెసీమలో చావు డేరా వేసిందని ప్రభుత్వం కనీసంగా గుర్తించడం లేదు. 1997-98 ప్రాంతాల్లో వరంగల్‌ తదితర జిల్లాల్లో పత్తిరైతులు వందలసంఖ్యలో మరణించినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూపిన స్పందనకీ, ఇప్పుడు చంద్రశేఖరరావు ప్రభుత్వం చూపుతున్న స్పందనకూ తేడాయేలేదు. నాటి వ్యవసాయ సంక్షోభమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి నేపథ్యంగా పనిచేసిందని గుర్తుచేసుకోవాలి. బుద్ధిజీవుల్లోను, ఉద్యోగుల్లోను ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం రాజకీయాల్లోకి కూడా ప్రవహించిన తరువాత ఎంతో కాలానికి గానీ గ్రామీణ ప్రాంతాల్లోకి, రైతాంగంలోకి ఇంకలేదు. పణికర మల్లయ్య చంద్రబాబు నాయుడును అడిగిన ప్రశ్న, రైతాంగం తెలంగాణ రాష్ట్రం మీద పెట్టుకున్న ఆశలకు ఒక సంకేతం. మరి ఆకుపచ్చని తెలంగాణ, మానవీయమైన తెలంగాణ, అసహజమరణాల్లేని తెలంగాణ- ఏమయింది?
రైతాంగంలో నెలకొన్న మనుగడ సంక్షోభం, దాని తీవ్రత కెసిఆర్‌కు తెలియనిది కాదు. తెలంగాణ వాదం ఒక్కటే తనను పూర్తిగా గెలిపించలేదని ఆయనకు అనుమానం ఉంది కనుకనే, రుణమాఫీ, పింఛన్లు వంటి సంక్షేమ హామీలను ఆయన గుప్పించారు. అక్కడ చంద్రబాబుకైనా, ఇక్కడ కెసిఆర్‌కైనా రుణమాఫీ తురుఫుముక్క వలె పనిచేసింది. తమను గెలుపునకు నడిపించిన ఆ అంశం గురించి ఈ ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? రుణమాఫీ పూర్తిగా అమలుచేసి ఉంటే, లేదా చేయగలిగి ఉంటే, ఈ ఆత్మహత్యలు నివారించగలిగేవారమా? కాకపోవచ్చు. ఉసురు తీసుకుంటున్న రైతుల మీద ఉన్న రుణభారం గురించి వింటుంటే, ప్రభుత్వ మాఫీ ఏ మూలకూ సరిపోయేది కాదు. కానీ, ప్రభుత్వాల సీరియస్‌నెస్‌కు మాఫీ అమలుపై వేసిన పిల్లిమొగ్గలు ఒక సూచిక. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు వేలాదికోట్ల వడ్డీలను, జరిమానాలను, రుణాలను మాఫీ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టని బ్యాంకింగ్‌ నిబంధనలు లక్షలాది రైతుల జీవన్మరణాల సమస్య విషయంలో అడ్డుపుల్లలు వేయడం అమానుషం. ఎవరితోనైనా తగాదాపడడానికి వెనుకాడనన్నట్టు ఉండే కెసిఆర్‌, ఈ విషయంలో రాజకీయపోరాటం చేసి ఉండవలసింది, ప్రజలు ఆయన వెనుక ఉండేవారు. సరే, మాఫీ సంగతి పక్కనబెడదాం. ఆత్మహత్యల నివారణకు క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదా? హైదరాబాద్‌ను విశ్వనగరంగా, కరీంనగర్‌ను న్యూయార్క్‌గా, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి సాధ్యపడుతున్నప్పుడు, కొన్ని విషాదమరణాలను, తెలంగాణకు అవమానకరమైన చావుజాతరను ఆపడానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదా? నిజంగా ఏమీ చేయలేదా?
సమగ్ర సర్వే నిర్వహణలో పాల్గొన్న ఒక ఉపాధ్యాయమిత్రుడు అదే రోజు సాయంత్రం తామడిగిన ప్రశ్నల గురించి ఇట్లా వ్యాఖ్యానించాడు. ‘‘ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు ఉన్న ఆస్తుల గురించి అడిగాము కానీ, అప్పులనడగలేదు. అప్పుల గురించి చెప్పని సర్వేలో అర్థసత్యాలే తెలుస్తాయి’’. కానీ, మన గ్రామసమాజాల్లో సాటి మనిషి రుణభారం గురించి తెలియకుండా ఉండదు. అవసరమైనప్పుడు గ్రామసభలను నిర్వహిస్తే, నెలకొని ఉన్న సంక్షోభ వాస్తవికత వెల్లడి అవుతుంది. నిస్పృహ వ్యక్తం చేస్తున్న మనుషులకు తోటివారు ధైర్యం చెప్పడమో, ధైర్యం కలిగే మార్గాలను సూచించడమో చేస్తారు. లేదా, సహాయాన్ని పొందే మార్గం అన్వేషిస్తారు. తలచుకుంటే, ఎక్కడెక్కడ సంక్షోభం పొంచిఉన్నదో, ఎక్కడెక్కడ ఆత్మహత్యలకు ఆస్కారం ఉన్నదో ప్రభుత్వం తెలుసుకోలేదా? ధైర్యం చెప్పగలిగే మార్గాలను అనుసరించలేదా? తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన పాటను, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి ఉపయోగించిన పాటను, రైతు ఆత్మహత్యల విషయంలో ఒక సాధనంగా వాడుకోలేరా? పూర్తి స్థాయి కరెంటు ఇవ్వలేకపోతే మానె, కనీసంగా తడి చావకుండా విద్యుత్‌ను వంతులవారీగా అందించడానికి గల అవకాశాలను పరిశీలించారా? మరికొంత త్యాగం చేయమని పట్టణ పౌరులను, పారిశ్రామికవేత్తలను అభ్యర్థించారా? కరెంటు దొరకడం దుర్లభం అనుకుంటే, పరిశ్రమలకు మరోరోజు కత్తెరవేసి, అవసరమైతే వారికి అందుకు తగిన పరిహారం చెల్లించి, కనీసంగా పొలాలను తడిపి ఉంటే కొన్ని ప్రాణాలైనా దక్కేవి కాదా?
ఇవన్నీ ఎందుకు జరగలేదు అని ప్రశ్నించుకుంటే, అప్రియమైన సమాధానమే దొరుకుతుంది. రైతులను వాళ్ల చావుకు వాళ్లను వదిలేశారు. అంతే. ప్రభుత్వానికి సంకల్పం లేదు. ప్రభుత్వాధి నేతకు ప్రాధాన్యాలు తెలియడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కొత్త ఆలోచనలను ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూవచ్చారు. వాటిలో అనేకం తెలంగాణ సమాజానికి మేలు చేసేవి, సృజనాత్మకమైనవి ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని వ్యక్తం చేసే అనేక వేడుకలు కూడా జరిపారు, అవీ జనాన్ని ఉద్వేగానాందాలలో ముంచెత్తాయి. పాలనలో ఆచరణలో ఏమి జరిగింది? విద్యార్థులపై, రైతులపై లాఠీచార్జిలు, మీడియాపై నిషేధాలు, సభలపై ఆంక్షలు, సంక్షేమపథకాల సమీక్ష పేరుతో ప్రజలను ఆందోళనపరిచే చర్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వర్గాలవారికి, రాష్ట్రం సిద్ధించిన కొన్ని రోజులకే చేదు అనుభవాలు ఎదురు కావడం ఏ సంకేతాలను పంపిస్తుంది? పింఛన్‌ దరఖాస్తులు ఇచ్చుకోవడానికి వృద్ధులు క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి ఏమి ప్రతిష్ఠ? ఏ ప్రభుత్వాన్నైనా రాజకీయ ప్రత్యర్థులు విమర్శించడం సహజం. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడానికి విమర్శలు చేసేవారూ ఉండవచ్చు. అదీ రాజకీయాలలో సాధారణమే. కానీ, విమర్శలన్నీ శత్రుపూరితమైనవని, ప్రభుత్వాన్ని విమర్శించడమంటే తెలంగాణను వ్యతిరేకించడమే అనే ధోరణి చూపించడం వివేకం కాదు. తప్పులను కప్పిపుచ్చి, అంతా సజావుగా ఉన్నదని చెప్పేవారు ఎవరైనా కావచ్చును కానీ శ్రేయోభిలాషులు మాత్రం కాదు.
అంతా వైఫల్యమే అని చెప్పడానికి నాలుగు నెలల కాలం సరిపోదు. అందుకే, జనం ఇంకా సహనంతో ఉన్నారు. కానీ, రైతుల చావులెక్క పెరుగుతున్న కొద్దీ ఓపిక వేగంగా క్షీణిస్తున్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు, మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ప్రభుత్వం కొత్త రాజధానిని నిర్మించడంతో పాటు, యథావిధి పాలన సాగిస్తే సరిపోతుంది. తెలంగాణలో అట్లా కాదు. తెలంగాణ ప్రజలకు కొత్త రాష్ట్రం సాధించుకున్నందువల్ల కొన్ని, కొత్త ప్రభుత్వం నుంచి మరి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. యథావిధి పాలన నిర్వహిస్తూనే, కొత్త రాష్ట్రం లక్ష్యాలను కూడా పరిపూర్తి చేయాలి. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పథక రచన చేస్తూ, తక్షణ పాలన కూడా కొన సాగించాలి. కొత్త ప్రభుత్వం విఫలమైతే, తెలంగాణ రాష్ట్ర ఆశయమే విఫలమయినట్టవుతుందని ప్రజలు భయపడు తున్నారు. ఆ భయం నిజం కాదని నిరూపించవలసిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉన్నది.
మెదక్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్‌, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్‌ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే తెలంగాణ ప్రతిష్ఠ నిలబడుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను కాపాడడం ఇప్పుడు కెసిఆర్‌ వంతు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.