సాంకేతిక సంరంభం

సాంకేతిక సంరంభం
సాధారణంగా మన దేశంలో ప్రజలు క్రికెట్‌ సిరిస్‌ ప్రారంభం కోసమో, ఒక సినిమా రిలీజ్‌ కోసమో ఎదురుచూడటం సామాన్యమైన విషయమే. ఒక కొత్త జనరేషన్‌ మొబైల్‌ కోసం, ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ కోసం ప్రజలు ఎదురుచూడటం మాత్రం విశేషం. ఈ కోణం నుంచి చూస్తే నేడు దేశ మొబైల్‌ ఫోన్ల చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన టెక్నాలజీ కంపెనీలుగా పేరు పొందిన గూగుల్‌, యాపిల్‌ కంపెనీలు భారత మొబైల్‌ మార్కెట్‌లో తమ స్థానాన్ని పదిలపరుచుకోవటానికి తమ ఉత్పత్తులను మార్కెట్‌లలోకి ప్రవేశపెడుతున్నాయి. అందరూ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 6ను యాపిల్‌ విడుదల చేస్తుంటే, దానికి సవాలుగా ఆండ్రాయిడ్‌-ఎల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో గూగుల్‌ నెక్సస్‌ 6ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. నెక్సస్‌ ఫోన్లను ఉపయోగించేవారందరికీ నేటి నుంచి ఆండ్రాయిడ్‌ ఎల్‌ అప్‌డేట్‌ అవుతుంది. దీని కోసం కూడా లక్షల మంది ఎదురుచూస్తున్నారు.
ఈ మధ్యకాలంలో రెండు అగ్రశ్రేణి కంపెనీలు నేరుగా తమ ఉత్పత్తులతో పోటీ పడటం ఇదే తొలిసారి. సామాన్యంగా మార్కెట్‌లోకి ప్రతి ఏడాది వందల మొబైల్‌ మోడల్స్‌ విడుదలవుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి ఆదరణ లభిస్తుంది. మరికొన్ని మౌనంగా మార్కెట్‌ నుంచి మాయమయిపోతూ ఉంటాయి. కానీ రాబోయే మోడల్స్‌ కోసం ఆతృతగా ఎదురుచూడటం, వాటికి సంబంధించిన చిన్న విషయం బయటకు పొక్కినా పెద్ద వార్తగా మారటం కూడా ఇదే మొదటిసారి. మధ్యతరగతి ప్రజల మందహాసంతో మారిన పరిస్థితులకు దీని ఉదాహరణ. ఇక్కడ ఈ రెండు కంపెనీల ప్రస్థానం కూడా చెప్పుకోవాలి. అగ్రశ్రేణి డస్క్‌టాప్‌ కంప్యూటర్లను తయారుచేసే కంపెనీగా ప్రారంభమయిన యాపిల్‌ ఆ తర్వాత ఐపాడ్‌, ఐఫోన్‌ వంటి ఉత్పత్తులతో సంచలనాలకు తెర తీసింది. ఉన్నత వర్గాల ప్రజలు వాడే ఒక స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా మారిన ఐఫోన్‌కు మన దేశంలో మొదటి నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తూనే ఉంది. ఐఫోన్‌6లో ఫీచర్స్‌ ఎలా ఉంటాయో తెలియకముందే మన దేశంలో దాదాపు 25 వేల మంది వాటిని ప్రీబుక్‌ చేసుకోవటమే దీనికి ఉదాహరణ. తమకు లభిస్తున్న ఈ ఆదరణను ఆ కంపెనీ జాగ్రత్తగా పసిగట్టింది.
ఇప్పటి దాకా యాపిల్‌ ఎప్పుడూ తన ఉత్పత్తులను పాశ్చత్య మార్కెట్‌లను అనుసరించి డిసెంబర్‌లో విడుదల చేస్తూ వస్తోంది. కానీ ఈ సారి దీపావళి సీజన్‌ ప్రాముఖ్యం గుర్తించి ఐఫోన్‌ను రెండు నెలల ముందు విడుదల చేయటం భారత మార్కెట్‌పై ఆ కంపెనీ చూపిస్తున్న ఆసక్తికి నిదర్శనం. మొబైల్‌ విక్రయాలను అర్థరాత్రి నుంచే ప్రారంభించటం ద్వారా కొత్త సంప్రదాయానికి కూడా తెరతీసింది. ఒక సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా టెక్నాలజీ మార్కెట్‌లోకి ప్రవేశించిన గూగుల్‌ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తూ వచ్చింది. సెర్చ్‌ఇంజిన్ల దగ్గర నుంచి మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (ఓఎస్‌)ల దాకా ఎదిగిన గూగుల్‌ ప్రతి ఏడాది కొత్త అప్‌గ్రేడ్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. మొబైల్‌ రంగంలో ఆండ్రాయిడ్‌ ఒక విప్లవం. అరచేతిలో ఇమిడిపోతూ డెస్క్‌టాప్‌కీ, లాప్‌టాప్‌కీ స్మార్ట్‌ఫోన్‌ ఒక ప్రత్యామ్నాయంగా అవతరించింది. డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే కార్ల దగ్గర నుంచి ఒక రక్తపు చుక్కతో 20 వ్యాధులను పసిగట్టే చిప్‌ల దాకా రకరకాల టెక్నాలజీలను గూగుల్‌ రూపొందిస్తూ వస్తోంది. మొబైల్‌ ఫోన్‌ డిజైన్‌ విషయంలో కాకపోయినా- తన అప్లికేషన్ల ద్వారా యాపిల్‌ మార్కెట్‌ను కొల్లగొట్టాలని గూగుల్‌ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. దీనికి భారత్‌ మార్కెట్‌నే యుద్ధభూమిగా ఎంచుకుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌లో మొబైల్‌ అప్లికేషన్లకు అధిక ఆదరణ ఉంది. ఈ కోణం నుంచి చూస్తే- మొబైల్‌ ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)లకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే గూగుల్‌ సరికొత్త ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లాలిపప్‌ కోసం లక్షల మంది లొట్టలేసుకుంటూ ఎదురుచూస్తున్నారు. మొబైల్‌ వినియోగదారుల అవసరాలను జాగ్రత్తగా గమనించటం, వాటికి అవసరమైన పరిష్కారాలు కనిపెట్టడం గూగుల్‌ ప్రత్యేకత. దీని కోసం ఆ కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రతి ఏడాది ఖర్చు పెడుతూ ఉంటుంది. అలాంటి పరిశోధనలను రహస్యంగా ఉంచుతుంది. అలాంటి ఒక రహస్య ప్రాజెక్టయిన వోల్గాలో రూపొందించినదే ఆండ్రాయిడ్‌ ఎల్‌. త్రీడీ మొబైల్‌ ఫోన్లకు గూగుల్‌ ఒక అడుగు దూరంలో మాత్రమే ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎల్‌ విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం వల్ల వందల కొత్త అప్లికేషన్లను మొబైల్‌లో ప్రవేశపెట్టాలని గూగిల్‌ భావిస్తోంది. ఎక్కువ అప్లికేష్లన్లను ప్రవేశపెడితే బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది కాబట్టి దానిపై కూడా గూగుల్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఎక్కువ సమయం బ్యాటరీ పనిచేసే విధమైన టెక్నాలజీలను రూపొందించి వాటిని దీనిలో ప్రవేశపెట్టామని గూగుల్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ టెక్నాలజీ కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు.
కేవలం టెక్నాలజీల పరంగా మాత్రమే కాకుండా- మార్కెట్‌ విషయంలో చైనాతో మనం పోటీపడగలమా అనే విషయాన్ని కూడా అంచనా వేయటం కోసం అంతర్జాతీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ఐఫోన్‌ గత నెల 19న కొన్ని దేశాల్లో విడుదలయింది. మార్కెట్‌లోకి ప్రవేశించిన మూడు రోజులకే కోటి మొబైల్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేశారు. చైనాలో దాదాపు లక్ష ఐఫోన్ల కోసం ఆర్డర్లు బుక్‌ చేసుకున్నారు. ఈ లెక్కలతో పోలిస్తే మన మొబైల్‌ మార్కెట్‌ తక్కువే అనిపించవచ్చు. కానీ మన వినియోగదారులు టెక్నాలజీ వాడకంలో ముందు ఉంటారు. అందుకే ప్రతి కంపెనీ తమ తాజా పరిజ్ఞానాన్ని మన మార్కెట్‌లో పరీక్షించి చూసుకోవాలనుకుంటుంది. ఈ కోణం నుంచి చూస్తే మనం మొబైల్‌ టెక్నాలజీల విషయంలో గెలిచినట్లే.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.